శేష జీవితం - మద్దూరి నరసింహమూర్తి

Seshajeevitam

“నాకోసం మీరు ఏ అమ్మాయిని చూసినా, వయసులో ఆమె నాకు ఏడాదికంటే తక్కువ చిన్నదిగా ఉండేటట్టు చూడండి. అమ్మాయి నాకు సమ వయస్కురాలైనా అభ్యంతరం లేదు. అలా వయసు విషయంలో నేను చెప్పినట్టుగా ఉన్న అమ్మాయి కాస్త బొద్దుగా ఉన్నా కూడా ఫరవాలేదు” ఆనంద్ పెళ్ళికి ఒప్పుకుంటూ తల్లితండ్రులకు కరుణతో పెట్టిన నిబంధన.

“మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావు. అయినా, నీకెందుకు ఆ పట్టుదల” అంటూ విశ్వేశ్వరరావుగారు కొడుకుని సూటిగా అడిగేరు.

“నా ఆలోచనలు నాకున్నాయి నాన్నా”

“అలా అంటే ఎలారా, నాన్నగారు నిన్ను సూటిగా అడుగుతూంటే నువ్వు కప్పదాటు సమాధానం చెప్తావేమిటి” కామాక్షిగారు కొడుకుని నిలదీసేరు.

“నేను పెళ్లి చేసుకోవాలంటే నేను చెప్పినట్టు చేయండి, లేదా నన్నిలా వదిలేయండి” అంటూ ఆనంద్ విసవిసా నడుచుకుంటూ తన గదిలోనికి వెళ్ళిపోయేడు.

“పొమ్మనక పొగ పెట్టేటట్టు మాటలాడతాడేమిటే వీడు”

“ఏదో ఒకటి, పెళ్ళికి ఒప్పుకున్నాడు అంతే చాలు”

“ఏమి ఒప్పుకోవడం. అలాంటి అమ్మాయి దొరకొద్దూ”

“మన తిప్పలు మనం పడి వీడిని ఒక ఇంటి వాడిని చేయడమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం”

“నాకు తెలిసి అలాంటి అమ్మాయి లేదు, నీ ఎరికన అలాంటి అమ్మాయి ఎవరైనా ఉందా”

“నాకు వరసకు తమ్ముడయే బీరకాయ పీచులాంటి చుట్టరికం ఉన్న సుబ్బయ్యకి ఒక అమ్మాయి ఉంది, పేరు అరుణ. వీడి కంటే రెండు మూడు నెలలు మాత్రమే చిన్నది అనుకుంటాను. క్రిందటి శ్రావణమాసంలో జరిగిన మా మేనమామ మనవరాలి పెళ్ళికి మనం వెళ్లినప్పుడు మీకు పరిచయం చేసేను కూడా. ‘అందంగా చిదిమి దీపం పెట్టుకోవచ్చన్నట్టు ఉన్నాదే అమ్మాయి’ అన్నారు మీరు, గుర్తొచ్చిందా”

“అవునవును. నువ్వు చెప్తూంటే గుర్తొస్తున్నాది. అమ్మాయి కాస్త బొద్దుగా ఉంది వరహీనం అయేటట్టు కనిపిస్తోంది అని ఆ పిల్లను మనవాడికి లెక్కలోకి తీసుకోలేదు కదూ”

“మన అబ్బాయి కోరినట్టు కాస్త బొద్దుగా ఉన్న ఆ అమ్మాయి వయసులో కూడా వాడు కోరుకున్నట్టే ఉంది కాబట్టి సుబ్బయ్యకి ఫోన్ చేసి మాట్లాడదామా”

“లేడికి లేచిందే ప్రయాణమా ఏమిటి. అయినా, మనం మగపెళ్ళివారం, మనమే నేరుగా అడుగుతే లోకువైపోమూ”

-2-

“కావలసిన వాళ్ళ దగ్గర అలాంటి పట్టింపులు పెట్టుకుంటే ఎలా? అయినా మీకు బెట్టు కానీ, నా వాళ్ళ దగ్గర నాకు బెట్టేమిటి. పెద్ద రాత్రై పోలేదు, ఇప్పుడే మాట్లాడతాను వాడితో”

“సరే, నువ్వు మాటలాడిన తరువాత నేను కూడా కుశలం అడిగినట్టుగా రెండు మాటలు మాట్లాడకపోతే బాగుండదేమో”

కామాక్షిగారు సుబ్బయ్యతో ఆమాటా ఈమాటా మాట్లాడినట్టుగా మాట్లాడిన తరువాత, విశ్వేశ్వరరావుగారు కూడా పలకరింపుగా రెండు మాటలు మాట్లాడేరు.

కామాక్షిగారి చాకచక్యపు మాటలతో సుబ్బయ్య నోటితోనే ఆయన అమ్మాయిని వీరి అబ్బాయికి అడిగేలా చేసి, అమ్మాయి చిత్రపటం జాతకం వెంటనే ఆయన వీరికి పంపేలా ఏర్పాటు కూడా చేసేరు.

కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్నట్టు ఆనంద్ పెళ్లి అరుణతో మూడు నెలల్లోనే జరిగిపోయింది.

