ఆకలి - వేముల శ్రీమాన్

Aakali

ఇష్టాయిష్టాలతో సంభందం లేని ఉరుకుల పరుగుల ఉద్యోగం ,వృత్తి ధర్మం ,తప్పని పరిస్థితులు ..ఉదయాన్నే ఆఫీస్ పనిరీత్యా జలంధర్ నుండి ఢిల్లీకి వెళ్ళవలసి రావడం .పరుగు పరుగున రెడీ అయి కరెంటు బుకింగుతో టికెట్ బుక్ చేసుకొని స్టేషన్కి బయలుదేరాను.ముందురోజు రాత్రి కూడా ఆఫీస్ పని వొత్తిడిలతో భోజనం చేయలేదు.శ్రీమతి ఎంత వారించినా టిఫిన్ కూడా చేయకుండానే బయలుదేరాను.ప్లాటుఫారమ్ చేరుకునేసరికి ట్రైన్ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది.భోగి వెతుక్కునే పనిలో నేను పరిగెడుతుంటే ఒక ముసలి భిక్షగత్తె నా ముందు మోకరిల్లుతూ ,నా కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నది."సార్,ఆకలి భరించలేకున్నాను.దానం చెయ్యండి.",తొందరలో ఉన్న నేను ,ఆమెను వదిలించుకుని భోగిలో ప్రవేశించాను.ఏంటి ఈ న్యూసెన్స్ అనుకుంటూ సీట్ లో విశ్రమించాను,అంతలోనే ఓ గుడ్డి జంట "ధర్మం చేయండి,ఆకలి తీర్చండి అంటూ పొట్ట కొట్టుకుంటున్నారు.విసుక్కుంటూ జేబులో ఉన్న ఓ అయిదు రుపాయలను వారి చేతిలో ఉంచాను.ఇదేం ట్రైన్ రా ,ప్రశాంతత లేదు అనుకుంటూనే అలసిపోవడంతో ,చిన్న కునుకు ,నిద్ర పట్టేసింది.

ఒక్కసారి చప్పట్ల శబ్దంతో మెలకువ వచ్చేసింది.ఎదురుగా ట్రాన్సజెండర్స్ గుంపు.ఆకలి తీర్చండి సారు,తోచినంత దానం చేయండి,పుణ్యం వస్తుంది; మరోమాట లేకుండా పది రూపాయలు తీసిచ్చాను.కానీ మనసులో ఎదో అసంతృప్తి,ఏంటి ఈ గోల ,రైలు ఎక్కినప్పటినుండి ఆకలి,ఆకలి ,దానం చెయ్యండి, ఇవే వినిపిస్తున్నాయి,నేనేమైనా దానధర్మాలు చెయ్యడానికే పుట్టానా,అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి,వీళ్లందరినీ ట్రైన్ లోకి ఎలా రానిస్తున్నారు, ప్రయాణికులకు ప్రశాంతత లేకుండా,ఆకలి,ఆకలి ,ఆకలి..ఎవరు చూసినా ఒకటే గోల,అందరు కస్టపడి సంపాదించాలి,తన సంపాదనతో తన ఆకలి తీర్చుకోవాలి.అప్పుడే దేశం బాగుపడ్డట్టు లెక్క..ఇలా రకరకాల ఆలోచనలు మనసుని కుదిపేస్తున్నాయి.

