
ఉదయం ఎనిమిది గంటలు.
కాలేజీకి వెళ్లడానికి తయారయింది ఆర్య.
"ఆ దుస్తులేమిటి? కాస్త మంచి బట్టలు వేసుకో!కాలేజీకి వెళుతున్న పిల్లవు!కొంచెం పద్ధతిగా ఉండాలి!"
హాల్లో దేవుడి పూజకు గంధం తీసుకుంటున్న భానుకళ మనవరాలిని మందలించింది.
"బామ్మా!నీకు తెలియదు.అందరూ ఇలాగే వస్తారు!నీలాగా మమ్మల్ని ఉండమంటే ఎలాగా?" బామ్మను కసురుకుంది ఆర్య.
ఆర్య ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది.ఆ పిల్లకు ఆధునిక పోకడలెక్కువ. బిగుతుగా ఉండే స్లీవ్ లెస్ టీ షర్ట్,మోకాళ్ళ దగ్గర చిరుగులుండే జీన్స్ ప్యాంటు. జీన్స్ ప్యాంటుకు, టీ షర్టుకు మధ్య కొద్దిగా పొట్ట కనిపిస్తూ ఉంది.చెవులకు పెద్ద పెద్ద రింగులు. జుట్టు ఫ్రీగా వదిలేసింది.
అటుగా వచ్చిన కోడలు సౌజన్యతో
"చూశావా! ఇలా కాలేజీకి వెళితే మగ పిల్లల్ని రెచ్చగొట్టినట్లుగా ఉంటుంది.అయినా ఆడపిల్ల అలా బిగుతు దుస్తులు వేసుకోవడం ఏమన్నా బాగుందా?కొంచెం వదులువి, కాస్త పొడుగ్గా ఉండే డ్రెస్సులు వేసుకోమని చెప్పు!మన భద్ర కూతురు వింధ్య డ్రెస్సులు చూడు! ఎంత పద్ధతిగా ఉంటాయో! "ఫిర్యాదు చేసింది భానుకళ.
సౌజన్య బామ్మను పట్టించుకోవద్దని ఆర్యకు కళ్ళతో సైగచేసి
"ఇప్పుడు కాలం మారిందత్తయ్యా!అందరు పిల్లలు ఇలాగే ఉన్నారు. మీరేమీ కంగారు పడకండి!వాళ్ల జాగ్రత్తలు వాళ్లకు తెలుసు. ప్రపంచం తోపాటు మనం మారకపోతే ఎలాగా? రాచ్చిప్పల్లో వండటం లేదుగా! రోళ్లు రోకళ్ళు ఇంట్లో ఉన్నాయా?అన్నింటా మార్పు సహజం!పాతకాలంలో లాగా ఇప్పుడెవ్వరూ లేరు!"
అంటూ కూతుర్ని వెనకేసుకొచ్చింది.
అయినా వదల్లేదు భానుకళ.
"పేపర్ తిప్పితే అన్ని క్రైమ్ వార్తలే! ప్రపంచం మారినా ఆఘాయిత్యాలు మారటం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి!"
కోపం వచ్చింది ఆర్యకు.
"అబ్బబ్బా!బామ్మా!మగవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు! మా కాలేజీ వాళ్ళందరూ మంచిగా ప్రవర్తిస్తారు.. అయినా ఈ కాలంలో పసిపిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళు రెచ్చగొట్టే బట్టలు వేసుకుంటున్నారా? నేనేం చిన్నపిల్లను కాను!నా జాగ్రత్త నాకు తెలుసు!"
చిరచిరలాడుతూ బ్యాగ్ సర్దుకొంటోంది ఆర్య. ఇంట్లో బామ్మ ఒకటి......తనపని తను చేసుకోక ఎప్పుడూ ఏదో ఒక సాధింపు....
"బామ్మ మాటలకేంగానీ!నువ్వు పద!టైమ్ అవుతోంది!"అంటూ ఆర్య బ్యాగులో టిఫిన్ బాక్స్ పెట్టింది సౌజన్య.
ఆర్య కాలేజీకి బయలుదేరింది.