శోభనం నాడు అరుణ “ఏమండీ” అంటూ ఏదో చెప్పబోతే –

“నేను నిన్ను ‘అరుణా’ అని పిలుస్తాను, నువ్వు నన్ను ‘బావా’ అని పిలు”

“ఆ వరస ఎలా మన మధ్య”

“నాకు వరసకు మేనమామ కూతురువైన నీకు నేను ‘బావ’నే కదా అవుతాను”

“అలా అంటారా. మన గదిలో నేను నిన్ను ‘బావా’ అని పిలవడం వరకూ సరే, నలుగురిలో ఉన్నప్పుడు అలా నిన్ను నేను పిలుస్తే ఎవరైనా ఏమనుకుంటారో”

“మా అమ్మా నాన్నకు నేను ముందే చెప్పి ఉంచేను. మన నలుగురికీ ఎటువంటి అభ్యంతరం లేనప్పుడు మిగతావారు ఎవరైనా ఏమనుకుంటే మనకేమిటి”

“సరే బావా”

“అదీ అలా చెప్పిన మాట వింటే ఎంతో ముద్దు అనిపిస్తావు” అని ఆనంద్ భార్యను ముద్దుల్లో ముంచెత్తేడు. తొలి రాత్రైనా ఏమాత్రమూ సిగ్గు పడక ఆమె కూడా తగురీతిగానే స్పందించింది.

భర్త దగ్గర బాగా చనువు ఏర్పడిన తరువాత –

ఒక రోజు రాత్రి, అరుణ –

“బావా, నీకు కాబోయే భార్య నీకంటే వయసులో ఏడాదికంటే తక్కువ చిన్నదిగా ఉండాలి అని భీష్మించుకొని కూర్చోవడమే కాక ఆ అమ్మాయి కాస్త బొద్దుగా ఉన్నా ఫరవాలేదు అన్న నీ ఆలోచనతో నాకు అదృష్టం కలిసొచ్చింది. నేను కాస్త బొద్దుగా ఉన్నానంటూ అరడజను మంది నన్ను వద్దనుకున్నారు తెలుసా. ఎందుకు అలా ఆలోచించేవు నువ్వు. అత్తయ్య మామయ్య అడిగినా కారణం చెప్పలేదట. నాకైనా చెప్తావా లేక నాకు కూడా చెప్పకుండా ఎప్పటికీ నీ మనసులోనే దాచుకుంటానంటావా”

-3-

“ఆ వివరాలు నీకు కాక ఇంకెవరికి చెప్పగలను అరుణా. కొంచెం బొద్దుగానే ఉన్న నా పక్కన నా భార్య పీలగా ఉంటే బాగుండదు కాబట్టి అమ్మాయి బొద్దుగా ఉన్నా ఫరవాలేదు అనుకున్నాను. తనవారిని వదలి నాజీవితంలోకి వచ్చే నా జీవిత భాగస్వామి బాగోగుల గురించి పట్టించుకోవలసిన బాధ్యత నాదే కదా. అందుకే, ఆమె వయసు విషయంలో నా పట్టుదల ఎక్కువ. భర్త తరువాత భార్యకు శేష జీవితం ఉండక పోవడం చాలా మంచిది. అయితే అది మన చేతిలో లేదు. భర్త కంటే భార్య ఎక్కువ చిన్నదిగా ఉంటే భర్త కాలం చేసిన తదుపరి ఆమె శేష జీవితం విధవరాలిగా ఎక్కువ కాలం గడిపే అవసరం ఉండవచ్చు. అలా కాకుండా, భర్తకు సమవయస్కురాలు లేక భర్త కంటే వయసులో తక్కువ చిన్నది అయితే, ఆమెకు ఆ దుర్భర బ్రతుకు ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అన్నదే నా జీవిత భాగస్వామి యెడల నా ఆలోచన”

“పెళ్లి కాకుండానే భార్య బాగోగుల గురించి ఆలోచించే విశాలమైన మనసు ఉన్న నువ్వు నా భర్తగా దొరకడం నేను చేసుకున్న అదృష్టం బావా” అంటూ భర్త పట్ల తనకున్న ప్రేమనంతా తెలియచేసేటట్టుగా ఆమె మనసారా భర్తను కౌగలించుకొని ముద్దుల వర్షం కురిపించింది.

దశాబ్దం గడిచేసరికి, ఆనంద్ దంపతులనే ఆ ఇంటికి పెద్దవారిగా నిలిపింది కాలం. ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు – ఇద్దరు కొడుకులు ఒక కూతురు – గుట్టుగా సంసారం నడిపే ఇల్లాలు, ఒకే మనసు ఒకే మాటగా నడుస్తున్న దంపతులతో, ఆ ఇల్లు మహాలక్ష్మి నిలయంగా నిలిచింది.

మరో పదిహేను వసంతాలు గడిచేసరికి, రెక్కలొచ్చిన పక్షులు వారి వారి స్వంత గూళ్ళు ఏర్పరచుకొని ఏడాదికి ఒకసారి మాత్రమే - సంక్రాంతి పండగప్పుడు - తల్లితండ్రుల దగ్గరకు రాసాగేయి.

