బంగ్లా కుక్క - -పెద్దాడ సత్యప్రసాద్

Banglaw kukka

మా వీధికి ఒక కుక్క వచ్చింది. అది ఊర కుక్క కాదు, మేలు రకం జాతి కుక్క. చూడడానికి అత్యంత బలిష్టంగా ఉంది. మంచి రంగు తేలి ఉంది. మెడలో బెల్ట్ ని బట్టి చూస్తే అది బాగా డబ్బు చేసిన వారి పెంపుడు కుక్క అని ఇట్టే చెప్పేయవచ్చు. అయితే దానిని పెంచిన వారు ఆ కుక్కని ఎందుకు అలా వీధిలో వదిలేసి వెళ్ళారో తెలియదు. యజమానుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉండే కుక్క తనకు ఈ కష్టం సొంత వారే తెచ్చిపెడతారని కలలో కూడా ఊహించి ఉండదు. అందుకే అలా ఎరుగని చోటుకు వచ్చి ఏడుపు మొహంతో కూర్చుంది.

వీధి కుక్కలు మా వీధిలో దాదాపుగా అరడజనుకు పైగానే ఉన్నాయి. అవన్నీ బక్క చిక్కి బతుకుతున్నవే. ప్రాణాలను ముక్కున పెట్టుకుని మూలుగుతున్నవే. వాటికి ఆకలి బాధ అంతా ఇంతా కాదు. దాంతో ఎవరైనా ఏమైనా పెడితే తిందామా అని కాపు కాస్తూంటాయి. వచ్చే పోయే పాదచారుల వెనకాల పడుతూంటాయి.

ఎవరైనా ఏదైనా ఆహారం పడేస్తే తినేందుకు మొత్తం కుక్కలు అన్నీ పోటీ పడుతూ ఉంటాయి. అంతవరకూ సఖ్యతగా ఉన్నట్లు కనిపించినా ఆకలి పోరాటంలో మీద పడి కరచుకుంటాయి కూడా. ప్రకృతిలో ఏ జీవికైనా ఆకలికి మించినది లేదు. అందుకే కుక్కల బాధ వాటిది.

ఇలా రోజూ వీధిలో తిరుగాడే ఈ బక్క చిక్కిన కుక్కలను చూసిన వారికి వాటి పక్కనే ఈ జాతి కుక్క కనిపించడం వింతగానే ఉంది. అది ఉలకదు, పలకదు, ఉన్న చోటనే కూర్చుని వచ్చే పోయే వారిని మౌనంగా చూస్తోంది. అందులో తన యజమాని ఎవరైనా ఉంటారేమో అని దాని కనులు ఆశగా వెతుకుతున్నాయన్న మాట. కుక్కకు భావోద్వేగాలు ఎక్కువే మరి.

తన వారు అనుకున్న వారు కనిపించకపోతే ఏకంగా పస్తులు ఉంటుంది. పచ్చి మంచి నీళ్ళను కూడా ముట్టదు. అందుకే కుక్కలే నయం మనుషుల కంటే అని అంతా అనుకోవడమూ సహజం. మరి ఈ జాతి కుక్క ఈ విధంగా ఉండిపోవడం నాబోటి వారికి ఒకింత ఆశ్చర్యంగానే ఉంది.

ఇక మనుషుల మధ్యన పోటీ ఎలా ఉంటుందో కుక్కల మధ్యల పోటీ ఉందనిపించేలా మా వీధి కుక్కలు జాతి కుక్క మీద కలబడుతున్న దృశ్యాలను నేను సాయంత్రం వేళ ఆఫీసు నుంచి వస్తూ గమనించాను. నాకే జాలి వేసి వాటిని తరిమేసి ఆ జాతి కుక్కను కాస్తా కాపాడాను.

తన మీదకు వచ్చి అన్ని కుక్కలు పడుతూంటే జాతి కుక్కకు ఏమి చేయాలో కూడా అసలు పాలుపోలేదేమో. అలా అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. దాంతో నేను ఇదేమి చిత్రమో అనుకున్నాను. ఈ జాతికుక్కకు దాని సహజ లక్షణం కంటే దానికి జమీందారీ లక్షణమే ఒంటబట్టినట్లుగా ఉందని కూడా అనిపించింది.

అవును ఆ కుక్క బంగ్లాలో ఉన్నపుడు దాని దర్జాయే వేరు కదా. యజమాని దానిని ఎంతో ప్రేమగా చూసుకుని ఉంటాడు. వేళకు అన్నీ తెచ్చి పెడుతూ దానిని ముద్దుగా బొద్దుగా సాకి ఉంటాడు. అంతే కాదు చలికాలం అయితే వెచ్చని గుడ్డను కూడా కప్పి చక్కని చోటున నిద్ర పుచ్చి ఉంటాడు. యజమాని ఒడిలో ఎంతో హాయిగా కూర్చుని దాని తిండీ నిద్ర కూడా పూర్తి అయి ఉండొచ్చు.

మరి ఎందుకు వదిలేసి ఉంటాడో అని ఆలోచించి ఆ జాతి కుక్కను పరిశీలించడం మొదలెట్టాను. దాని ఒంటి మీద ఏవో మచ్చలు కనిపించాయి. బహుశా దానికి ఏదో రోగం వచ్చి ఉంటుంది. దాంతో ఇక అది ఎక్కువ రోజు బతకదు అని పశువుల డాక్టర్లు చెప్పి ఉంటారు, లేదా దానితో ఉంటే మీకూ ఆ జబ్బు అంటుకుంటుంది అని కూడా హెచ్చరించి ఉంటారు. అందుకే ఎవరికీ చెప్పకుండా ఎక్కడ నుంచో కారులో వేసుకుని వచ్చి మరీ మా వీధి చివరన ఆ యజమాని వదిలేసి పోయి ఉంటాడు అనుకున్నాను.

అలా దాని గురించి ఆలోచిస్తున్న కొద్దీ జాలి కలుగుతూ వచ్చింది. బతికి చెడ్డది పాపం అనుకుని దానికి మెల్లగా నేను దగ్గరకు తీశాను. మా ఇంటికి పిలుచుకుని వచ్చి కాస్తాంత ఆహారం దానికి వేశాను. అయితే నా వైపు ఆ ఆహారం వైపు ఎగాదిగా చూసి ఆ జాతి కుక్క అలాగే ఉండిపోయింది తప్ప ముద్ద ముట్టడం లేదు.

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో కానీ వీధి కుక్కలు ఒక్కసారిగా కలబడి ఆ ఆహారాన్ని ఆబగా తినేయడం మొదలెట్టాయి. నేను అదలిస్తున్నా అవి వినిపించుకుంటేనా. పాపం జాతి కుక్క డొక్క మాడిపోతోంది. అయినా ఏమి చేస్తాం. అది అసలు నోరు తెరచి తినదాయే.

ఇలా కొన్ని రోజులు గడచాయి. నేను ఆహారం వీలు దొరికినపుడల్లా అది ఉన్న చోటకు తెచ్చి పెట్టడం ఒక డ్యూటీగా చేసుకున్నాను. నాకు తెలియకుండానే దాని మీద ప్రేమను కనబరుస్తూ వస్తున్నాను. తిండి లేక ఎక్కడ చచ్చిపోతుందో అన్న బాధ కూడా నాకు కలుగుతోంది.

అయితే ఆ జాతి కుక్క మాత్రం తన యజమాని మీద ఉన్న చోట మీద బెంగతో అలాగే మారం చేస్తోంది. ఇలా కాలం గడుస్తోంది. ఒక రోజు నేను వీధి చివర మలుపు నుంచి ఇంటి వైపుగా వస్తున్నాను. ఆహారం పొట్లాం ఎవరో జాతి కుక్కకు పెడుతున్నారు. ఆ సమయంలో వీధి కుక్కలు కూడా అక్కడికి వచ్చి వాటా కోసం పోటీ పడుతున్నాయి. అయితే చిత్రంగా జాతి కుక్క ఆ అహారం కోసం వీధి కుక్కల మీదకు ఒక్కసారిగా ఉరికింది. అదే ఊపుతో తన బలంతో వాటిని కట్టడి చేసి ఖంగు తినిపించింది. ఆ మీదట తాను ఒక్కతే ఆబగా ఆ ఆహారాన్ని తినేసింది.

ఇదంతా దూరం నుంచి చూస్తున్న నాకు ముచ్చటేసింది. జాతి కుక్క మెల్లగా లోకం లో పడింది అనిపించింది. అవును నిజమేగా ఏ బెంగ అయినా ఎంత కాలం ఉంటుంది. అది కుక్క కాబట్టి అన్ని రోజుల పాటు తన యజమాని కోసం శోష వచ్చేలా ఎదురుచూసింది. చివరికి బతుకు పోరాటంలో ఓడి గెలిచింది.

ఈపాటికి దానికి అన్నీ అర్ధం అయి ఉంటాయి. ఇక మీదట తన జీవితం వీధిలోనే అన్నది పూర్తిగా బోధపడి ఉంటుంది. తన నివాసం కూడా ఎండకు చలికి వానకు తట్టుకోవాల్సిందే అని కూడా అర్ధం చేసుకుని ఉంటుంది. అందుకే అది తన కొత్త జీవితాన్ని మొదలెట్టింది. అలా ఇతర వీధి కుక్కలతో పాటుగా అది కూడా ప్రతీ రోజూ కలియ తిరగడం ప్రారంభించింది. అలా దాని బతుకు వేటలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అవును కుక్క అయినా మనిషి అయినా బంగ్లా రోజులు ఎవరికీ శాశ్వతం కావు కదా అనిపించింది నాకు.

మరిన్ని కథలు

Ekaaki
ఏకాకి
- ప్రభావతి పూసపాటి
Kalpita betala kathalu.3
కల్పిత బేతాళకథలు - 3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
KalpitaBetala kathalu.2
కల్పిత బేతాళకథలు - 2
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
KalpitaBetala kathalu.1
కల్పిత బేతాళకథలు - 1
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Manam
మనం
- మణి
Kanumarugai
కనుమరుగై
- ఐసున్ ఫిన్
Vaaradhulu
వారధులు
- Bhagya lakshmi Appikonda
Vaarthallo headloinega
వార్తల్లో హెడ్లైన్సా
- ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)