ఇంటి బయట ఆటో తీసికొని భద్ర వచ్చాడు. భద్ర కూతురు వింధ్య కూడా ఆర్య చదివే క్లాసులో చదువుతోంది. ఆ వీధిలో మరో ఇద్దరు పిల్లల్ని కూడా తీసికొని కాలేజీలో దింపివస్తాడు భద్ర.
"భద్రా!అమ్మాయిల్ని జాగ్రత్తగా కాలేజీలో దింపి తీసికొనిరా!"అంది భానుకళ.
"అలాగేనమ్మా!"అన్నాడు భద్ర.
బామ్మ చాదస్తానికి విసుగ్గా ఉంటుంది ఆర్యకు. రోజూ డ్రైవరుకు జాగ్రత్తలు చెప్పందే లోపలికి వెళ్ళదు భానుకళ.
"మీరు అన్ని విషయాల్లో అతిగా పట్టించుకోవటం మానేస్తే బాగుంటుంది. ఈ వయసులో పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి!లేకపోతే మొండి తేలిపోతారు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్లే తెలుసుకుంటారు! మనం వెనకా వెంటా ఉండి కాపలాకాయక్కరలేదు!"
కోడలి మాటలకు మనసులో నొచ్చుకుంది భానుకళ.
భానుకళ భర్త చనిపోయి రెండేళ్లవుతోంది. ఒంటరిగా ఏలూరులో ఉండలేక భానుకళ ఆర్నెల్ల క్రిందట పెద్దకొడుకు సునీల్ దగ్గరికి వచ్చింది. పెద్దరికంతో ఏదన్నా సలహా ఇస్తే పెద్ద తప్పయిపోతోంది ఇక్కడ. భర్త ఉన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి భానుకళకు.
"భానూ!నేను లేకుండా కొడుకుల దగ్గర ఉన్నప్పుడు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తించాలి. కొంచెం కష్టమయినా వాళ్ళతో సర్దుకుపోతూ ఉండాలి! ఎక్కువగా ఆరాటపడకు!"
కళ్ళల్లో నీళ్లు ఉబికి ఉబికి వచ్చాయి భానుకళకు.
'ఈసారి నుండి జాగ్రత్తగా ఉంటాను '. అనుకుంటూ పూజచేసుకోవటానికి వెళ్ళింది.
** ** ** ** ** ** ** **
కాలేజీకి వచ్చారు ఆర్య,ఆమె స్నేహితురాళ్లు.కాలేజీకి వచ్చే ఆడపిల్లల మీద జోకులు వేసుకుంటూ బైకుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు మిత్రులు రషీద్, మనోజ్, విశాల్, చంద్రలు. ఆర్య వాళ్ళను చూడంగానే వాళ్ల మొహాల్లో కాస్త వెకిలి నవ్వులు కనిపించాయి. అప్పుడప్పుడే మీసాలు వచ్చి మగతనంతో పాటు మృగత్వాన్ని సంతరించుకుంటున్న వాళ్లలో కొత్త కొత్త,తిక్క తిక్క ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి.
ఆర్య, ఆమె స్నేహితురాళ్లు అందరితో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటారు.ఆధునికమైన నాగరికంగా ప్రవర్తించటం అనీ, అది పెద్ద తప్పు కాదని చాలా మంది ఆడపిల్లల అభిప్రాయం.
యవ్వనంలో కనిపించే సహజమైన ఉత్సాహం వాళ్ళల్లో ఉరకలు వేస్తూ ఉంటుంది.అక్కడ చాలామంది ఎక్కువగా ఎగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళే. సినిమాల ప్రభావం ఈ కాలపు విదేశీ సంస్కృతి ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగానే ఉంటుంది.అలా అని అమ్మాయిలందరూ అలా ఉండరు. అక్కడక్కడ కాస్త సాంప్రదాయంగా వింధ్యలాంటి వాళ్ళు కూడా కనిపిస్తారు.కొంత మంది ర్యాంకుల మీద దృష్టి పెట్టే పిల్లలు ఉంటారు. వాళ్ళ ధ్యాస అంతా చదువు, భవిష్యత్తు మీద ఉంటుంది.
