M B కంపెనీ - మద్దూరి నరసింహమూర్తి

M B Company

కోటేశ్వరరావు దంపతులు ఆదివారం ఉదయం ముందర గదిలో కూర్చొని కాఫీ త్రాగుతున్నారు. భార్య కనకం టి‌వి చూస్తూంటే, ఆయన మొబైల్ లో వాట్స్ ఆప్ సందేశాలను చూసుకుంటున్నాడు.

“కనకం, టి‌వి ఒకసారి కట్టి M B కంపెనీ నుంచి వచ్చిన ఈ సందేశం చదువు” అని ఆమెకు తన మొబైల్ ఇచ్చేడు. అందులో --

“అధిక లాభసాటి అయిన ట్రేడింగ్ వ్యాపారం మీకు చేయాలని ఉన్నా అందులో మెళకువలు తెలియక భయపడుతున్నారా? మేము మీకు అండగా ఉంటాము. వివరాలకు హలోఅని ఈ నంబరుకు ఒక సందేశం పంపండి. మా కంపెనీ ప్రతినిధి మీతో సంప్రదించి అవసరమైన సహాయం అందిస్తారు-- అని ఉంది.

“ఇది మనకు ఏ విధంగా పనికొస్తుంది, మీ ఆలోచన ఏమిటి”

“వారం రోజులలో నేను పదవీ విరమణ చేయగానే సుమారుగా 58లక్షలు వస్తాయి. 3లక్షలు బాంకులో ఉంచి, మిగతా 55లక్షలు ట్రేడింగ్ వ్యాపారంలో పెడితే త్వరలో మంచి లాభాలు ఆర్జించవచ్చు”

“ఆ సొమ్ము బ్యాంకులో ఫిక్సెడ్ డిపోజిట్ చేసి నెలనెలా వడ్డీ తీసుకుంటే మీ పెన్షను కూడా కలుపుకొని చీకూచింతా లేకుండా మనం జీవనం గడిపేయవచ్చు కదా”

“బ్యాంకులో ఫిక్సెడ్ డిపోజిట్ మీద వడ్డీ ఏడాదికి 8శాతం మాత్రమే వస్తుంది. పైగా అందులో ఆదాయపు పన్ను పోతుంది. ట్రేడింగ్ వ్యాపారంలో పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందవచ్చు”

“ముందు ఆ కంపెనీ వాళ్ళతో అన్నీ మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయానికి రండి”

కోటేశ్వరరావు వాట్స్ ఆప్ ద్వారా ‘హలో’ అని సందేశం పంపేడు.

సందేశం పంపిన అరగంటకు కోటేశ్వరరావుకు ఫోన్ వచ్చింది.

“హలో, నేను కోటేశ్వరరావుని మాట్లాడుతున్నాను. ఎవరు మీరు”

“నేను M B కంపెనీ ప్రతినిధిని. మీరు మాకు పంపిన సందేశం చూసి ఫోన్ చేస్తున్నాను”

“నాకు ట్రేడింగ్ వ్యాపారం చేయాలని ఉంది. కానీ, ఆ వ్యాపారం గురించి పెద్దగా తెలియదండీ”

“మేము ఉన్నదే మీలా తెలియని వారికి సహాయ సహకారాలు అందించేందుకు. అప్లికేషన్ ఫామ్ మీ నంబరుకు పంపుతాము. అది ప్రింట్ తీసుకొనే అవసరం లేదు. వాట్స్ ఆప్ లోనే పూర్తి చేసి, మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కాపీలతో మాకు పంపితే చాలు. రెండు మూడు రోజులలో మేము మీకు తెలియచేసిన తరువాత,

మీరు మదుపు పెట్టదలచుకున్న సొమ్ము మేము చెప్పిన అక్కౌంట్ కు పంపుతూ ఉంటే, మీ తరఫున ట్రేడింగ్ వ్యాపారం మేమే చేస్తూ, ఏరోజుకు ఆరోజు రాత్రి 7గంటలకు అంతవరకూ మీరు పెట్టిన మదుపు మీకు వచ్చిన లాభాల వివరాలు మీకు వాట్స్ ఆప్ లో తెలియచేస్తూ ఉంటాము”

“అలాగే పంపుతాను. కానీ, మిమ్మల్నే నమ్ముకున్న నాకు మీరే భరోసా”

“మీరు పెట్టె మదుపు గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే, మీరు ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టే ప్రతీ పైసా మా స్వంత సొమ్ముగా చూసుకుంటాము”

“అంటే” అన్నాడు రాఘవరావు ఆందోళనగా.

“మా సొమ్మును ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, అంతే జాగ్రత్తగా మీ సొమ్మును చూసుకుంటామండీ బాబూ” అంటూ ఆయన నవ్విన నవ్వుకి –

“భలేవారే మీరు” అంటూ కోటేశ్వరరావు తేలిక పడ్డ మనసుతో నవ్వులు కురిపించేడు.

“ఇప్పుడు మా నియమ నిబంధనల గురించి వివరిస్తాను, జాగ్రత్తగా వినండి”

“చెప్పండి”

“మీరు మాకు పంపే మదుపుతో మీ తరఫున మా కంపెనీ పేరుతో మేము ట్రేడింగ్ వ్యాపారం చేసి మీకు మంచి లాభాలు ఆర్జించి పెడతాము. అందుకు ప్రతిఫలంగా -- మీకు వచ్చే ప్రతీ లాభంలో ఎప్పటికప్పుడు రెండు శాతం మా కమీషన్ రూపేణా, మరొక శాతం మా కార్యాలయ నిర్వహణ ఖర్చులకు మీదగ్గర తీసుకుంటాము. మీ సొమ్ము మాదగ్గర మదుపు పెట్టినందుకు సాలీనా మీకు 10శాతం వడ్డీ కూడా ఇస్తాము. ఆ వడ్డీ ప్రతీనెలా తీసుకుంటారో లేక ట్రేడింగ్ వ్యాపారం కోసం మదుపుగా వాడుకోదలచుకున్నారో మీరు అప్లికేషన్ ఫామ్ లో తెలియచేయాలి. ట్రేడింగ్ వ్యాపారం అన్న తరువాత లాభాలు మాత్రమే కాక, మన నియంత్రణలో లేని కారణాలతో అప్పుడప్పుడు చిన్నగానో పెద్దగానో నష్టాలు రావొచ్చు. లాభం గణనీయంగా రాలేదనో లేక నష్టం వచ్చిందనో కృంగిపోక, క్రిందకు పడినా వెంటనే లేచిన బంతిలా, పోయిన చోటునే మరలా సంపాదించుకొనే ప్రయత్నం చేయడం ఉత్తమ వ్యాపారి లక్షణం. మీకు వచ్చే లాభాలకు కానీ నష్టాలకు కానీ మేము ఎంత మాత్రమూ బాధ్యులము కాము. మీరు ఎప్పుడు మాతో వ్యాపారం ఆపేయాలనుకున్నా, అందుకు మీరు సర్వ స్వతంత్రులు. అయితే, మాకు వారంరోజుల ముందర మాత్రం ఖచ్చితంగా తెలియచేయాలి. గడువు ముగిసిన రోజు రాత్రి 8 గంటలకు మీకు రావలసిన సొమ్ము పూర్తి వివరాలతో మీకు అందించే ఏర్పాటు జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ లో ఈ నియమనిబంధనలన్నీ ఉన్నాయి. అవన్నీ క్షుణ్ణంగా చదువుకొని మీకు సమ్మతమైతేనే మాద్వారా ట్రేడింగ్ వ్యాపారం నడపండి”

“లాభాల మీద ఆదాయపన్ను ఎంత పడుతుంది”

“మీపేరు మీద వ్యాపారమే లేనప్పుడు మీకు ఆ చింతే లేదు”

“బాగుంది. ఇంతకీ, M B కంపెనీ అంటే పూర్తి పేరు ఏమిటి”

“మాయా బజార్ కంపెనీ”

“అదేమి పెరండీ బాబూ”

“ట్రేడింగ్ వ్యాపారంలో జరిగేది మాయే కదండీ”

“అదా సంగతి. సరే, మీరు అప్లికేషన్ ఫామ్ పంపండి”

అప్లికేషన్ ఫామ్ అందుకున్న కోటేశ్వరరావు పూర్తి చేసి పంపేడు.

మూడోరోజు కోటేశ్వరరావుకి --- “మీరు మదుపు పెట్టడం ప్రారంభించవచ్చు” అన్న సందేశంతో పాటూ ఎక్కడకి ఎలా పంపాలో వివరాలు వచ్చేయి.

పదివేలరూపాయల మదుపుతో ట్రేడింగ్ వ్యాపారం ఆరంభం అయింది. ఆరోజు మొబైల్ లో అందుకున్న సందేశం ద్వారా నికరాదాయం ‘రెండువేల ఎనిమిదివందలు’ అని తెలుసుకున్న కోటేశ్వరరావు దంపతుల ఆనందానికి హద్దు లేదు. ఆరాత్రి ప్రత్యేకంగా పాయసంతో దంపతులు సంతోషంగా భోజనం చేసేరు.

నెలరోజుల్లో పెట్టిన 5లక్షల మదుపుకి, ‘లక్షా ఇరవైవేలు’ ఆదాయం కనిపించడంతో, కోటేశ్వరరావు రోజురోజుకీ మదుపు పెంచుతూ, మూడు నెలలు తిరగకుండానే 50లక్షలు ట్రేడింగ్ వ్యాపారంలో మదుపు చేసేడు.

నాలుగో నెల మొదటి వారంలో అసలుతో నికరాదాయం కలిపి ‘62లక్షల 20వేలు’ అని తెలుసుకున్న వారి సంతోషానికి అవధులు లేవు. ఆ సొమ్ము మొత్తం ట్రేడింగ్ వ్యాపారంలో మదుపు చేసేరు. అయితే, దానిమీద రెండు లక్షలు మాత్రమే లాభం వచ్చినట్టు సందేశం వచ్చింది.

తక్కువ లాభం వచ్చిందని క్రుంగిపోకూడదన్న సలహా ముందే అందుకున్న కోటేశ్వరరావు కంపెనీ దగ్గర ఉన్న తన మొత్తం సొమ్మును మదుపుగా వాడుకోమని సందేశం పంపించేడు.

“మీరు సార్ధక నామధేయులైనందుకు అభినందనలు, ఈరోజుకి మీ మదుపు లాభాలు కలిపి ‘ఒకకోటి పన్నెండువేలు’ అని వచ్చిన సందేశం చూసిన కోటేశ్వరరావు దంపతుల ఆనందానికి అవధులు లేవు.

ఆనందం నిండిన మనసులతో కోటేశ్వరరావు దంపతులు వారి తొలిరేయి అనుభవాలను ఆరాత్రి తిరగ వ్రాసుకుంటూ, అలసిన మేనులతో మధురిమలు నిండిన మనసులతో తెలవారగట్ల నిద్రలోకి జారుకొని కలల ప్రపంచంలో విహరించ సాగేరు.

మరునాడు – కోటేశ్వరరావు తన సేవింగ్స్ ఖాతాలో ఉన్న 3లక్షలు కూడా M B కంపెనీ వారికి పంపుతూ, అది వారి దగ్గర ఉన్న మొత్తం సొమ్ముకు కలిపి, అంటే ఒకకోటి మూడులక్షల పన్నెండువేలు వ్యాపారంలో మదుపు పెట్టమని సందేశం పంపబోగా, కనకం కలగచేసుకొని “ఆ 3లక్షలు పంపకండీ” అని అడ్డుకుంది.

