వీడని తోడు - Dr. శ్రీదేవీ శ్రీకాంత్

Veedani todu

'కాలం నిధానంగా నడుస్తున్నట్లు అనిపిస్తోంది. గడియారం ముల్లు శబ్ధం బాగా వినిపిస్తోంది. కళ్యాణి ఆరోగ్యంగా బాగుంటే ఎంతో సందడిగా ఉండేది. ఇప్పుడు దాని కదలని పరిస్థితి చూడలేక పోతున్నాను. కళ్యాణి నా ప్రాణం. అది అలా మౌనంగా వుంటే నాకు చాలా కలవరంగా వుంది. నా మనసంతా ఎంతో ఆందోళనగా వుంది. డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాలి' కళ్యాణిని ఎత్తుకుని కారులో కూర్చోపెట్టాను. హైద్రాబాద్ లోని అమీర్ పేటలో ఆసుపత్రి. దానికి బాగున్నప్పుడు గుండ్రంగా కళ్లు తిప్పి చుట్టూ పక్కల దృశ్యాలు చూసేది. ఇప్పుడు దుప్పటి మాటున, స్తబ్దుగా వుంది. ఆలోచిస్తూ హాస్పిటల్ చేరుకున్నాను. "మీ కళ్యాణీ కళ్లు పోయాయి. వినికిడి కూడా పూర్తిగా పోయింది ప్రకాష్ గారు! ఇక వచ్చే ఆస్కారం లేదు." అంది డాక్టర్ నమ్రత. 'డాక్టర్ గొంతులో ఏమాత్రం బాధ లేదు. ఎంతో మామూలుగా ఏదో చిన్న విషయం చెప్పినట్లు చెప్పింది. ఈ విషయం ఎంతో బాధతో చెప్పే విషయం. నా గుండె బరువెక్కింది. నా మనసు మనస్సులో లేదు.' "స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్ళినా లాభం లేదు" అన్న డాక్టర్ మాటలు నా నరాల్ని మెలిపెడుతున్నాయి. నా గుండె చెరువు అయ్యింది. మనసు అంతా శూన్యం. కళ్యాణి పక్కనే కూర్చుని బాధ పడసాగాను. "కళ్యాణీ!" నిదానంగా పిలుస్తూ దగ్గరగా వెళ్ళి మృదువుగా వెన్ను నిమిరాను. ఏ మాత్రం ప్రతి స్పందన లేదు. చాలా అవస్థ పడుతోంది. "ఓ దేవుడా! నా కళ్యాణి బాధను పోగొట్టలేవా? దాని అవస్థ చూడలేక పోతున్నాను. అది నొప్పులతో చాలా బాధ పడుతొంది. మందులు సరిగ్గా పనిచేయడం లేదు. దేవుడా! మాట్లాడవా. బదులు లేదు. దేవుడు కనిపించడు." గట్టిగా మాట్లాడుతున్నాను. ఎవరైనా చూస్తే పిచ్చి వాడు అనుకుంటారేమో!? నా మనస్సు మూగగా రోదిస్తోంది. శ్వాస బలవంతంగా తీసుకున్నాను. నాలో తెలియని నిట్టూర్పు. 'ఆరోగ్యమే మహా భాగ్యం అని ఊరికే అనరు. ఏ జీవికైనా వృద్దాప్యం మహాశాపం. కళ్యాణి ఒక్కో అవయవాన్ని తట్టి పడుకో పెడుతొంది. కళ్యాణీ! నువ్వు సరదాగా తిరుగుతుంటే వందమంది ఇంట్లో ఉన్న బలం నాకు. నువ్వూ నేను ఎన్ని కబుర్లు చెప్పుకునే వాళ్ళం?' అప్రయత్నంగా కళ్లు నీటి చెలమలయ్యాయి. "కళ్యాణీ! నువ్వు ఇలా స్తబ్దుగా ఉంటే నేను ఎవరితో కబుర్లు చెప్పాలి. నాలోని దేవునికా? దేవుడు కనబడడే? మాట్లాడడే? నాలో దిగులు అనంతం కళ్యాణీ!" చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాను. "నువ్వు- నేను మనిద్దరిలో ఎవరు నిజం దేవుడా? నాకు తెలుసు