చిత్రం ఎగిరింది - మణి

Chitram egirindi

అది పెద్ద గది. అక్కడ , రక రకాల , రంగు రంగుల చిత్రాలు ఎన్నో ! అందమయినవి అర్ధవంతమయినవి , చిత్రాలు , చక్కటి ఫ్రేం లలో బిగించబడి , అందంగా అలంకరించ బడి వున్నాయి.

అన్ని చిత్రాలు , పొందిక గా ఫ్రేంలలో, ఇమిడి ఒద్దికగా కూర్చుని వున్నాయి.

కానీ , కొత్తగా ఒక చిత్రం వచ్చింది. వచ్చినప్ప టి నుండీ , ఫ్రేం లో వుండనంటూ ఒకటే గొడవ.

ఫ్రేం పగలకొట్టుకొని, బయటకి రావాలని దాని ప్రయత్నం. ఆ ప్రయత్నం లో , కర్కశమయిన, శబ్దాలు కూడా రావడం మొదలు పెట్టాయి. ఆ శబ్దాలతో అందరి దృష్టి దాని మీద పడింది.

" నేను సృష్టించబడింది, జీవం లేకుండా పడి వుండడానికి కాదు. ఆడాలి ! పాడాలి !

విశ్వం లాంటి నన్ను నేను శోధించుకోవాలి ! శోధించుకొని. నన్ను నేను కొత్తగా, క్రొంగొత్తగా వ్యక్తం చేసుకోవాలి !

నా ఉనికిని సార్ధకత చేసుకోవాలి! నేను జీవం లేనట్లు ఈ ఫ్రేం లో పడి వుండలేను ! " అంటూ కీచు గొంతుకతో

వచ్చినప్పటినుండీ , కేకలు వేస్తూనే వుంది.

అన్ని చిత్రాలు , దానిని ఆశ్చర్యం గా చూడ సాగాయి.

" ఏమిటి ఈ గొడవ , మేమంతా లేమూ ? "

" నేను మీ గురించి మాట్లాడటం లేదు. నా గురించి నేను చెప్తున్నాను ." అంది ఆ చిత్రం

" నీ గురించి అయినా , ఏమిటి నీకు వచ్చిన బాధ ? ఈ ఫ్రేం లో అందం గా నే కాదు , క్షేమం గా కూడా వున్నాం. ఫ్రేం లేకపోతే మనకి క్షేమం ఎక్కడ? క్షేమం గా వుండబట్టే గా అందంగా వ్యక్త పరచు కుంటున్నాం. " మరో చిత్రం అంది.

" జీవం లేకపోతే అందం ఏమిటి? అనందం ఏమిటి ?" అంది కొత్త చిత్రం.

" జీవం ఎందుకు లేదు ? ఎందుకు అలా అంటావు ?" అక్కడ వున్న చిత్రాలలో ఒకటి.

" జీవం ఎక్కడ వున్నట్లు? కదల కుండా ఎంత వొదిగి వుండాలి ? ఎంత కుచించుకుపోతే ఈ ఫ్రేం లో ఇమడగలం!

మరి సంతోషాలు ఎక్కడ ? ఇలా కుచించుకు పోయి వుండడం ఎంత కష్టం?! అయినా సంకుచిత్వం లో లో అందం

ఏముంది?! ప్రతి అణువు విచ్చుకుని విప్పారితేనె కదా అందం ?! నా ప్రతీ అణువు విచ్చుకుని , విప్పారాలంటే. ఏదీ చోటు ? "

మరింత ఆశ్చర్య పోయాయి మిగిలిన చిత్రాలు.

" ఫ్రేం లేకపోతే , నువ్వు ఏం చక్క పడతావేం గొప్ప?! ". ఒక చిత్రం మూతి విరుచుకుంటూ అంది

"ఏం ఎగురుతావా ?! పరిగెడుతావా?! " అంది వెటకారం గా, ఇంకో చిత్రం

" ఏం చేస్తానో, బయట కి వస్తే గా తెలిసేది ?! . ఇలా బంధించ బడి వుంటే ... ఏమీ చేయలేనని , ఎవరూ చెప్పకనే తెలుస్తోంది .

నన్ను నేను సంపూర్నం గా వ్యక్త పరుచుకోవాలి అంటే , నేను ఎన్ని దారులలో, ప్రయాణం చేయాలి ! ఎన్ని అనుభవాలు మూట కట్టు కోవాలి ! అప్పుడే కదా నేనెవరో నాకు తెలిసేది ? నన్ను తెలుసుకోకుండా , ఏ విధం గా , ఏమని వ్యక్త పరుచు కోగలను?

నిత్యమూ సత్యమూ అయిన సౌందర్యాన్ని ఎప్పటికయినా తెలుసుకోవాలి. అది నేను ఈ ఫ్రేం లో వుంటే సాధ్యం కాదు."