తాము ఉంటున్న పాత ఇంటికి అవసరమైన మార్పులు చేయించిన ఆనంద్ దంపతులు క్రింద మీద వేరు వేరుగా సుఖ నివాసం ఉండేందుకు కావలసిన అధునాతనమైన హంగులు అమర్చుకున్నారు.

ముగ్గురు పిల్లలు కాబట్టి మరో రెండు ఇళ్ళు ఎక్కువ ఉండాలి అనుకున్న ఆనంద్ త్వరలోనే ఆ ఆలోచనను సాకారం చేసేడు.

ముందు చూపుతో ఆలోచించే ఆనంద్ అలా సాధించిన రెండు ఇళ్ళను వేరువేరుగా ఇద్దరు అబ్బాయిల పేరున, తాము ఉంటున్న ఇంటి పైభాగం అమ్మాయి పేరున, క్రింద భాగం భార్య – అరుణ – పేరున వీలునామా వ్రాయించేడు.

ఒక ఆదివారం మధ్యాహ్నం భోజనాల అనంతరం విశ్రాంతిగా భార్యాభర్తలు కూర్చొని ఉన్నప్పుడు –

“అరుణా, ఈ కాగితాలు ఒకసారి చూడు” అంటూ ఇళ్ళ కాగితాలతో సహా ఆ విధంగా వ్రాయించిన వీలునామా కూడా ఆమె చేతిలో పెట్టేడు, ఆనంద్.

-4-

“ఇప్పుడు వీలునామా వ్రాసే అవసరం ఏమొచ్చింది బావా”

“అవసరం అని కాదు, ముందు జాగ్రత్త”

“పిల్లల పేరున మూడు ఇళ్ళు వ్రాయించేవు, బాగానే ఉంది. కానీ, ఈ ఇంటి క్రింది భాగం నా పేరున వ్రాయించవలసిన అవసరం ఎందుకో దాని వెనక ఉన్న ముందు జాగ్రత్త ఏమిటో నాకు అర్ధం కావడం లేదు”

“ఆ మూడు పనుల కన్నా ఈ పనే అత్యావశ్యకం”

“అంటే”

“ఇంతకు ముందే నీకు భార్య యెడల నా ఆలోచనా విధానం విడమరచి చెప్పేను, గుర్తుందా”

“దానికీ దీనికీ సంబంధం ఏమిటి?”

“ఒకవేళ కాలం నన్ను ముందుగా నీకు దూరం చేస్తే, ఎటువంటి అసదుపాయం కలగకుండా తల దాచుకునేందుకు నీడ అంటూ నీ పేరున ఒక ఇల్లు ఉండి తీరాలి అరుణా”

“నువ్వు నా మీద చూపుతున్న అతి ప్రేమ నాకు ఆనందం కంటే భయాన్నే ఎక్కువ కలగచేస్తోంది బావా” అంటూ భర్త గుండెల మీద వాలిపోయిన ఆమె తనకు భర్త ఎక్కడ దూరమైపోతాడో అన్నట్టు అతన్ని గట్టిగా కౌగలించుకుంది”

ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని “పిచ్చి అరుణా భయం ఎందుకు?”

“నువ్వు లేని జీవితం నేను ఊహించలేను బావా. ‘భక్త జయదేవ’ చలన చిత్రంలో చూపించినట్టుగా నువ్వు లేవు అని తెలిసిన మరుక్షణం నా ఊపిరి ఆగిపోవడం ఖాయం”

పిల్లలు ముగ్గురూ వారి వారి కాపరాలతో దూరంగా ఉంటే, కాలగర్భంలో ఏభైఇదు వసంతాలు చవి చూసిన దంపతులు ఒకరికొకరు సాయం అన్నట్టు కాలం గడుపుతున్నారు.

ప్రతీ ఏడు లాగే ఈ ఏటి సంక్రాంతి పండగకు కూడా ముగ్గురు పిల్లలూ వారి వారి కుటుంబాలతో వస్తున్నారు అని తెలుసుకున్న అరుణగారు, పిల్లల పంటి కిందకు పనికొస్తాయని రెక్కలు ముక్కలు చేసుకొని, పది రకాల పిండి వంటలు వారు వచ్చే ముందరే తయారు చేసి అలసిన శరీరంతో పట్టేసిన నడుంతో పక్క మీదకు చేరి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే వచ్చిన ఆనంద్ గారు –

“అరుణా, ఏది కావలిస్తే అది అంగడిలో దొరికే ఇప్పటి కాలంలో కూడా ఈ వయసులో నువ్వు ఇంత శ్రమ పడి అవన్నీ చేయాలా. నేను వద్దంటే వినక అవన్నీ చేసి నడుం నొప్పి నీరసం తెచ్చుకున్నావు”

“అంగడిలో దొరకవని కాదు బావా, నా చేత్తో చేసినవి పిల్లలు తింటూ ఉంటే నాకు అదో తృప్తి”

“నిజమే, కానీ నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా, నువ్వేమీ చిన్నదానివి కాదు కదా”

“బ్రతికున్నన్నాళ్లూ నీకూ పిల్లలకూ నేను చేయగలిగినవి చేయడంలోనే నాకు ఆనందం”

-5-

“నీ ధోరణే నీదే కానీ, నా మనసు తెలియడం లేదు నీకు”

“నీ మనసు నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది బావా”

“తెలిసి కూడా నేను చెప్పినది వినకుండా నా మనసు కోరే విధంగా ప్రవర్తించక పోతే ఏమనుకోవాలి”

“నా యెడల నీ ఆలోచనకు నా వంతు సహకారం అందిస్తున్నాను అనుకో”

“అంటే” అర్ధం కాక కనుబొమ్మలు ముడిపడి అయోమయంగా అడిగేడు.