సీతాకోక చిలుకల్లాగా కిలకిలలాడుతూ,పిల్లలందరూ కబుర్లు చెప్పుకుంటూ క్లాసులకు వెళ్లారు.
ఆర్య దగ్గరగా వచ్చాడు మనోజ్. మనోజ్ ని చూచి ఆగింది ఆర్య. క్లాసుకు వెళ్ళే ముందు కాసేపు ఫ్రెండ్స్ తో మాట్లాడి వస్తుంది ఆర్య. ఆ విషయం వింధ్యకు తెలుసు.
వింధ్య ఆగకుండా క్లాసు రూములోకి వెళుతోంది.
'పాత సినిమా హీరోయిన్!'అంటూ వింధ్యను చూపించి నవ్వుతున్నాడు మనోజ్.
మిగిలిన స్నేహితులు కూడా అతడితోపాటు శృతి కలిపారు.
ఆర్యకూడా వాళ్ళతో పాటు చిన్నగా నవ్వింది. వింధ్య తమకంటే తక్కువ అంతస్తు ఉన్న పిల్ల. కాలేజీకి వస్తూ కూడా ఫ్యాషన్ గా తయారవటం చేతకాదు. ఎంతసేపు చదువు.. చదువు.. అంతే.మనోజ్ బృందం వింధ్యని హేళన చేస్తూ, 'పల్లెటూరి పిల్ల!'అంటూ జోకులు వేస్తుంటే ఆర్యకు మనసులో కించిత్తు గర్వం కలుగుతూ ఉంటుంది.
మగపిల్లలు తనని పొగుడుతూ ఉంటే అదొకరకమైన ఆనందం కలుగుతోంది. అందుకని ఖాళీ దొరికినప్పుడల్లా ఎక్కువగా మనోజ్ బృందంతో గడుపుతూ ఉంటుంది ఆర్య.
మధ్యాహ్నం అవుతూ ఉంటే ఆర్యకు ఒక క్లాస్ లేదు. పిల్లలందరూ చెట్ల క్రిందకు చేరారు.
"సరదాగా కాస్త ఛాట్ తిని వద్దాం!"అంటూ మనోజ్ బృందం ఆర్యను పిలిచారు.
ఇంతకు ముందు నాలుగైదు సార్లు మనోజ్ వాళ్ళతో బైక్ మీద ఛాట్ సెంటర్ కు వెళ్లి సరదాగా ఏదో ఒకటి తిని, కబుర్లు చెప్పుకొని రావటం ఆర్యకు అలవాటే. ఈ సారి కూడా
'సరదాగా తిరిగి వద్దాం!'అనుకుంది ఆర్య.
"వింధ్యా!నువ్వు కూడా రావే!"అంది ఆర్య.
వింధ్య మొహం చిట్లించింది. మగపిల్లల బైకుల మీద వెళ్ళవద్దని తండ్రి హెచ్చరిస్తూ ఉంటాడు.
"మా నాన్న కోప్పడతారు. నువ్వు వెళితే వెళ్లు!"అంది వింధ్య.
అక్కడికి ఛాట్ సెంటర్ దగ్గర్లోనే ఉంది. మహా అయితే రెండు మూడు కిలోమీటర్లు అంతే!
మనోజ్ బైక్ మీద ఎక్కి కూర్చుంది ఆర్య. వెంట రషీద్ కూడా బైక్ మీద అనుసరించాడు.
ఆమె వక్షోజాలు తన వీపుకు తగులుతుంటే గమ్మత్తైన అనుభూతిగా ఉంది మనోజ్ కు.
బైక్ వేగం పెంచాడు. ఛాట్ సెంటర్ దాటిపోయింది బైక్.
"అరెరే!ఎక్కడికి?.."అంది అయోమయంగా ఆర్య.
"సరదాగా కాసేపు తిరిగివద్దాం! తర్వాత ఛాట్ సెంటర్ కు వెళ్ళొద్దాం!"బైక్ వేగంగా వెళుతోంది.
