
అది పర్కాల పోలీసు స్టేషన్..
“సార్..! వాళ్ళే మా నానమ్మ, తాతయ్య” అని దూరంగా వస్తున్న ఇరువురిని కిటికీ గుండా చూపిస్తూ.. ఉన్నఫళంగా వణకి పోయారు పిల్లలిద్దరు.. వనజ, వాసు.
పిల్లల ధైర్యానికి.. వారు చెప్పిన మాటలు నిజం కాబోతున్నందుకు ఆశ్చర్య పోయాడు ఎస్సై (సబ్ ఇనస్పెక్టర్ ఆఫ్ పోలీస్) రఘు. ‘పిల్లలు దైవంతో సమానం’ అనే నానుడి.. ఇంకా వారి మాటల్లో వాస్తవం ఉంటుందనే విశ్వాసంతో తను జమేదారును, మరో కానిస్టేబుల్ ను పంపడం మంచిదయ్యిందని.. మనసులోకి రాగానే పెదవులపై చిరునవ్వు మొలచింది. చటుక్కున తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది. పిల్లలను మరో గదిలోకి తీసుకు వెళ్లి బల్ల మీద కూర్చోబెట్టాడు. తాను పిలిచినప్పుడు మాత్రమే రావాలని జాగ్రత్తలు చెప్పి తిరిగి వచ్చి తన సీట్లో ఆసీనుడయ్యాడు రఘు. కిటికీ గుండా దృష్టి సారించాడు. ఇద్దరు వృద్ధదంపతులు స్టేషన్ కాపలాదారునితో అనుమతి తీసుకొని తన గదికి వస్తున్నట్టు గమనించాడు. వారిని గుమ్మంలో చూడగానే లోనికి రమ్మన్నట్టు తలూపుతూ..
“ఎవరు మీరు” అంటూ తనదైన శైలిలో అడిగాడు రఘు.
ఇరువురూ రెండు చేతులు జోడించి దండాలు పెట్టారు.
“సార్.. నా పేరు పేరయ్య. ఈమె నా పెండ్లాం పాపమ్మ. మా కోడలు కొమురమ్మ కనబడ్త లేదని పోలీసులకు రిపోర్టిద్దామని వచ్చినం సార్” అంటూ వినయంగా చేతులు నలుముకోసాగాడు పేరయ్య.
“ఎన్ని రోజులవుతోంది?” ప్రశ్నించాడు రఘు.
“పోయిన ఐతారం (ఆదివారం) నుండి సార్” మిడుక్కుంటూ జవాబిచ్చాడు పేరయ్య.
“అవును సార్” అంటూ వత్తాసు పలికింది పాపమ్మ.
“ఇంకో వారం రోజులు చూడక పోయారా!.. ఏదైనా తీర్థయాత్రలకు పోయిందేమో!” రఘు వ్యంగ్య ధోరణి అర్థంగాక పేరయ్య, పాపమ్మ విస్తుపోయి ఒకరినొకరు లిప్తకాలం చూసుకున్నారు. పాపమ్మ వెంటనే తేరుకొని..
“లేదు సార్. మాకు తెల్వకుంట యాడికీ పోదు. గీ సందుల నా కొడుకు తోని కయ్యం పెట్టుకుంటాందని తెల్సింది. వాళ్ళు నర్సక్క పల్లెల ఉంటరు. బంగారమసోంటి ఇద్దరు పొలగాండ్ల ముందల పెండ్లాం మొగలు కీసులాడుకునుడు వాడల ఇజ్జతి పోతాందని మేము సోంచాయించు కున్నం. పోయి కోడల్ను, పిల్లలను తీస్కరమ్మన్నడు నా పెనిమిటి. నాల్గొద్దులుంటే వానికి బుద్ధత్తదని పోయి తీస్కచ్చిన. వారం రోజులున్నది. పిలగాండ్లకు పండుగ సెలవులే కదా అత్తా.. ఈడనే ఉండనీయుండ్లి. ఆయనకక్కడ వంటకు తక్లీబైతదని.. పోయిన ఐతారమే పోయింది. కాని ఇల్లు చేరినట్టు ఫోను రాలేదని తెల్లారి కొడుక్కు నేనే ఫోను సేసిన.. రాలేదన్నడు. పాణం డక్కుమన్నది..” ఏకధాటిగా చెబుతుంటే పాపమ్మ గొంతు పొరమారింది.
