![Kalpita betala kathalu.3 Kalpita betala kathalu.3](https://www.gotelugu.com/godata/articles/202502/KalpitaBetala kathalu.3-Story picture_1739114634.jpg)
అపార్ధం .
పట్టువదలని విక్రమార్కుడు తన ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధీంచి భుజంపైన చెర్చుకుని మౌనంగా స్మశానంనుండి బయలుదేరాడు.
"మహిపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీపట్టుదల మెచ్చదగినదే! సకల శేస్త్రాలు అభ్యసించిన నీవు అభినందనీయుడవు మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా అపార్ధం అనేకథ చెపుతాను విను....
కుంతల రాజ్యాన్ని పూర్వం చంద్రసేనుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు.
ఒకసారి తన మంత్రి సుబుధ్ధి తోకలసి మారువేషాలలో నగర పర్యటనకు బయలుదేరి చాలాప్రాంతం తిరిగి కోటకు వచ్చేదారిలో బాగా కాపుమీద ఉన్న మామిడితోట కనిపించింది. దోరమగ్గిన మామిడి పండ్లను చూసిన రాజు గారికి నోరు ఊరింది.
తోట సమీపంలోని యువకుని చూసిన రాజుగారు "నాయనా ఈతోటలోని మామిడి పండు చూస్తుంటే తినాలి అనిపిస్తుంది రెండుపండ్లు ఇవ్వగలవా అన్నాడు." అయ్య తమరు బాటసారుల్లా ఉన్నారు. గుర్రాలుదిగి ఆ చెట్టునీడన సేదతీరండి" అని తోటలోనికి వెళ్లి రెండు మామిడి పండ్లు దిగుడుబావి వద్ద నీటిలో కడిగి తెచ్చి రాజు, మంత్రికి చెరొకపండు అందించాడు.
మామిడిపండు ఆరగించిన రాజు సంతృప్తిచెంది "నాయనా పండురుచి చాలాబాగుంది. నాకు రెండు గంపల నిండుగా పండ్లు కావాలి వెల ఎంతొ తెలియజేయి, నేచెప్పిన చిరునామాలో పండ్లు అందజేసి వాటికి రావలసిన ధనం తీసుకువెళ్ళు" అన్నాడు.
"అయ్య ఇది నా మిత్రుని తోట. పక్కనే ఉన్నది నా తోట మీరు కోరిన విధంగా రెండు గంపల పండ్లు ఎవరికి అందజేయాలో తెలుపండి అందజేసి వాటిధర ధనం తీసుకుంటాను అన్నాడు ఆ యువకుడు. క్షణకాలం ఆలోచించిన రాజు "నాయనా ఉచితంగా ఇవ్వడానికి నీ మిత్రుని తోటలో పండ్లు, అమ్మకానికి అయితే నీ తోటలోని పండ్లు అంటున్నావు. ఇది మిత్రద్రోహం కదా" అన్నాడు రాజుగారు .
"కానేకాదు మహరాజా" అన్నాడు ఆతను.
విక్రమార్క ఇలా మామిడి పండ్లు అమ్మడం మిత్రద్రోహంకాదా తెలిసి చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు" అన్నాడు బేతాళుడు.
"బేతాళా అతను స్నేహధర్మంలో మిత్రుని అనుమతిలేకుండా రెండు పళ్లు దానం చేయవచ్చు కాని పండ్ల ధర తెలియకుండా అతని వస్తువుకు తాను వెలనిర్ణయించడం న్యాయంకాదు. అతని తోటలోని పండ్లకు ఇతను వెల నిర్ణయించడం న్యాయం, అందుకే అతని తోటలోని పండ్లు రాజుకు అమ్మచూపాడు" అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
*******
మూడు సూక్తులు .
పట్టువదలని విక్రమార్కుడు, తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధీంచి భుజంపైన చెర్చుకుని మౌనంగా స్మశానంనుండి బయలుదేరాడు.
" మహిపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీపట్టుదల మెచ్చదగినదే! అమిత సాహాస పరాక్రమ వంతుడవు. అరువదినాలుగు కళా విశారదుడవు అయిన నీవు చాలా కాలంగా ఉన్న నా సందేహానికి నీకు అలసట తెలియకుండా మూడు సూక్తులు అనేకథ చెపుతాను విను... భద్రగిరిని వీరసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతని మంత్రి సుబుద్ది.