ఆర్యకు కంగారుగా ఉంది.
దుర్గం చెరువు దగ్గరికి వచ్చారు. నిర్జనంగా ఉందా ప్రదేశం.
"ఇక్కడికెందుకు తీసికొచ్చావ్?"
ఆర్యకు భయం వేస్తోంది.
"అరే!పల్లెటూరి దానిలా ఆ కంగారు ఏంటి ఆర్యా!....భయం లేదులే!.."అంటూ ఆర్యను గట్టిగా హత్తుకున్నాడు మనోజ్.
మనోజ్ చెయ్యి బలమైన కొండచిలువలాగా ఆర్య దేహాన్ని చుట్టుకొంటోంది.
ఒక్కసారి స్పృహ వచ్చింది ఆర్యకు.అతడి పట్టుని విదిలించుకొంది
బలంగా అతడిని వెనక్కి తోసింది. కింద పడ్డాడు మనోజ్.
పక్కనున్న బండ తీసుకొని మనోజ్ మీదికి గట్టిగా వేసింది.బలంగా బండ అతడి పొట్టలో తగిలింది.
"అబ్బా!"అంటూ పొట్ట పట్టుకున్నాడు మనోజ్.ఇంకొంచెం దూరం పరిగెత్తింది.
ఇంకొంచెం పెద్దగా ఉన్న బండ ఎత్తి మళ్లీ మనోజ్ మీదికి గట్టిగా వేసింది.
ఈసారి తలమీద పడింది. తలనుండి రక్తం....
తల పట్టుకొని పడిపోయాడు మనోజ్.
దూరంగా బైక్ చప్పుడు వినిపించింది. రషీద్ వస్తున్నాడు.
'ఏం చేయాలి?...'
కొద్ది దూరంలో ఉన్న ఇంకొక బండరాయి తీసుకొని బలం కొద్దీ పరుగెత్తింది. బైక్ ఆపి దిగాడు రషీద్.
"దాన్ని పట్టుకో!"అరిచాడు మనోజ్.
ఆర్య వైపు వస్తున్నాడు రషీద్.
బండరాయి పట్టుకొని రషీదుకు తగిలేలా వేసింది ఆర్య.
రషీద్ భుజానికి తగిలింది బండ.అయినా ఆర్య వెనకబడ్డాడు.
బలమంతా కూడ తీసుకుంటూ
"హెల్ప్!హెల్ప్!"అంటూ కేకలు పెట్టుకుంటూ పరిగెత్తుతోంది ఆర్య.
రోడ్డు దగ్గరికి వచ్చింది.
రోడ్డు కవతల ఒక భవనం దగ్గర ఉన్న పెద్దాయన ఆర్యను చూశాడు.
" ఏమిటమ్మా?అన్నాడు పెద్దాయన ఆర్యకు దగ్గరగా వస్తూ.
పెద్దాయనని చూడంగానే రషీద్ ఆగాడు. వెనక్కు పరిగెత్తటం మొదలుపెట్టాడు.
ఆగింది ఆర్య. వగురుస్తూ నిల్చుంది.
"వాళ్ళు.... వాళ్ళు... నన్ను..."
అంటూ రషీద్, మనోజ్ వైపు చెయ్యిచూపించింది.
పెద్దాయనకు అర్థం అయింది.
"ఒరేయ్!రండిరా!ఇక్కడికి!"
అంటూ పొలికేక పెట్టాడు.
పెద్దాయన ప్రక్కన ఉండటంతో భయం కాస్త తగ్గింది ఆర్యకు.
భవనం దగ్గర తాపీ పని చేసుకుంటున్న కూలీలు చూశారు. పెద్దాయన కేక విని ఇద్దరు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు.
"వాళ్ళ చేతులు విరిచి కట్టండిరా!నేను పోలీసులకు ఫోన్ చేస్తాను!"అంటూ పోలీసులకు ఫోన్ చేశాడు.
