
"దివ్యా..! నీకు పెళ్ళి చెయ్యాలని అనుకుంటున్నాము..నీకు ఎలాంటి అబ్బాయిని చూడాలో నువ్వే చెప్పు తల్లీ..?" అడిగాడు తండ్రి కాంతారావు
"డబ్బున్నా లేకపోయినా..మంచి చదువు, ఉద్యోగం, మంచి గుణం ఉండి ప్రేమగా చూసుకునే అబ్బాయిని చూడండి నాన్న..! అప్పుడే నా జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది" అంది దివ్య
"అంతా నీ బ్రమ..డబ్బుంటేనే సుఖం తల్లీ " అన్నాడు తండ్రి
"నేను ఒప్పుకోను నాన్నా..! మీరు అమ్మను పెళ్ళి చేసుకున్నప్పుడు మీకు ఎంత ఆస్తి ఉండేది..? మీరు మంచివారనే కదా అమ్మను మీకు ఇచ్చి చేసారు. మీరిద్దరూ హ్యాపీ గా ఉన్నారుగా. ఎందుకు మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు నాన్నా..?"
"ఆ రోజులు వేరే తల్లి..ఈ రోజుల్లో డబ్బు లేనిదే..కంటికి నిద్ర కూడా సరిగ్గా పట్టదు.."
"మీరు చెప్పింది నిజమే.. కానీ డబ్బుతో పాటు వచ్చే అహం, గర్వం, నిర్లక్ష్యం నా జీవితంలో వద్దు. మీరు చెప్పిందే నిజమైతే, డబ్బున్న జంటలు ఎవరూ విడిపోకూడదు...కానీ అలా జరగడం లేదే! ఈ రోజుల్లో డబ్బున్నవారు అందరూ మంచివారని కూడా ఎక్కడుంది చెప్పండి..? డబ్బుంటే సుఖాలు ఉంటాయి, అలాగే వ్యసనాలు కూడా, చెడ్డ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. డబ్బు ఎంత మంచి చేస్తుందో..అంత కన్నా ఎక్కువే చెడు చేస్తుంది.
చదువు, తెలివి ఉంటే, ఈ రోజుల్లో డబ్బు ఎలాగైనా, ఎప్పుడైనా సంపాదించవచ్చు. అదే అబ్బాయి మంచివాడు కాకపోతే, విడాకులు వరకు వెళ్లి ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. మళ్ళీ పెళ్ళి కాక కొంత మంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. నేను బాగా చదువుకున్నాను, అబ్బాయి బాగా చదువుకుని, మంచివాడైతే చాలు.. ఇద్దరం కలిసి సంపాదించుకుంటాం..ఆస్తులు కూడబెట్టుకుంటాం.
మా ఫ్రెండ్ గురించి చెబితే, మీకు ఇంకా బాగా తెలుస్తుంది. మా ఫ్రెండ్ తనకి నచ్చిన బాగా డబ్బున్న బిజినెస్ పర్సన్ ని పెళ్ళి చేసుకుంది. కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత, భర్త ఎప్పుడూ బిజినెస్, డబ్బు కోసమే జీవితం అన్నట్టుగానే జీవించేవాడు. ఆయనకి బిజినెస్ ట్రిప్స్ ఎక్కువ అయ్యాయి. డబ్బున్నా, ఏమిటి ప్రయోజనం..? ప్రేమ చూపించి, టైం స్పెండ్ చేసే భర్త దగ్గరలేడు. ఎప్పుడో గానీ మాట్లాడడానికి కూడా ఆయనకి తీరిక ఉండేది కాదు . ఏమైంది..? జీవితం మీద విరక్తితో పిచ్చెక్కి సూసైడ్ చేసుకుంది. ఇలా ఎన్నో ఉదాహరణలు.."
"సరే దివ్య..డబ్బు కన్నా ప్రేమ చాలా గొప్పదని ఒప్పుకుంటున్నాను. నీకు నచ్చిన అబ్బాయితోనే నీకు పెళ్ళి చేస్తాను.." అంటూ తను పెట్టిన పరీక్షలో నెగ్గిన కూతురిని చూసి ఆనందపడ్డాడు కాంతారావు
******