ఒకరోజు రాజుగారిసభలో ప్రవేసించిన ఇరువురు యువకులు "జయము జయము ప్రభువులకు మహరాజా. మా తండ్రిగారు మరణిస్తు మూడు సూక్తులు చెప్పారు. ఆయన మరణానంతరం మేము ఆస్తి సమంగా పంచుకోగలిగిన మాకు మూడు సూక్తుల అర్ధం తెలుసుకోలేక పోయాము" అన్నారు.
"ఏమిటి ఆ మూడు సూక్తులు? "అన్నాడు మంత్రి సుబుద్ది.
"మంత్రివర్యా మెదటి సూక్తి అమ్మకు అన్నంపెట్టవద్దు. రెండోసూక్తి అప్పు ఇచ్చి అడగవద్దు. మూడ సూక్తి పేద శవాలకు చదివింపులు తప్పక చేయాలి. అన్నవే మూడు సూక్తులు "అన్నారు ఆ యువకులు .
" విక్రమార్కమహరాజా ఈ మూడు సూక్తుల మర్మమేమిటి నీకు తెలిసీ చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు "అన్నాడు బేతాళుడు.
"బేతాళా చనిపోయిన ఆ యువకుల తండ్రి చాలా ముందుచూపు కలిగినవాడు, గొప్ప దాత. ప్రతివారు వృధాప్యంలో పలు రుగ్మతలకు లోను కావడంతోపాటు చీటికి మాటికి చిరాకు పడటం, కోపగించు కోవడంతో పాటు బాల్యానుభూతికిలోనౌతాడు. వయసులో సుఖాలతో, సంపాదన ఆరాటంలో మునిగినవారు వృధాప్యంలో చిన్నపీల్లల్లా అన్నితినాలని కోరుకుంటారు. అందుకే మెదటి సూక్తిలో తల్లికి అన్నం పెట్టోద్దు అంటే వృధ్ధులను తమకు కావలసినంత ఆహరం వారినే వడ్డించుకు తినమని అర్ధం.
రెండోసూక్తి అప్పుఇచ్చి అడగవద్దు అంటే, అడగకుండా అప్పుతీర్చేవారికే అప్పుఇవ్వమని అర్ధం.
మూడవ సూక్తి పేదరికంలో ఉన్నవారి ఇంట క సంభవిస్తే అర్ధికంగా వారి బాధ వర్ణాతీతం. పేదవారి ఇంట చనిపోయిన వారికి చదివించమంటే వారికి ధనం దానం చేయమని అర్ధం , ఇదే మూడు సూక్తుల మర్మం " అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
*******
ఎవరి విలువ వారిదే.
విక్రమార్కుడు బేతాళునికొరకు స్మశానంలో ప్రవేసించి,బేతాళుడు ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధీంచి భుజంపైన చెర్చుకుని మౌనంగా స్మశానంనుండి బయలుదేరాడు.
మహిపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీపట్టుదల, శ్రమ మెచ్చదగినదే! మనప్రయిణంలో నీకు అలసట తెలియకుండా ఎవరి విలువ వారిదే అనే కథ చెపుతాను విను..
" విక్రమార్క మహరాజా ఈలోకంలో ఎవరికి ఉండే విలువలు వారివి. రాజు అయినంత మాత్రాన గొప్పవాడని, సన్యాసి అయినంత మాత్రాన తక్కువ వారు అనుకోవడం తప్పు. ఆకలి, ఆనందం, బాధ వంటి స్పందనలు అందరికి ఒకటే. ఎంత గొప్పవారికి అయినా సామాన్యుని అవసరం కలగవచ్చు.
పూర్వం మన రాజ్యాన్నిచంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతను చాలా గర్విష్ఠిగా ప్రవర్తిస్తుండేవాడు. అతని మంత్రి పేరు సుబుద్ది.
రాజు గారికి తగిన గుణపాఠం చెప్పాలి అనుకుని, ఒకరోజు మంత్రి సుబుద్ది ''మహారాజా వయోభారంతో ఈమంత్రి పదవి నిర్వహించ లేకుండా ఉన్నాను, నేను వనవాసం వెళ్లి ప్రశాంతంగా నాశేషజీవితం ధ్యానం చేసుకుంటూ ఉండాలి అనుకుంటున్నాను'' అన్నాడు.