కూలీ పనివాళ్ళు పరిగెత్తుతూ వచ్చి రషీద్ వెంటపడి పట్టుకొన్నారు. ఇంకో ఇద్దరు కూడా వచ్చారు.మనోజ్ ని కూడా పట్టుకొన్నారు .
" నీకేం భయం లేదమ్మా!వాళ్ళ పని నేను చూస్తాను!"అంటూ ఆర్య రెక్కపట్టుకొని భవనం దగ్గరికి తీసికొని వచ్చాడాయన.అక్కడొక భవనం నిర్మాణంలో ఉంది . అక్కడ ఆడవాళ్ళుకూడా కొందరు పని చేస్తూ కనిపించారు. ప్రాణం కుదుటపడింది ఆర్యకు.
ఆడవాళ్లు ఇద్దరు ముగ్గురు ఆర్య ప్రక్కన కూర్చున్నారు. వాళ్ళిచ్చిన మంచినీళ్లు త్రాగింది. తండ్రికి ఫోన్ చేసింది.
*********************************************
మనోజ్, రషీదులు అరెస్ట్ అయ్యారు.
టి. వి. లో న్యూస్ ఛానల్స్ కు మంచి మేత దొరికింది.రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆడపిల్లలు పిచ్చి పిచ్చి దుస్తులు వేసుకొని మగవాళ్లతో సమానంగా తిరగటం వలన ఉపద్రవాలు పుట్టుకోస్తున్నాయని ఒక వర్గం వాదిస్తుంటే, ఇంకోవైపు పెచ్చరిల్లిన ఉన్మాదం అని... అందులో ఆడపిల్లల తప్పేమీ లేదని మరోవర్గం,... అన్నింటికీ ప్రభుత్వపు పరిపాలనే కారణమని మరొక వర్గం... చెప్పిందే చెప్పి ప్రేక్షకుల బుర్రలు బద్దలు కొడుతున్నాయి.
పదిరోజులుగా రకరకాల వ్యాఖ్యానాలు వింటోంది ఆర్య. తనను విమర్శించేవాళ్ళు కొందరైతే, సాహసంగా బయటపడ్డావని మెచ్చుకొనే వారు కొందరు.
కాలేజీకి వెళ్ళటం లేదు. చదువుకో బుద్ది కావటం లేదు. డిప్రెషన్ చుట్టుకుంది ఆర్యకు.
పిల్లను బాగుచేసుకోవాలి.
మనవరాలి దగ్గరికి వచ్చింది భానుకళ.
"అంతా నాదే తప్పు బామ్మా! నా ప్రవర్తన వల్లే ఇంత జరిగింది..."
"పిచ్చిదానా!తప్పులు ఎవరైనా చేస్తారు. దిద్దుకొంటూ వెళ్ళటమే!.. ఇదొక పాఠం!అంతే!జీవితం ఎంతో పెద్దది. ఇదొక చిన్న సంఘటన!దీనిని దాటి ఆలోచించు!మనం ఎన్ని నేర్చుకోవచ్చో తెలుసా!నీకు మహాభారతం తెలుసా!"
"చదవలేదు బామ్మా!కానీ కథ తెలుసు "
"అందులో చూడు!ధర్మరాజు జూదం ఆడాడు. తప్పే కదా!అతడు చేసిన తప్పు వలన అతడి భార్యా, తమ్ముళ్లు ఎంత బాధ పడ్డారు!... ఎన్ని అవమానాలు సహించారు!కులంలో ఒక్కడు కూడా మిగలకుండా వారసుల్ని పోగొట్టుకొన్నారు!అయినా వాళ్ళు డిప్రెషన్ తెచ్చుకొని ముసుగేసుకొని మూల కూర్చున్నారా!చెప్పు!"
"వాళ్ళు గొప్పవాళ్ళు బామ్మా!పురాణాల్లో ఉండేవాళ్ళు.. వాళ్లకు మనకు పోలికేమిటి?"
"ఇప్పుడు కూడా వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము? వాళ్ళు మానసికంగా దృఢత్వం ఉన్నవాళ్ళు కాబట్టి!.. ఆ పురాణాలు చదివి మనల్ని మనం దిద్దుకోవాలి!"