రఘు టేబుల్ పైన ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చాడు.. ఇంతలో ఫోన్ మ్రోగింది. ఫోన్ ఎత్తాడు రఘు. ఎదురి చూస్తున్న సమాచారం అందేసరికి ముఖం విచ్చుకుంది.
“అయితే నువ్వు కోడలును దిగబెట్టడానికి తోడూ వెళ్ళలేదా?” చిరునవ్వు నవ్వుకుంటూ అడిగాడు రఘు.
“లేదు సార్” అంటూ పేరయ్య దిక్కు చూసి.. వెంటనే తల దించుకుంది పాపమ్మ.
“అలా తల దించుకునే పని చేసి మళ్ళీ రిపోర్ట్ ఇద్దామని నంగనాచి లెక్క మొగణ్ణి వెంట పెట్టుకొని వచ్చావా?” గద్దిస్తూ అడిగాడు రఘు.
“ఏంది సారూ.. ఏమంటానవ్?” అనుకుంటూ.. మేకపోతు గాంభీర్యంతో తల ఎగరేసింది.
“పోలీసు ఠానాకు పొతే గిట్లనే ఉల్టా, పల్టా కానూన్లు తీత్తరు. మల్ల మన మీదకే తెత్తరని.. చెప్తే ఇన్నవా?” అంటూ కోపంతో పేరయ్యను సుర, సుర చూసింది పాపమ్మ.
“ఆహా..! చిన్నప్పుడు నాటకాలు వేసావా? ఏంటి?.. బలేగా నటిస్తున్నావు” అంటూ కళ్ళ నుండి నిప్పులు కురిపించాడు రఘు.
“వనజా.. వాసూ.. ఇలా రండి. మీ నానమ్మ, తాతయ్యలు వచ్చారు” అంటూ లోపలి గదివంకా చూస్తూ పిలిచేసరికి గజ్జున వణకింది పెంటమ్మ. వాసు, వనజలు కనబడే సరికి పేరయ్యకు మూర్ఛ వచ్చినంత పనయ్యింది.. కొయ్యబారిపోయాడు.
“మీరు రాత్రి కల్లు తాక్కుంటూ.. మాట్లాకున్న మాటలన్నీ విన్నారు. మీ కంటే ముందే పిల్లలు మీ మీద రిపోర్టిచ్చారు” అంతా ఇందులో ఉన్నదన్నట్టు ఫైల్ మీద చూపుడు వేలితో టక, టకలాడిస్తూ..
“ఇప్పుడు నిజం చెప్పు పాపమ్మా.. ఇక తప్పించుకోలేవు. ఏం జరిగిందో చెప్పు. నా పని కేసు బుక్ చేసి నిన్ను కోర్టుకు పంపడమే.. నిజం చెప్పక పోయావో.. ఎలా చెప్పించాలో నా లాఠీ చూసుకుంటుంది..” అంటూ లాఠీని పాపమ్మ ముఖంమ్మీద పెండ్యూలంలా ఊపాడు రఘు.
అయినా పాపమ్మ అదరలేదు, బెదరలేదు. తాను చేసిన నిర్వాకం మీద ఉన్న నమ్మకమది. ధైర్యమంతా కూడగట్టుకొని.. “సార్.. చిన్న పొలగాండ్లు. వాళ్లకేమెర్క. సంసారమన్నాక లచ్చ తొంబై ఇచ్చాకాయలు, కచ్చకాయలు మాట్లాడుకుంటం. ఇనచ్చి, ఇనరాక ఏం చెప్పిండ్లో! ఏం పాడో!. ఇందుల చెప్పటానికేమున్నది? దాయడానికేమున్నది?.. జాడతీసి మా కోడల్ను మాకు అప్పజెప్తరని వచ్చినం” అంటూ ఎదలోనుండి ధుఃఖం తన్నుకు వస్తోందనే రీతిలో ముఖానికి కొంగు అడ్డు పెట్టుకుని ముక్కు చీదినట్టు చేసింది పాపమ్మ.