నెమ్మదిగా కడుపులో ఆకలి మొదలైన ఫీలింగ్.కానీ టిఫిన్స్ దొరికే అవకాశం కనిపించలేదు.ఎన్నిసార్లు బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉండ లేదు..,ఓ కునుకు తీస్తే అదే పోతుందిలే అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. రైలు బండి పెద్ద కుదుపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను.ట్రైన్లో అంతా చీకటి.ఒకటే అరుపులు.,ఎవరో మాట్లాడుతున్నారు.ఏదో సమస్యతో ట్రైన్ ఆగిపోయింది.అంతా కారుచీకటి.మసక మసక మొబైల్ లైట్లతో కొద్దికొద్దిగా జనాలు కనిపిస్తున్నారు.కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి.తొందరపాటుతో కనీసం తాగడానికి నీళ్లు కూడా తెచ్చుకోలేదు.దానికి తోడు రాత్రి భోజనం ,ఉదయం టిఫిన్ చేయలేదు.కడుపులో ఆకలి కేకల కుదుపులు.ఎవరినైనా ,ఏదైనా అడగాలంటే మొహమాటం.చుట్టూ చూసాను.ఏదైనా తినడానికి దొరికే అవకాశం ఉందా అని.అది స్టేషన్ కూడా కాదు.ఎక్కడో మధ్యలో టన్నెల్లోఆగిపోయింది.దానికి తోడు చీకటి.అమ్మడానికి ఎవరు రావడం లేదు.ఎలా.. ఏదైనా దొరుకుతే బాగుండు.లేచి మెళ్లి మెళ్లిగా రెండు మూడు భోగీలు తిరిగి వచ్చాను.ఎక్కడ కూడా తినడానికి స్నాక్స్ కానీ,తాగడానికి నీళ్లు కానీ దొరికే అవకాశమే లేదు.నిరాశ ,నిస్పృహ . అతి కష్టం మీద మళ్ళీ సీట్లోకి తిరిగివచ్చాను.కొద్దిసేపు నిద్రపట్టినా బావుండు.,ఈ ఆకలి గోల ఉండదు..నిద్రపోవాలన్న నా ప్రయత్నం ఫలించడం లేదు.ఎవరికి చెప్పుకోవాలి నా భాద.ఇలాంటి రోజు వస్తుందని నేను నా జీవితంలో ఊహించలేదు.నెలకు లక్షరూపాయలు సంపాదించే నాకు ,ఇలాంటి రోజు ఊహకందని విషయం.ఆకలి తట్టుకోడానికి రకరకాల ప్రయత్నాలు ..నా శ్రీమతి ఎప్పుడు ప్రయాణాలున్న బ్యాగ్లో ఏదోఒక స్నాక్ పెడుతుండేది, సమయానికి పనికొస్తాయని. ఆ ఆలోచనతో చిన్న ఆశ .ఆకలి తీరుతుందేమోనని.బాగ్ అంతా వెతికి చూసాను.ఎక్కడా చిన్న బిస్కెట్ కూడా లేదు.అబ్బా ,ఏంటి ఈ శిక్ష..ఈరోజు ఏమైంది..,తెలియని కోపం,అసహనం,ఎలా ఎలా ,ఈ ఆకలినుండి బయటపడేది. ఎదురుగా ఓ పాప చాకోలెట్ తింటోంది .అబ్బా ,నాక్కూడా ఇస్తే బాగుండు.కొద్దిగానైనా ఈ భాద తీరేది.మొహమాటం తగ్గించుకొని అడిగితే ఎలా ఉంటుంది.ఆమ్మో ,చుట్టూ ఉన్నవాళ్లు నన్ను పిచ్చోడు అనుకుంటారేమో.ఏమిటి ఈ భాద.జీవితంలో ఎన్నడూ ఎరుగను.కళ్ళు చేతులు ముడుచుకొని పడుకున్నాను.ఎక్కడనుంచో ఛాయ్ ఛాయ్ అన్న అరుపు వినిపిస్తోంది.ఈ కష్టసమయంలో దేవుడు నన్ను ఆదుకోవడానికి వస్తున్నాడేమో అన్నంత సంతోషం.ఒక్కసారిగా లేచి ఛాయ్ అమ్మే కుర్రాడిని వెదుక్కుంటూ వెళ్ళాను."బాయ్ ,ఏక్ ఛాయ్ దేదో ,",క్షమాకీజియే సాబ్, ఛాయ్ అభి ఖతం హోగయా." ఒక్క కప్పు అవుతుందేమో చూడు,డబ్బులు ఎక్కువైనా ఇస్తాను.లేదు సర్,ఉంటె ఇవ్వకుండా ఉంటానా,ఒక్క ఛాయ్ కోసం ఇంతలా అడగాలా ,ప్రయత్నిస్తాను,దొరికితే తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోయాడు. విపరీతమైన నిరాశ ,నిస్పృహ,ఏంటి ఈ వేదన,నేనేం తప్పుచేసాను.ఎందుకింత కష్టం నాకు.ఒక్క ఛాయ్ కోసం నా కడుపు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతుంది.ఈ దుస్థితిమునుపెన్నడూ ఎరిగింది లేదు, మళ్ళీ పడుకునే ప్రయత్నం చేస్తున్నాను.

మా అమ్మ ,నా శ్రీమతి గుర్తుకువస్తున్నారు...జీవితంలో ఏ రోజు నాకు పస్తులుండే పరిస్థితులు కలిగించలేదు.భోజనం ఎక్కువైందనే గోలే తప్పా,ఆకలి బాధ ఎన్నడూ ఎరుగను. ఊర్లో మా ఇల్లు ఒక సత్రం .ఉన్నంతలో నలుగురికి పంచడం ,కలిసి భోజనం చెయ్యడం మా నాన్నకి అలవాటు,ఆనందం కూడా.నాన్నకు తగ్గట్టే అమ్మ.కడుపు నిండా భోజనం పెట్టేది అడిగిన అందరికి.నా శ్రీమతి వీలుపడినప్పుడల్లా అన్న దానాలు చేసేది గొల్లో,గోపురాల్లో ,ఆశ్రమాల్లో,అనాధ శరణాల్లో ,తప్ప్పదంటే ఆన్లైన్లో.ఒక్కోసారి శ్రీమతితో గొడవ పడేవాణ్ణి.ఎందుకూ ఈ దానధర్మాలు.. నిజంగా ఆ డబ్బులు అవసరం ఉన్న వాళ్లకి అందుతాయో లేదో అని.మనసులో ఏదో తెలియని పాశ్చాత్తాపం.నిజంగా ఎంత విశాల హృదయం.వాళ్ళకి ఆకలి విలువ తెలుసు....రకరకాల ఆలోచనలు .ఒక్క క్షణం ఏడుపు వచ్చేసింది.నిజంగా నాకేనా ఈ పరిస్థితి.యింత దౌర్భాగ్యం.బీపీసీల్ లో పెద్ద ఆఫీసర్ని.ఎన్నోసార్లు ఫైవ్ స్టార్ హోటల్స్ ,ఫ్లైట్లలో తిరిగిన వాణ్ని. పెద్ద పెద్ద పార్టీలూ ,లగ్జరీలూ ,మంచి ఆఫీస్ కాంటీన్న్లు ,ఎక్కడా వెలితి లేదు.ఇంట దుర్భరమైన పరిస్థితి ఊహించలేదు.

పరిస్థితి ఇంకా దిగజారుతున్నట్లుంది.కళ్ళు భైర్లు కమ్ముతున్న పరిస్థితి,స్పృహతప్పుతున్నాను..ఎదురుగా ఓ వికలాంగుడు..నాకు నోట్లో నీళ్లు అందిస్తున్నాడు.ఏదో తినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. సార్,తప్పుగా అనుకోవద్దు.మీరు కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితిలో వున్నారు.అది నేను గ్రహించి ,ఇందాకే గురుద్వారా లంగర్ కమిటీ వాళ్ళు ట్రైన్లో అన్న దానం పేరిటా ఈ ప్యాకెట్ యిచ్చారు..సమయానికి బాగా పనికొచ్చింది.దేవుడి ప్రసాదం ,అంట సర్దుకుంటుంది." చెబుతూ వెళ్తున్నాడు.భగవంతుడు ఈ రూపంలో నన్ను పరీక్షించడానికి నాకు దర్శనం యిచ్చాడేమో.ఆకలికి గబా గబా తినేస్తున్నాను.కడుపు నిండింది.ఎదురుగా అయన ముఖంలో ఏదో తెలియని సంతృప్తి.మాములు స్థితికి చేరుకున్నాను.నాలో ఉన్న ఈగోని చంపుకుని అయన కాళ్లకు దండం పెడుతున్నాను.

ఒక్క కుదుపుతో సీటునుండి క్రిందపడుతున్న క్షణంలో లేచి నిలదొక్కుకున్నాను.బయటకి చూస్తే అంబాలా స్టేషన్ వచ్చినట్టుంది.ఇంతవరకు జరిగిన విషయాల జ్ఞాపకాల దొంతరలు ఒక్కటొక్కటి గుర్తుకువస్తున్నాయి.ఓహో ,ఇదంతా కలా,పీడకలా,ఆకలి భాదతో వచ్చిన కల .అమ్మయ్య ,ఎదో తెలియని రిలీఫ్ .ఒక్కసారి రైలు దిగి ప్లాటుఫారం పైకి వచ్చాను.ఎదురుగా సర్దార్జీలో ప్రేమతో గురునానక్- ఉత్సవాల లంగర్కానా ప్రసాదాన్ని పంచిపెడుతున్నారు.తరతమ ,జాతి ,మతం భేదాభేవాలేమి లేకుండా భక్తి శ్రద్దలతో అందరూ కడుపారా ఆరగిస్తున్నారు.నేను నా జీవితంలో మొదటిసారిగా అంత్యంత భక్తి శ్రద్దలతో ప్రసాదాన్ని చేతిలోకి తీసుకున్నాను. ఆకలి భాద పూర్తిగా తీరిపోయింది.మొదటిసారిగా భగవంతుడిపై పూర్తి నమ్మకం ఏర్పడింది .

ఇప్పుడొక స్థిర నిర్ణయానికి వచ్చాను.జీవితంలో ఎంత కష్టం వచ్చినాయి సరే.కనీసం ఓ ఐదు శాతము డబ్బులనైనా ఆకలి కోసం అర్థించే అన్నార్తులకు చేరేలా చూడాలి.అన్నం పరభ్రమ్మ స్వరూపం ,అన్నదానం మహాదానం.

మరిన్ని కథలు

Veedani todu
వీడని తోడు
- Dr. శ్రీదేవీ శ్రీకాంత్
Banglaw kukka
బంగ్లా కుక్క
- -పెద్దాడ సత్యప్రసాద్
Ekaaki
ఏకాకి
- ప్రభావతి పూసపాటి
Kalpita betala kathalu.3
కల్పిత బేతాళకథలు - 3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
KalpitaBetala kathalu.2
కల్పిత బేతాళకథలు - 2
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
KalpitaBetala kathalu.1
కల్పిత బేతాళకథలు - 1
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Manam
మనం
- మణి
Kanumarugai
కనుమరుగై
- ఐసున్ ఫిన్