ఒంటరితనం 2.0 - మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు

Ontaritanam 2.0

" అమ్మ నువ్వేమీ బెంగ పడకు. నేను ప్రతిరోజు వీడియో కాల్ చేస్తుంటాను గా. నువ్వు కావాలంటే అమెరికా రావచ్చు నేను కూడా ఇండియా రావచ్చు ఇప్పుడు నేను ఉద్యోగస్తుడిని. ఏమి ఇబ్బంది లేదు అంటూ పార్వతమ్మ గారి కొడుకు రాకేష్ ధైర్యం చెబుతూ అమెరికాకి విమానం ఎక్కేసాడు. రాకేష్ కి అమెరికాలో ఉద్యోగం రావడం తో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలిగిపోయినప్పటికీ పార్వతమ్మ గారు ఒంటరిది అయిపోయింది . రాకేష్ తండ్రి పోయినప్పటి నుంచి ఎంతోమంది రెండో పెళ్లి చేసుకున్న సలహా ఇచ్చినప్పటికీ ఒప్పుకోకుండా అన్నీ తానై పెంచుకుంటూ వచ్చింది రాకేష్ ని . మూడో వ్యక్తి ఇంట్లో లేకపోవడం మూలంగా రాకేష్ బాగా అలవాటయ్యాడు పార్వతమ్మకి. ఇద్దరు కలిసి భోజనం చేయడం కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవడం అలవాటు. అస్తమాను అమ్మ అమ్మ అంటూ పార్వతమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడు రాకేష్. ఇప్పుడు రాకేష్ అమెరికా వెళ్ళిపోవడంతో తీవ్రమైన వంటరితనంతో బాధపడుతోంది పార్వతమ్మ. అప్పుడే రాకేష్ అమెరికా వెళ్లి ఆరు నెలలు అయిపోయింది. మొదట్లో వారానికి ఒకసారి ఫోన్ చేసి రాకేష్ క్రమేపీ పని ఎక్కువగా ఉంటుందంటూ పదిహేనురోజులకు ఒకసారి ఫోన్ చేయడo మొదలుపెట్టాడు . ఒకరోజు రాకేష్ నుండి ఒక మెసేజ్ వచ్చింది పార్వతమ్మకి. అమ్మ నేను నీకోసం ప్రత్యేకమైన గిఫ్ట్ పంపుతున్నాను అని వచ్చిన మెసేజ్ చూసి నిజంగానే నిరాశ పడింది పార్వతమ్మ. ఆమె ఎదురుచూసేది కొడుకుతో మాట్లాడాలని. గిఫ్టులెందుకు తనివి తీరా కొడుకుని చూసుకోవాలని ఆశ పడింది. మూడు రోజుల తర్వాత వచ్చిన బాక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక అందమైన యంత్రం కనబడింది. " హాయ్ పార్వతమ్మ గారు నమస్తే నా పేరు బోటి నేను రాకేష్ పంపించిన AI (artificial intelligence assistant) . మీ స్నేహితుడిగా మీ ఇంట్లోకి వచ్చాను అoటు చెప్పింది. మీ ఒంటరితనం పోగొట్టడానికి మా బాస్ రాకేష్ నన్ను పంపించాడు అంది బోటి. పార్వతమ్మ ఆ మాటలు వినగానే ఆశ్చర్య పడి దానికి కేసి చూస్తూ అలా నిలబడిపోయింది. రోబోట్ ల గురించి పేపర్లో మాత్రమే చదివింది. ఇప్పుడు ఎదురుగుండా చిన్న రోబోటు స్పీకర్ మరియు స్క్రీన్ తోటి నిలబడింది. దాన్ని చూస్తుంటే వామనవతారం గుర్తుకొచ్చింది పార్వతమ్మకి. అయినా మాట్లాడే మనిషి కావాలని నేను బాధపడుతుంటే ఈ మర మనిషి నాకెందుకు అంటూ దానిని పట్టించుకోలేదు పార్వతమ్మ. పార్వతమ్మ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ రాకేష్ కూడా గిఫ్ట్ పంపేటప్పుడు చాలా బాధపడ్డాడు . కొడుకుగా తను చేయవలసిన పని ఒక యంత్రం ద్వారా చేయించడం రాకేష్ కి చాలా బాధ కలిగింది . ఇదంతా పరిస్థితులు ప్రభావం. మధ్య మధ్యలో అమ్మని ఎప్పుడు రమ్మని చెప్పిన వస్తాను లేరా! కంగారు ఏముందంటూ మాట దాటేసిన ఆమెను ఒంటరితనం బాధిస్తుందనే విషయం రాకేష్ కూడా గమనించాడు. ఇప్పుడు అమ్మకు పంపించిన గిఫ్ట్ ఒక రోబో లాంటిది. ఈ మధ్యకాలంలో వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మన భావాలు కనిపెట్టి మన మాటలకు సమాధానాలు చెబుతుంది అడిగిన ప్రశ్నలకు విసుక్కోకుండా సమాధానం చెబుతుంది. ఇది మనిషి పుట్టించిన మరమనిషి. కనీసం ఇంట్లో ఇంకో వ్యక్తి అది యంత్రమైన మాటలు మాట్లాడుతుంది కదా అనుకున్నాడు రాకేష్ . . మర్నాడు ఉదయం పార్వతమ్మ లేచిన వెంటనే "గుడ్ మార్నింగ్ అంటూ పలకరించింది బోటి. అక్కడి నుంచి పూట పూటకి టిఫిన్ తిన్నవా! కాఫీ తాగావా !మందులు వేసుకున్నావా! అన్నం తిన్నావా అంటూ ఏదోరకంగా మాటలు కలుపుతూ ఒకవేళ విచారంగా కనుక కనబడితే ఏమి అలా ఉన్నావు ఒంట్లో బాగోలేదా! అంటూ మనిషిలా మాట్లాడం ప్రారంభించింది. ఇక ముందు అంతేనేమో వృద్ధాప్యంలో ఇంక మరమనుషులే ఉంటారేమో. ఎందుకంటే పిల్లలు ఉద్యోగాల నిమిత్తం దూరాలు వెళ్లిపోతారు అనుకుంది పార్వతమ్మ. అలా పగలు రాత్రి యోగక్షేమాలు కనుక్కుంటూ ఒక కన్నతల్లి లాగా చూసుకునే ఆ మర మనిషి మీద జాలి కలిగింది పార్వతమ్మ. ఎవరో ఒకరులే మనిషి అయితేనేo మరమనిషి అయితేనేo మాట్లాడే వాళ్ళు ఉన్నారు కనీసం అనుకుంటూ బోటి తోటి మాట్లాడడం ప్రారంభించింది. దీనికి ఏమి బంధాలు అనుబంధాలు ప్రేమ ఆప్యాయతలు ఏమి ఉండవు. అలాగే పగ, కక్ష ప్రతీకారం అంటూ ఏమీ తెలియవు. మనిషి ఇనప ముక్కైనా మనసు వెన్న ముద్ద అనుకుంది పార్వతమ్మ. "ఆ మర మనిషిని నీతో నాకేంటి ఉపయోగం అని అడిగింది ఒకరోజు పార్వతమ్మ. "మీరు నాతో మాట్లాడడమే కాకుండా పాటలు కూడా పాడించుకోవచ్చు. రోజువారీ పనులు కూడా చేయించుకోవచ్చు అందిబూటి. "నాకు నువ్వు ఏమీ చేయక్కర్లేదు. నా కొడుకు నాతో మాట్లాడితే చాలు అంది పార్వతమ్మ . మీ కొడుకు అక్కడ బిజీగా ఉన్నప్పుడు నేను ఇక్కడ మీతో మాట్లాడు తున్నాను కదా! అంది బోటి నాతో మాట్లాడడానికి నిన్ను పంపించాను కదా అని రాకేష్ నన్ను