
"గుడ్ మార్నింగ్ తాతయ్యా ,"వాకింగ్ ముగించుకుని వచ్చి ఇంటి ముందు వేసిన కుర్చీలో కూర్చున్న తాతయ్యకు కాఫీ అందిస్తూ విష్ చేసింది శ్రేయ.
" గుడ్ మార్నింగ్ చిన్నీ,"తిరిగి విష్ చేసి కాఫీ తీసుకున్నారు తాతయ్య.
" కాలేజీ కి వెళ్ళాలా అమ్మా ."
"మధ్యాహ్నం వెళ్లాలి తాతయ్యా ."బదులు ఇచ్చింది శ్రేయ. తాత మనవరాలు ఇద్దరూ లోకాభిరామంగా మాట్లాడుకుంటూ అప్పుడే వచ్చిన పేపర్ తిరగవేయసాగారు.
సమయం ఎనిమిది కావస్తుండగా మేడ మీద అద్దెకు ఉంటున్న సరిత తన ఇద్దరు పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించడానికి కిందకు వచ్చింది. ఇద్దరు పిల్లలు ఒకరినొకరు తోసుకుంటూ దిగడంతో పెద్దవాడి స్కూల్ బ్యాగ్ కిందపడి అందులోని పుస్తకాలు బయటపడ్డాయి. తనే ముందు పోవాలనే ఆతురతలో చిన్నవాడు ఆ పుస్తకాల మీద కాలు పెట్టి కిందకు దిగాడు.
వెంటనే పెద్దబ్బాయి ఆ పుస్తకాలను తీసి కళ్ళకు అద్దుకుని బ్యాగ్ లో పెట్టుకుంటూ తమ్ముడి వైపు చూసి "ఒరేయ్! పుస్తకాలను తొక్కుతావట్రా కళ్ళు పోతాయి. సరస్వతి దేవికి కోపం వస్తుంది. చదువు రాదు అంతే" అని "అవును కదమ్మా?" అంటూ తల్లి వైపు చూశాడు.
" అవును నాన్నా" అన్న సరిత చిన్నవాడిని తప్పు కదూ అంటూ మందలించింది.
చిన్నబ్బాయి "సారీ అమ్మా" అంటూ పెద్దవాడి బ్యాగును కళ్ళకు అద్దుకున్నాడు.
వీళ్ళ అల్లరిని నవ్వుతూ చూడసాగారు శ్రేయ మరియు తాతయ్య.
"వెళ్ళొస్తాను తాతగారూ! బాయ్ శ్రేయా," అంటూ వెళ్లిపోయింది సరిత.
"ఇదిగో రత్తాలు! ఈరోజు కిటికీ గ్లాసులన్నీ శుభ్రంగా తుడవాలి," లోపలి నుంచి అమ్మమ్మ గొంతు వినిపించింది. "అలాగే అమ్మగారు," అని బదులిచ్చిన రత్తాలు "అమ్మగారు కాగితంతో తుడిస్తే గ్లాసులు శుభ్రమవుతాయని శ్రేయమ్మ గారు చెప్పారండి ఏవైనా పాత కాగితాలు ఉంటే ఇవ్వండమ్మా తుడవడానికి" అడిగింది.
"వెనక సామాన్ల గదిలో పాత పుస్తకాలు, కాగితాలు ఉన్నాయి తెచ్చుకో," జవాబు ఇచ్చింది అమ్మమ్మ.
"సరేనమ్మా" అని వెళ్లిన రత్తాలు పాతబడ్డ ఒక పెద్ద పుస్తకం పట్టుకొచ్చి "దీన్ని వాడనా అమ్మా ,"అంది.
దాని చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసిన అమ్మమ్మ,
" అయ్యో దాన్ని ఎందుకు తీసుకున్నావే. అది భగవద్గీత. చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను సామాన్ల గదిలో పోయిందన్నమాట" అంది.
"నాకు చదవడం రాదు కదమ్మా తెలవలేదు" కళ్ళకు అద్దుకుని ఆ పుస్తకం అమ్మమ్మ ముందు పెట్టేసింది.
ఆమె కూడా దానిని కళ్ళకు అద్దుకొని టేబుల్ మీద పెట్టింది.
"ఇది తీసుకోనా" అంటూ ఇంకో పుస్తకం పట్టుకొచ్చింది రత్తాలు.
