
వీరపునాయుని పల్లిని వీరసూరుడు పాలించేవాడు. అతనికి నిత్యం తనను గౌరవించే వారంటే ఎంతో ఇష్టం. రాజు ఆస్థానంలో ప్రతి రోజూ తనకు నమస్కరించి అణుకువతో భక్తిభావం చూపేవారు అంటే ఎంతో ఇష్టం. ఈ మూలంగానే అలాంటి వారిని గుర్తించి ప్రత్యేకంగా విలువైన బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చేవాడు.
తన పట్ల రాజ భక్తి చూపితే దేశానికి ఎంతో శ్రేయస్కరమని భావించేవాడు.
రాజ ఆస్థానం వదిలి బయట వెళుతున్నప్పుడు తనకు నమస్కారం చేయని వారిని ఆగ్రహించి రాజద్రోహి, దేశద్రోహి అనే పేరుతో వెయ్యి కొరడా దెబ్బలువేసి శిక్షించేవాడు.
ఈ కఠినమైన శిక్షలు భరించలేని ప్రజలు రాజుకు నమస్కరించి రాజభక్తుడు అని రాజు వద్ద ఆశీర్వచనం పొందేవారు.
దీన్ని గుర్తించలేని రాజు ప్రతి రోజూ తన కాళ్లకు నమస్కరించి అణకువ చూపుతున్న సైన్యాధిపతి శేషయ్యను ప్రశంసిస్తూ విలువైన బంగారు కానుకలు సమర్పించేవాడు.
ఇది రాజోద్యోగులకు గిట్టక అసహ్యించుకుని రాజుపై కోపం ప్రదర్శించేవారు.
వీరసూరుడు వారిని పిలిచి తనపై గౌరవం చూపలేదని ఒక్కరికీ రాజభక్తి లేదని ఇలా వుంటే రాజ్యానికి తీరని నష్టం వస్తుందని సైన్యాధికారిని చూసి అసలు భక్తి అంటే ఏమిటో నేర్చుకోవాలని బోధించేవాడు.
అయితే రాజోద్యోగులు ఇది నిజం కాదని రాజును మనసులో గౌరవిస్తే చాలని అదే నిజమైన భక్తి అని భావించేవారు. అయితే ఇది గుర్తించని రాజు వారికి వెయ్యి కొరడా దెబ్బల శిక్ష విధించేవాడు. దీన్ని భరించలేక రాజోద్యోగులు అయిష్టంగానే రాజు పోరుపడలేక విధిగా నమస్కరించి భక్తిని ప్రదర్శించేవారు. దీన్ని చూసి రాజు లోలోన మురిసిపోయేవాడు.
ఓ సారి రాజ్యంలో పండిన పప్పు ధాన్యాలను పొరుగు దేశానికి విక్రయించేలా వాణిజ్య ఒప్పందం చేసుకున్నాడు వీరసూరుడు. ధాన్యాన్ని సముద్ర మార్గంలో ఓడలో ఎక్కించి పంపారు.
పర్యవేక్షకుడిగా రాజభక్తుడైన సైనికాధికారిని పంపారు.
నాల్గు నెలలతర్వాత పక్కనే వున్న సింహళం రాజ్యానికి ఖాళీనౌక చేరుకుంది.
సింహళం రాజ్యాధిపతి సింహనాధుడు తమ వద్దకు పప్పు ధాన్యాలు చేరలేదని మళ్లీ పంపాలని వీరసూరుడిని ప్రధ్యేపడ్డాడు.
వీరసూరుడు ఆలోచనలో పడ్డాడు. రాజభక్తుడైన సైనికాధికారిశేషయ్యను పిలిచి ‘ ఏం జరిగింది?’’ అని ప్రశ్నించాడు.
శేషయ్య రాజుకు వినయంతో నమస్కరించి ‘‘ నాకేమీ తెలియదు ప్రభూ..!’’ అంటూ అమాయకంగా ముఖం పెట్టాడు శేషయ్య.
రాజుకు ఇతరులపై నమ్మకం లేక మళ్లీ నౌకలో పప్పు ధాన్యాలను నింపి శేషయ్యను పర్యవేక్షకుడిగా పంపారు.
మళ్లీ తమ వద్దకు ఖాళీ నౌక చేరుకుందని మళ్లీ పప్పు ధాన్యాలు పంపాలని సింహనాధుడు వీర సూరుడికి మొరపెట్టుకున్నాడు.
ఈ సారి దీర్ఘ ఆలోచనలో పడ్డాడు వీరసూరుడు. రాజ్యానికి జరిగిన నష్టాన్ని తలుచుకుని అవాక్కయిన వీరసూరుడు ఈ సారి తనపై భక్తిలేని నమస్కరించని, కొరడా దెబ్బలు తిన్న ఓ పౌరుడిని సైనికాధికారికి తోడుగా పంపి జరుగుతున్నదేమిటో నిఘావేసి తనకు వివరించాలని ఆదేశించి పంపాడు.
నౌక బయలుదేరింది. పౌరుడు జాగ్రత్తగా గమనించసాగాడు.
ఓ రాత్రి సైనికాధికారి ఓ ఇనుప పెట్టు నిండా తెచ్చిన ఎలుకల్ని వదలడం చూశాడు. వందల సంఖ్యలో వున్న ఎలుకలు రోజూ పప్పు ధాన్యాలను తిని బస్తాలను ఖాళీ చేస్తున్న సంగతిని వీరసూరుడికి చేరవేశాడు.
ఆ తర్వాత రాజు స్వయంగా వచ్చి నౌకను గమనించి ఎలుకల్ని పట్టి నివారించాడు. రాజ్యానికి అపార నష్టం కలిగించిన రాజోద్యోగి తనపై చూపింది నిజమైన భక్తి కాదని కానుకల కోసం చూపిన కపట ప్రేమ అని గుర్తించాడు రాజు. తనకు నమస్కరించలేదని, భక్తి చూపలేదని కొరడా దెబ్బల శిక్ష వేసిన పౌరుడు పప్పు ధాన్యాలను సంరక్షించి దేశానికి కలుగుతున్న నష్టాన్ని నివారించి నిజమైన దేశ భక్తి చూపినందుకు అతడిని అభినందించాడు. ఆ తర్వాత వ్యక్తిగత ఆనందాన్నిచ్చే రాజభక్తి కన్నా దేశ శ్రేయస్సును పెంచే దేశ భక్తిని అలవరుచుకోవాలని హితవు పలికాడు. కఠిన కొరడా శిక్ష దెబ్బలను రద్దు చేశాడు నిజమైన భక్తి ఏమిటో తెలిసిన వీర సూరుడు.