నువ్వే. అన్నీ ఇచ్చే వాడివి నువ్వేగా!? కర్మ సిద్ధాంతం ప్రతిఫలాలు ఎంత బాధా కరమైనవి. జీవితమే వేదన అంటావా? ఎందుకు నేను ఇంత పెద్దగా నవ్వు తున్నాను? ఇది నిజమైన నవ్వు కాదు. బాధ ఎక్కువైనప్పుడు నైరాశ్యంలో వచ్చే నవ్వు. నాలో దురంతరంగా దుఃఖం కలుగుతోంది. అది నీకు తెలుసు. మనం ప్రేమించిన వారు క్షేమంగా లేక పోతే మనలో తీవ్రమైన బాధ వుంటుంది." దేవుడితో మాట్లాడు తున్నాను. దేవుడు మాత్రం మాట్లాడడం లేదు. లోకంలో దేవుడు మనతో మాట్లాడాడు అని చెబితే ఆ చెప్పిన వాళ్ళని పిచ్చి వాళ్ళుగా చూస్తాం. "నా కళ్యాణీ! నువ్వు నన్ను ఎంత ఇష్ట పడేదానివి. ఇప్పుడు మతి మరుపుతో జ్ఞాపకాలన్నీ చెరిపేసు కున్నావు." "దేవుడా! మతి యెందుకు పెడతావు? బంధనాల్ని యెందుకు చేస్తావు! ఎందుకు జ్ఞాపకాల్ని తుడిపేస్తావు? ఒక గదిలో నుండి మరో గదిలోకి వెళ్ళ దారిని గుర్తు పట్టలేని నా కళ్యాణి దుస్థితి చూస్తున్నావుగా!? నన్ను ఎంతో బాధ పెడుతున్నావు దేవుడా!" కళ్యాణిని దగ్గరగా పొదవి పట్టుకున్నాను. ఎవరో దాన్ని నా నుండి దూరం చేస్తున్న భావన. "కళ్యాణీ! కొంచం నీకు ఇష్టమైన పెరుగన్నం తిను. పెరుగు అన్నం అనగానే చొంగ కార్చుకుంటూ చిన్న పిల్లలా క్షణం ఆలస్యం చేయ కుండా నా మీదకు ఉరుకు కుంటూ అన్నం తినేదానివి. కొంచం తిన్నాక, నా చేతిని పట్టుకుని తినిపించమని సైగ చేసేదానివి. నేను తినిపిస్తే ఇష్టంగా తినేదానివి. నేను నిన్ను ఎంత పిలుస్తున్నా కన్నెత్తి చూడలేని స్థితి నీది. నా బంగారు తల్లికి ఎన్ని కష్టాలు వచ్చాయో!" 'పొగిలి పొగిలి ఏడుస్తుంటే ధారలుగా కారే కన్నీరే నా తోడా!?' "దేవుడా! నెల రోజుల నుండి సరిగ్గా ఆహారం తినక ఎంత చిక్కి పోయిందో!? ఎందరో స్నేహితులు వచ్చి చూసి వెళుతున్నారు మా ఇద్దరినీ. నాలోని బాధను చూడలేరు.వాళ్ళు. నా ఆవేదనా, ఆక్రోశం వారికి అర్థం కావు." "ఇలా మీరు ఢీలా పడిపోతే ఎలా?"అంటారు. ఒక్కరు... కనీసం ఒక్కరు నా వేదనను అర్థం చేసుకునే వారు లేరు స్వామీ!" "కళ్యాణీ! నా బంగారూ! కొంచం పాలన్నా తాగు." "అయ్యో! దేవుడా! నా కళ్యాణి కి పుట్ట చెవుడు వచ్చింది." 'ఒక్కసారి ఈ పాలపీక నోట్లో పెట్టి ప్రయత్నిస్తాను. అసలు మింగుడు పడడం లేదు దానికి. నాకు కాళ్ళూ చేతులు ఆడడం లేదు. మనసులో యెన్నో జ్ఞాపకాలు. ఒక్కొక్కటి వచ్చి నన్ను కవ్వించి కనుమరుగు అవుతున్నాయి.' "కళ్యాణి! దుప్పటి సరిచేయనీ!" "కళ్యాణీ! నువ్వు మొదటి సారి నాదగ్గరకు వచ్చినప్పుడు మూడు నెలల వయసు నీకు. అమావాస్య నాటి కటిక చీకటిలా నీ దేహం. పౌర్ణమి లో వెలిగే చంద్రుడిలా ఫ్లోరోసెంట్ రంగులో మెరిసే నీ కళ్ళు. "భౌవ్ భౌవ్" అంటూ పలకరించావు. "నీ తోడుగా ఉండడానికి వచ్చాను" అన్నట్లు నీ అరుపును అన్వయించుకున్నాను. కొత్తా పాతా లేకుండా నా ఒళ్ళో వచ్చి కూర్చున్నావు. మెల్లగా నీ వీపు నిమిరాను." 