దానిని చూసిన శ్రేయ, "అరే ఇది నేను హైస్కూల్లో ఉన్నప్పుడు గీసిన డ్రాయింగ్ బుక్. ఎన్నాళ్లకు దొరికింది" అంటూ రత్తాలు చేతిలోది గబుక్కున తీసుకుని మెరిసే కళ్ళతో తిరగవేసాగింది.
"ఏది తీసుకోవాలో నాకు అర్థం కాదు అమ్మగారూ .మీరే ఏదైనా తీసి ఇవ్వండి," అంది రత్తాలు.
గదిలోకి వెళ్లిన అమ్మమ్మ ఒక పాత వారపత్రికను తెచ్చి రత్తాలుకు ఇచ్చింది.
ఇదంతా ఆలోచనగా చూస్తున్నారు తాతయ్య.
పుస్తకం తిరగవేసిన శ్రేయ, దాన్ని అపురూపంగా పట్టుకుని "ఏంటి తాతయ్య ఆలోచిస్తున్నావు?" అని అడిగింది.
"ఏం లేదమ్మా మారే విలువలను చూస్తున్నాను." అన్నారు తాతయ్య.
"మారే విలువలా! అర్థం కాలేదు తాతయ్య," అయోమయంగా అంది శ్రేయ.
"ఈ అరగంటలో పుస్తకాల గురించి జరిగిన విషయాలు గమనించావా శ్రేయా?" అడిగారు తాతయ్య.
"అవును కదూ తాతయ్యా !అదే కాగితంతో చేయబడిన పుస్తకాలు. ఒకదాన్ని కళ్ళకద్దుకుంటే ఒక దాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నాము. ఎందుకని తాతయ్యా ?" ఆసక్తిగా అడిగింది శ్రేయ.
"ఇలా రా చెబుతాను." అంటూ శ్రేయను పక్కన కూర్చోబెట్టుకున్న తాతయ్య ఇలా చెప్పసాగారు.
"శ్రేయా ! అప్పుడే నువ్వు చూసావు కదా, పై ఇంటి పిల్లలు తాము చదివే పుస్తకాలను తొక్కకూడదు అన్నారు. దసరాలో సరస్వతీ పూజ నాడు ఆ పుస్తకాలను పెట్టి పూజ చేస్తారు. ఆ పుస్తకాల్లో సరస్వతీ దేవిని చూడడం ఆ పిల్లలకు అలవాటయింది. తాము ఇప్పుడు చదువుకునే పుస్తకాలను అవమానపరిస్తే, ఆ దేవికి కోపం వచ్చి తమకు చదువు బుర్రకక్కదు అన్న భావన ఆ పిల్లలది. కానీ ఆ క్లాసు దాటగానే వాటిని పాత పుస్తకాల వాడికి అమ్మేస్తారు.
ఇక రత్తాలు మొదట తెచ్చిన పుస్తకం బాగా పాతబడిపోయింది. కానీ మీ అమ్మమ్మ దానిని కళ్ళకద్దుకొని తీసి పెట్టింది. ఎందుకంటే అది భగవద్గీత. పుస్తకం పాతబడి పోయినా, దానిలోని విషయం ఎప్పటికీ పాత బడదు. మీ అమ్మమ్మ గౌరవించింది ఆ కాగితాలను కాదు అందులో ఉన్న విషయాన్ని.
రత్తాలు తరువాత తెచ్చిన పుస్తకాన్ని, నీవు తీసి పెట్టుకున్నావు. ఆ పుస్తకం పాతదే అందులోని బొమ్మలు కూడా మరీ అంత చెప్పుకోదగ్గవిగా లేవు. అయినా కూడా తీసి పెట్టుకున్నావు. ఎందుకంటే దానితో నీ జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఆ పుస్తకాన్ని చూడగానే నీ కళ్ళు మెరిసాయి. నీ హై స్కూల్ జీవితం, మీ డ్రాయింగ్ మాస్టారు, నీ మిత్రులు అన్ని గుర్తుకొచ్చి ఉంటాయి. అందుకే అది నీకు అపురూపం. తీసి పెట్టుకున్నావు.
ఇక చివరగా మీ అమ్మమ్మ తీసి ఇచ్చిన వారపత్రిక. దానికి విలువ ఉండేది ఒక్క వారం మాత్రమే. దినపత్రికలు అయితే ఒక్కరోజు మాత్రమే. కొత్త సంచిక రాగానే వెనుకటి దాని విలువ పడిపోతుంది. అది రద్దీ కాగితం అయిపోతుంది. అన్ని అలాగే అవుతాయి అనుకోకూడదు. ఏ పత్రికలోనైనా మనకు కావలసిన విషయాలు ఉంటే, వాటిని కూడా పదిలంగా దాచుకుంటాము.