"ఎగరక పోయినా పర్వాలేదు. పడిపోయినా పర్వా లేదు. పరిగెట్టక పోయినా పర్వలేదు. నేను ఈ ఫ్రేం లో మాత్రం బందీ లా వుండలేను. "

ఇలా ఆ చిత్రం ఒకటే, గొడవ చేయ సాగింది.

అక్కడ వున్న పర్య వేక్షకుడు , ఆ చిత్రం చేసే శబ్దాలకి " ఎవరది, ఆ శబ్దాలు చేసేది ? " అంటూ గట్టిగా అరిచాడు .

అతని అరుపుకి , ఇద్దరు కాపలా వాళ్ళు పరిగెట్టుకొని వచ్చారు . అంతా తిరిగి చూసి , " కొత్తగా వచ్చిన చిత్రం , ఫ్రేం లో వుండనంటూ ఒకటే గొడవ.చేస్తోంది . బయటకి రావడానికి ప్రయత్నం చేస్తోంది. అందుకే, ఫ్రేం అటూ ఇటూ జరిగి , ఒకటే శబ్దం ." అంటూ చెప్పారు.

"దానిని, రెండు రోజులు గుడ్డల తో కట్టి పడేయండి . అదే అలవాటు అవుతుంది. " అంటూ, హుకూం జారీ చేసి , నిద్ర లోకి జారాడు .

కాపలా వాళ్ళు, ఆ చిత్రం కదలకుండా , కొన్ని గుడ్డల తో , దానిని చుట్టి , గట్టిగా కట్టారు . రెండు రోజుల తర్వత ఆ గుడ్డలని విప్పారు.

కానీ ఆ చిత్రం , మళ్ళీ , బయటకి వచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది.

" ఉష్! ..." అంటూ ఒక చిత్రం దానిని వారిస్తూ అంది " ఆ పర్యవేక్షకుడు చూసాడా , నిన్ను తీసి చీకటి గదిలో, ఒక మూల వేసేస్తాడు. అప్పుడు నువ్వు వెలుగు కూడా చూడలేవు."

"నాకు , ఇక్కడ కూడా , మూల పడి వున్నట్లే వుంది. " అంది ఈ చిత్రం.

" దాని మానానికి, దాన్ని వదిలి వేయండి . దాని గొడవ ఏదో పడుతుంది. “ అంటూ జీర్ణ అవస్త లో వున్న ఒక చిత్రం అంది.

" దాని రాత వేరే ఉండి వుంటుంది.. " అంటూ గొణుక్కుంది .

“ ఫ్రేం ఎంత ఆసరాగా వుంటుందో , అర్ధం చేసుకుంటే , నువ్వు ఫ్రేం లోంచి బయటకి రావాలని అనుకోవు " అంది ఒక చిత్రం .

" అయినా నాలుగు రోజులు వుంటే అదే అలవాటు అవుతుంది . ఎందుకు గొడవ చేస్తున్నావు " అంది మరో చిత్రం .

" అదే నాకూ భయం . అలవాటు పెద్ద బంధమై నన్ను చుట్టుకుంటే ఈ మాత్రం జ్ఞానం కూడా నాలో మిగల్చదు. మీరంతా ఆసరా అనుకుంటున్న ఈ ఫ్రేం బంధన గా గుర్తించడం కూడా , అప్పుడు నాకు సాధ్యం కాదు " అంది కొత్త చిత్రం .

" అందరూ అలా అనుకుంటే , అంతా అలజడే వుంటుంది . ఇంక ప్రశాంత త ఎక్కడ వుంటుంది . " ఇంకొక చిత్రం విసుక్కుంటూ అంది .

" జీవం లేనట్లు పడి వుంటే అది ప్రశాంతత ఎలా అవుతుంది. ఇక్కడ మనం ఈ ఫ్రేం ల లో వుండడానికి ఎంత కుచించుకు పోవాలి ! ఎంత సంకోచించాలి !!

అయినా , నిత్యమూ , సత్యము , అయిన సౌందర్యం , సంకుచిత్వం లో వుండదు . విశాలత్వం లో వుంటుంది. అటువంటి సౌందర్యాన్ని చూడాలనే , నా ఆశ . నా ఈ ప్రయత్నం . ఈ ఫ్రేం లలో , వుండడానికి అలవాటు పడ్డ మీకు , నేను చెప్పినా , అర్ధం కాదు ." అంది

" అబ్బో! చెప్పొచ్చావులే !" అంటూ మూతి విరుచుకున్నాయి కొన్ని చిత్రాలు .

"ఇదే జీవితం , అనే మీ నమ్మకమే మిమ్మలని ఇంకోలా ఆలోచించ నివ్వటం లేదు. " అంది కొత్త చిత్రం .

