
వెనుకబడిన ప్రాంతాలైన కొండాపురం, రామాపురం గ్రామాలు
పట్టణాల విస్తరణ వల్ల భూముల క్రయవిక్రయాలతో అభివృద్ధికి నోచుకుంటున్నాయి.
కొండాపురం గ్రామం ఎత్తైన మెట్ట భూమిలో ఉంటే
రామాపురం గ్రామం సమతల ప్రాంతంలో ఉండి ఊరి చివర
పెద్ద చెరువు ఎప్పుడూ నీటితో కళకళలాడుతు వ్యవసాయానికి
సాగునీరు అందిస్తు చేపల పెంపకంతో ఊరి పంచాయితీకి
ఆదాయ వనరుగా మారింది. అందువల్ల రామాపురం గ్రామ
ప్రజలు దాన్ని బంగారు చెరువుగా పిలుస్తారు. పచ్చని పంట
పొలాలు ఆహ్లాద వాతావరణం ఉండటం వల్ల ప్రతి సంవత్సరం
రకరకాల విదేశీ పక్షులు వలస వచ్చి గూళ్లు కట్టుకుని నివాసం
ఉంటాయి. వాటిని చూడటానికి పక్షి ప్రేమికులు వస్తుంటారు.
వ్యవసాయం, పాడి, కాయకూరల పెంపకంతో, వ్యాపారాలతో
ఊళ్లోని వారు భూస్వాములుగా చెలామణి అవుతూ చక్కటి
ఇళ్లు, భవంతులతో తమ ప్రాభవం కనబరుస్తుంటారు. ఊరిలో
గ్రామదేవత, శివాలయం, రామాలయం, సాయిబాబా గుడి
ఏర్పాటు చేసి ఎప్పుడూ దైవ కార్యకలాపాలతో సందడిగా
ఉంటుంది.
కొండాపురం గ్రామ వ్యవసాయ భూములు ఎత్తైన ప్రదేశంలో
ఉన్నందున వర్షపు నీరు దిగువకు ప్రవహించి నీటి వనరులు
లేక వర్షాధార మెట్ట పంటలే సాగుచేసుకోవల్సి వస్తోంది.
ఆ ఊరి ప్రజలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. తాటి పాకలు,
పెంకుటిళ్లు కనబడతాయి. పిల్లలు రామాపురం గ్రామంలో
పాఠశాలకు నడచి వచ్చి చదువుకోవల్సి వస్తోంది. అందువల్ల
అక్కడి రైతులు తమ పిల్లల్ని బడులకు పంపకుండ వ్యవసాయ
పనులకు, వృత్తి పనులకు తీసుకుపోతూండటం వల్ల నిరక్షరాస్యత
పెరిగిపోయింది. అన్నిటికీ రామాపురం గ్రామ భూస్వాముల మీదే
ఆధారపడవల్సి వస్తోంది.
కొండాపురం , రామాపురం గ్రామాలకు కలిపి ఒకటే పంచాయతీ
ఉంది. ఎప్పుడూ రామాపురం భూకామందులే పంచాయతీ సర్పంచిగా
ఎన్నికవుతు రాజకీయంగా పరపతి సంపాదించి అన్ని వసతులు
తమ గ్రామానికే సమకూరుస్తు కొండాపురం గ్రామాన్ని చిన్న చూపు
చూస్తుంటారు.
కొండాపురం, రామాపురం గ్రామాల మద్య మట్టి రోడ్లను
బాగుచేయించనందున వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందిగా
ఉంటోంది. రామాపురం నుంచి పట్నానికి పోయే బాటను
తారు రోడ్డుగా చేసి హంగులు ఏర్పాటు చేసుకున్నారు.
ఆర్థికంగాను అన్ని అవసరాలకు భూకామందుల మీద
ఆధారపడినందున కొండాపురం ప్రజల్లో ఎవరికీ సాహసించి
అడిగే ధైర్యం లేకపోయింది.
కొండాపురం గ్రామ ప్రజలు బీదవారనీ , చదువు సంధ్యలు లేనివారని,
కట్నకానుకలు ఇచ్చుకోలేరని హేళన చేస్తు అక్కడి యువకులకు పిల్లను ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.
రామాపురం యువతీ యువకులు పట్నాలకు పోయి కాలేజీలలో
పెద్ద చదువులు సాగిస్తున్నారు. మంచి ఉధ్యోగాలు సంపాదిస్తున్నారు.
ఊళ్లో అందరికీ కార్లు, మోటర్ సైకిల్సు ఉన్నాయి. వైద్యుని రప్పించి
చిన్న వైద్యశాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
కొండాపురంలో కమ్మరి పని చేసే అప్పలస్వామి కొడుకు
రామకృష్ణకు చిన్నప్పటి నుంచి చదువంటె శ్రద్ధ ఎక్కువ.