అవడానికి అన్ని కాగితాలే అయినా వాటి విలువ వేరువేరు విషయాలపై ఆధారపడి ఉంటాయి."
ఆసక్తిగా వింటున్న శ్రేయ ను చూసి "ఇది మనుషులకూ వర్తిస్తుంది," అన్నారు తాతయ్య.
"అదేలా తాతయ్యా !" విస్మయంగా అడిగింది శ్రేయ.
"మొదటి రకం వ్యక్తులు పిల్లల పుస్తకాల వంటి వారు. ప్రస్తుతానికి అవసరమయ్యే వ్యక్తులు. నేను అప్పుడప్పుడు పోయే బ్యాంకులోని ఉద్యోగులు, నిన్ను రోజు కాలేజీకి తీసుకెళ్లే ఆటో డ్రైవర్ మొదలైన వాళ్ళు. ఇప్పుడు నాకు ముఖ్యమనిపించే ఆ ఉద్యోగులు, బదిలీ అయిపోతే వాళ్ళను నేను కొంతకాలానికి మర్చిపోతాను. వాళ్లు కూడా అంతే వేరే ఊరికి వెళితే నన్ను మర్చిపోవచ్చు. నీ కాలేజ్ అయిపోతే లేక ఈ ఆటో కాకుండా వేరే ఆటో ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడున్న ప్రాముఖ్యత ఆ ఆటో డ్రైవర్ కు అప్పుడు ఉండదు.
ఇక రెండో రకం వ్యక్తులు భగవద్గీత లాంటివారు. ఎంత పాతబడినా వాళ్ళ విలువ తగ్గదు. మనకు విద్య నేర్పిన గురువులు ఈ కోవలోకి వస్తారు. ఒక విధంగా వాళ్ళు మన జీవితంలోని భాగాలు. ఎప్పుడూ విలువ కోల్పోరు.
నీవు ఆత్మీయంగా తీసిపెట్టుకున్న పుస్తకం లాంటివారు మూడో రకం వాళ్లు. ఆ పుస్తకాలు ఎంత పాతబడినా, చిరిగిపోతూ ఉన్న కావాలనుకుంటాము. తల్లి, తండ్రి, భర్త, భార్య, పిల్లలు లాంటి ఆత్మీయులు అన్నమాట. పాతబడిన కొద్దీ, మనకు వాళ్ళ మీద మక్కువ పెరుగుతుందే కానీ తరగదు. వాళ్లు మన జ్ఞాపకాలు. ఒక్కో వ్యక్తీ పుస్తకంలోని ఒక్కోపుటలాంటివారు. ప్రతి పుట కూడా ఏదో ఒక జ్ఞాపకంతో ముడిపడి ఉంటుంది. జీవించి ఉన్నంతకాలం మనతోనే ఉంటాయి ఆ జ్ఞాపకాలు. కొన్ని పుటలు చేదు జ్ఞాపకాలను కూడా గుర్తు చేయవచ్చు. ఏదైనా మర్చిపోలేనివి.
ఇక చివరగా వచ్చేది, గడువు ముగిసిపోగానే రద్దీగా మారే నాలుగో రకం వాళ్లు. వీళ్లు మన జీవితంలో రోజు వచ్చి పోయే వ్యక్తులు. ఏ షాపులోనో, బజారులోనో, తారసపడేవాళ్లు. అపరిచితులు ఐనా, కొందరు మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతారు. మనకు కావలసిన విషయం ఉన్న పత్రిక లాంటివారు.
మన జీవిత గ్రంథాలయంలో ఏ రకమైన పుస్తకాలు ఉన్నాయి. వేరొకరి గ్రంథాలయంలో మనం ఏ రకమైన అరలో ఉన్నాము అన్నదాని పైన మనిషి విలువ ఉంటుంది.
చాలాసార్లు మనం భగవద్గీత లాగా ఉంటామా, లేదా గడువు ముగిసిన దిన, వార పత్రికలమవుతామా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. మనిషి అన్న వాడెప్పుడూ భగద్గీతలాగా ఉండడానికే ప్రయత్నించాలి. అప్పుడే మనిషికి, మనిషి జీవితానికి ఒక విలువ ఏర్పడుతుంది." కాగితాలతో పోల్చి జీవితాల విలువ చెప్పిన తాతయ్య వంక ఆరాధనగా చూసింది శ్రేయ.