పెద్దకోడలు - మద్దూరి నరసింహమూర్తి

Peddakodalu

జ్యేష్ఠ పుత్రుడు భరత్ కి మధ్యవర్తి ద్వారా మంచి సంబంధమే వచ్చింది అని లక్ష్మణరావు సుమిత్ర గార్లు సంతోషంగా ఉన్నారు.

ఆడపెళ్ళివారైన కేశవరావు కౌసల్య గార్ల జ్యేష్ఠ పుత్రిక మాధవికి కట్నం ప్రసక్తి లేని సంబంధం వచ్చిందని సంతోషంగా ఉన్నారు.

ఇరువైపులా అంగీకారంతో ఆడపిల్లవారింట్లో సాయంత్రం 5 గంటలకు పెళ్లిచూపులు కార్యక్రమం ఆరంభం అయింది.

ప్రత్యక్షంగా చూసిన మాధవిని లక్ష్మణరావు కుటుంబం వారు, భరత్ ని కేశవరావు కుటుంబం వారు నచ్చుకున్నారు.

ఇరుపక్కలవారు ఎదుటి వారి కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు.

ఇప్పటి రోజులకు అనుగుణంగా అబ్బాయిని అమ్మాయిని వేరుగా మాట్లాడుకుందికి మీదన డాబా మీద ఏర్పాటు చేసేరు.

ఎదురెదురుగుండా కూర్చున్న భరత్ మాధవి నోరు విప్పేందుకు రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడచిపోయేయి.

చివరకు నోరు విప్పిన భరత్ "ముందు నేను మాట్లాడేదా మీరు మాట్లాడాతారా"

"నేను కొంచెం ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి, ముందుగా మేరే మాట్లాడండి"

"లేడీస్ ఫస్ట్ అని అంటారు కదా, ముందు మీరే మాట్లాడండి"

"మీరు స్వల్పంగా మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి ముందు మీరే మాట్లాడండి"

"సరే, ఈ క్షణం నుంచే మీరు చెప్పేది వినడం ప్రారంభిస్తాను. నాభార్య గృహిణిగా ఉండాలన్నది నా అభిమతం. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. కాబట్టి, నా తల్లితండ్రులను జాగ్రత్తగా చూసుకొనే ఇల్లాలు కావాలి నాకు. మీరు ఈ రెండు కోరికలకు సరే అంటే, మీతో వివాహం విషయంలో నేను మీతో వేరే మాట్లాడేందుకు ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో నిర్మొహమాటంగా మాట్లాడండి"

"సరే, మీ రెండు కోరికలకు నేను సమ్మతమే. ఎందుకంటే, గృహిణిగా ఉండడం నా కోరిక కూడా. అత్తమామలకు సేవ చేస్తూ వారి అవసరాలను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత కోడలికి ఉంది అని విశ్వసించేవారిలో నేను ఒకరిని. కానీ, ఒక విషయం మీకు సూటిగా చెప్పాలి"

"తప్పకుండా, సూటిగానే చెప్పండి"

"భార్య మానసికంగా భౌతికంగా అంగీకరిస్తేనే భర్త భార్యతో శారీరక సుఖంలో పాల్గొనాలి తప్ప, ఏ కారణం మీదనైనా ఆమెకు ఇష్టం లేనప్పుడు బలవంతంగా అనుభవించాలన్న ప్రయత్నం భర్త చేయకూడదని నా స్థిరమైన అభిప్రాయం. మీరు అందుకు అంగీకారమేనా"

"ఇందులో అంగీకారం కాకపోవడానికి నేను సంస్కారహీనుడిని కాదండోయ్. భార్యాభర్తలు ఏకమనస్కులై సాగించేదే అసలు సిసలైన శారీరక సుఖం, అనురాగ దాంపత్యజీవనం"

"నేను ఇంకా కొన్ని మాట్లాడాలి. కానీ, అవి మీ ఒక్కరికే సంబంధించినవి కావు కాబట్టి అందరిముందర మాట్లాడాలి, మీకేమైనా అభ్యంతరమా"

"పదండి"

భరత్ మాధవి త్వరగా వెనక్కి వచ్చేయడం చూసి ఇరుపక్కలవారు ఆశ్చర్యపోయేరు.

ముందుగా కోలుకున్న భరత్ నాన్నగారు "ఏమిరా అప్పుడే వచ్చేసేరు, అమ్మాయినేమైనా ఇబ్బంది పెట్టేవా ఏమిటి"

"లేదు నాన్నా తను మీ అందరితో ఏదో మాట్లాడాలంటేనూ"

"మీరిద్దరూ మాట్లాడుకోవలసినవి మరేమీ లేవా" అడిగేరు మాధవి నాన్నగారు.