'కళ్యాణి చర్మం తాకగానే నా అర్ధాంగి సుధా యామిని మెత్తని బుగ్గలు గుర్తు వచ్చాయి. తనతో గడిపిన జ్ఞాపకాలను ముందేసుకుని నా గుండె అరల్ని తెరుస్తూ మౌనంగా చదువు కున్నాను. కొందరి జీవితాల్లోకి కొందరు వచ్చి మనసిస్తారు. గాలి దూరని దగ్గర తనం అందిస్తారు. ప్రేమించిన వాళ్ళను పిచ్చి వాళ్ళను చేస్తారు. చెప్ప కుండా వెళ్ళి పోతారు. నా అర్ధాంగి సుధ నాకు చెప్ప కుండా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ జ్ఞాపకాలు,ఆ వేదనకు ఉపశమనంగా నిన్ను నాకు నేస్తాన్ని చేసింది ఆ దేవుడే కళ్యాణీ! గతాన్ని తలుచుకుంటూ బాధ పడటమే నాకు మిగిలిందా!?' "కళ్యాణీ! నీకు చిన్న గౌనులు, డ్రాయర్లు, సాక్సులు, టోపీలు కుట్టించాను. నిన్ను నా లోకంగా చేసిన దేవునికి కృతజ్ఞతలు చెప్పు కున్నాను. గుర్తుందా!? ఒకనాడు దొంగ నన్ను పట్టుకుని కత్తి తీసి బెదిరించి... నా సుధ జ్ఞాపకంగా ఉంచు కున్న బంగారం, పట్టు చీరలు మూట కట్టుకున్నాడు. "డబ్బు తీసుకుని, ఆ నగలు, పట్టు చీరలు వదిలేయి. నీకు దణ్ణం పెడతాను" అని దొంగను ప్రాధేయ పడ్డాను. దొంగ కత్తితో నా పై దాడిచేసే లోపు నువ్వు దొంగ కాలిని గట్టిగా పట్టుకుని చీరేసావు. అన్ని వస్తువులూ పెట్టిన మూటను లాగేసుకున్నావు." "కళ్యాణీ మంచి బుట్ట గౌను వేశాను. అందంగా అలంక రించాను. కళ్ళ అద్దాలు పెట్టమని గోల చేశావు. పాస్ ఎండ్ పెట్స్ బ్యూటీ కాంటెస్ట్ కు తీసుకుని వెళ్ళాను. అందరి కళ్లు నీ మీదే. నువ్వు చేసిన విన్యాసాలకు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నీ జవాబులకు నీకు ప్రథమ బహుమతి వచ్చింది." "బాగా ట్రెయిన్ చేసారు మీరు" అంటూ అందరూ నన్ను ఎంతగానో ప్రశంసించారు. "కళ్యాణి ఆయుష్షు ...అంటే మీ ఈ రకం కుక్క జాతి ఆయుష్షు పన్నెండు నుండి పదిహేను సంవత్సరాలే" అంది డాక్టర్ నమ్రత. "నా ప్రేమలో పద్దెనిమిదో సంవత్సరం లోకి అడుగు పెట్టావు కల్యాణి!" నా దుఃఖం అనంత సంద్రాల మేళవింపు. 'మనకు నచ్చిన వారి తోడులో యుగాలు గడిపేయ వచ్చు. మనిషి ఆయుష్షు వంద ఏళ్ళా?' అంతా మిథ్య. జరా మరణాలు దైవ నిర్ణయాలు. 'నిన్న నేడు రేపు అనే కాల చక్రం. నిరంతర చక్ర భ్రమణం. సృష్టి మొదలయ్యాక ఎన్నో కోట్ల మంది కాల గర్భం లో కలిసి పోయారు. మళ్ళీ జీవం పుడుతుంది. కొంతకాలం జీవించి దైవం లోకి వెళతాము. జీవిత చక్ర రహస్యం అర్థం కాదు.' "దేవుడా!నిన్ను చూడాలని చాలా సార్లు అనుకున్నాను. కానీ నిన్ను తెలుసుకోవాలి అని ఏనాడూ అనుకోలేదు. ఇన్నాళ్లు నువ్వు నన్ను బాగా చూసుకున్నావు. నన్ను చూసి నువ్వు ఇప్పుడు యెందుకు నవ్వుతున్నావు? ఏదో చెప్పాలి అనుకుంటున్నావు. చెబుతున్నావు. నీ భాష నాకు అర్థం కావడంలేదు. నీ తత్వం నాకు బోధ పడడంలేదు.నీ సైగలు నా కళ్ళకు స్పష్టంగా కనబడడం లేదు. నేను నిజం కాదు అనేది నాకు తెలుసు. అనంత గర్భం లో ఎందరో అతిథులు. పోయే తిథి తెలియని నిర్భాగ్యులు. అన్నీ తెలిసిన నువ్వు ఏదీ ముందుగా చెప్పవు. నేను గొంతు చించుకుని నీ ముందు మోకలబడి మాట్లాడుతున్నాను. నీది మాత్రం మౌనం." 'దేవుడితో మాట్లాడడం ఈమధ్య నాకు బాగా అలవాటు అయ్యింది. నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తాడు. కనిపించడు. సద్దు చేయడు. బాధ తీవ్రతలో వున్న మనిషి మాట్లాడ గలిగేది నిజానికి దేవుడితోనే. అదే కొండంత ఊరట కదా!' 'నా అర్ధాంగి సుధా యామిని నన్ను విడిచి వుండలేదు అనుకునే వాడ్ని .'ప్రకాష్!మన పేర్లు చిత్రం. మనం కలిసేది లేదు అనేది. నువ్వు వెలుగు. నేను చీకటి. నా లోని సుధ మాత్రం నీ జ్ఞాపకాల అడుగుల్లో ఉండి పోతుంది' అనేది. తను నవ్వుతూ అనే మాటల్ని నిజం చేసి వెళ్ళిపోయింది. నా ప్రకాశాన్ని యామినిలో చుట్టేసి వెళ్ళినప్పుడు నేను ఇంత బాధ పడలేదు. ఆ ఒక్క సంఘటన మమ్మల్ని ఇద్దరినీ వేరు చేసింది. అదే ఆమె మరణం. నా గుండెకు వేదనా రణం. ప్రపంచం లో అత్యంత బాధాకరణ విషయం ఏదన్నా వుందా అంటే అది మరణమే!' 'దేవుడా! నాకు సుధకు మధ్య వున్న రహస్యాలు అన్నీ నీకు తెలుసు. నేను- నువ్వూ ఎదురు ఎదురుగా వచ్చినప్పుడు నా రహస్యాలు తెలిసిన నిన్ను ఎలా చూడగలనో! మనిషి జీవితంలో రహస్యాలు అన్నీ నిజానికి నీకే తెలుస్తాయి కదా! నేను నీ చెంతకు వచ్చినప్పుడు నన్ను చూసి గేలి చేయవు కదా! నేను ఈ సృష్టిని ప్రేమించాను. అంటే నాలోని నిన్ను అధికంగా ప్రేమించాను దేవుడా!' నా ధీన గాథను ఆలకించు. 'కళ్యాణి కదులుతోంది. కాదు విపరీతంగా బాధ పడుతోంది. ఫోన్ చేసి డాక్టర్ని ఇంటికి రమ్మని పిలుస్తాను. ఈనాడు ఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తున్న మానవ మేథస్సు, నా కళ్యాణి ప్రాణాలను రక్షించలేదా? డబ్బుకు వెనుకాడను.' "కళ్యాణీ! ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడవూ! నీకు నేను గజ్జెలు కొన్నప్పుడు అవి పెట్టగానే ఎలా పరిగెట్టావు! ఆ పరుగు నా కళ్లకు కనిపిస్తుంది ఇప్పుడు. నువ్వు గజ్జెల కాళ్ళతో నడుస్తుంటే నా కూతురే అందెల పాదాలతో గలగలమని సవ్వడి చేస్తున్నట్లు మురిసిపోయాను. నేను పాట పాడితే ఎంత బాగా నాట్యం చేసేదానివి. "నీకు ఇష్టమైన పాట... శింజిని రవళులు ఎదనే తాకగ మంజరి మనమున ఏవో కలలూ మయూరి నాట్యం నా కళ్యాణి చేయగ మదిలో వెలుగుల వర్షపు హర్షము..." 'ఆ జ్ఞాపకాల మూటలు... నీ మధుర చేష్టలు... ఇప్పుడు నా కళ్లల్లో ఆకాశ గంగ పరవళ్ళు... నీ నాట్యం చూసి నా మనస్సు సెలయేరులా సవ్వడి చేసేది. మనిద్దరం ఎన్ని రకాల వంటలు చేసుకుని తినేవాళ్ళం. నా భార్య యామినీ సుధ గురించిన ఎన్ని రహస్యాలు నీకు చెప్పాను. ఎందుకు నన్ను చూడవు. "నీ కిష్టమైన పాట పాడతాను. ఒక్క సారి కళ్లు తెరిచి నన్ను చూడవా!?" కళ్యాణి కదలవే. అయ్యో! బాధతో తీవ్రంగా మూలుగుతున్నావు. నిన్ను నా ఒళ్ళో పొదివి పట్టుకుంటాను. నేను నీతోనే ఉన్నాను. చూడూ నిన్నూ నన్నూ ఎవరూ విడదీయ లేరుకదూ! ఎందుకో ఈ రోజు నా మనసు పదే పదే గతాన్ని నెమరు వేయ సాగింది కళ్యాణీ!" *** "నా పొట్ట లో నువ్వు కాలితో తట్టి చూపిస్తూ అరుస్తూ ఉన్నావు." 'ఎందుకు కొన్నాళ్ళుగా కళ్యాణి నన్ను చూసి ఇలా అరుస్తుంది? పదే పదే కాలితో పొట్టను రాస్తోంది!?' అని నా స్నేహితుడు Dr. శ్రీకాంత్ తో అన్నాను. "అశ్రద్ధ చేయకు. వెంటనే నువ్వు ఆసుపత్రికి రా!" అన్నాడు డా శ్రీకాంత్. "ఏరా! మీ డాక్టర్లకు అన్నీ అనుమానాలే" అన్నాను. తీరా టెస్ట్ చేస్తే క్యాన్సర్ మొదటి స్టేజ్ లో ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. "డాక్టర్! కళ్యాణికి నాకు క్యాన్సర్ ఉన్నట్లు ఎలా తెలిసింది? నాకు ఎలాంటి సింప్టమ్స్ లేవు కదా!?"అన్నాను. "ప్రకాష్!కుక్కలకు మానవుల కంటే పదివేల నుండి లక్ష రెట్లు ఎక్కువ సున్నితమైన వాసనా శక్తి ఉంటుంది. ఈ అసాధారణమైన సామర్థ్యం... క్యాన్సర్ వల్ల, వ్యక్తి శరీర వాసనలో చోటుచేసుకునే సూక్ష్మ మార్పులను గుర్తిస్తుంది. క్యాన్సర్ కణాలు రక్తంలోకి ప్రత్యేక సంతులిత వాయువుల సమ్మేళనాలను విడుదల చేస్తాయి. ఈ సమ్మేళనాలు శ్వాస ద్వారా లేదా చెమట, మలము లేదా చర్మం ద్వారా వెలువడుతాయి. కుక్కలను ఈ సమ్మేళనాలను గుర్తించేందుకు, ముఖ్యంగా ప్రారంభ దశలలోనే, శిక్షణ ఇవ్వవచ్చు. కుక్కలు మెలనోమా, ఊపిరితిత్తుల, ఛాతీ, గర్భాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్‌లను బాగా గుర్తించగలవు." అన్నాడు శ్రీకాంత్. "మరి మన కళ్యాణికి క్యాన్సర్ గుర్తించడం లో ఎలాంటి శిక్షణా లేదు కదా! " అన్నాను నేను. "శిక్షణ పొందని కుక్కలు కూడా వ్యక్తి శరీరంలోని ప్రత్యేక ప్రాంతం లో గట్టిగా వాసన చూడటం, దాని చెయ్యితో తట్టి చూపించడం చేస్తాయి ప్రకాష్!" అన్నాడు శ్రీకాంత్. "కళ్యాణీ!