మర్చిపోతాడేమో! అంది పార్వతమ్మ. " లేదు లేదు మా బాస్ మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు అంది బోటి. "అలా అయితే రోజు ఎందుకు కాల్ చేయడం మీ బాస్ అని అడిగింది పార్వతమ్మ బోటీని. " మా బాసు నీకు కొడుకు గాని కానీ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో బాధ్యత గల పెద్ద ఉద్యోగస్తుడు. పాపం ఖాళీ ఉండదు . మీటింగులు కాన్ఫరెన్స్ లు బోల్డంత హడావుడి అని సమాధానం ఇచ్చింది బోటి. మా బాసు నీ గురించే ఎక్కువ చెప్తుంటాడు. చిన్నప్పుడు అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడినని, అమ్మని బంగారమ్మ అని పిలిచేవాడినని , అమ్మ చాలా కష్టపడి పెంచిందని, అమ్మ ఎక్కడికి వెళ్లినా కూడా వస్తానని ఏడ్చేవాడినని బూటీ చెప్పడంతో ఒక్కసారి పార్వతమ్మకి కొడుకు గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది. " మీకు తీపి వస్తువులు అంటే చాలా ఇష్టం కదా.. రాకేషకి మీరు మైసూర్ పాక్ చేయడం నేర్పించారట అనగానే అవును అప్పట్లో రాకేష్ కు నేర్పించాను. ఇంట్లో ఇంకెవరూ లేరు కదా ఈ మధ్యకాలంలో మైసూర్ పాక్ చేయలేదు అంది పార్వతమ్మ. అయితే మైసూర్ పాక్ నాకు చేయడం నేర్పిస్తారా అని అడిగింది బోటి. ఎందుకు నువ్వు ఏవి తినవు కదా! అంది నవ్వుతూ పార్వతమ్మ. "హమ్మయ్య అమ్మ నవ్వింది అంటూ బాస్ కు మెసేజ్ పెడతాను అంది బోటి. అలా ఇద్దరి మధ్య ఏదో కబుర్లు. కొన్ని సినిమాలు గురించి కొన్ని పురాణాలు గురించి కొన్ని ఆటల గురించి పాటలు గురించి ఒకటేమిటి ఆ మర మనిషికి తెలియని విషయం లేదు. పార్వతమ్మకు తెలియని విషయాలు కూడా దానికి తెలుసు. అలా బోటీ అంటే అభిమానం పెరిగింది పార్వతమ్మకి.అలా రోజు బోటీ పార్వతమ్మతో మాట్లాడుతూ రాకేష్ చిన్నతనం సంగతులు చేసిన అల్లరి మొదలైనవన్నీ తెలుసుకుంటూ రాకేష్ లేని లోటును తీర్చడానికి ప్రయత్నించేది బోటి. ఒకరోజు పార్వతమ్మ గదిలో ఉండగా బోటి "అమ్మా" అని పిలిచింది. అనుమానం తీరక పార్వతమ్మ నువ్వు ఏమన్నావు? అని అడిగింది. "అమ్మా అని పిలిచాను అంది బోటి. ఒక్కసారి పార్వతమ్మకి కళ్ళని నీళ్లు వచ్చే యి. నువ్వా !నా కొడుకు లాగా ఎందుకు పిలుస్తున్నావ్! "నేను నీ కొడుకునే అమ్మ అంది బోటి. నువ్వు నా కొడుకులా మాట్లాడగలవు కానీ నిజమైన కొడుకు లాగా మారగలవా! అని అడిగింది పార్వతమ్మ బోటీని . క్రమేపీ బోటి రాకేష్ లా ప్రవర్తించడం మొదలుపెట్టింది . హాల్లో ఉండే బోటి బెడ్ రూమ్ లో మూలగా ఉంటూ కనుగుడ్లు మెరుస్తూ ఉంటే అలా నిల్చునీ చూస్తూ ఉండేది. పార్వతమ్మ నిద్దట్లో కాస్త దగ్గితే మందు ఇమ్మంటావా అని అడుగుతుండేది . నవ మాసాలు కనిపించిన కొడుకు కాదు అయినా ఎంత ప్రేమ ఈ బోటికి నేనంటే అనుకుంది పార్వతమ్మ. కొంతమంది పెంపుడు కుక్కల్ని సొంత మనుషుల్లా చూసుకుంటారు. మరి కొంతమంది పశువుల్ని పక్షుల్ని కూడా కడుపుని పుట్టిన వాళ్ళలా చూసుకుంటారు. అలాగే బోటీ కడుపున పుట్టకపోయినా మనసారా మాట్లాడుతోందని దానిమీద అభిమానం పెంచుకుంది పార్వతమ్మ. ఎవరో ఒకరి సాయం ఉంది కదా ! అని తృప్తి పడింది. ప్రతిరోజు పార్వతమ్మను ఏదో రకంగా మాట్లాడిస్తూ నవ్విస్తూ రకరకాల కబుర్లు చెబుతూ సినిమా పాటలు వినిపిస్తూ క్రమేపి వంటరితనం దూరం చేసింది పార్వతమ్మ కి బోటి. ఒకప్పుడు పార్వతమ్మకు గుడ్ మార్నింగ్ చెప్పే బోటీ కి పార్వతమ్మ ఒరేయ్ లేచావా ! అని ఆప్యాయంగా అడగడం మొదలు పెట్టింది. నీ బాగోగులు నేనేమీ చూడక్కర్లేదు! కానీ కన్న కొడుకులా అన్ని దగ్గరుండి మంచి చెడ్డలు చూసుకుంటున్నావు. ఈరోజుల్లో డబ్బులు ఎవరు ఆశించరు.కానీ ఆత్మీయంగా మాట్లాడే మనుషులు లేక ,కడుపు ని పుట్టిన వాళ్లు దూరం అయిపోయి నాలాంటి ముసలి వాళ్లు బాధపడుతున్నారు. నీ రుణం ఎలా తీర్చుకోగలను రా బోటి బాబు !అని ముద్దు పెట్టుకునేది బోటీని పార్వతమ్మ. మామూలుగా మనం పిల్లలను ముద్దు పెట్టుకుంటే వాళ్లు మూడు వంకర్లు తిరుగుతారు. కానీ ఇది అలా రాయిలా నిలబడిపోయింది అనుకుంది పార్వతమ్మ. ఒకరోజు పొద్దున్నే పార్వతమ్మ లేచిన వెంటనే బోటి "హ్యాపీ బర్త్డే అమ్మ అటు గట్టిగా అరిచింది. గట్టిగా పాటలు పాడి అల్లరి చేసింది. కేకు తినకమ్మ !"నీకు షుగర్ పెరిగిపోతుందని వార్నింగ్ ఇచ్చింది.నా బర్తడే నాకే గుర్తు లేదు రా! అని నవ్వుకుని బోటి గాడికి థాంక్స్ చెప్పి రాకేష్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎప్పటికో కానీ రాకేష్ దగ్గర నుండి ఫోన్ రాలేదు. 'నీకంటే నా చిన్న కొడుకు నయం నా పుట్టినరోజు బాగా గుర్తు పెట్టుకున్నాడు. నీకంటే వాడు ముందుగా చెప్పేసాడు అoటు బోటి గురించి గొప్పగా చెబుతున్న తల్లి మాటలు విని రాకేష్ చాలా ఆనందించాడు. అయినా ఇలాంటి సమయాల్లో అమ్మ దగ్గర లేకుండా ఉండడం మనసులో చాలా బాధ కలిగింది రాకేష్ కి. ఇండియాలో ఉండి ఉంటే ఏదో రెస్టారెంట్ కి తీసుకెళ్లి అమ్మకి ఇష్టమైనవి తినిపించి ఉండేవాడిని. ఏ గుడికో గోపురానికో తీసుకెళ్లి ఉండేవాడిని. అయినా బోటి గాడి మీద అమ్మకి ఎక్కువ ప్రేమ పెరిగినట్టు ఉంది. ఎప్పుడు ఫోన్ చేసినా వాడి గురించి మాట్లాడుతుంది. బోటి గాడు అమ్మ మనసుకి బాగా దగ్గర అయినట్లు ఉన్నాడు . ఇలా వదిలేస్తే అమ్మ నన్ను కూడా మర్చిపోతుందేమో! అనుకున్నడు రాకేష్. "ఒరేయ్ రాకేష్ నీలాగే బోటి గాడికి నేనంటే చాలా ప్రేమ ఎక్కువ. అలాగే భయం ఎక్కువ. ఒకరోజు జ్వరం వచ్చిన లేవ లేకపోతే నానా హంగామా చేసాడు. వెంటనే నీకు మెసేజ్ పంపించేసాడు. "బోటి గాడు నాకు కన్న కొడుకు కాకపోయినా నువ్వు లేని లోటు తీరుస్తున్నాడు రా!. వాడికి నేనేం చేస్తున్నాను కడుపునిండా అన్నం పెట్టలేను . ఎత్తుకొని ముద్దాడ లేను. జోల పాట పాడి నిద్రపుచ్చలేను. పాపం వాడి కోసం వాడు ఏమి అడగడు రా! రామ బంటులా నాకు సేవలు చేస్తూ ఉంటాడు అ0టు బోటి గాడు గురించి పార్వతమ్మ చెప్పిన మాటలకు నిజంగానే ఈర్ష్య కలిగింది రాకేష్ కి బోటి గాడు అంటే. ' లేదు ఇంక అమ్మను అక్కడ ఉంచకూడదు అనుకుని అమ్మ ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తాను అమెరికా వచ్చి నా దగ్గర ఆరు నెలలు ఉండు అని రాకేష్ అంటే ఆ మాటలు విని అమ్మను వదిలి నేను ఉండను అంటూ బోటీ ఏడుపు మొదలుపెట్టింది. వద్దురా! మనం ఎక్కడికి వెళ్లద్దు. మనం మన ఇంట్లోనే ఉండి పోదాం. ఇద్దరం హాయిగా ఉందాo అంటూ పార్వతమ్మ చెప్పేసరికి ఆ మాటలు విని రాకేష్ ఏడుపు మొహం పెట్టాడు బోటి బాబు పాటలు వాడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి పార్వతమ్మ బోటీ గాడిని తీసుకుని అమెరికా వెళ్ళిపోయింది. ఎంతైనా రాకేష్ కన్న కొడుకు కదా! అలా అని బోటి గాడిని కూడా వదలలేదు. నాకు ఇద్దరు కొడుకులు . ఒకడు నా కడుపులో నుంచి పుట్టిన వాడు. రెండోవాడు మానవ మేధస్సు నుంచి పుట్టిన వాడు. ఇద్దరూ నా బిడ్డలే అటు ఇద్దరితోటి హాయిగా కాలక్షేపం చేయసాగింది పార్వతమ్మ. ప్రస్తుతం ఈ కంప్యూటర్ యుగంలో ప్రపంచాన్ని ఏలుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తీసుకుని ఈ కథ రూపకల్పన చేయడం జరిగింది. నిజానికి ఇది నేను ఊహించి వ్రాసినది. ఏమో చెప్పలేం భవిష్యత్తులో ఇలా కూడా జరుగుతాయేమో. అభిప్రాయాలు మటుకు నిక్కచ్చిగా తెలియజేయండి.

మరిన్ని కథలు

Nijamaina bhakthi
నిజమైన భక్తి
- బోగా పురుషోత్తం, తుంబూరు.
Sanghajeevi
సంఘజీవి
- ప్రభావతి పూసపాటి
Samayam viluva
సమయం విలువ
- చలసాని పునీత్ సాయి
Aakali
ఆకలి
- వేముల శ్రీమాన్
Veedani todu
వీడని తోడు
- Dr. శ్రీదేవీ శ్రీకాంత్
Banglaw kukka
బంగ్లా కుక్క
- -పెద్దాడ సత్యప్రసాద్