![Ekaaki Ekaaki](https://www.gotelugu.com/godata/articles/202502/Ekaaki-Story picture copy_1739199766.jpg)
“ఏమండీ కాఫీ” చేతిలోని కాఫి కప్ చేతికి అందిస్తూ “ఏమిటి అంతా ఆలోచనలో పడ్డారు ” దిగులుగా కనిపిస్తున్న ఆయన్ని ఎదురుగా వున్న సోఫాలో కూర్చుంటు అడిగాను.పొదున్నే రాజోలు లో వున్నఅక్క బావగారి వాళ్ళ ఇంట్లో బావగారి తండ్రి సంవత్సరీకం లకి వెళ్ళి వచ్చాము.
“ నీకు ప్రత్యేకంగా తెలియనిది ఏమి లేదులే, కొత్తగా నీకు చెప్పడానికి కూడా ఏమి లేదు.కొంచెం సేపు రామరావు వాళ్ళింటికి వెళ్ళి వస్తా” అంటూ కప్ కింద పెట్టి వుత్తరీయం దులిపి భుజాన వేసుకొని నీరసంగా అడుగులు వేస్తూ గేటు తీసుకొని వెళ్లారు.
నోరు తెరిచి చెప్పకపోయినా ఆయన దేనికంతగా మధన పడుతున్నారో తెలియన దానిని కాదు.చీటికి మాటికి తన ఫ్రెండ్ రామరావు గారింటికి ఎందుకు వెళుతుంటారో తెలియనంత అమాయకురాలిని అయితే కాను. ఈయన,రామరావుగారు ఒకే కంపెనీ లో దాదాపుగా 35 సంవత్సరాలు కలిసి పని చేశారు,ఇద్దరు ఆధునికంగా వున్న కాలనీ లో ఇళ్ళు కట్టుకొని స్టిరాపడ్డారు,పిల్లల పెళ్ళిళ్లు ,భాద్యతలూ తీరీ విశ్రాంతి జీవితం గడుపు తున్నారు
కానీ ఒక్కటే తేడా రామరావు గారితమ్ముళ్ళు ,చెల్లెళ్ళు, ఆయన పిల్లలు ఇద్దరు అందరూ వున్నవూళ్లోనే మంచి వుద్యోగలు చేస్తూ,తల్లితండ్రికి ఆసరాగా వుంటూ,సెలవుల్లో పిల్లలతో వచ్చిసరదాగా గడిపి వెళుతువుంటారు, మరి మా పిల్లలో రెండు మూడేళ్లలో ఒక్క పది రోజులు వుండడమే గగనమై పోతోంది,ఏమైనా అంటే సెలవలు దొరకాలి కదమ్మా అనేస్తారు.బయట పడకపోయినా మనసులో గూడుకట్టుకు పోతున్న ఒంటరితనం దిగులు మానసికంగా ఆయన్నిబాగాక్రుంగ తీస్తోంది,కొంత తెరుకునేందుకు వెళ్ళి వాళ్ళ మనవలతో కొంచెం సేపు ఆడి మనసు నెమ్మదించాక ఇంటికి వస్తారు లే అని అనుకొని ఖాళీ కప్ తీసి పనిలోపడితే మంచిది అనుకొని వంటింట్లోకి వెళ్ళాను.
నిన్న అక్కవాళ్ళ ఇల్లు వాళ్ళ మరుదులు,బావగార్లు,కొడుకులు కోడళ్ళు మనవలతో
వాళ్ళ నవ్వులతో,కేరింతలతో ఇల్లంతా మారుమ్రోగి పోయింది.వచ్చిన ప్రతివాళ్లు అక్కబావ మీద చూపించిన అభిమానం, ప్రేమ నా కళ్ళు తెరిపించేలా చేసింది.అక్కబావ సంపాదించుకొన్న ఆస్తి ఏమిటో,.అక్కబావ కళ్ళల్లో కనపడిన ఆత్మస్టైర్యమ్ మేము ఏమి కోల్పోయాము అన్నవిషయం తెలిసి వచ్చేలా చేసింది.మా అక్క చుట్టాలే కాకుండా బావ వైపు చుట్టాల అందరి అభిమానం సంపాదించిన అక్కమనసు, నడవడి నేను అలవరచు కోలేక పోయాను అన్నభావం మొదటి సారి అనిపించింది...అక్కడ వాళ్ళు పొందుతున్నప్రేమ,అబిమానం మాకు కొరవడిందన్న భావం మా వారి మనసు కితగిలిన గాయంమళ్ళీ రేగేలా చేసింది.