“వీలైనంత వరకూ నీ తరువాత నాకు శేష జీవితం ఉండకూడదు అంటూ ఉంటావు కదా”

“అందుకని, కోరి ఇలా ప్రవర్తిస్తే అది ఆత్మహత్యా సదృశం అయి పాపం చుట్టుకుంటుంది నీకు తెలుసా”

“సరిలే, మనం అనుకున్నవన్నీ అయిపోతాయా ఏమిటి” అంటూ నడుం నొప్పితో మూలుగుతున్న భార్యతో

“ఉండు, నీ నడుం మీద లేపనం పట్టించి మర్దనా చేస్తాను” అంటూ తెచ్చిన లేపనం ఆమె నడుం మీద వ్రాసి చేత్తో మెల్లగా మర్దనా చేస్తూంటే –

“నీ చేత్తో నా నడుం మీద మర్దనా చేస్తూంటే నొప్పి తగ్గుతున్నట్టు అనిపించడమే కాక, నా వయసు ముప్ఫై ఏళ్ళు తగ్గిపోయినట్టు కూడా అనిపిస్తోంది బావా”

“సిగ్గులేకపోతే సరి”

“నీ దగ్గర నాకు సిగ్గెందుకు. ఈరోజుకి కూడా నీ చేతిలో ఆనాటి సరసత నా శరీరంలో ఆనాటి పులకింత ఏమాత్రమూ తగ్గిపోలేదు”

“అయితే, నన్ను కూడా వచ్చి నీ పక్కన పడుకోమంటావా”

“నడుం నొప్పి పూర్తిగా తగ్గిపోయి ఉంటే ‘సరే’ అందును. నువ్వు చేసిన సేవతో నా నడుం నొప్పి రేపటికి పూర్తిగా ‘ఉష్ కాకీ’ అయిపోనీ, మనిద్దరం తప్పకుండా రేపే ఒకటైపోదాం”

“విషయాన్ని పక్కదారి పట్టించి నన్ను మాయ మాటలలో పెట్టడంలో నీకు నువ్వే సాటి”

“అదంతా నీ సాహచర్య భాగ్యం బావా. ఏ పాటు పడినా సాపాటు తప్పదుగా, లేచి రాత్రికి ఏదైనా వండుతాను” అని మెల్లగా లేవబోతున్న భార్యను కదలనివ్వక –

“నువ్వు లేవకు, ఈరాత్రికి నేను వండుతాను, కావలసిన సలహాలు ఇస్తూ ఉండు చాలు”

“ఛా, నేనుండగా నువ్వు వంట చేయడమేమిటి”

“మన ఇద్దరం ఒకరికొకరంగా ఉన్నప్పుడు ఎవరు వంట చేస్తే ఏమిటి, నువ్వు లేస్తే నా మీద ఒట్టే”

“ఒట్టు వరకూ ఎందుకు, ఒక పని చెయ్యి. అన్నం ఒక్కటీ వండు చాలు, మజ్జిగ పోసుకొని ఆవకాయతో ఈ రాత్రికి తినేద్దాం, రేపు నేను అన్ని అధరువులుతో నీకు వంట చేసి పెడతాను”

“ఈరాత్రికి నువ్వు చెప్పినట్టే చేద్దాం కానీ రేపు మాత్రం నువ్వు ఏ పనీ చేయకుండా విశ్రాంతిగా కూర్చొని ఏది ఎలా చేయాలో చెప్తూ ఉంటే, నేనే వంట చేస్తాను”

“సరే, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు”

-6-

“రేపు కూడా నేను చెప్పినట్టు వింటాను అని నాకు మాటివ్వాలి” అని బుంగమూతి పెట్టిన భర్తతో - - -

“అలాగే, రేపు నువ్వు చెప్పినట్టే వింటాను” అని ఆమె చిన్నగా నవ్వి భర్త చేతిలో చేయి వేసింది.

భోగీ ముందు రోజు వచ్చిన ముగ్గురు పిల్లల కుటుంబాలతో సంక్రాంతి పండగ మూడు రోజులూ సందడిగా సాగింది. పండగ రోజుల్లో అరుణగారికి ఆమె కూతురు ఇద్దరు కోడళ్ళు పనిలో సహాయం చేయడానికి ముందుకు వచ్చినా “మీ ఇంట్లో మీరు పనులు చేసి చేసి అలసి పోయి ఉండగా ఇక్కడైనా కాస్తా విశ్రాంతిగా ఉండండి” అంటూ ఆమె వారిని ఏ పనీ చేయనివ్వలేదు.

ఒక పక్క పిల్లలతో నవ్వుతూ గడుపుతూనే, మరో పక్క ఒంటిగా అంతమంది కోసం చేస్తున్న వంటలు తదితర పనులతో ఎక్కువ శ్రమకి గురి అవుతూన్న భార్య ఆరోగ్యం ఎలా ఉందో అనుకుంటూ ఆనంద్ గారు ఆలోచించసాగేరు.