"ఇంత జరిగాక నాకేమీ జరగనట్లు నేను కాలేజీకి ఎలా వెళ్ళగలను?"
"ధైర్యంగా వెళ్ళు!చిరునవ్వుతో వెళ్ళు!నిన్ను ఎవరైనా విమర్శిస్తే ఒక చిన్న నవ్వు నవ్వు!భయం లేదు!నీ మానసిక ధైర్యమే నీకు రక్ష!మనసును గట్టి చేసుకో!నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటూ, తగ్గిపోయి, భయపడుతూ ఉంటే ఈ సంఘం ఏదో ఒకటి విమర్శిస్తూ ఉంటుంది. ఇలాగే భయంతో బ్రతుకుతామా?"
ఆలోచిస్తూ మౌనంగా ఉంది ఆర్య.
భానుకళ ప్రతిరోజూ మనవరాలి పక్కన కూర్చుని ఆ కథలు ఈ కథలు చెప్పి ధైర్యాన్ని నూరిపోస్తోంది.
మెల్లగా ధైర్యం తెచ్చుకొంది ఆర్య.
"నాన్నా!నేను బి. ఎ. లో చేరుతాను నాన్నా!"
అందొక రోజు ఆర్య సునీల్ తో.
'ఆర్య మనుషుల్లో పడి బాగుపడితే చాలు!' అనుకున్నాడు సునీల్.
ఏలూరులోని కాలేజీలో చేర్పిద్దామనుకున్నాడు.కొంచెం పరిసరాలు మారితే ఆర్య కోలుకుంటుందని అతడి ఉద్దేశం.
ఆర్యను తీసుకొని ఏలూరు వచ్చింది భానుకళ.
ఆర్య బి. ఎ.లో చేరింది.నెమ్మదిగా కొత్త కాలేజీ,.... కొత్త చదువు....కొత్త ఫ్రెండ్స్...... కొత్తప్రపంచం....మొత్తానికి ఆర్య ఉత్సాహంగా ఉంటోంది.
ఆమె ప్రవర్తన, కట్టూ బొట్టూలో చాలా మార్పు వచ్చింది.ఒకరకంగా చెప్పాలంటే పెద్దరికం వచ్చింది. అలాగే బామ్మ చెప్పిన పుస్తకాలన్నీ వదలకుండా చదువుతోంది. మెల్లగా ఆమె వ్యక్తిత్వం పరిణితిని సంతరించుకుంది.
ఈరోజు ఆర్య నిండుగా, నిదానంగా ప్రవహించే నది వంటిది.
కాలం గడిచింది.ఆర్యకు ఇరవై ఏడేళ్లు వచ్చాయి.
ఆమె తెలుగులో ఎమ్.ఎ. చేసి, పి. హెచ్. డి.కూడా చేసింది.ఇప్పుడు ఆర్య తెలుగులో మంచి పాండిత్యం కలిగిన ప్రొఫెసర్.
ఆమె వివాహం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే అభిరామ్ తో జరిగింది.
భానుకళ పెద్దదయింది.
ఆర్యకు పాప పుట్టింది. ఆరోజు చిన్నపాప బారసాల. ఆర్య భర్త, అత్తగారింటి వారందరూ వచ్చారు. ఇల్లంతా సందడిగా ఉంది.
భానుకళ కుర్చీలో కూర్చుని ఉంది.
"బామ్మా!నువ్వు చెప్పు!పాపకు ఏ పేరు పెట్టాలో!"
మురిపెంగా బామ్మను అడిగింది ఆర్య.
"వేద సంస్కృతి '...ఈ పేరయితే మీకు నచ్చుతుందా?"
అంది భానుకళ.
"మీరు చెప్పిందే వేదం బామ్మగారు!"అన్నాడు అభిరామ్.
అందరూ హాయిగా నవ్వారు.
నిజమే!'మన వేద సంస్కృతి 'దినదిన ప్రవర్థమానమై ప్రకాశిస్తూనే ఉంటుంది.
సమాప్తం.
** ** ** ** ** ** ** ** ** **