“నీ యాక్షను.. డైలాగులకేం తక్కువ లేదు. బాగానే ఉన్నాయి కానీ.. నువ్వు ఈ మధ్యలో లోతుకుంటకు పోయినవా.. అదే తాటి చెట్లుండే గట్టు కింద”
పాపమ్మ గుండె ఝల్లుమంది. మనసులో కలవరం మొదలయ్యింది.. అయినా గాబరా పడుతున్న పేరయ్య ముఖం వంక చూస్తూ.. ధైర్యంగా ఉండుమన్నట్టు ఏర్పడకుండా కళ్ళతో సైగ జేసి.. రఘువంక జేస్తూ..
“సార్.. లోతుకుంట ఎక్కడ?. ఎక్కడ తాటి చెట్లు?” అంటూ అమాయంకంగా అడిగింది పాపమ్మ.
“నాకు పిల్లలు అంతా చెప్పారని చెప్పాను కదా!..ఇలా అయితే నువ్వు నిజం చెప్పవు” అంటూ ఉగ్రుడై చటుక్కున లేచి పోలీసు భాషలో తిట్లదండకం విప్పాడు. వీపు సాపు సాఫ్ కావాల్సిందే అన్నట్టు లాఠీతో మేజా మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. పేరయ్యకు ధోవతి తడిచినట్టు ముఖం పెట్టాడు. పాపమ్మకు గుండె ఆగినంత పనయ్యింది.
“ఇంతకు ముందు ఫోన్ వచ్చింది చూసావు కదా!.. పిల్లలు చెప్పినట్టే నువ్వు కొమురమ్మను పాతి పెట్టిన లోతుకుంట దగ్గరికి ఇద్దరు పోలీసులను పంపాను. మీ కోడలు శవం దొరికిందని ఫోన్ చేసారు. ఫోటో కూడా పంపారు” అంటూ తన సెల్ ఫోన్ లోని ఫోటో చూపించాడు రఘు. దాన్ని చూడగానే పేరయ్య కళ్ళు బైర్లుకమ్మి హఠాత్తుగా నేల మీద పడిపోయాడు. పిల్లలిద్దరూ ‘తాతయ్యా..’ అంటూ పేరయ్య మీద వాలి పోయారు. పాపమ్మ గాబరా పడుతూ.. బల్ల మీద ఉన్న వాటర్ బాటిల్ లోని నీళ్ళు కొన్ని పేరయ్య ముఖం మీద చల్లింది. రెండు చేతులతో దండం పెడుతూ.. “సార్ నిజం చెపుతాను” అంటూ రఘు కాళ్ళమీద పడిపోయింది. పేరయ్య తేరుకొని లేచి కూర్చున్నాడు. పాపమ్మ ఇషారాతో పిల్లలను తీసుకొని పక్క గదిలోకి వెళ్ళాడు పేరయ్య.
ఇక నిజ చెప్పక తప్పదనుకుంది..
“సారూ! సత్తె పమానంగ నిజం చెప్తాన..” అంటుంటే.. పాపమ్మ కళ్ళు జలపాతాలయ్యాయి. “మా కోడలు నీయతి తప్పింది సార్. ఇండ్లల్ల మొగోళ్ళు తాగితే పెండ్లాలు లొల్లి పెట్టి బుద్ధి సెప్పిత్తరు.. కాని మా కోడలు ఇంట్ల అంతా ఉల్టా.. పల్టా..!”
“అంటే.. కొమురమ్మ..!” అంటూ విస్తుపోయాడు రఘు.