"అదికాదు నాన్నా, నేను పెద్దవారితోనే మాట్లాడాలవలసినవి కొన్ని ఉన్నాయని వచ్చేసేము"

"నువ్వు అబ్బాయితో మాట్లాడడం సబబు కానీ, అతని అమ్మా నాన్నలతో మాట్లాడడమేమిటే" మాధవి అమ్మగారు మాధవితో మెల్లిగా గుసగుసలాడేరు.

"ఫరవాలేదు, అమ్మాయిని మాట్లాడనివ్వండి" అని భరత్ అమ్మగారు భరోసా ఇచ్చేరు.

"థాంక్స్ అంటీ, మరి అంకుల్ ఏమంటారో"

"మా ఇద్దరిదీ ఎప్పుడూ ఒకటే మాటమ్మా, నువ్వు ఏమి మాట్లాడాలనుకుంటున్నావో నిర్మొహమాటంగా మాట్లాడు"

అక్కడే కూర్చున్న భరత్ తమ్ముడు వసంత్, చెల్లి అనూష ఈ సంభాషనంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.

మాధవి లేచి నుంచొని మాట్లాడబోతుంటే, భరత్ అమ్మగారు "కూర్చొని ఫ్రీగా మాట్లాడమ్మా" అన్నారు.

మాధవి మాట్లాడసాగింది.

"నేను మీ ఇంటికి కోడలిగా ఉన్నన్నాళ్ళు మీ సేవ చేస్తూ మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవాలి అని నాకు తెలుసు, చూసుకుంటాను కూడా"

"అంటే" భరత్ అమ్మగారు సందేహం వెలిబుచ్చేరు.

"వసంత్ కి పెళ్ళైతే, నేను ‘కోడలు’ బదులు ‘పెద్దకోడలు’ గా పరిగణింపబడతాను కదా"

"అంతే కదా మరి"

"అప్పటినుంచి మీ సేవ చేస్తూ మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నాకెంత ఉంటుందో, మీ చిన్నకోడలికి కూడా అంతే బాధ్యత ఉండాలి. అంతే కానీ, పెద్దకోడలిని కదా అని

మీ బాధ్యత అంతా నా ఒక్కర్తి మీద వేస్తే నేను ఆ బాధ్యత వహించను. కాబట్టి మీ సేవ చేస్తూ మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత మా ఇద్దరి కోడళ్ల మధ్య సమానంగా పంచి మీరే పుణ్యం కట్టుకోవాలి”

భరత్ అమ్మానాన్నలు ఒకరి మొహాలొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు.

"వసంత్, ఏమంటావు నువ్వు" అన్న మాధవి ప్రశ్నకు ఏమి మాట్లాడాలో తెలియని వసంత్ -

"నాకేమీ తెలియదు. మీరంతా కలసి ఏమి నిర్ణయిస్తే అదే నాకు సమ్మతం"

“వసంత్ ఎదిగిన అబ్బాయి కాబట్టి అతని పనులు స్వంతంగానే చేసుకోవాలి తప్ప ఎవరి మీద ఆధారపడకూడదు. వసంత్, నువ్వు ఏమంటావు" అన్న మాధవి ప్రశ్నకు ----

“నిజమే అంటాను నేను కూడా" అని నవ్వుతూ చెప్పేడు వసంత్.

“అనూష విషయంలో నాకు ఏమీ బాధ్యత ఉండదు. ఎందుకంటే, నాలాగే అనూష కూడా పెళ్ళై అత్తవారింటికి వెళ్ళవలసిన అమ్మాయి. కాబట్టి ఆమె పనులు ఆమె పుట్టింట్లోనే చక్కబెట్టుకోకపోతే అత్తవారింట్లో ఎలా చేస్తుంది. అనూష, ఏమంటావు నువ్వు" అన్న మాధవి ప్రశ్నకు ----

"అది నిజమే" అని నవ్వుతూ తలూపింది అనూష.

"ఏమిటమ్మా ఇది. నీ పెళ్లి చూపులకు వచ్చిన వారితో నువ్వు ఇలాగేనా మాట్లాడేది" అని మాధవి నాన్నగారు కొంచెం నొచ్చుకున్నట్టు మాట్లాడేరు.

"మీరలా నొచ్చుకోనక్కరలేదు, అమ్మాయి మనసు విప్పి మాట్లాడడం మంచిది, మేమేమీ బాధపడడంలేదు" అని భరత్ నాన్నగారు భరోసా ఇచ్చేరు.

"ఇంకా ఏమైనా చెప్పాలమ్మా" అని భరత్ అమ్మగారు నవ్వుతూ అడిగేరు”

"ఇంకా కొన్ని ఉన్నాయి ఆంటీ"

"ఇంకా ఏమిటే" అని వాపోయేరు మాధవి అమ్మగారు.