ఏడాదంతా కేవలం ఇద్దరి కోసం వంట తదితర పనులు చేస్తున్న అరుణగారు ఇంతమందికోసం వరసగా మూడు రోజులు పనులన్నీ ఒంటి చేత్తో చేసేసరికి, ఆమె శరీరం విపరీతమైన ఒత్తిడికి శ్రమకు గురైంది. ఉన్న బలానంతా కూడగట్టుకొని, ఎవరికీ ఏమీ చెప్పక, ఎవరికీ ఏమీ తెలియనీయకుండా పిల్లలున్న రోజుల్లో పనులన్నీ ఆమె ఒక్కరే చేసుకున్నారు.

పిల్లల ముగ్గురి కుటుంబాలూ వారికి ఉండే పని ఒత్తిడి దూరాభారం వలన కనుమనాడు రాత్రికే తిరుగు ప్రయాణం అయేరు.

పిల్లలంతా వెళ్ళిపోయిన తరువాత ఏదో ఇంత తిన్నానని పించిన అరుణగారు నీరసంగా ఉందంటూ త్వరగా నిద్రపోయినా, మరునాడు లేవడానికి ఆమె శరీరం ఏమాత్రమూ సహకరించలేదు. ఆనంద్ గారే కాఫీ పెట్టి ఆమె చేత త్రాగించేరు. అది త్రాగిన వెంటనే పెద్ద వాంతి అయి తోటకూర కాడలా వేలాడిపోతూన్న భార్యను ఆసుపత్రికి తీసుకొనిపోయి వైద్యుడికి చూపించేరాయన.

అరుణగారిని క్షుణ్ణంగా పరీక్షించిన వైద్యుడు ఇంతకు ముందు ఆమెకు చేయించిన పరీక్షల వివరాలు వాటి ఫలితాలు తెలిపే కాగితాలు చూపమని అడిగేడు. ఇంతవరకూ ఏ పరీక్షా ఎప్పుడూ ఆమెకు చేయించలేదు అన్నది తెలుసుకున్న వైద్యుడు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించి, తాత్కాలికంగా బలానికి క్షార లోహములు లవణములు కలిగిన ద్రవపదార్ధం ఆమె శరీరంలోకి సూది ద్వారా ఎక్కించే ఏర్పాటు చేసి, కొన్ని పరీక్షలు చేయించమని వ్రాసిన చిట్టా ఇచ్చి, అదే ఆసుపత్రిలో వాటిని వెంటనే చేయించమని సలహా ఇచ్చేడు.

-7-

ఆ పరీక్షల ఫలితాల వివరాలు చూసిన వైద్యుడు ఆసుపత్రిలోనే వేరే విభాగంలో ఉన్న మహిళా సంబంధపు రోగాల నిపుణురాలైన వైద్యురాలిని పిలిపించి అరుణగారిని ప్రత్యేకంగా పరీక్షించి ఆమెతో ఏకాంతంగా మాట్లాడమని చెప్పేడు. మహిళా వైద్యురాలు అరుణగారిని పరీక్షించి ఏకాంతంగా మాట్లాడి వెళ్ళిన తరువాత – ఆ మహిళా వైద్యురాలుతో కలిసి కూర్చున్న వైద్యుడు తన గదికి ఆనంద్ గారిని పిలిపించేడు.

“ఆనంద్ గారూ, మీ భార్యకు రక్తపోటు హెచ్చు తగ్గులకు ఎక్కువగా గురి అవుతున్నది. చక్కర పరిమాణం కూడా తక్కువగా ఉంది. ఆమె రక్తపోటు చక్కర పరిమాణం సాధారణ పరిమాణానికి తెచ్చేందుకు ఇవ్వవలసిన మందుల కోసం ప్రస్తుతం నాలుగు లేదా ఐదు రోజులు ఆవిడ ఇక్కడ మా పర్యవేక్షణలో ఉండి తీరాలి. ఆ తరువాత వీలైనంత త్వరలో ఆమెకు శస్త్రచికిత్స చేసి గర్భసంచీ తొలిగించే అవసరం ఉంది. శస్త్రచికిత్స చేసేటప్పుడు కనీసం నాలుగు లేక ఐదు సీసాలు రక్తం ఎక్కించవలసి వస్తుంది. ఆ శస్త్రచికిత్స చాలా క్లిష్టమైనది కాబట్టి ఏ పరిణామానికైనా మనసా మీరు తయారుగా ఉండాలి. మీకు అర్ధమైంది అనుకుంటాను.

“శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాలంటారా”

“అవసరముంది. అయినా, మీరు మరొక వైద్యుని సంప్రదించాలనుకుంటే తప్పకుండా సంప్రదించండి”

“అక్కరలేదు, నాకు మీ మీద నమ్మకముంది. ఇప్పట్లో నా భార్య ప్రాణానికి ఏమైనా ప్రమాదముందా”

“అవసరమైన శస్త్రచికిత్స ఆలస్యమైతే మాత్రం ఆమె పరిస్థితి ఏ క్షణానికి ఏమి జరుగుతుందో చెప్పడం కష్టం. శస్త్రచికిత్స ఎదుర్కొనేందుకు ఆమె శరీరాన్ని ముందుగా సిద్ధం చేసిన తరువాత గర్భసంచీ తొలగించాలి. శస్త్రచికిత్స జరిగిన తదుపరి కూడా మా పర్యవేక్షణలో ఆమె ఇక్కడ వారం రోజులవరకూ ఉండే అవసరం ఉంది. శస్త్రచికిత్స సమయంలోనూ తదుపరి కూడా ఆమె శరీరం మా వైద్యానికి స్పందించే పద్ధతి చూస్తే తప్పించి, ఆమె ప్రాణానికి హామీ ఇవ్వడం వీలు కాదు. ప్రస్తుతానికి ఆమె రక్తపోటు చక్కెర పరిమాణాల స్థిరత్వానికి మా చికిత్స ఆరంభిస్తాము. ఆమె కోలుకున్న తరువాత మీరు మీ భార్యా మాట్లాడుకొని చెప్తే శస్త్రచికిత్స ఎప్పుడు చేసేది నిర్ణయిద్దాం”

“సరే, అలాగే చేయండి. దయచేసి ఆమెకు అవసరమైన వైద్యం వెంటనే ఆరంభించండి” అని కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న ఆనంద్ గారి దగ్గరకు వచ్చిన వైద్యుడు –

“మనిషి అన్నవారు మగ అయినా ఆడ అయినా నలభై సంవత్సరాల వయసు వచ్చిన తరువాత ఆరు నెలలకు ఒకసారి కాకపోయినా ఏడాదికి ఒకసారైనా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. లేకపోతే, ఇలాగే హఠాత్తుగా వైద్యం చేయించుకొనే పరిస్థితి వస్తుంది. అయినదేదో అయింది. మీరు ఇలా డీలా పడిపోతే ఆమెకు ఏమని ధైర్యం చెప్పగలరు. ఇప్పటికి ఏమీ ఆలోచించక మీరు వెళ్ళి ఆమె దగ్గర కూర్చోండి.

కొద్దిసేపు పోతే నేనొచ్చి ఆమెకు ఇవ్వవలసిన మందులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియచేస్తాను”

వైద్యులిద్దరికీ నమస్కరించి ఆనంద్ గారు భార్య ఉన్న గదికి వచ్చేరు.

-8-

“ఏమిటి బావా, వైద్యులతో ఇంత సేపు మంతనాలు”

“నాకు కూడా చెప్పకుండా నువ్వు నిర్లక్షం చేసిన నీ ఆరోగ్యం గురించి తప్ప వేరే ఏముంటాయి నాకు వారితో మంతనాలకు”

“నాకోటి తెలిసి ఏడిస్తే కదా నీకు చెప్పడానికి”

“భరించలేనంత నీరసంగా ఉన్నప్పుడైనా నాకు చెప్పొచ్చు కదా”

“సంవత్సరం పొడుగునా మన ఇద్దరికోసం చేసే పనులు ఒక్కసారిగా ఎక్కువయేసరికి శరీరం నీరస పడడంలో ఆశ్చర్యమేముంది అని నీతో ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు”

“వచ్చిన వారు మన పిల్ల మన కోడళ్ళు మాత్రమే కదా. వారంతట వారే పనిలో నీకు సాయం చేస్తామంటూ ముందుకు వస్తే, వద్దని ఒక్కర్తివే అంత పని నీ మీద వేసుకొంటే ఆసుపత్రిపాలు అవవలసి వచ్చింది”

“నేను ఆసుపత్రిపాలైనందుకు నాకు ఏమీ విచారం లేదు బావా, నా విచారమంతా నీ గురించే. నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ నీ ముఖం ఎలా వాడి పోయిందో అద్దంలో చూసుకో. పొద్దున్నించీ ఏమీ తినలేదు కదూ. ఈ ద్రవం ఏదో బలం కోసం నాకు ఎక్కిస్తున్నారు కదా, నువ్వు ముందు ఏమైనా తిని రా బావా”

“అలాగే తింటాను. నా కోసం కాకపోయినా కనీసం నీ గురించి అటూ ఇటూ తిరగడానైకైనా ఏదో తినాలిగా”

“మరైతే త్వరగా వెళ్ళు”

“ఆ వైద్యుడు వస్తామని చెప్పేరు, ఆయన వచ్చి వెళ్ళిన తరువాత వెళ్ళి తినివస్తాను”

ఇలా భార్యాభర్తలు మాట్లాడుకుంటూండగానే వచ్చిన వైద్యుడు ఇవ్వవలసిన మందుల వివరాలు అరుణగారి మంచం దగ్గర ఉన్న కాగితాల మీద వ్రాసి, అక్కడే ఉన్న సహాయకురాలికి అవన్నీ ఎలా ఎప్పుడెప్పుడు ఇవ్వాలో వివరించి వెళ్తూ అరుణగారితో –

“అమ్మా, నాలుగు రోజులు మీరిక్కడే ఈ గదినుంచి ఆవలకు కూడా వెళ్లకుండా మీకు వ్రాసిన మందులన్నీ వేసుకుంటే, అయిదోరోజు సరికి బాగైపోయి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లిపోవచ్చు” – అని చెప్పి,

ఆనంద్ గారితో –

“రోజూ రెండు పూటలా నేను వచ్చి మీ భార్య ఆరోగ్యం ఎలా ఉందో పరీక్షిస్తూంటాను. ఏ సమయంలో అయినా ఆవిడ గురించి నాతో వెంటనే మాట్లాడాలనిపిస్తే, ఈ సహాయకురాలికి చెప్తే ఆమె నన్ను పిలిపిస్తుంది. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త” అని నవ్వుతూ చెప్పి వెళ్లిపోయేరు.

భార్యకు ఆమె గర్భసంచీ వెంటనే తీసేయాలన్న విషయం ఇప్పుడు చెప్పకుండా ఇంటికి వెళ్ళిన తరువాత చెప్పొచ్చు అనుకున్నారు ఆనంద్ గారు.

నాలుగు రోజులు భారంగా గడిచేయి భార్యాభర్తలిద్దరికీ. అరుణగారు ఆసుపత్రిలో ఉన్న నాలుగు రోజులూ ఆనంద్ గారు ఆసుపత్రికి దగ్గరలోనే ఉన్న ఫలహారశాలకు వెళ్ళి ఏదో తిన్నాను అనిపించుకొనేవారు.

-9-

అయిదోరోజుకి ఆమె ఆరోగ్యం కుదుటబడడంతో దంపతులు ఇంటికి చేరుకున్నారు.

మరునాటి రాత్రి పడుకున్నప్పుడు --

“అరుణా, నీకు ఒక నిజం చెప్పాలి”

“అదేమిటి అలా మాట్లాడుతున్నావు”

“అవును, శస్త్రచికిత్స చేసి నీ గర్భసంచీ వెంటనే తొలగించవలసిన అవసరం ఉంది అని వైద్యులు చెప్తూ, ఎంత త్వరగా చేయించుకుంటే అంత మంచిది అని కూడా చెప్పేరు”

“నాలుగు రోజులు అక్కడే ఉన్న నాతో చెప్పకుండా నీతో ఎప్పుడు చెప్పేరు”

“నిన్ను ఆసుపత్రిలో చేర్చిన రోజున వైద్యపరీక్షలు చేయిస్తే వచ్చిన ఫలితాలు చూసిన వైద్యుడు మహిళా వైద్యురాలు చేత నిన్ను పరీక్షించింప చేసిన తరువాత ఆరోజే నాతో చెప్తూ, నీ ఆరోగ్యం బాగులేనందున నీతో ఆ విషయం అప్పుడు చెప్పవద్దు అని కూడా చెప్పేరు”

“అందుకని నాకు ఇప్పటి వరకూ చెప్పకుండా నీ మనసులోనే దాచుకొని ఆ ఆలోచన అంతా నువ్వు ఒక్కడివే ఇన్ని రోజులు భరించేవా బావా” అంటూ ఆమె బావురుమంది.

“నీకు చెప్పకూడదు అన్న వైద్యుని సలహా పాటించాలి మరి. ఇంతకూ ఎప్పుడు చేయించమంటావో చెప్తే, పిల్లలకు రమ్మని చెప్పాలి కదా”

“నువ్వు ఎప్పుడంటే అప్పుడే. శస్త్రచికిత్సకై నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఇంట్లో ఉండకుండా ఆసుపత్రిలో నా దగ్గరే ఉంటావుకదా, పిల్లలొచ్చి చేసేది ఏముంది”

“అమ్మకు ఇంత పెద్ద శస్త్రచికిత్స అయితే మాకు ముందుగా ఎందుకు చెప్పలేదు అని పిల్లలు నన్ను నిందిస్తారు అరుణా”

“పెద్ద శస్త్రచికిత్స అంటున్నావంటే నా ప్రాణానికి ప్రమాదం అనే కదా. అసలు అందుకే పిల్లలను పిలవాలి అనుకుంటున్నావు కదూ” అని ఆమె జీవం లేని నవ్వొకటి నవ్వింది.

“నువ్వు ఏమీ భయపడకు బెంగ పెట్టుకోకు అరుణా” అంటూ ఆమె చేతులు తీసుకొని తన గుండెల మీద పెట్టుకున్నారాయన.

“భయపడేది నేను కాదు, నాకేమైనా అవుతుందా అని నువ్వు భయపడుతున్నావు”

“నిజమే నీకేమైనా అవుతుందేమో అన్న భయం నాకైతే లేకపోలేదు. నీకేమీ భయం వేయడం లేదా”

“నువు నాతో ఉండగా నాకు భయమెండుకు బావా, నాదొక కోరిక తీరుస్తావా”

“తప్పకుండా అరుణా, చెప్పు అదేమిటో”

“నాకు ఆఖరి క్షణాల్లో నీ కౌగిలిలో లేదా కనీసం నీ ఒడిలో తల పెట్టుకొని ప్రాణం వదలాలని నా కోరిక”

“ఛా, అలా ఎందుకు ఆలోచిస్తావు, నీకేమీ కాదు”

“ఒక వేళ ఏమైనా అయితే, నా కోరిక తీరుస్తావు కదూ”

-10-

“నువ్వు శస్త్రచికిత్స విజయవంతంగా చేసుకొని ఇంటికి తిరిగి వస్తావని నాకు నమ్మకం ఉంది. నువ్వు కూడా మనసులో ఆ విశ్వాసంతోనే శస్త్రచికిత్స చేయించుకోవాలి తెలుసా” అంటూ రుద్ధమైన గొంతుకతో ఇంకేమీ మాట్లాడలేకపోయేరు ఆనంద్ గారు.