తండ్రికి వెనుక వ్యవసాయ పరికరాలు తయారీలో సహాయ
పడుతూ తనూ ఎలాగైనా పెద్ద చదువులు చదివి రామాపురం
ఊరితో తమ ఊరిని ఆధునిక వసతులు కల్పించి సమాన
హోదా తేవాలని సంకల్పించాడు.
కాలినడకన రామాపురం పాఠశాలకు వచ్చి ప్రాథమిక చదువు
పూర్తి చేసి తండ్రికి నచ్చచెప్పి సైకిలు మీద పట్నానికి పోయి
ఉన్నతపాఠశాల చదువు , కళశాలలో ఇంటర్ చదవగలిగాడు.
తర్వాత గ్రామాభివృద్ధికి పనికొచ్చే చదువు చదవాలని
నిశ్చయించి గురువుల సలహా మేరకు పాడి వ్యవసాయ అభివృద్ధికి
సంబంధించిన రంగంలో చదివితే ఆధునిక వ్యవసాయ పద్దతులతో
ఎంతో అభివృద్ధి సాధించవచ్చని తెల్సింది.
ఉన్నతపాఠశాల, కళాశాల చదువుల నుంచి ప్రథమశ్రేణి అంకాలతో
ఉత్తీర్ణుడవుతున్న రామకృష్ణకు ఆ ప్రాంత శాసన సబ్యుడి సహాయ సహకారాలతో ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో ప్రవేశం కల్గింది.
తను ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో చదువుతూనే తండ్రికి
వ్యవసాయ పనిముట్లలో ఆధునికత చూపుతు, ఊరిలో వాతావరణ
పరిస్థితులకు తగ్గ పంటలు, బిందు సేద్యం , పంటల మార్పిడి
కాయగూరల సాగు, పాడి పసువుల పెంపకం, కోళ్ల పెంపకం,
సహకార సంఘాలతో ఆర్థిక వనరుల ఏర్పాట్లు చేసి కొండాపురం గ్రామంలో ఎంతో మార్పు తెచ్చాడు. గ్రామంలోని ఆడ మగ పిల్లల్ని వ్యవసాయ పనులకు కాకుండా పాఠశాలకు పంపేలా పెద్దలకు
తెలియచెప్పాడు.
ఊరిలో రామకృష్ణ చేసే అబ్యుదయ పనులకు ఆకర్షితులై
మరికొంతమంది యువకులు ముందుకు వచ్చి అతని సలహాలు
తీసుకుంటున్నారు. కోళ్ల ఫారాలు, పాడి పశువుల డైరీ ఫారాలు
మొదలు పెట్టారు. ఎటువంటి వర్షాభావ పరిస్థితుల్నైన ఎదుర్కొనేల
భూములను తయారు చేసి పంటల దిగుబడి చేసి ఆర్థికంగా
నిలదొక్కుకుంటున్నారు. యువకులు మోటర్ సైకిళ్లు సమకూర్చు
కుంటున్నారు. వ్యవసాయ పనులకు ఆధునాతన ఉపకరణాలు వాడుతున్నారు.. ఆడవారు ఆభరణాలతో అలంకరించుకుంటున్నారు.
పాత తరం పెద్దలు కూడా రామకృష్ణ చేసే అభివృద్ధి పనులను
మెచ్చుకుంటున్నారు. ఊరి జనం చేతిలో డబ్బులు కనబడుతున్నాయి.
ఊరిలో రామకృష్ణ పరపతి పెరిగింది. అతను ఏది చెబితే అలా
చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా ఆప్రాంత శాసన
సబ్యుడికి కొండాపురం ఓట్లు ఎంతో కీలకమయాయి. ఇదే అదునుగా
రామకృష్ణ ఊరి అవసరాలు తీర్చాలనుకున్నాడు. నీటి ఎద్దడి
తీరాలంటె కొండవాలులో చెక్ డ్యామ్ కడితే వర్షాకాలంలో
వరద నీటిని నిలవచేసి వ్యవసాయ సాగు నీటిగా వాడవచ్చని
అనుమతులు నిధులు ఏర్పాటు చేయించాడు. రామకృష్ణ
తన వ్యవసాయ కళాశాలలో డిగ్రీ చదువు సాగిస్తునే ఊరికి
ఉపకారిగా మారేడు.
ఆర్థికంగా మెరుగుపడిన వారు పాతఇళ్లను కూలగొట్టి ఆధునిక
వసతులతో ఇళ్లను కట్టుకుంటున్నారు.సహకార సంఘాల ఏర్పాటుతో
ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నారు. మగపిల్లలతో సమానంగా
ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లి అక్షరజ్ఞానము సంపాదిస్తున్నారు.
