
“అబ్బాయిలూ పండగకు వచ్చిన మీకు ఏమి కావాలో చెప్తే చేసి పెడతాను” రమణమ్మగారి అమ్మతనం.
“ఆరు నెలుగా నేను చక్కెర తీసుకోవడం బాగా తగ్గించేసేనమ్మా”
“నువ్వేమంటావురా చిన్నోడా”
“నాలుగు నెలలుగా నూనె నెయ్యి వాడకం బాగా తగ్గించేసేనమ్మా”
“ఒకడు పంచదార వద్దని ఇంకొకడు నూనె నెయ్యి వద్దని అంటే పండగ నాడు ఎలారా”
“ఇప్పుడు మేము చెప్పింది గుర్తుంచుకొని ఏమి చేస్తావో చెయ్యమ్మా” అబ్బాయిల ముక్తకంఠం.
“ఏమండీ విన్నారా వీరి మాటలు”
“విన్నాను, కానీ ఇప్పుడు వారికోసమంటూ ఏం చేస్తావు మరి”
“వేరే చేయడానికేముందండీ, చిన్నప్పుడు వీరు లొట్టలు వేసుకుంటూ తినే ముత్యాలన్నమే పెడతాను”
“ముత్యాలన్నం అన్న పేరు విన్నట్టే అనిపిస్తోంది. కానీ, ఆరో తరగతి చదువు నుంచే హాస్టల్ వాతావరణంలో పెరగడంతో అదేమీటో అసలు గుర్తుకు రావడం లేదమ్మా” అన్నదమ్ముల కుతూహలం.
“తినబోతూ రుచి అడగడమెండుకు అన్నారు పెద్దలు. రేపు ఉదయం మీకు అదే పెడతాను. ఇన్నాళ్ల తరువాత కూడా అది మీరు లొట్టలు వేసుకొని తినడం ఖాయం”
పండగనాడు ఉదయమే స్నానపానాదులు కావించుకొని వచ్చిన కొడుకులిద్దరినీ కూర్చోబెట్టిన రమణమ్మగారు – “ఏమండీ మీరిలా వచ్చి పిల్లలిద్దరి కళ్ళకు గంతలు కట్టండీ” అని కేక వేసేరు.
తనయులిద్దరి కళ్ళకు తండ్రి నవ్వుతూ గంతలు కడుతూంటే, పిల్లలిద్దరూ పండగ ముచ్చట భలేగా ఉందనుకుంటూ సరదాగా గంతలు కట్టించుకున్నారు.
ఐదు నిమిషాల తరువాత –
“పెద్దోడా చిన్నోడా, మేము మీ ఇద్దరి కళ్ళకు గంతలు విప్పుతున్నామిప్పుడు – ఒకటి, రెండు, మూడు” -- అంటూ తండ్రి పెద్దకొడుకు గంతలు తల్లి చిన్నకొడుకు గంతలు ఒకేసారి విప్పగానే –
అబ్బాయిలిద్దరూ వారి కంటి ఎదురుగా ఆకుపచ్చటి తామరాకు మీద ఉన్న మల్లెపూవు లాంటి చల్ది అన్నము, ఆ అన్నం మీదున్న నల్లని వాము, అన్నాన్ని ఆనుకొని ముత్యాల్లా మెరుస్తూ చుట్టూరా కదులుతూన్న తరవాణి చుక్కలు చూసుకొని --
పండగ ఆనందం అంతా ఈ ముత్యాలన్నంలోనే ఉందంటూ తమ ఇప్పటి వయసు కనుమరుగైపోయి చిన్నతనం గుర్తుకు వస్తూంటే, చిన్నప్పటిలాగే లొట్టలు వేసుకుంటూ ‘ఎంత బాగుందో’ అంటూ తినసాగేరు.
** శ్రీరామ**