“ఔ.. సార్. బగ్గ తాగుద్ది. సోయి లేకుంట పంటది. వాడకట్టుల తలెత్తుకొని తిరుగలేక పోతాన అని నా కొడుకు మందలిత్తే పెద్ద బొబ్బ మోపైతది. ‘ఇంట్ల పనేమైన పండపెడ్తాన్నా.. పనంతైనంకనే
కదా!.. నా రెక్కల కట్టం నేను తాగుతాన. గట్ల తాగుతనే నాకు మల్ల తెల్లారి పనిలకు పోబుద్ధైతది. నువ్వు మొగోడివి.. ఇంట్ల కర్సులు ఎల్లదీసుడు నీ వంతు. అయినా నేనేమైన సేతులు ముడ్సుకొని సూత్తాంటనా?. వేన్నీల్లకు సన్నీల్ల లెక్క ఎంతో కొంత ఆసరైతాన కదా!’ అని ఎదురు తిర్గుతది. మాటకు మాట అంటాంటే.. మన ఇజ్జతే పోతదని నా కొడుకే నోరు మూసుకుంటడు. కోడలు సుత కైకిలుకు పోతది అదీ బిర్రు. నేను రెండు , మూడు సార్లు కోడలుకు బుద్ధి సెప్పి సూసిన. మర్ల పడుడే కాని సదురుక పోవుడు తెల్వదని నా కొడుకు కంట్లె నీళ్ళు తీసుకున్నడు. నా పానం కలి, కలైంది.. దాన్ని లేపేత్తెనే పీడ పోతదని అనుకున్నాం. అందుకే పోయి తీస్కచ్చిన. మల్ల దిగబెట్టి వత్తనని కోడలను తీస్కోని లోతుకుంటకు తీస్కపోయిన. పెద్ద లొట్టెడు కళ్ళు తీస్కోని దూరంగా చెట్ల పొదల్ల కూకున్నం. బెవోసయ్యేదాక బగ్గ తాగిచ్చిన. పెద్ద బండ తీస్కోని తల్కాయె పలుగ గొట్టిన. పక్కనే పెద్ద బొందల నూకి మన్ను కప్పిన. నాకు ఏ సిచ్చేసినా సరే.. సావుదలకు వచ్చిన దాన్ని” అనుకుంటూ రఘును బిక్క ముఖంతో చూడసాగింది.
“పాపమ్మా.. చాలా పాపపు పని చేసావు. కోడలును చంపడమే పరిష్కారం కాదు. ఇప్పుడు ఈ తల్లి లేని పిల్లలు ఏం కావాలి?. కోడలును పోలీసు స్టేషన్ కు తీసుకు వచ్చి షికాయత్ చేస్తే నయాన్నో, భయాన్నో దారికి తెచ్చే వాళ్ళం. కాని నువ్వే తప్పుడు నిర్ణయం తీసుకొని చేజేతులా కొడుకు సంసారాన్ని నాశనం చేసావు” అంటుంటే రఘును అడ్డుకుంది పాపమ్మ.
“నాశనం కాలేదు సారూ.. అది ఉంటేనే పోలగాండ్ల సదువు అటకెక్కేది. ఎవ్వల తోని చెప్పిచ్చినా అది మారక పోయేది. బగ్గ సోంచాయించే ఈ పని చేసిన. నా మనుమడు , మనుమరాలు పిల్లలు కాదు.. పిడుగులే!.. పీడ పోయిందని సంబుర పడ్తానం. నా కొడుకు సుత సంబుర పడ్తడు. నన్ను ఉరి తీసినా మంచిదే..” అంటూ కన్నీరు మున్నీరయ్యింది పాపమ్మ.
‘ఆమె ఆవేదనలో కొమురమ్మ ఎంతగా బాధ పెట్టిందో అర్థమవుతోంది. కాని చంపడం పరిష్కారం కాదు. పాపమ్మ అజ్ఞానంతో చేసిన పనికి శిక్ష పడాల్సిందే..’ అని రఘు మనసులో అనుకుంటూ కానిస్టేబుల్ ను పిలిచి పాపమ్మను లాకర్లో వేయించాడు. పేరయ్య దగ్గర అతని కొడుకు ఫోన్ నంబరు తీసుకొని ఫోన్ చేసాడు.
‘కొమురమ్మ శవపంచనామా, పోస్ట్ మార్టం..’ కోసం వెళ్ళాలని.. పిల్లలను తీసుకొని ఇంటికి వెళ్ళమని పేరయ్యకు చెప్పి.. వాయు వేగంగా జీపులో లోతుకుంటకు బయలుదేరాడు రఘు. *