ఊరిలో పారిశుద్ధ్యం , తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఆరోగ్య
సూత్రాలతో పాటు తాగుడు, జూదం, కొట్లాటలు తగ్గుముఖం
పట్టేయి. ఇప్పుడు కొండాపురం గ్రామం ఉత్తమ గ్రామంగా అందరి
నోళ్లలో నానుతోంది.
రామాపురం గ్రామ ప్రజలకు కొండాపురం అభివృద్ధిని చూసి
కనువిప్పు కలుగుతోంది. రామాపురం గ్రామ ప్రజలతో సంబంధ బాంధవ్యాలు కలుపుకోడానికి ముందుకు వస్తున్నారు.
ఊళ్లోని యువకులు పెద్ద చదువులు చదివి ఉధ్యోగాలంటు వివిధ ప్రాంతాలకెళిపోయారు. ఊరి బాగోగులు పట్టించుకునే వారు
లేకపోయారు. రాజకీయాలు పెరిగి జనం ప్రత్యర్ధులుగా తయారయారు.
పంచాయతీ ఎన్నికల్లో తగవులు కొట్లాటలతో అభివృద్ధి కుంటుపడింది.
పాత తరం పెద్దలే పంచాయతీ ఎన్నికల్లో తమ ప్రాభవం చూపుతున్నారు.
పట్నంలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో చదువుతున్న రామకృష్ణకు
ఒకసారి సాంస్కృతిక కార్యక్రమంలో రామాపురం పంచాయతీ ప్రసిడెంటు
సిద్ధరామయ్య గారి కుమార్తె ఇందిరతో పరిచయం ఏర్పడింది.
ఇందిర పట్నంలో ఫల పుష్ప వనాభివృద్ధి విభాగంలో డిగ్రీ
చదువుతోంది. రామాపురం వచ్చినప్పుడు జనాలలో రామకృష్ణ
వ్యవసాయ కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్టు , కొండాపురం ఉన్నతి
కోసం చేస్తున్న కృషి పట్టుదల వింటూ వచ్చింది. రాజకీయ కారణాల
వల్ల వారు ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేకపోయింది.
రామకృష్ణను ప్రత్యక్షంగా మొదటిసారి కలిసినప్పుడు అతని
సౌమ్యత, మృదుభాషను , చిరునవ్వు ముఖం చూసి ముగ్ధురాలైంది.
అతను వెనుకబడిన తన ఊరి గురించి పడుతున్న కృషిని అభినందించింది. పెద్దలకు తెలియకుండా అలా వారి పరిచయం
చిగురించింది. రాజకీయ కక్షలకు స్వస్తి పలికి పెద్దల ఆశీర్వాదంతోనె
పెళ్లి చేసుకోవాలనుకున్నారు వారు.
ఊరి పెద్దల సహకారం, శాసన సబ్యుడి సహాయంతో రామకృష్ణ
వ్యవసాయ కళాశాల చదువులో ఉన్నత మార్కులతో పాసయి పట్టా
సంపాదించేడు. అనేక ఉధ్యోగావకాశాలు వచ్చినా ఊరి బాగు కోసం వాటిని వదులుకున్నాడు.
ఇంతలో రామాపురం పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పటి వరకు
రెండు గ్రామాల ప్రజల ఓట్లతో పంచాయతీ ప్రసిడెంటు ఎన్నిక అవుతూ
వచ్చింది.
ఇప్పుడు కొండాపురం గ్రామ ప్రజల ఓట్లు కీలకంగా మారేయి.
ఈసారి రామకృష్ణను ఉమ్మడి గ్రామపంచాయతీ ప్రసిడెంటు
పదవికి నామినేషను వెయ్యవల్సిందిగా ఊరి ప్రజలు కోరారు.
వెనుకబడిన కొండాపురం గ్రామాన్ని ఎలా తీర్చిదిద్ది అభివృద్ది
చేసి ఉత్తమ గ్రామంగా చేసిందీ అందరికీ తెల్సింది. ఇటువంటి
యువకుడు గ్రామ పంచాయతీ సర్పంచిగా ఉంటే ఊరు ఎంతో
అభివృద్ధి చెందుతుందని అందరూ చర్చించుకుని ఏకగ్రీవంగా
ఎన్నుకోదలిచారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లలేక
పాత ప్రసిడెంటు సిద్ధరామయ్య కూడా రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకోడానికి అంగీకరించారు.
ఆ ప్రాంత శాసన సబ్యుడి ఆధ్వర్యంలో రామకృష్ణ
రెండు గ్రామాల ఉమ్మడి పంచాయతీ ప్రసిడెంటుగా ఏకగ్రీవంగా
ఎన్నికయాడు.
రామకృష్ణ, ఇందిరల ప్రేమను తెలుసుకున్న ఇరు కుటుంబ
పెద్దల అంగీకారంతో అట్టహాసంగా వారి వివాహం జరిగింది.
సమాప్తం