“నా బావ ఇంత బేల అని ఇప్పుడే మొదటి సారి చూస్తున్నాను. నీకోసమైనా నేను బాగై వెనక్కి వచ్చి తీరాలి అనిపిస్తోంది. కానీ, పెద్ద శస్త్రచికిత్స అంటున్నారు కాబట్టి ఏమి జరుగుతుందో ఎవరు ఊహించగలరు” అంటూ ఆమె కూడా తన్నుకొస్తున్న దుఖానికి మూగపోయిన గొంతుకతో అతని గుండెల మీద తల వాల్చి ఏడవసాగింది.

కొంతసేపటికి తెరుకున్న ఆనంద్ గారు --

“అరుణా, శరీరంలో ఉన్న రుగ్మత ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది కాబట్టి, రేపే ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేసేయమని చెప్దామా”

“అలాగే బావా”

“అయితే, పిల్లలకి ఇప్పుడే చెప్పేదా”

“వద్దు, వాళ్ళు వెళ్ళి వారం రోజులు కూడా కాలేదు. మళ్ళా ఖర్చు పెట్టుకొని రావడమంటే కష్టం వాళ్ళకు. అందుకే, శస్త్రచికిత్స అయిన తరువాత ‘ఇలా జరిగింది’ అని చెప్పొచ్చు”

“అదీ నిజమే, అలాగే చేద్దాం. ఈ రాత్రి ఒకరినొకరు పట్టుకొని పడుకుందాం, మళ్ళా రేపటినుంచి ఇద్దరం వేరు వేరుగా ఉండక తప్పదు కదా”

“నా మనసులో మాట చెప్పేవు బావా” అంటూ తన కౌగిలిలో ఒదిగి పడుకున్న భార్యను పొదివి పట్టుకున్నారు ఆనంద్.

రాత్రంతా దంపతులు అలా కౌగిలించుకొనే పడుకోని, పాత జ్ఞాపకాలు మననం చేసుకుంటూ ఏ అర్ధరాత్రికో కళ్ళు మూసేరు.

మరునాడు బాగా తెల్లవారి కిటికీలోంచి సూర్యకిరణాలు వారి పక్కమీద పరుచుకోనారంభించేయి.

సూర్యకిరణాల వేడికి కళ్ళు విప్పిన ఆనంద్ ఇంకా అరుణ తన కౌగిలిలోనే కళ్ళు మూసుకొని చిరు నవ్వుతో పడుకొని ఉండడం చూసి, ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటే ఆమె నుదురు చల్లగా తగిలింది.

తడిమి చూస్తే చేతులు ముఖమే కాక ఆమె శరీరం అంతా చల్లగా తగలడంతో –

ఆమె చివరి కోరిక ప్రకారం తన కౌగిలిలోనే చివరి

ఊపిరి వదిలింది అని తెలిసి వచ్చింది ఆయనకు.

-11-

గత రాత్రి తనతో మాట్లాడుతూ పడుకున్న ఆమె ఏ మందూ వేసుకోలేదని ఆనంద్ గారికి అప్పుడు గుర్తుకొచ్చింది.

అలా ఏ మందూ వేసుకోకుండా ఆమె పడుకోవడం యాధృచ్చికమా లేక స్వయంకృతమా అన్న సందేహం ఇప్పుడు ఆయన్ను పీడించనారంభించింది.

కావలసిన మందులు వేసుకోవాలని ఆమెకు ఇవ్వకపోవడం, కనీసం గుర్తు చేయకపోవడం, జీవితంలో తాను చేసిన సరిదిద్దుకోలేని పెద్ద తప్పు అనుకుంటూ ---

ఆ తప్పే ఆమెను తనకు శాశ్వతంగా దూరం చేసిందని తలచుకుంటూ –

మన్ను మిన్ను ఏకమయేటట్టుగా రోదిస్తూ –

తన తదనంతరం భార్య శేష జీవితం పట్ల తనకు కల ఆలోచన ‘ఈ విధంగా రూపాంతరం చెందేటట్టు చేసేవా భగవంతుడా’ అని నుదురు మీద కొట్టుకుంటూ బాధపడసాగేరాయన.

**

మరిన్ని కథలు

Veda samskruthi
వేదసంస్కృతి
- టి. వి. యెల్. గాయత్రి.
Nijamaina bhakthi
నిజమైన భక్తి
- బోగా పురుషోత్తం, తుంబూరు.
Ontaritanam 2.0
ఒంటరితనం 2.0
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sanghajeevi
సంఘజీవి
- ప్రభావతి పూసపాటి
Samayam viluva
సమయం విలువ
- చలసాని పునీత్ సాయి
Aakali
ఆకలి
- వేముల శ్రీమాన్