యాంత్రికంగా చేతులు పని చేస్తున్నైకానీ మనసులో అనేకఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.. అసలు ప్రస్తుతం మేమున్న ఈ స్టితి కి నా ఆలోచన ,నా ప్రవర్తనే కారణమేమో.....,నా పెళ్లైనాటికి మాది వుమ్మడి కుటుంబం,నలుగురు మరుదులు,ఇద్దరు ఆడపడుచులతో,వచ్చిపోయే చుట్టాలతో ఇల్లు, కళకళ లాడుతూ వుండేది. చాలరోజుల వరకు ఇంటి భాద్యత మావగారే చూశారు, మా ఆయనసహజంగా కొంత మెతక మనిషి అవటం వలన,నాకు కూడా మనకు ఎందుకు ఈ అత్తగారింటి కుటుంబ భాద్యత అనే స్వార్ధం వల్ల నెమ్మది నెమ్మదిగా మరుదులు ,ఆడపడుచుల ని దూరం పెట్టటం,మా పుట్టినింటివారినే చేరదీయటం చేశాను. అత్త వారింటివైపు పెళ్ళైన,పబ్బమైన...పండగలు ప్రస్తాపాలైన మొక్కుబడిగా వెళ్ళిరావటం వలన నాలో వస్తున్న మార్పు గుర్తించి అందరూ ముక్తసరిగా పలకరించటం లోకి వచ్చేశారు.నన్నెమి అనలేక ఈయన కూడా సర్దుకోపోయారు..... ఫలితం ఈనాటి ఈ నిరాసక్తమైన ,నిస్తేజమైన జీవనవిధానం. ఇలా వూరు కొనివుంటే లాభం లేదు,ఏదోఒకటి చేసి ఆయనని ఈ నిర్వేదం నుండి బయట పడేలా చేయాలి.
“వడ్డించాను రండి..మీకు ఇష్టమని గుత్తి వంకాయ కూర,ముక్కల పులుసు పెట్టాను” కొంచెం ఆయనలో హుషారు వస్తుందని పిలిచాను”.ఈ సారి మావగారి ఆబ్దికంమన ఇంట్లో పెడదాము..అందరికీ ఫోన్ చేసి పిలుద్దాము..వీలు వుంటే రెండు రోజులు ముందుగానే రమ్మని పిలుద్దాము...ఈ పేరున ఐనా అందరూ వస్తారు,మనకేమైనా బందు బలగం తక్కువ ఏంటి?పెరుగు వడ్డిస్తూ చెప్పా ను.
“ ఇన్నాళ్ళు లేనిది ,ఇప్పుడు ఏంటి కొత్తగా” కంచెంలొ చెయ్యి కడిగి లేస్తూ మనకి ఇప్పుడు నచ్చింది,వీలు కుదిరింది చేస్తాము అన్నంత మాత్రాన జరగవు కదా..... ఎవరూ వస్తారని నేను అనుకోవటం లేదు...”భారంగా లేచి వెళ్ళిపోయారు.
“ మీరు మరీనూ మనం ఎవ్వరిని దూరంచేసుకోలేదు...ఏదో కొంచెం పనుల వత్తిడివల్ల ఇవ్వాల్సిన ప్రేమ, అభిమానం చూపించ లేకపోయము, అంతమాత్రాన బందుత్వాలు పొతయా ఏంటి? మనం పిలిస్తే చాలు ..చూడండి అందరు రెక్కలు కట్టుకొని వచ్చి వాల్తరు...”చేతికి తాంబూలం అందిస్తూ ధీమాగా పలికాను.
మనసుల మధ్య దూరం పెరగిపోయాక పెదవుల పైన పలికే తేనె పలుకులు మనుషులని దగ్గరచేస్తాయను కోవటం నీ భ్రమ..నీ పుట్టింటి వారు వాస్తరేమో కానీ....బాధతో గొంతు జీర పోవడం తో ఇంక నాతో మాట్లాడవలసిన అవసరం లేదు అన్నట్టు గొడవైపుకి తిరిగి పడుకొన్నారు.