నా పట్ల ఎంతో శ్రద్ధ చూపించిన ప్రాణ ధాతవు. గుర్తుందా!? కళ్యాణీ! ఆరోజు నిన్ను పట్టుకుని ఎన్ని ముద్దులు పెట్టానో! ఇప్పుడు నువ్వు ఇంత బాధ పడుతుంటే నీ ఆరోగ్యం గురించి నేను ఏమీ తెలుసుకోలేక పోతున్నాను. మనిషికి తెలుసుకునే శక్తి లేదు. యంత్రాల సాయం కావాలి". నా వేదనల నిట్టూర్పులే తప్ప ఈ విషమకాలంలో నీకు శక్తిని ఇచ్చే శక్తి నాకు లేదు." *** "ఏమిటా అలికిడి!? ఎవరు? డాక్టర్!మీరా!? రండి." డాక్టర్ నమ్రత లోపలికి వచ్చి కూర్చుంది. "చెప్పండి డాక్టర్!నా కళ్యాణి పరిస్థితి ఎలా ఉందో!?" డాక్టర్ నమ్రత కళ్యాణిని పరీక్ష చేస్తూ "ప్రకాష్ గారు! కళ్యాణి నొప్పులతో చాలా బాధ పడుతుంది "అవును అది అంత బాధ పడడం నేను చూడలేక పోతున్నాను." దాని ధీన అవస్థ చూస్తే నా దుఃఖం ఆగడం లేదు డాక్టర్! "కళ్యాణీ! నీకు బాధలేకుండా చేస్తారట డాక్టర్! నా కళ్యాణి! నా కళ్యాణి! డాక్టర్ మాటలకు నా ఛాతీ బరువెక్కుతుంది." *** "ప్రకాష్ గారు!కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు వాస్తవాన్ని గ్రహించాలి. ఏ జీవి అయినా మరణించక తప్పదు. మీ కళ్యాణికి వయసు అయిపోయింది. మీ ప్రేమ వల్ల ఇంకా ఎక్కువ కాలమే బ్రతికింది. పూర్ణాయుష్కురాలు." అంది డాక్టర్ నమ్రత. "పుట్టుటయు నిజము. పోవుటయు నిజము.ఈ ఒంటరి జీవితం... ఎందరికో. ఒకరుగ రావడం... ఒకరుగ పోవడం... మధ్య బ్రతుకంతా ఆ దేవుని ఆటే.. బంధాలు ఎన్నెన్నో కలిసి పోతుంటాయి. కనుల నిండు కడలిలో ఉప్పెనలు యెన్నో యెన్నో. నిత్య మైనదిమరణం. సత్యమైనది దైవం. నా లోని దైవమా నువ్వు నిజమేను.' నాలో ఏదో వేదాంతం... "ఒక ఇంజెక్షన్ చేస్తాను. ఆ నొప్పులన్నింటికి శాశ్వత ఉపశమనం. అంటే ప్రశాంత మరణం" అంది డాక్టర్ నమ్రత. 'తెగుతున్న బ్రతుకు నరాలు... గుండె నిదానంగా ఆగుతోంది. గోడ గడియార లోలకం కళ్యాణి గుండెను కోస్తూ వుంది.దుఃఖం త్రెంచుకొని వస్తుంది నా లోకి. నాలో చీకటి.' "ప్రకాశం గారు! మీరు దిగులు పడకండి!" అంది ఇంజక్షన్ ఇస్తూ...డాక్టర్ నమ్రత కల్యాణిని పార్థివ దేహాన్ని డబ్బాలో పెడుతూ. "క్రిమేషన్ అయ్యాక యాషస్ పంపిస్తాను" అంది లేచి బయలుదేరుతూ. జలజలమని లోలోనికి భీకర వర్షం. ఆకాశం కట్టుకున్న సాయం సంధ్యా ముదురు కాషాయ చీర నా కన్నుల్లో ఆరవేశాడు దేవుడు. కళ్లు ఎరుపెక్కాయి.నా లోకి సంధ్రాలను ఉప్పొంగ చేస్తున్న దేవుడు. నిదురించే కడలి లో నౌక మునిగి పోతున్న దృశ్యం. దూరం నుండి హోరు శబ్ధం. *** 'కళ్యాణి వెళ్ళిపోయింది. గుండెలో రూపం నవ్వుతోంది. కనుల తడి నింపి... నా ఆసరా తుంచి వెళ్ళింది నా వృద్ధాప్యపు కలలకు ఆసరా వెళ్ళిపోయింది. ప్రొద్దుటే న్యూస్ పేపర్ తెచ్చి ఇచ్చేది. నాతో వాకింగ్ కి వచ్చేది. సమయానికి నాకు మందులు గుర్తు చేస్తూ తెచ్చి ఇచ్చేది..