‘ఆలి అవసరం పంటి కిందకు పడక మీదకు మాత్రమే తప్ప వ్యాపారంలో కాదు’ అన్న నిర్ణయంతో ఆవిడ మాటలకు విలువ ఇవ్వక తాను చేయాలనుకున్నదే చేసి మగవాడి అధికారం ప్రదర్శించేడు.

కలకంఠి కన్నీరు మౌనంగా ఒలికిన వేళ ఆ ఫలితం ఎంతకు దారి తీసిందంటే ----

ఆరోజు రాత్రి కానీ మరునాడు రాత్రి కానీ కోటేశ్వరరావు మొబైల్ కు ఎటువంటి సందేశం రాలేదు.

M B కంపెనీ వారికి అతను పంపే సందేశాలు కూడా ఎందుకో వెళ్ళడం లేదు.

M B కంపెనీ వారితో ఎన్నిసార్లు మాట్లాడాలని ప్రయత్నం చేసినా –

ఈ నంబరు ప్రస్తుతం వాడుకలో లేదు” అన్న జవాబు మాత్రమే వస్తోంది.

కలత చెందిన మనసుతో, M B కంపెనీ నంబరు ఉన్న వాట్స్ ఆప్ వివరాలు చూద్దామని ప్రయత్నిస్తే –

--డిలీట్ ఫర్ ఎవ్రి వన్ (delete for every one)’ అన్న పద్ధతిలో – అక్కడ ఉన్న సందేశాలను కంపెనీ వారు తొలగించేరు కాబోలు, కోటేశ్వరరావు మొబైల్ లో ఇప్పుడు ఏ సందేశాలు లేవు.

జరిగినవన్నీ మనసులో పరిశీలించుకుంటున్న కోటేశ్వరరావుకు --

ట్రేడింగ్ వ్యాపారం కోసం M B కంపెనీ వారికి తాను పంపిన అప్లికేషన్ ఫామ్ కాపీ కూడా ఉంచుకోలేదని ; ఆ అప్లికేషన్ ఫామ్ లో తాను సంతకం పెట్టనే లేదనీ ; ట్రేడింగ్ వ్యాపారంలో జరిగేది మాయ అవునో కాదో కానీ, M B కంపెనీలో జరిగేది మాయే అని ; తాను మదుపు పెట్టిన సొమ్ము, దానిమీద రావలసిన వడ్డీ, ట్రేడింగ్ వ్యాపారంలో వచ్చేయని చూపించిన లాభాలు కలిపి మొత్తం - అనగా ఒకకోటి మూడులక్షల పన్నెండువేలు పైన - ఆ కంపెనీ వారు తనని మోసగించి తీసేసుకున్నారని ; సతి సలహా వినక దురాశ పడిన తన అవివేకమే ఇంతటి అనర్ధానికి కారణం --

అని అర్ధమై, సైబర్ పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేసేందుకు ప్రయాణమయేడు.

ఆ సమయాన ఆయన పరిస్థితికి అనుగుణంగా,

కులగోత్రాలు చిత్రంలోని పాట – అయ్యయ్యో డబ్బులు పోయేనే

దూరంగా వినిపించసాగింది.

** శ్రీరామ **

మరిన్ని కథలు

Oke okkadu
ఒకే ఒక్కడు
- కందర్ప మూర్తి
Mitam
మితం
- ఆదిత్య ప్రణవ్
Bamma ki ichina mata
Bamma ki ichina mata
- Prabhavathi pusapati
Peddakodalu
పెద్దకోడలు
- మద్దూరి నరసింహమూర్తి
Parina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం
Tatayya salahalu
తాతయ్య సలహాలు
- గాయత్రి కులకర్ణి
Seshajeevitam
శేష జీవితం
- మద్దూరి నరసింహమూర్తి
Veda samskruthi
వేదసంస్కృతి
- టి. వి. యెల్. గాయత్రి.