ఈయన ఇలాగే అంటారు...నాకు తెలియదా మా మరుదులు ఆడపడుచుల సంగతి...మాకన్నా మరుదులు కొంచెం తక్కువ సంపాదనలో వున్నారు,అన్న అనే గౌరవం తో వస్తారు,ఇక అడపడుచులు చాలా భోలా మనుషులు..కొంచెం ప్రేమ నటిస్తూ మాట్లాడితే చాలు వాళ్లే వస్తారు...ఈ సారి నేను దగ్గరుండి ఫోన్ లొ అందరినీ పిలిపిస్తా...ఎలా రారో నేను చూస్తా...పనిలో పని పిల్లలిని కూడా రమ్మంట ...ఒక్కసారి అందరు కలిసి మాట్లాడుకొంటే దూరాలు అవే సమసిపోతాయి...రేపే అందరికీ ఫోన్ చేస్తాను అనుకొని తేలిక పడ్డ మనసుతో నడుము వాల్చాను.
“అలాగే వదిన తప్పకుండ వస్తాము” ,”నువ్వు అంతగా పిలవా”లా వదిన అలాగే వస్తాము,””నువ్వు పిలిచాక రాకుండా వుంటామా” ఇలా అందరూ తప్పకుండ వస్తామని హామీ ఇచ్చేంత వరకు పట్టువదలని విక్రమార్కు డిలా ఫోన్ లో పిలిచాను.పిల్లలు కూడా తప్ప క వస్తారనే భరోసా కుదిరాకే “ఏమండీ ఈ కార్యక్రమం అయిపోయాక అందరం అదేనండీ అన్ని జంటలు కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసు కొందాము.” రెట్టింపు అయిన సంతోషం తో చెప్పాను.
“బాబు అపహర్ణం దాటి పోతోంది ...ఇంక కార్యక్రమం మొదలు పెట్టాలి” పంతులుగారు తొందరపెడుతున్నారు....పొద్దున నుండి వీధి గుమ్మం వైపే చూస్తున్న ఈయన కండువా తో కళ్ళు తుడుచు కొంటూ వచ్చి పీటల మీద కూర్చున్నారు. మంత్రాలకి అనుగుణంగా పెదాలు చేతులు కదులుతున్న ఈయన మనసు మాత్రం రాని తమ్ముళ్ళ చుట్టే తిరుగు తున్నట్టు వుంది.
అన్న దమ్ములు అందరి లో పెద్దవాడిని తనబ్రోటకనవేలు క్రిందగా తన తమ్ముళ్ళ చేతులు వుంచి తర్పణం వదల లేకపోయాను అన్న భావం ఆయన కళ్ళల్లో కదలాడు తుండగా “బాబు లేచి ఈ చిన్న పిండం తీసుకొని కాకి కి పెట్టి రండి” దాంతో కార్యక్రమం పూర్తి అవుతుంది. అని పంతులుగారు చెప్పగా పిండం తీసుకొని పెరటి వైపు నడిచారు.
“ కలికాలం వచ్చేసి నట్టు వుంది బాబు ఒక్క టి అంటే ఒక్కటి....ఒక్క కాకి కూడా కనపడటం లేదు మాయదారి పట్టణాలలో....ఏమి చేస్తారు మీరు మాత్రం..ఆగోడ మీద వుంచి ఒక్క దణ్ణం పెట్టి వచెయ్యండి” మిగతా కార్యం ముగించి తన కి వచ్చే సంభావన తీసుకొని వెళ్ళి పోవాలని ఆయన తొందర పడుతున్నారు.
తన అహంకారం,తన తెంపరితనం వల్లే అంతమంది వుంది వున్నా ఆయన్ని ఒంటరిగా మిగిల్చినది తనే అని,ఆ విషయం తనకి ఇప్పుడు తెలిసినా తనని మన్నించి రాలేకపోయిన తన తమ్ముళ్ళ కోసం,ముద్ద ముట్టడానికి రాని కాకి కోసం ఎదురు చూస్తూ ఏకాకి ల మిగిలిన ఆయన్ని చూస్తూ కళ్ళు తుడుచు కొంటూ క్షమించమని మనసులోనే వేడుకొన్నాను