
చుట్టూ కొండల మధ్య పచ్చని ప్రకృతి నడుమ ఉంది అమ్మ పాలెం గ్రామం. ఆ గ్రామంలో పొట్టి దొర, పొట్టమ్మ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కొడుకు విజయశంకర్. అతడికి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప. బాబుకు ఆరేళ్ళు. పాపకి మూడేళ్లు. బ్రతుకు తెరువుకోసం పట్నంలో ఉద్యోగం చేస్తూ భార్యా పిల్లలను పోషిస్తున్నాడు విజయ్ శంకర్.
తల్లిదండ్రులు కొడుకుతో పట్నం వెళ్ళడానికి ఇష్టపెట్టుకోలేదు. స్వగ్రామంలో ఉన్న పూరి పాకలో సంబంధీకులందరి మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. సంక్రాంతి పండుగకు విజయశంకర్ తన భార్యా పిల్లలతో పల్లెకు చేరుకున్నాడు. మనవల రాకతో ఆ ఇంట్లో సందడి నెలకొంది. మనవల ఆట పాట చూసి తాత నాన్నమ్మ ఎంతో సంతోషించారు. ఉన్నంతలో ఉన్నంత మనవల కోసం జంతికలు, అరిసెలు మొదలగు పిండి వంటలు చేసింది పొట్టమ్మ.
ఇంట్లో పాడి పశువులు ఉండడం వల్ల పాలకు లోటు ఉండేది కాదు. రెండు పూటలా పాలు కాచి మనవలకు ఇచ్చేది పొట్టమ్మ. మనవడు చక్కగా గ్లాసుతో పాలు తాగేవాడు, మనవరాలు చిన్నది పాలు తాగడం రాక ఒలికిపోతాయి కదా అని తాగించబోతే "నేనే గ్లాసు పట్టుకుని తాగుతానని" మారం చేసింది. మనవరాలిని ఏడిపించడం ఇష్టం లేక పాలగ్లాసును మనవరాలి చేతికి ఇచ్చింది. మనవరాలు సరిగ్గా పట్టుకోలేక గ్లాసులో పాలన్నీ కిందికి ఒలికిపోయాయి. “అయ్యో పాలన్నీ నేల పాలు చేసావు కదే!” అంది పొట్టమ్మ. “అదేంటి నానమ్మా ఇవి ఆవు పాలు కదా!” అన్నాడు మనవడు. “నేలలో లేదా మట్టిలో కలిసిపోవడాన్ని నేలపాలు, బూడిదలో పోసిన పన్నీరు అంటాం. వాటిని మనం తిరిగి తీసుకురాలేము. ఆ పాలు వృధాగా పోయినట్లే.” అంది పొట్టమ్మ మనవడితో. నాటి నుంచి తినే పదార్థాలు కానీ, ద్రవరూపంలో ఉన్నవి కానీ నేల మీద పడి వృధా అయిన సందర్భంలో నేల పాలయ్యాయి అనే జాతీయం వాడుతున్నాము” అని చెప్పింది పొట్టమ్మ.