పూజకు పూలు కోసి తెచ్చేది. నా జీవితపు అడుగడుగునా దాని జ్ఞాపకాలే. మనసంతా కలత. నా జీవన తరువు పండే వేళ, నా ఊతం... ఆయుష్షు పండి పోయింది. గుబులు పడిన మదిని ఊరడించేది ఎవరు!? నిశిలో నింగి మలుపు మసక బారు తున్న వేళ దూరం నుండి తీతువుల కూతలు నా మనో వీధిలో వినబడుతున్నాయి. బెంగతో మనస్సు కుమిలి పొతోంది. నా ఎదను తన ఎదతో ముడివేసి నా సొదలు ఆలకించే నా కళ్యాణి రాదా!' వచ్చింది కళ్యాణి. కాదు పోస్ట్ లో కళ్యాణి బూడిద. పంపింది డాక్టర్! ప్రాకృతిక సంలీనం.భూమి లోకి ఇంకుతున్న రూపం వీడి బూడిద అయిన కళ్యాణి దేహం. స్నేహితుల ఆలింగనాలు. "అయ్యో!" మీ కళ్యాణి కాలం చేసిందా!? చచ్చి పోయిందా!? దేహం విడిచిందా... పదాల మార్పు. మరణం. ఒక్క క్షణపు ఎందరో సేదా వచనాలు నా మనసుకు ఊరడి నివ్వడం లేదు. నా లో ఎడతెగని సుడుల వలలో చిక్కుపడ్డ మూగరోధనలు. 'నాలో ఇప్పుడు ప్రకాశం లేదు. వెలుగూ చీకటీ ఎప్పుడూ సమాంతరంగా పయనించవు. పిపీలికాది పర్యంతం సమస్త జీవజాలం చనిపోయిన తరువాత వాటివాటి చేసుకున్న పుణ్యపాపముల లేదా కర్మలననుసరించి పునర్జన్మ లో వేరువేరు జీవజాలాల శరీరాలను ధరిస్తాయా!?' దూరం నుండి వినబడుతోంది... "న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతో2యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ||" "ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా ఉండకుండా ఉండదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు. ** "ప్రకాశం!" అని పిలుస్తున్నారు... "ఎవరది!?" "రండి జీవన్ గారూ. కూర్చోండి." "మా భాగ్యం ఈనింది. మీ కోసం ఈ కళ్యాణీ ని తెచ్చాను. మీకు ఈ వయసులో తోడుగా ఉంటుంది. మూడో రోజు పిల్ల. నేను తల్లి పాలు కొన్ని పిండి తెస్తాను." అన్నాడు నా స్నేహితుడు జీవన్. ఇదే మీ వీడని తోడు. కళ్లు మెరిసాయి. అదే నలుపు. అవే కళ్లు. *** అయిపోయింది****

మరిన్ని కథలు

Banglaw kukka
బంగ్లా కుక్క
- -పెద్దాడ సత్యప్రసాద్
Ekaaki
ఏకాకి
- ప్రభావతి పూసపాటి
Kalpita betala kathalu.3
కల్పిత బేతాళకథలు - 3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
KalpitaBetala kathalu.2
కల్పిత బేతాళకథలు - 2
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
KalpitaBetala kathalu.1
కల్పిత బేతాళకథలు - 1
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Manam
మనం
- మణి
Kanumarugai
కనుమరుగై
- ఐసున్ ఫిన్
Vaaradhulu
వారధులు
- Bhagya lakshmi Appikonda