''మంత్రి వర్యా ఇక్కడ సుఖమైన జీవితం వదులుకుని అడవులలో ఆహారం లభించక ఎటువంటి సౌకర్యాలు లేని జీవితం మీరు కోరుకోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది'' అన్నాడు రాజుగారు.'' ప్రభూ ఏ పండు రుచి దానిదే సపోటా బాగుందని మామిడి పండును వద్దనలేముకదా! ప్రతివారి జీవితము ప్రత్యేకమైనదే. అనుభవంలోనికి వస్తేకాని ఎదుట వారి జీవితవిలువ తెలియదు, శెలవు'' అని నమస్కరించిన మంత్రి వెళ్లిపోయాడు.
కొద్దిరోజుల్లో తెలివైన తన మంత్రి లేకపోవడంవలన పలు ఇబ్బందులు ఎదుర్కొన్నరాజు, మంత్రిని వెదుకుతూ అడవికి వెళ్ళాడు. మహారాజు రాక గమనించిన మంత్రి కళ్లు తెరవకుండా ధ్యానం లో ఉన్నట్లు నటించసాగాడు. ''మంత్రివర్యా మేము మహారాజులం విచ్చేసాం'' అన్నాడు బిగ్గరగా.
కళ్లుతెరచిన మంత్రి "మహారాజా స్వాగతం తమరు ఎలా ఉన్నారు " అన్నాడు.
"మీరు లేని లోటు మాకు చాలా ఇబ్బంది కలిగించింది. అయినా మంత్రివర్యా రాజభోగాలు, మమ్ములను కాదనుకొని మీరు ఈ అడవిలో కందమూలాలు, ఆకులు తింటూ ఎండా వానలను భరిస్తూ ఏంసాధించారు'' అన్నాడు రాజుగారు.
అతని మాటలకు మంత్రి ఏం సమాధానం ఇచ్చాడో తెలిసి చెప్పక పోయావో తలపగిలి మరణిస్తావు " అన్నాడు బేతాళుడు.
" బేతాళా రాజ్యంలో ఉండగా ప్రతిరోజు రాజు దర్శనానికి మంత్రి వెళ్ళేవాడు. ఇప్పుడు రాజే మంత్రిని వెదుకుతూ అరణ్యంలోనికి వెళ్ళాడు. ఇది నమ్మలేని సత్యం, మహారాజు ఒక సన్యాసిని వెదుకుతూ రావడం ఆశ్చర్యం. ఎదటి వారికంటే, నేనే గొప్పఅనుకోవడం ఎంత తప్పో రాజు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. పదండి, ఎవరి విలువ వారిదే అని రాజ్యంచేరిన రాజు తన గర్వాన్నివదలి, మంత్రి సుబుధ్ధి సలహాతో చక్కటి పరిపాలన చేసాడు" అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతోసహ మాయమైయ్యాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
********
రాజ్య రక్షణ.
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు పైనున్న బేతాళుని బంధించి భుజానవేసుకుని మౌనంగా నడవసాగాడు.
'మహీపాలా నీవు నాకు ఉన్న ఒక సందేహాన్నినీవే తీర్చాలి. నీకు ప్రయాణ బడలిక తెలియకుండా ఉండేందుకు రాజ్య రక్షణ అనే కథా చెపుతాను విను...
చంద్రగిరి రాజ్యాన్ని అమరసేనుడు అనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. వయోభారం తన రాజ్యాన్ని రెండు భాగాలు చేసి, తన ఇరువురి కుమారులైన జయుడు, విజయు లకు పట్టాభిషేకం చేసి 'చిరంజీవులారా మీకు కొన్ని విషయాలు చెపుతాను వినండి, ప్రయత్నం, చురుకుదనం, ఇంద్రియ నిగ్రహం, యుధ్ధనిర్వాహణా కౌశలం, ఆత్మనిగ్రహం, పరాక్రమం, ఏ పరిస్ధితులలోనూ భయపడకుండా ఉండటం, కోపాన్ని, కోరికలను, అహంకారాన్ని, అసూయను దరి చేరనివ్వకండి. నిష్పాక్షికత, క్షమ, దయ, ప్రజల పట్ల దయా గుణం, దుష్టులు, చోరులు, శత్రువుల పట్ల ఖటినంగా ఉండాలి. జూదానికి, మధ్యానికి, యుధ్ధనికి బానిస కాకూడదు. విద్యావంతులైన మీకు చాలా విషయాలు తెలుసు. ముఖ్యంగా గతం లో ఉమ్మడిగా ఉన్న మన రాజ్యం ఎంతో బలంగా ఉన్నందున ఇరుగు పొరుగు రాజులు మనపై దండెత్తి రావడానికి సంకోచించే వారు. నేడు మన రాజ్యం రెండుగా విభజించబడి బలహీనంగా ఉండటం వలన వారితో యుధ్ధభయం ఎప్పుడూ ఉంటుంది ఈవిషయం మీ ఇరువురూ ఎన్నడూ మరచి పోవద్దు. అన్ని రంగాలలో అభివృధ్ధి సాధించండి. ప్రజలకు కష్టం కలేగే పనులు, పన్నులు విధించకండి' అని హితబోధ చేసి సతీ సమేతంగా ప్రశాంత జీవనం గడపటానికి వనజీవనం ప్రారంభించాడు.
జయుడు తన రాజ్య ప్రజలను వ్యవసాయం, విద్యా, వ్యాపర వంటి అన్ని రంగగాలలో ప్రోత్సహించి అభివృధ్ధి సాధించాడు.
విజయుడు తన దృష్టి వ్యవసాయ రంగంపై నిలిపి, రాజ్యంలోని బంజరు భూములను కొత్తగా వ్యవసాయ భూములుగా మార్చి, తనసైన్యం కత్తులను కొడవళ్ళు, వ్యవసాయ పని ముట్లుగా చేసి విరివిగా ధాన్యం పండించేలా తన రాజ్యప్రజలను ప్రోత్సహించాడు. ప్రజలంతా శ్రమించి గొప్పగా వ్యవసాయం చేసారు. ప్రకృతి వారికి అనుకూలంగా ఉండటంతో గాదెలు, పాతర్లు నిండాయి. ఎక్కడ చూసినా అపార ధాన్యరాసులే! ప్రజలంతా చేతినిండా ధనం రావడంతో సంతోషగా ఉన్నారు.
ఇదంతా విజయుని రాజ్యానికి సరిహద్దు రాజ్యమైన చంపావతి రాజు విక్రమ సేనుడు గమనించి వేగుల ద్వారా జయుడు తన రాజ్యానికి దూరంగా ఉన్నసమయంలో, విజయుని అశ్వ-గజ-రధ-సైనిక బలగాల వివరాలు సేకరించి విజయుని పై యుధ్ధం చేసి రాజ్యాన్ని పొందాడు.
'విక్రమార్క మహారాజా విజయుడు న్యాయంగానే జీవించాడు. పరుల రాజ్యంపై ఏనాడు పోరుకు పోలేదు. అయినప్పటికి విజయునికి ఈ దుస్ధితి రావడానికి కారణం ఏమిటి? తెలిసి సమాధానం చెప్పక పోయావో నీతలపగిలి మరణిస్తావు'. అన్నాడు బేతాళుడు.
దేశం అభివృధ్ధి చెందాలి అంటే వ్యవసాయం, వ్యాపారం, విద్యా వంటి అన్నిరంగాలలో సమతుల్యత పాటించాలి. కాని విజయుడు చేసిన తప్పు రాజ్య రక్షణ గురించి ఆలోచించక పోవడం. రాజ్యం వీరభొజ్యం. బలవంతుడిదే రాజ్యం. ఇది వేల సంవత్సరాలుగా భూమిపై జరుగుతున్నదే! ఇక్కడ నిజాయితీ, మంచితనం కాదు ముఖ్యం, శత్రురాజులను ఎదుర్కొనే శక్తిహీనుడుగా విజయుడు ఉన్నాడు. కత్తులను కొడవళ్ళుగా మార్చడం అతను చేసిన పెద్దతప్పు. వ్యవసాయం వేరు, దేశరక్షణ వేరు. కత్తిపని కత్తిదే, కొడవలి పని కొడవలిదే అని అతను తెలుసు కోలేక పోవడం వలన విజయుడు రాజ్యం కోల్పోయాడు' అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కునికి మౌన భంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళుని కొరకు వెనుతిరిగాడు.