
ఉదయం 5.30 కి సెల్ఫోన్ అలార్మ్ మ్రోగడంతో నిదుర మేలుకొన్న మూర్తి, రోజూ లాగానే, దేవుని గది లోకి వెళ్లాడు. ఇష్ట దైవం అయిన రాముల వారి పటంలో జూచి నమస్కరిస్తూండగా, ‘మూర్తి! ఇక మనం వెళ్దామా,’ అని రాముల వారు అడుగగా, ‘ అలాగే’ అంటూ వెంట నడిచాడు మూర్తి. ‘అయినా, నన్ను తీసుకు వెళ్లడానికి యమకింకరులో, దేవ దూతలో రావాలి కాని, అవతార పురుషులు, తమరు వచ్చారే!’, అన్నాడు మూర్తి, చిరు నవ్వు దాచుకుంటూ. ‘నీ ఇష్ట దైవాన్నంటావుగా! నీ ముఖ్యమైన ప్రయాణంలో నీకు తోడౌదామనే వచ్చాను’, అన్నారు స్వామి మంద హాసంతో. తాను శరీరం విడిచి పెట్టినట్టు తెలుసుకున్న మూర్తి, ‘భూమే గా కర్మస్థలము. భూ నిష్క్రమణ, ముఖ్య ప్రయాణం యెలా అయ్యింది స్వామి!’ అని అడిగాడు. ‘అందరికీ కాక పోవచ్చు. కానీ, తరుచూ జ్ఞాపకాల నీడలో తిరిగే నీకు ఇది ముఖ్య ప్రయాణమే! నీతో నడచి, మాటాడి, ఆటలాడి, పోట్లాడి, మనసూ, మంచి పంచుకోని వెళ్లిపోయిన కొందరిని నీకు మళ్లీ చూపించడం ఈ ప్రయాణంలో ఒక భాగం’, అన్న దైవం పలుకులకు నిశ్చేష్టుడయ్యాడు మూర్తి. ఎంత దయ తన మీద స్వామికనుకొని, మురిసి పోయాడు మూర్తి.
స్వామితో నడుస్తున్న మూర్తికి శీను కనిపించాడు. ప్రాణ స్నేహితుని చూడ గానే గట్టిగా కౌగిలించుకోని, ఎలాగున్నాడని అడిగితే, అంతా బాగేనని శీను అన్నాడు. ‘ఒరేయ్! నీ కొడుకు పెళ్లైంది, తెలుసా’, అని అడగితే, ‘ఇక్కడ నుండి అంతా తెలుస్తుంది. మీ వారి అమ్మాయే,’ అంటూ నవ్వేసాడు శీను. ఆ నవ్వు మళ్లీ ఆరేళ్ల తరవాత చూసి చాలా సంతోషించాడు మూర్తి. స్వామి చేయి పట్టుకోని నడుస్తున్న మూర్తికి, తన తండ్రి కనిపించారు. తొమ్మిదేళ్ల తరువాత తండ్రిని చూసే సరికి, కళ్లల్లో నీళ్లు తిరిగాయి, మూర్తికి. చాలా నీరసంగా నిష్క్రమణ చేసిన తండ్ర మళ్లీ సైకిలెక్కి రావడం చూసి ఆశ్చర్య పోయాడు మూర్తి. ఆయన తండ్రి మట్టుకు ఎటువంటి స్పందనా లేక, నింపాదిగా కొడుకు దగ్గరికొచ్చీ, ఇప్పటి భారత రాజకీయ పరిస్థితుల పై తనదైన ధోరణిలో ఒక చురక విసిరారు. ‘ఈ భారత్ జోడోలు, వయసు మళ్లిన వాళ్ల నిస్సార ఆధిపత్యాలు, ఈపార్టీని ఏ గట్టూ ఎక్కించదు’, అన్నారు మూర్తి తండ్రి. ‘ ఏం నాన్న, తొమ్మిదేళ్ల తరవాత కలుసు కున్న కొడుకని కుశలమడగక, ఏవో అనవసర రాజకీయం మాట్లాడుతున్నావే!’ ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి. వెంటనే స్వామి ‘మమతా వికారములు ఇక్కడ వుండవు. నీవు వచ్చావనే సత్యం వెనుక ఇక్కడి వాళ్లకి ఎటువంటీ ఆపేక్షలూ ఉండవు. అంత మాత్రం చేత సంగతుల మీద అవగాహన, ఆ వ్యక్తిగత ఆలోచనల వలన జనించిన అనాపేక్షిత భావాలను వ్యక్త పరచడానికి వెనకాడరు’, అన్నారు స్వామి. ‘నాన్న,అమ్మ ఎక్కడుంది’, అడిగాడు మూర్తి. ‘కాలం దారిలో కదా మన పయనం. వారి వారి భూ నిష్క్రమణ క్రమంలో వారిని కలుద్దాం’, అన్నారు స్వామి. ‘అమ్మ, నాన్న లా కాదు. తన అభిప్రాయాలను అంత ఖచ్చితంగా చెప్పేదికాదు. ‘ఎమ్ ఎస్’ కన్నా ‘ఎమ్ ఎల్ వి’ పాటంటే చాలా యిష్టం. ఇంకొందరివి నచ్చేదికాదు. అయినా తన అయిష్టత కన్నా యష్టాన్నే ఎక్కువగా, చెప్పేది,’ అనకున్నాడు మూర్తి. అంతలో తన తల్లి కనిపించింది. ‘అప్పటి ఆ నవ్వు పదహారేళ్లైనా ఆలాగే ఉన్నది. ధనుర్మాసం కావటం వల్ల ఏదో ముగ్గుతో కుస్తీ పడుతోంది అమ్మ’, అని అనుకుంటూనే జానకమ్మ దగ్గరకు వెళ్లాడు మూర్తి. ‘అమ్మా’, అంటూ ఆర్దృతతో పిలిచాడు. ‘నాన్నా, మూర్తి యీ ముగ్గు సరిగ్గా వచ్చిందా’, అడిగింది జానకమ్మ. ‘ముగ్గవగానే, మీ నాన్న బలమురళి కచ్చేరికి సైకిల్ మీద తీసుకెళ్తానన్నారు. ఈరోజు, కళ్యాణిలో రెండు కీర్తనలుంటాయి’, అంటూ చెప్పారు, జానకమ్మ. మూర్తికి అక్కడి వాతావరణం కొంత బోధ పడ్డట్టు, కొంత తెలియనట్టు తోచింది.
అంతలో జగన్నాధం మాస్టారు కనిపించారు. చలవ చేసిన చొక్కా, నెత్తిన తెల్లని టోపి, అచ్చంగా 32 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, అలాగే అగుపడ్డరు ఆయన మూర్తికి. విద్యా విద్వత్తుల కలబోత ఆయన ముఖ వర్చస్సు. వ్యంగ ప్రసంగం, చిరు చలోక్తులు ఆయన సొత్తు. దగ్గరకు వెళ్లి నమస్కరించిన మూర్తితో, ‘పంచ తంత్రాల సారాన్ని మానేజ్మెంట్ పాఠాలుగా మార్చాలి మూర్తి. నాగరీక జీవనంలో తరాలు దాటినా, నిల్చిన సత్యాలు, నిత్యాలు. మానవ ప్రగతికి మంచి మెట్లవి’, అన్నారు మాస్టారు, ఎవ్వరి పైకూడ వ్యంగాస్త్రం వేయకుండ. మూర్తి ఆశ్చర్యానికి యిక అవధులు లేవు. ‘ఏవిటీ విచిత్ర ధోరణి! తాను ఎరిగిన వారి ప్రవర్తన మునుపటి వలె లేదు. వారి తెలివితేటలు, అవగాహన, ఆలోచనలు, తానెరిగినటులే ఉన్నాయి. ఎదుటి మనిషి మీద న్యూనత భావం గాని, మానవ సహజమైన వాసనలు గానీ కనపడుట లేదు. అంత మాత్రాన వారేమీ నిశ్చల మనస్కులన్నట్టూ లేరు. స్వామి వారన్నట్టు వారికీ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలను వ్యక్తీకరించే ధోరణి వేరుగా వున్నది. తమ వాదన నెగ్గాలనే విపరీత తపనా కనబడుట లేదు’. ఈ లాగున ఆలోచిస్తున్న మూర్తిని భుజం మీద తట్టి, ‘నీ పరిస్థితి అర్థమైంది. నీ సందేహాలు తీర్చడం కోసమే నేను నిన్ను తీసుకొచ్చా’, స్వామి చెప్పడం మొదలు పెట్టారు. ‘భూమి ఒక పరిమిత వ్యవస్థ. మనసూ, మేధ అపరిమితమైనవి. కానీ, మనిషి తనకు కనిపించే లేక అనిపించు పరిమితులకు తన మనస్సును, మేధస్సును కుదించేస్తాడు. భాష, కులం, మతం, ప్రాంతం లాంటి వాటిని ‘పరికరాలుగా’ కాకుండా ‘పరిమితులుగా’ పరిగణిస్తూ తన ఉనికిని మరిచిపోతున్నాడు. ఏ కొందరో గాని అట్టి పరిమితులను అధిగమించి మానవ జన్మ లోని నిజ మాధుర్యాన్ని అనుభవించ లేక పోతున్నారు’. ‘స్వామీ, పరిధులు లేకండా ఎలా! జంతువులు సైతం తమ పరిధుల్ని నిర్నయించుకుంటాయిగా!’ ప్రశ్నించాడు మూర్తి. ‘వాస్తవమే. మానవుడు తన భుక్తి కి వలసిన పరిధులను నిర్మించుకోవడాన్ని దాటి, ఆలోచనల, ఆచారాల, ఆదాయాల, బాంధవ్యాల మరి ఇంకెన్నో రకాల పరిమితుల చెరశాలల్లో బందీగా ఉంటూనే, స్వతంత్రుడనంటాడు! ఆ మనుషులే తమ దేహ జాఢ్యాలను వదిలి ఎంతో చిదానందులై ఉండడం చూసావుగా!’, అన్నారు స్వామి. మూర్తి మనసులోని రెండు ప్రశ్నలకు జవాబులు వెతుకే ప్రయత్నంలో, ‘ స్వామీ, మీరు అన్నట్టు గానైతే, శీను ‘మీ వాళ్లమ్మాయేగా’, అన్న దాంట్లో కొంత నన్ను దెప్పి పొడవడం కాదా!’ అన్నాడు. ‘నీ ధోరణిలో, నీవు నీ స్నహితుని మాటలను వక్రీకరిస్తున్నావు. నీవు కలిసిన నలుగురూ అరూపులైనప్పటికీ, నీవెరిగిన రూపాల్లోనే కనిపించారు కదా! ఆ క్రమంలో, ఇతరులకు వారి వారికి తగు రూపాల్లో కనిపిస్తారు. నీవు నీ స్నేహితుని, తండ్రిని, తల్లిని యింక నీ ఉపాధ్యాయుని కలిసావుగా. వారు నిన్ను ఆ భావంతో నే పలకరించారు. మంచి స్నేహానికి ఆత్మీయత ఒక సూచి. శీను ఆ సూచీకి తగినట్టు పలికాడు. తలిదండ్రుల ధోరణి వేరు. తండ్రి నిశ్చయార్థకముగానూ, తల్లి చైతన్య ప్రతీకగానూ, వ్యవహరించారు. ఇక గురువు విద్యా విషయ మూలాలను స్పృశించారు. వీటిలో అసలు, అభిమాన, అహంకారాది వాసనలు లేవు’ అంటూ తేల్చేశారు శ్రీరాముల వారు. ‘చివరిగా, నేనూ భూవాసం విడిచి వచ్చానుగా! నా పూర్వ వాసనలు నన్ను ఎందుకు వీడ లేదు? కొంత సమయం పడుతుందా!’ అని మూర్తి స్వామిని అడగ్గా, ‘ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం శిష్యః స్వమేథయా । పాదం సబ్రహ్మచారిభ్యః, పాదం కాలక్రమేణ చ ॥ అని కదా ఆర్యోక్తి!! అంటే నీవు నేర్చుకొనే దాంట్లో నాల్గవ వంతు ఆచార్యుల వద్దనూ, మరియొక నాల్గవది స్వమేధ వలననూ,ఇంకో నాల్గవ వంతు సహధ్యాయుల వలన, తక్కినది కాలక్రమేణ నేర్వ వలెను’, అని చెప్పి అదృశ్యమయ్యారు. అబ్బా! ఇంత చెప్పిన స్వామి, ఈ సంగతి చెప్పకనే అదృశ్యమైనాడనకుంటూ, బిక్క మొహం వేసుకొని, శూన్యం లోకి చూడ సాగాడు, మూర్తి.
అంతలో తన యెడమ భుజాన్ని ఎవరో గట్టిగా కుదుపుతున్నట్టు ఆనిపించింది, మూర్తికి. అటు తిరిగి తన భార్య లక్ష్మిని చూసి ‘నీ వెప్పుడొచ్చా యిక్కడికి’, అని అడిగాడు. ‘ఆ! ఎప్పుడా! ముప్ఫై ఏళ్ళయ్యింది ఈ కొంపకొచ్చి. ఇప్పుడిక లేవండి నిద్ర! బాగా తెల్లవారింది! మొహం కడుక్కోని వస్తే, కాఫీ తాగొచ్చు’ అన్నది లక్ష్మి గడియారం వైపు వేలు చూపుతూ! స్వామి అన్న ‘కాలక్రమేణచ’ అంటే ఏవిటో, ‘కల’నుంచి, నిదుర నుంచి బయిటికి వస్తే గానీ తెలియ లేదు మూర్తికి. గరిమెళ్ళ సురేష్