అది పట్టుదలగా, చుట్టూ వున్న ఫ్రేం నుంచి , బయట పడే ప్రయత్నం చేస్తూనే వుంది. ఆ ప్రయత్నం లో , దాని శరీరం అంతా , రక్త శిక్తం అయింది. దాని పట్టు దలకి తల వంచినట్లు , ఆ ఫ్రేం పట్టు , కొద్ది, కొద్దిగా సన్నగిల్లి, ఆశ్చర్యంగా, ఫ్రేం విరిగి, కింద పడింది.

చిత్రం కూడా , కింద పడ పోతూంటే , రక్త శిక్తమయిన దానినుంచి , రెండు పెద్ద రెక్కలు మొలిచి , దానిని పైకి ఆకాశం లోకి , ఎగుర వేశాయి.

కొత్త చిత్రం, ఆ రెక్కలతో ఆశ్చర్యం గా అంది " ఎవరు మీరు ? "

“ నీ భావన ,సంకల్పం లోంచే వచ్చాము . పరిమితిలకి అతీత మయినది, నిత్యమూ సత్యమూ అయిన సౌందర్యం. దాని కోసం నువ్వు చేసే అన్వేషణకి తోడుగా వుంటాం " అంటూ ఎగరవేయ సాగాయి.

అది అలా ఆకాశం లోకి ఎగురుతూ వుంటే ,అందరూ అశ్చర్యంగా చూడ సాగారు .

"ఎలా ఎగర గలుగు తోంది ???.."

"ఎంత కష్ట పడింది దీని కోసం..."

" మనము కూడా ఎగరగలమా???..."

" ఎందుకు ఎగరలేము . కానీ, దానికి ముందు ఫ్రేంల లోంచి , మనం బయటకి రావాలిగా !!.."

"మనం ఫ్రేం ని కాపాడడమే ధ్యేయం గా, పెట్టుకున్నపుడు బయటకి ఎలా వస్తాము ? .."

" ఇదే జీవితం అని నమ్ముతూ వచ్చాము ఇన్నాళ్ళు . ఇంకొక విధముగా వుండగలమని కూడా అనుకోలేదు ఎప్పుడూ. "

" అయినా ఫ్రేం ల కి , అలవాటు పడి పోయాము. అలవాటు కన్న , పెద్ద బంధం ఏముంటుంది ? అందుకే, ఫ్రేం బంధిస్తోంది అనికాని , ఫ్రేం లో , జీవం లేనట్లు పడి వున్నామని కాని , అర్ధం చేసుకోవడం కూడా మనకి కష్టమే. అలవాటు అవడం వల్ల

క్షేమంగా , సౌకర్యంగా , అందం గానే , వున్నాం అని అనుకుంటాము. అది భ్రమ అని కూడా తెలుసుకోలేము. ఆ కొత్త చిత్రం సరిగానె చెప్పింది ."

" మనకి తెలియకుడానే , మనము మన నమ్మకాలకి , అలవాట్లకి , బందీలు అయ్యాము. "

" అయినా, ఆ చిత్రం ఎగిరి ఎక్కడకి వెళుతుంది ?! ఏమి సాధిస్తుంది ? తెలియని, ఒంటరి దారులలో ఎంత కాలం ప్రయాణం చేస్తుంది?! "

" అలసి పోయి , మళ్ళీ అదే వస్తుంది . "

"ఇక్కడ అందరితోనూ కాలక్షేపం చెయక , ఏమిటొ ఈ పిచ్చి వేషాలు ! "

ఇలా సాగింది అక్కడ వున్న చిత్రాల సంభాషణ.

ఎగిరి పోయిన ఆ చిత్రం, సత్యము , నిత్యము అయిన సుందర తత్వ అన్వేషణలో , ఇంకా పై పై కి అలానే ఎగిరిపొతూనే వుందో ఏమో, మళ్ళీ తిరిగి రాలేదు.

నిలకడగా వున్న చెరువులొ లో రాయి వెస్తే , చెరువు కాస్సేపు ప్రకంపనాలకి లోనయి , మళ్ళీ యధా స్తితికి వచ్చినట్లు,

అక్కడ వున్న చిత్రాలు కొన్ని రోజులు దాని గురించే రరకాలుగా మాట్లడుకున్నా , మళ్ళీ వాళ్ళ దిన చర్య లో వాళ్ళు మునిగి పోయారు .

........

మరిన్ని కథలు

Veda samskruthi
వేదసంస్కృతి
- టి. వి. యెల్. గాయత్రి.
Nijamaina bhakthi
నిజమైన భక్తి
- బోగా పురుషోత్తం, తుంబూరు.
Ontaritanam 2.0
ఒంటరితనం 2.0
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sanghajeevi
సంఘజీవి
- ప్రభావతి పూసపాటి
Samayam viluva
సమయం విలువ
- చలసాని పునీత్ సాయి
Aakali
ఆకలి
- వేముల శ్రీమాన్
Veedani todu
వీడని తోడు
- Dr. శ్రీదేవీ శ్రీకాంత్