"చెప్పమ్మా. నువ్వు మాట్లాడుతుంటే వినడానికి చాలా బాగుంది" అని భరత్ అమ్మగారు నవ్వుతూ అన్నారు.

"మీ ఇంట్లో వంటమనిషి ఉందా"

"వంటమనిషి లేదమ్మా"

"మంచిది. ఉంటే మానిపించాలని చెప్పి ఉండేదాన్ని. వంట చేయడం వడ్డించడం నాకు సరదా. నా వాళ్ళకు నేనే వండిపెట్టడం నాకు ఇష్టం.

మీ ఇంట్లో పనిమనిషి ఉందా"

"ఉందమ్మా"

"మంచిది. నేను ఇంటిపని వంటపని రెండూ చేయలేను. కొందరి ఇళ్లలో కోడలు రాగానే పనిమనిషిని మానిపించడం చూస్తూనే ఉన్నాము. మీరు అలా చేయకూడదు. ఈ విషయంలో తరువాత వచ్చే వసంత్ భార్య నిర్ణయంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఉండదు”

"అలాగే చేద్దామమ్మా"

“ఇంకొక్క విషయం చెప్పాలి"

" చెప్పమ్మా" అన్నారు భరత్ అమ్మగారు.

"ఇల్లన్న తరువాత బంధువులు స్నేహితులు ఏదో పనిమీద, లేక చూసిపోదామని రావడం మామూలు. అలా ఎవరూ రాకపోతే, బంధుత్వాలకు స్నేహాలకు విలువ లేకుండా పోతుంది”

“బాగా చెప్పేవమ్మా” భరత్ అమ్మగారు మురిసిపోయేరు.

“కానీ, ఖర్చులు బాగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో, తిష్ట వేయడానికి వచ్చే జనాన్ని మాత్రం భరించేది లేదు. అలాంటి వారిని పసిగట్టి ‘పొమ్మనక పొగ పెట్టడం’ నాకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి నా ప్రయత్నాలకు మీరెవరూ అడ్డు చెప్పకూడదు”

“నువ్వు చేసే ఏ మంచిపనికీ నీకు ఎవరూ అడ్డు చెప్పరమ్మా”

“ఇరుగుపొరుగు అమ్మలక్కలు కూడా మన ఇంటికి వస్తారు, రావాలి కూడా. కానీ, వారిలో ఎవరైనా మనలో పొరపొచ్చాలు పెట్టేవాళ్ళుంటే, వారికి కూడా అదే ట్రీట్మెంట్ తప్పదు" అని మాధవి ఆగింది.

“బాగా చెప్పేవామ్మా. ఇంకా నువ్వు చెప్పదలహుకున్నది ఏమైనా ఉన్నాయమ్మా" అని అడిగేరు భరత్ అమ్మగారు.

"ఇంకేమీ లేవు ఆంటీ. 'అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు' అన్నారు కదా పెద్దలు. అందుకే, నా మనసులో ఉన్నవన్నీ మీకు చెప్పేను. అన్నీ విన్న మీకు నా మీద కోపం లేక, ప్రస్తుతానికి నన్ను మీ కోడలుగా తదుపరి పెద్దకోడలుగా స్వీకరించడానికి ఒప్పుకుంటే, మిమ్మల్ని ‘అంకుల్ ఆంటీ’ అని పిలవడం మాని, ‘మామయ్యా అత్తయ్యా’ అని పిలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను"

"ఇంకా ఆలస్యమెందుకు నువ్వు అలా పిలుస్తే వినాలని ముచ్చటగా ఉంది మాకు. నీ మాటలు, నీ మనస్తత్వం, నీ ఆలోచనలు అన్నింటికీ మించి నీ నిర్మొహమాటం మాకు చాలా నచ్చేయి" అన్న భరత్ నాన్నగారి మాటలకు అక్కడ నవ్వులు విరిసేయి.

వెంటనే, మాధవి లేచి "నన్ను దీవించండి మామయ్యా అత్తయ్యా" అని భరత్ అమ్మా నాన్నల పాదాలకు నమస్కారం చేసింది.

వారు కూడా భరత్ తో సహా ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.

మాధవి అమ్మానాన్నలు ఆనందభాష్పాలతో ఆ సన్నివేశాన్ని తిలకించసాగేరు.

** శ్రీరామ **

మరిన్ని కథలు

Parina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం
Tatayya salahalu
తాతయ్య సలహాలు
- గాయత్రి కులకర్ణి
Seshajeevitam
శేష జీవితం
- మద్దూరి నరసింహమూర్తి
Veda samskruthi
వేదసంస్కృతి
- టి. వి. యెల్. గాయత్రి.
Nijamaina bhakthi
నిజమైన భక్తి
- బోగా పురుషోత్తం, తుంబూరు.
Ontaritanam 2.0
ఒంటరితనం 2.0
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు