గుడివాడ - బొమ్మిరెడ్డి పల్లి ప్రమీల రవి

Guudivada

ఫాస్ట్ గా నడుస్తూ రఘు చేతికున్న వాచ్ లొ టైం చూస్తే యెనిమిది ఇరవై అయిదు. అమ్మో.. ఎనిమిదిన్నర వరకు క్యాష్ కాంటర్ లో ఉండాలి. ఇంకేం.. త్రాస్టుడు అంటే బ్రాంచ్ మేనేజర్ బ్యాంకింగ్ హాల్లో కస్టమర్ల ముందు రంకెలు వేస్తుంటాడు. ఎంత వేగంగా నడిచినా పది నిమిషాలు అవుతుంది. లక్కీగా సిటీ బస్ ఒకటి వెళుతూ స్లో అవడం గమంచి ఫుట్ బోర్డు మీదకి ఎక్కేసాడు. రఘు కాలేజీ డేస్ నించి ఫుట్ బోర్డు ట్రావెలింగ్ అలవాటే. అలాగే రన్నింగ్ బస్ నుండి దిగడం కూడా. అలా బ్రాంచ్ ముందు బస్ నుంచి దూకి బ్యాంక్ లో కి అడుగు పెట్టాడు. టైం చూస్తే యెనిమిది ముప్ఫై ఐదు. అనుకున్నట్లే మేనేజర్ త్రా స్టుడు ఎప్పటిలాగా అదే డైలాగు "ఏయ్.. రఘు మెన్డ్ యువర్ సెల్ఫ్.. డైలీ లేట్" అంటూ కస్టమర్స్, స్టాఫ్ ముందు పరువు తీసేసాడు. కానీ అది రఘు కు అలవాటైపోయింది. ఇంతకు ముందు రఘు ఒక విలేజ్ బ్రాంచ్ లో పనిచేసేవాడు. అక్కడ నో టెన్షన్. పబ్లిక్ పొద్దున్నే పొలాల కి వెళ్లి లంచ్ కి ఇంటికి వెళ్తూ మెల్లగా మధ్యాహ్నం బ్యాంక్ కి వచ్చేవారు. బ్యాంక్ కి లేట్ అయినా అడిగేవారు లేరు. ఆ అలవాటే ఇప్పుడు కష్టం అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి బ్రాంచ్ స్ప్లిట్ డ్యూటీ బ్రాంచ్. పొద్దున్న యెనిమిది ముప్ఫై నించి పదకొండు వరకు. సాయంత్రం నాలుగు నుంచి యెనిమిది వరకు. ఆ టైమింగ్సు కి రఘు ఇంకా అడ్జస్ట్ కాకపోవడమే ఈ లేటు కి కారణం. కౌంటర్ ముందు పది మంది వరకు అసహనంగా రఘు ని చూస్తున్నారు. అందులో ఒకరు "మీకయితే నొ టైమింగ్సు.. మేం ఒక నిమిషం లేట్ అయితే కౌంటర్ క్లోజ్డ్ అంటారు "అంటూ కామెంట్ చేసాడు. తప్పదు కనుక రఘు నోరు మూసుకుని త్వరగా పని ప్రారంభించాడు. రఘు చాలా ఫాస్ట్. మొత్తం రష్ నీ అరగంటలో క్లియర్ చేయడమే కాకుండా వేరే కౌంటర్ ముందు ఉన్న కస్టమర్స్ నీ కూడా క్లియర్ చే సేశాడు. ఒక గంట తర్వాత బ్యాంకింగ్ హాల్లో ఒక పురుగు కూడా లేదు. స్టాఫ్ అందరికీ మేనేజర్ కి కూడా రఘు వర్క్ ఎఫిసిఎన్సి తెలుసు. అందరూ ఫ్రీ అయి టీ కొట్టడానికి పక్కనే ఉన్న రెస్టారెంట్ కి వెళితే రఘు మాత్రం ముందు రోజు డే బుక్ కూడా ఒక అర గంటలో ట్యాలి చేసి ఇంకా ఏముంది అన్నట్లు మేనేజర్ వేపు చూసాడు. మేనేజర్ కన్నన్ నవ్వుతూ "నీకు కోపం తెప్పిస్తే గాని పనులు కావు. తక్కిన వాళ్ళ సంగతి తెలుసు కదా.. చలో చాయ్ తాగి వద్దాం "అంటూ కుర్చీ లోంచి లేచాడు. ఇంతలో ఫోన్మోగింది. కన్నన్ ఫోన్ విని హడావిడిగా స్టాఫ్ మీటింగ్ పెట్టీ " చూడండి ఈవెనింగ్ ఫోర్ కి హెడ్ ఆఫీస్ నుండి డాక్యుమెంట్ ఇన్స్పెక్షన్ కి AGM శాస్త్రి గారు వస్తున్నారు. అందరూ టైమ్ కి కౌంటర్ లో ఉండాలి. రఘు నీకే. పది నిమిషాలు ముందే వొచ్చేయి. నాకు ఇన్స్పెక్షన్ లో హెల్ప్ చెయ్యాలి డాక్యుమెంట్లు నువ్వే చూస్తున్నావుగా "అని ఆర్డర్ వేసాడు. రఘు టైం చూస్తే ఒంటి గంట. ఇంటికి వెళ్లి లంచ్ చేసి పరిగెత్తుతూ రావాలి. ఆలోచన లో ఉన్న రఘు నీ చూస్తూ హెడ్ క్యాషియర్ రావు గారు "ఇప్పుడు పరిగెడుతూ ఇంటికెళ్ళి ఏం వస్తావు గాని నా క్యారియర్ లో తినెయ్. కొత్త ఆవకాయ మొన్ననే .మా మామగారు గుడివాడ నుంచి పంపించారు ముద్ద పప్పు తో బలేగా వుంటుంది." అన్నాడు. రావు గారు మధ్యాన్నం ఇంటికీ వెళ్ళ లేక రోజూ క్యారియర్ తెచ్చుకుంటాడు. ఆయన మాటల్లో గుడివాడ పేరు లేకుండా ఒక్క వాక్యం కూడా ఉండదు. రోజూ ప్రతిదానికీ మా'గుడివాడలో 'అంటూ గొప్పలు చెప్పడం ఆయనకి అలవాటు. ఆయన్ని ఆట పట్టించడానికి రఘు గుడివాడ నీ క్రిటిసైజ్ చేస్తుంటాడు . రఘు ఇంట్లో 'అమ్మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు 'అని చెప్పి ఇంటికీ బయలు దేరాడు. రఘు నీ చూడంగానే " ఏమిట్రా ఇవాళ ఇంత లేటు త్వరగా భోజనం చేయి" అంటూ వాళ్ళ అమ్మ రుక్మిణి తొందర పెట్టింది. రఘు అశ్చర్యంగా "బ్యాంక్ నాలుగ్గంటలకు తొందర దేనికి?" అన్నాడు. " అయినా చూస్తుంటే మీరు ఎక్కడికో తయారయి వెళ్తునట్లున్నారు. " అన్నాడు. రఘు వదిన సుందరి అందుకుని "ముందర భోంచేయరా..చెప్తాను" అంది నవ్వుతూ. అలా రఘుని తొందర చేసి భోజనం అయిందనిపించి అసలు విషయం చెప్పారు. ఇప్పుడు మూడున్నర గంటలకి పెళ్ళి చూపుల అట. పెళ్లి వారు నిన్న రాత్రి ప్రత్యేకంగా పిల్లని చూపించడానికి వచ్చారు ట మళ్లీ రాత్రి బండికి వెళ్లి పోవాలట. రయ్య్ మని లేచాడు రఘు ." ఈవెనింగ్ షిఫ్ట్ కి నాలుగు గంటలకల్లా నేను బ్యాంక్ కి వెళ్ళాలని తెలుసుగా. మరి ఇప్పుడు ఈ చూపులేమిటి. నాకు కుదరదు" అన్నాడు. " అరేయ్ వాళ్ళు ఊరి నుండి వొచ్చారు రా.. నువ్వు అలా అనకు" అంది రుక్మిణి. వెంటనే సుందరి " ఒక పని చేద్దాం. ఇప్పుడు రెండు అవుతోంది. నువ్వు కూడ తయారయి మనం బయలుదేరే సరికి రెండున్నర. వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి మూడు అనుకో, వెంటనే పిల్లని చూసి నువ్వు ఆటో లొ బ్యాంక్ కి వెళ్ళిపో. నాలుగు గంటలకల్లా ఆఫీసు లొ ఉంటావు. మేము మెల్లిగా ఇంటికి వెళ్తాము. పాపం ఆడ పిల్లవారు ఎదురు చూస్తుంటారు" అంది. వీళ్ళు వదిలేటట్టు లేరు అనుకుంటూ అర్ధంగీకరం తొ బయలు దేరాడు రఘు. అదేంటో ఒక్క ఆటో కూడా దొరక లేదు. టైం పరిగెడుతోంది. రెండూ ముప్పావ్.. సరే ఇవాళ అయ్యేటట్లు లేదు బతికిపోయా బ్యాంకు కి టైం లో టెన్షన్ లేకుండా వెళ్ళచ్చు అనుకున్నాడు రఘు. ఇంతలో బుడ్డి గాడు అదే రఘు వాళ్ళ అన్నయ్య కొడుకు " అమ్మా అదిగో ఆటో" అంటూ గంతులేసాడు. ఇక తప్పక ఆటో లొ పెళ్లివాళ్ళ ఇంటికీ వచ్చేసరికి మూడుగంటల పది నిమిషాలు. వాళ్ళ మర్యాదలు అయేసరికి మరో పది నిమిషాలు. సుందరి రఘు ఆరాటం చూసి " కొంచం అమ్మాయిని చూపించండి మా రఘు బ్యాంక్ కి వెళ్ళాలి" అంది. వచ్చినప్పటి నుంచీ బాగా సుత్తి కొడుతున్న ఒక పెద్ద మనిషి" అదెలా! వర్జ్యం మూడు నలభై వరకు వుంది. ఆ తరువాతే పెళ్ళి చూపులు." అని తేల్చేశాడు. అసహనంగా చూస్తున్న రఘు వొంక చూసి సారీ అన్నట్లు మొహం పెట్టింది సుందరి.రుక్మిణి వాళ్ళ తొ ఏవో బీరకాయ పీచు సంభందాలు కలి పేసుకుంటోంది. ఇది గమనించిన పెళ్ళికూతురు అక్క తులసి మెల్లిగా వాళ్ళ నాన్నగారితో ఏదో మాట్లాడి పెళ్ళికూతుర్ని తెచ్చి కూర్చో బెట్టింది. రుక్మిణి, సుందరి పెళ్ళికూతురి పెద్ద జడ తొ సహా అన్నీ పరీక్షగా చూస్తూ ఏవేవో ప్రశ్నలు గుప్పిస్తున్నారు. రఘు దృష్టి అంతా వాచీమీదే. అసలు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చూసుకున్నారో లేదో, ఇలా కాదు అనుకుని తులసి ఇద్దరిని పక్క రూమ్ లొకి తీసుకెళ్ళి ఏకాంతం గా కూర్చోపెట్టి "మీరు మాట్లాడుకునిత్వరగా విషయం తేల్చేస్తే మీరు ఆఫీసుకు వెళ్లిపోవచ్చు" అంటూ వెళ్ళిపోయింది. రఘు దృష్టి అంతా టైమ్ మీదే. రఘు వాలకం చూసి లాభం లేదు అనుకుని పెళ్ళికూతురు " మీరు యే బ్యాంక్" అడిగింది. " స్టేటు బ్యాంకు" " నేను ఏమ్ కామ్ " నిశ్శబ్ధం " మీరు ఏదైనా అడగండి" పెళ్లి కూతురు " ఆహా..మీ పేరు" " పరిమళ" " మీ ఊరు " " గుడివాడ " షాక్.. హెడ్ క్యాషియర్ రావు గారిలా వీళ్లదీ గుడివాడ యేనా.. "ఏ కాలేజీలొ చదివారు" అడిగాడు రఘు. "ఏ ఎన్ ఆర్ కాలేజ్ గుడివాడ" మళ్ళీ గుడివాడ. బాబోయ్ ఇదేం గుడి వాడ రా బాబూ అనుకుంటూ ఆమె తొ "నాకు బ్యాంక్ కి టైం అవుతోంది అండి .. మా వాళ్ళు అన్నీ మాట్లాడుతారు . నాకు బ్యాంకు లొ ఇన్స్పెక్షన్ ఉంది" అంటూ లేచి బయటకు వచ్చిన రఘు టైమ్ చూస్తే మూడు నలభై అయిదు. తల్లి వైపు చూస్తూ" మీరు తర్వాత మెల్లిగా రండి నేను బ్యాంక్ కి వెళ్ళాలి" అంటూ పెళ్లివారు ఏదో చేపుతున్నా హడావిడిగా బ్యాంక్ కి బయలు దేరిపోయాడు రఘు. అతని దృష్టి అంతా బ్యాంక్ మీదే. ఆటో లో కూర్చున్నాక అరె పెళ్లివాళ్ళు యేమనుకున్నారో ఆ అమ్మాయి ఏమి అయినా నొచ్చు కుందేమో అనుకుంటూ బ్యాంక్ కి వెళ్లేసరికి నాలుగు అయిదు. మళ్లీ త్రాస్తుడు అదే మేనేజర్ కన్నన్ కోపం తో ఊగి పోతూ" యూ నెవర్ మేన్డ్ "అంటూ క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్షన్ కి వచ్చిన శాస్త్రి గారి కి డాక్యుమెంట్లు చూపించడం లో పడి పోయాడు రఘు. రఘు డాక్యుమెంట్ మైంటెనెన్స్ చూసి శాస్త్రి మెచ్చు కుంటూ మేనేజర్ కన్నన్ తొ "వెరీ గుడ్. ఈ పిల్లాడు బాగా మెయింటెయిన్ చేస్తున్నాడు అందుకే మొత్తం డాక్యుమెంట్ నీ గంటన్నర లో చూపించాడు.కామెంట్ చేయడానికి ఏమి లేదు. గివ్ హిమ్ ఎక్సలెంట్ రిపోర్ట్" అంటూ తనకి షాపింగ్ పని ఉందని తన భార్యా వెయిట్ చేస్తో ఉంది అని సెలవు తీసుకున్నాడు. ఇన్స్పెక్షన్ అంటె భయ పడిన కన్నన్" నాకు తెలుసు రఘు నువ్వు గుడ్ వర్కర్ అని, ఓకే నీ కౌంటర్లో వర్క్ చూసుకో" అంటూ ఊపిరి తీసుకున్నాడు. అప్పటికే టైం అయిందని కౌంటర్స్ అన్ని క్లోజ్ చేసేశారు. అప్పుడు దిగాడు ఒక కస్టమర్. అయితే ప్యూన్ జలాల్ ఆ కస్టమర్ నీ తరిమేస్తున్నాడు క్లోజ్ అయిపోయింది అని. కస్టమర్ చూడాబోతే రైతు బిడ్డలా పంచా జూబ్బా తొ మాసిన గడ్డం చూడంగానే రఘు కి మొన్న ఒక డిపాజిటర్ అన్నమాట ..'అదే మేము ఒక్క నిమిషం ఆలస్యం అయితే మీరు ఊరుకుంటారా.. క్లోజ్ అని చెప్పారా! ' గుర్తుకొచ్చింది.. వెంటనే రఘు "జలాల్.. అతన్ని లోపలకు పంపు..నేను మాట్లాడుతాను" అన్నాడు ఆ కస్టమర్ పేరు వెంకట్రామయ్య , అతను ఐదు ఏళ్ల క్రిందట పది వేలు ఫిక్సెడ్ డిపాజిట్ చేశాడు. ఇప్పుడు అది మెచూరు అయింది. వాళ్ళ అమ్మాయి పెళ్ళి వొచ్చే వారం. అందుకు డబ్బులు తీసుకోడానికి వాళ్ళ విలేజ్ నుండి వచ్చాడట. మళ్లీ రాత్రి ట్రెయిన్ కి వెళ్లి పోవాల ట. పాపం అనుకుని రఘు తన కౌంటర్ కాక పోయినా నెత్తి మీద వేసుకుని మిగిలిన స్టాఫ్ వద్దు అంటున్న ఓల్డ్ రికార్డు లోంచి అకౌంట్ ఓపెనింగ్ ఫారం స్పెసిమెన్ సిగ్నేచర్ స్వయంగా తీసి వడ్డీ లెక్క కట్టి మొత్తం పదహారు వే లు అని తేల్చాడు. క్యాష్ కౌంటర్ క్లోజ్ అయినా హెడ్ క్యాషియర్ రావు గారిని పేమెంట్ కి రిక్వెస్ట్ చేశాడు రఘు. రావు గారు " మొత్తం నువ్వే చేస్తున్నావుగా పేమెంట్ బాధ్యత కూడా తీసుకుని పేమెంట్ చేసేయి. హ్యాండ్ బ్యాలెన్స్ కూడా ట్యాలీ చేసాయి" అంటూ క్యాష్ క్యాబిన్ కీస్ రఘు చేతిలో పెట్టీ, దొరికింది కదా అనుకుంటూ సిగరెట్ తాగడానికి బయటకు వెళ్ళిపోయాడు. తప్పదు అనుకుంటూ మొదలుగా కస్టమర్ నీ పంపాలని అతనికి ఇవ్వలసిన పేమెంట్ పదహారు వేలు లెక్కపెడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తూ కస్టమర్ తనకి అన్నీ వంద రూపాయల నోట్లె కావాలని రిక్వెస్ట్ చేసాడు. కొంచం విసుగ్గా లెక్కపెట్టిన క్యాష్ పక్కకు పెట్టీ మొత్తం వందల కట్టలు పే చేసేసాడు. ట్రెయిన్ టైమ్ అవుతోంది అంటూ కస్టమర్ గబ గబా బయట వెయిట్ చేస్తున్న ఆటో లొ స్టేషన్ కి బయలు దేరి పోయాడు. తీరిగ్గా కూర్చుని రఘు ఆ రోజు క్యాష్ బ్యాలెన్స్ ట్యాలి చేయడానికి ప్రయత్నిస్తే నాలుగు వే లు తక్కువ వస్తోంది. ఎన్నిసార్లు చూసినా, అందరూ వెరిఫై చేసినా నాలుగు వే లు షార్ట్. వోచెర్స్ వెరిఫై చేస్తుంటే అఖరుగా చేసిన పేమెంట్లో పదహారు వేలకి బదులు ఇరవై వే లు ఇచ్చినట్లుగా తేలింది. తల పట్టుకున్నాడు రఘు. స్టాఫ్ అందరూ " చెప్తే వినవుగా. అన్నిట్లో తల దూరుస్తావ్, వాడెవడో మన రెగ్యులర్ కస్టమర్ కాదు. మన వూరు కాదు. పైగా వచ్చింది లేటు." అంటుంటే రఘు కి ఇంట్లో తల్లి మీద, వొదిన మీద ఆఖరుకు ఆ పెళ్ళి వారి మీద కోపంతో వొళ్లు మండిపోయింది. తన అకౌంట్ లొ మహా వుంటే వేయి రూపాయిలు ఉంటుంది నెల చివర కనుక. రఘు నీ చూసి జాలి పడి మేనేజర్ కన్నన్ " సరే ఏం చేస్తావు, నా అకౌంట్ నుండి తీసుకో. సాలరీ లో ఇద్దువు గాని. లేట్ రావడం వల్ల టెన్షన్ . దాంతో బుర్ర సరిగా పని చేయక తప్పులు అవుతాయి. సర్వీస్ చేయాలనుకుంటే పది నిమిషాలు ముందే రావాలి " అంటూ క్లాస్ పీకాడు. ఇంటికి వచ్చాక అదే మూడ్ లొ రఘు తన కోపం తల్లి మీద చూపించాడు. వొదిన సుందరి పెళ్ళికూతురు కబుర్లు చెబుతున్నా పట్టించుకోకుండా తన గదికి వెళ్లి ముసుగు తన్నేసాడు. మర్నాడు బ్యాంకు లో చాలా డల్ గా పనిచేస్తున్న రఘు నీ చూసి హెడ్ క్యాషియర్ రావు గారు "రఘూ..కాంటర్ క్లోజ్ అయ్యాక నా దగ్గర కి రమ్మని" చెప్పి తన క్యాబిన్ కి వెళ్ళిపోయాడు. అలాగే రఘు తన పని అయిపోగానే రావు గారి క్యాబిన్ కి వెళ్ళాడు. అప్పటికే రావు గారు సీరియస్ గా ఏదో రాసు కుంటా కళ్ళతో కూర్చో అని సైగ చేశారు. పావుగంట తర్వాత మెల్లిగా " చూడు రఘు నిన్న నిన్ను తలచు కుంటే బాధ కలిగింది. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నిన్న ఎక్సెస్ పేమెంట్ తీసుకున్న కస్టమర్ కి నీ ఆర్థిక పరిస్థితి వివరిస్తూ ఒక రేక్వెస్టింగ్ లెటర్ రాశాను నువ్వు చూసి ఒకే అంటే పంపిద్దాము" అంటూ రఘు చేతికి అందించాడు. ఆ లెటర్లో" అయ్యా, మీకు గుర్తు ఉండే ఉంటుంది నిన్న మీరు బ్యాంకు మూసేసిన తరువాత బ్యాంక్ కి వచ్చి తమ కూతురు పెళ్లికి తమ ఫిక్సడ్ డిపాజిట్ డబ్బులు అర్జెంట్ గా కావాలని కోరారు. బ్యాంక్ కౌంటర్ క్లోజ్ అయినా నా కౌంటర్ కాకపోయినా మీ పరిస్థితి అర్థం చేసుకుని వేరే స్టాఫ్ నీ ఒప్పించి మీ డబ్బులు ఇప్పించాను. ట్రెయిన్ కి టైం అవుతోంది అని, వందనోట్లె కావాలని మీరు హడావిడి చేయండం తొ తొందరలో మీకు పది వేలు అసలు ఆరు వేలు ఇంటరెస్ట్ కలుపుకుని పదహారు కి బదలు రెండు వందల కట్టలు అంటే ఇరవై వేలు ఇవ్వడం జరిగింది. ఇది నా పొరపాటే . మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే నాకు నాలుగు వేలు నష్టం జరిగింది. నేను ఒక చిన్న గుమాస్తా. నాలుగు వేలు నా జీతంలో కట్ చేస్తే ఎంత ఇబ్బందో ఆలోచించి మీరు ఆ నాలుగు వేలు పోస్టల్ మనిఆర్డర్ ద్వారా పోస్టల్ వారి చార్జీలు మినహాయించి నా కింది అడ్రస్ కిపంపగలరు. ఇట్లు విధేయుడు రఘు. ఉత్తరం రాసిన సరళి నచ్చి రఘు చాలా బావుంది కానీ ఆయన అడ్రస్ ఎలాగ మరి అంటూ డౌట్ వ్యక్తం చేశాడు. గట్టిగా నవ్వి రావుగారు" బాబూ. అకౌంట్ ఓపెనింగ్ ఫారం లో ఉంటుంది. అది తీసుకురా ఇప్పుడే లెటర్ పోస్ట్ చేద్దాం ఆలస్యం ఎందుకు" అన్నారు. వెంటనే రఘు నిన్నటి వోచర్స్ నుంచి వెతికి ఓపెనింగ్ ఫారం తెచ్చాడు. రావు గారు "ఆ.. అయన పేరు , అడ్రస్ చెప్పు"అన్నాడు. " ఆయన పేరు మద్ది వెంకటరామయ్య" " అడ్రస్" "సత్యనారాయణ పేట.. గుడివాడ" అంటూ తల పట్టుకున్నాడు రఘు .ఇదేం గుడివాడ రా బాబూ అనుకుంటూ " . సార్..నాకు గుడివాడ మీద నమ్మకం లేదు.. అంత దూరం నుండి డబ్బు పంపుతాడా" డౌట్ వ్యక్తం చేశాడు రఘు. రావు గారు ఉత్సాహంగా " గుడివాడ.. మా వాడే ..మరి ఇంత దూరం వచ్చి అకౌంట్ ఓపెన్ చేయడము ఏంటీ.. అయినా గుడివాడ వాళ్ళు మంచి వారయ్యా.. నీ డబ్బులు వచ్చేస్తాయి. వెంటనే లెటర్ పోస్ట్ చేసేయి" అంటూ లంచ్ కి వెళ్లి పోయాడు. రఘు ఉత్తరం పోస్ట్ చేసి నిట్టూరుస్తూ రఘు ఇంటికి బయలు దేరాడు. ఇంట్లో ఒకటే గొడవ పెళ్ళికూతురు గురించి 'ఏమ్ ఆలోచించావు, అమ్మయి జడ చాలా పొడవుగా ఉంది అంటూ' అమ్మ , వదిన సుందరి ' అమ్మయి బాగా చదువుకున్నది' అంటూ. రఘు అసలే బ్యాంకు లో సంఘటనకి మూడిగా మౌనంగా తప్పించు కుంటు గడిపేశాడు ఒక వరం రోజులు. ఇంట్లో కూడా లాభం లేదని అడగడం మానేశారు. ఆ రోజు ఈవెనింగ్ షిఫ్ట్ లో సీరియస్ గా పనిచేస్తున్న రఘు భుజం మీద చెయ్యి పడటంతో కౌంటింగ్ ఆపి వెనక్కి చూసాడు. హెడ్ క్యాషియర్ రావు గారు నవ్వుతూ " ఏంటీ.. మా గుడివాడ వాళ్ళ మీద నమ్మకం లేదా..చూడు పాపం మా గుడివాడ వెంకట్రామయ్య ఆయన తీసుకున్న ఎక్సెస్ పేమెంట్ మనిఆర్డర్ పంపించాడు." అంటూ రఘు చేతిలో డబ్బు రసీదు పెట్టాడు. ఒక్క సారి ఆశ్చర్య పడి వెంటనే ఆనందంతో కేక వేశాడు. ఉలిక్కి పడి స్టాఫ్ అంతా ఏమయింది అనుకుంటూ అసలు విషయం తెలవగానే వెంటనే పార్టీ కావాలంటూ పట్టుపట్టారు. రఘు సంతోషంతో కేక్స్ సమోసాలు తెప్పించి హుషారుగా ఇంటికి బయలు దేరాడు. ఇంటి బయట రెండు మూడు వెహికల్స్ ఆగి ఉండడం చూసి ఎవరా అనుకుంటూ లోపలకి వచ్చి చూస్తే పది రోజుల కింద చూసిన పెళ్ళి వారు. అందులో పెద్దమనిషి అప్పటికే ఏదో సుత్తి కొట్టేస్తున్నాడు. రఘు అన్నయ్య హరి పాపం బలి అయిపోతున్నాడు ఆయన సూత్తికి. రఘుని చూసి "రావయ్యా.. నీ కోసమే ఎదురు చూస్తున్నాం" అంటూ మా ఇంటికి నన్నే ఆహ్వానిస్తున్నాడు అనుకుంటూ తల వంచుకుని రఘు హాల్లో కి వెళ్తే అక్కడ పెళ్ళికూతురు, వాళ్ళ అక్క తులసి తొ అమ్మా వదిన అదరకొట్టేస్తున్నారు. అయోమయంగా తన రూమ్ లొకి వెళ్లి పోయాడు రఘు. వెనకే సుందరి వచ్చి "అరేయ్.. వాళ్ళు గుడివాడ నుంచి వచ్చారుట మన సంబంధం బాగా ఇష్ట పడి సాయంత్రం ఫోనే చేశారు. నీకేమో తీరడం లేదు అందుకే అన్నయ్య తొ మాట్లాడి మన ఇంటికే రమ్మన్నాను. నాకు, మీ అమ్మ కి, మీ అన్నయ్య కి కూడా నచ్చింది. వాళ్ళ అన్నయ్య రేపు అమెరికా వెళ్ళిపోతున్నాడుట. అందుకే అందరూ వచ్చి నువ్వు కుడా ఓకే అంటే నిశ్చయ తాంబూలాలు తీసు కుందామని" అని తన మనసులో మాట చెప్పేసింది. తలుపు సందులోంచి కనపడుతున్న పరిమళ నీ చూడంగానే రఘు కి అర్థం అయింది తనకి గుడివాడకి రాసి ఉందని. రఘు మొహం లో ఇష్టం గ్రహించిన సుందరి " తెలిసింది లేవోయి త్వరగా డ్రెస్ చేసుకుని వచ్చేయి..తాంబూలాలు తీసుకుందాం.. వాళ్ళ అన్నయ్య మళ్లీ ఇప్పట్లో రాడుట" అంటూ శుభవార్త అందరికీ చెప్పడానికి పరిగెత్తింది. అప్పుడే పరిమళ కూడా సిగ్గుతో రఘుని చూస్తుంటే ' గుడివాడ బాగానే అచ్చి వచ్చిందని 'హెడ్ క్యాషియర్ రావు గారితొ పాటు తను కూడా రేపట్నించి గుడివాడకి తాన తందాన అనాలా...అనుకుంటూ చిరు నవ్వు విసిరాడు పరిమళ మీదకి.

మరిన్ని కథలు

Pareeksha
పరీక్ష
- తాత మోహనకృష్ణ
M B Company
M B కంపెనీ
- మద్దూరి నరసింహమూర్తి
A1 farmula
ఏ1 ఫార్ములా
- వై.కె.సంధ్యా శర్మ
Oke okkadu
ఒకే ఒక్కడు
- కందర్ప మూర్తి
Mitam
మితం
- ఆదిత్య ప్రణవ్
Bamma ki ichina mata
Bamma ki ichina mata
- Prabhavathi pusapati
Peddakodalu
పెద్దకోడలు
- మద్దూరి నరసింహమూర్తి
Parina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం