
“నా అబ్యర్ధన మన్నించి నన్ను మీ స్నేహితుడిగా గుర్తించి మీ ముఖ పుస్తకం (face book) లో నాకూ ఒక స్థానం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అక్కరలేని కృత్రిమ సౌందర్య సాధనలకు పోక, సహజ సౌందర్యంతో వెలిగిపోతూ, అందానికి నిర్వచనంగా కనిపిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీరే కాదు, మీ పేరు కూడా అందంగా ఉంది. మీకు వీలున్నప్పుడల్లా నాతో మీ మనోభిప్రాయాలు పంచుకోమని మీకు విన్నవించుకుంటూ, అదే అవకాశం నాకూ కలిగించమని వేడుకుంటున్న మీ నూతన స్నేహితుడు - ప్రేమ్”
తన ముఖ పుస్తకంలో ఆరోజు ప్రేమ్ దగ్గర నుంచి వచ్చిన సందేశం చదువుకున్న ప్రియ మనసు ఉబ్బి తబ్బిబ్బైంది. అప్పుడు సమయం రాత్రి పది గంటలు దాటినా, ప్రేమ్ సందేశం చదివిన ప్రియ జవాబు ఇవ్వకుండా ఉండలేక –
“కాలేజీకి వెళ్ళిరావడం, ఎప్పటి పాఠాలు అప్పుడే చదువుకోవడం, ప్రాజెక్టు పనులు, ఇంట్లో అమ్మకు పనుల్లో సాయం చేయడం వంటి పనులతో రోజంతా క్షణం తీరిక లేకుండా గడిపే నాకు సామాజిక మాధ్యమాలైన ముఖ పుస్తకం మొదలైనవి చదవాలన్నా, చదివినవాటికి స్పందించాలన్నా, తీరిక దొరికే సమయం రాత్రి పది గంటల తరువాతే. అందుకే, మీ తొలి సందేశానికి ఇంత ఆలస్యంగా స్పందిస్తున్న నేను ముందుగా క్షమాపణ కోరుతున్నాను. మీరు నన్ను అతిగా పొగిడేస్తున్నారనిపిస్తోంది. దయచేసి నన్ను అలా పొగడకండి, నాకు అదోలా ఉంటుంది – ప్రియ”
రెండో రోజు ప్రేమ్ సమాధానం –
“ప్రియా, చదువు ఎడల ఇంటి పనుల ఎడల మీకున్న నిబద్దతకు నా అభినందనలు. అలా నిబద్ధత కలవారంటే నాకు చాలా ఇష్టం. మీకు నా పొగడ్త అదోలా ఉంటుంది అని వ్రాసేరు. అంటే, ఎలా ఉంటుందో కాస్తా వివరిస్తారా. నిజానికి నేను మిమ్మల్ని పొగడలేదు. ఉన్నది ఉన్నట్టుగా చూసిన నా కళ్ళు సత్యాన్ని చెప్తే, అది నా కలం మీకు వివరిస్తే, నన్ను నిందించడం మీకు భావ్యం కాదు. అయినా, పొగడ్త గిట్టని మీ వ్యక్తిత్వానికి నా జోహార్లు. మీతో ఎప్పుడూ సత్యాన్ని మాత్రమే చెప్పే నాకు, స్వచ్చమైన మీ మనసులో కొంచెం చోటిస్తారు కదూ. మీ జవాబుకి 24 గంటలు ఎదురు చూడాలంటే నాకు ఇప్పుడే నిస్పృహ నిస్సత్తువ కలుగుతున్నాయి. మిమ్మల్ని మీ వ్యకృత్వాన్ని అభిమానిస్తున్న – మీ ప్రేమ్”
అది చదువుకున్న ప్రియకు మనసులో ఏదో గిలిగింత కలిగి ఇచ్చిన జవాబు --
“ప్రేమ్, నాలో మీకు ఏమి గొప్పతనం కనిపించిందో నాకు తెలియదు. కానీ నేను మీ అభిమానానికి తగనేమో అనిపిస్తోంది. ఏది ఏమైనా, మీ పలుకుల్లో ఒక ఆకర్షణ మాత్రం నిండుగా తొణికిస లాడుతూ ఉంది. ఇక నేను వెంటనే నిద్రకు ఉపక్రమించకపోతే, రేపటి దినచర్య సవ్యంగా చేయలేను, శుభరాత్రి – మీ ప్రియ”
పడుకోబోతూ ప్రేమ్ దగ్గరనుంచి ఏమైనా జవాబు వచ్చిందా అని ముఖ పుస్తకం చూసింది ప్రియ --
“నన్ను నిద్రకు దూరం చేస్తూనే, నిద్రాదేవి ఒడిలోకి చేరిపోతున్న నీకు నా మాటలతో ఇక భంగం కలిగించలేక – నీ నిద్ర నిండుగా తీయని కలలు రావాలని, ఆ కలలలో నేను కూడా నీతో కలిసి విహరించాలని ఎంతో ఆశపడుతున్న – నీ ప్రేమ్ (నా ఆశ అత్యాశ కాదు కదా)”
అన్న ప్రేమ్ జవాబు చదివి గంతులువేసింది.
“నా నిద్రకు భంగం కలిగించను అంటూనే నాకు నిద్రను దూరం చేస్తున్న నిన్ను క్షమిస్తూ, నీకు కూడా త్వరగా నిద్ర రావాలని ఆ నిద్ర నిండుగా తీయ తీయని కలలు రావాలని ఆ కలలలో మనమిరువురం నిండి ఉండాలని అత్యాశ పడుతున్న – నీ ప్రియ (దయచేసి, నీ సందేశాలతో మరి నాకు నిద్రాభంగం కలిగించకు బాబూ)”
ఎదురెదురుగా లేని వ్యక్తులను కూడా అతి తక్కువ వ్యవధిలో చాలా దగ్గర చేసి, ఒకరినొకరు బహువచనంలోంచి ఏకవచన సంబోధనలోకి చేరుకొనేలా చేసే శక్తి ముఖ పుస్తకంకి ఉంది.
ఆ వ్యక్తులు యుక్త వయస్కులైన ఒకరు ఆడ మరొకరు మగ అయితే, వారిద్దరిలోనూ అతి తక్కువ కాల వ్యవధిలో ఒకరిపట్ల మరొకరికి ఆకర్షణ కలిగేటట్టు చేసే శక్తి కూడా ముఖ పుస్తకంకి ఉంది.
ప్రేమ్ మరియు ప్రియ మధ్యన – ముఖ్యంగా ప్రియ మన్సులో -- తొలి రెండు రోజులలో అదే జరిగింది.
ఈ రెండు రోజులలోనే వారిద్దరూ ఒకరి గురించి మరొకరికి అన్నీ చెప్పుకొని, ఎన్నో ఏళ్లగా ఒకరికొకరు తెలిసిన వారిలా తయారయేరు. అయితే, ఆమె గురించి అన్నీ చెప్పేలా ప్రియను మాటలాడింప చేస్తూ, తన గురించి ఏమీ తెలుసుకోకుండా చేయగలిగేడు ప్రేమ్ అన్నది ప్రియ గమనించలేకపోయింది.
మూడోరోజు –
“ప్రియా, నిన్ను నా కంటి నిండుగా చూసుకోవాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది. అందుకై, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. వారం రోజుల లోపల ప్రేమికుల దినం (నీకు తెలుసుగా ఫిబ్రవరి 14) వస్తోంది కదా. ఆరోజు మనం ఎలాగైనా కలుసుకొని ఒకరినొకరు తృప్తిగా తొలిసారిగా చూసుకోవాలి. ప్రేమ చరిత్రకు గొప్ప చిహ్నామై, అంతర్జాతీయంగా ఏడు వింతలలో ఒకటిగా పేరు పొందిన ‘తాజ్ మహల్’ దగ్గర మనం ఆరోజు కలుసుకొందాం. మీ కాలేజీ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘వైజ్ఞానిక యాత్ర’ అన్న నెపంతో ‘తాజ్ మహల్’ దగ్గరకు వచ్చేయి. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర నేను నీ కోసం కళ్ళు కాయలు చేసుకొని ఎదురు చూస్తూ ఉంటాను. తప్పక వస్తావు కదూ, నాకు నమ్మకం ఉంది నా ప్రియ నా నమ్మకాన్ని వమ్ము చేయదని”
“అమ్మో నావల్ల కాదు. తరువాత అబద్ధం అని తెలిసిపోతే, మా ఇంట్లో నా పరిస్తితి ఏమౌతుంది”
“ప్రేమలో కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు ఆడుతూ ప్రేమికులు ప్రేమని కొనసాగించాలి ప్రియా. నేను స్కై బ్ల్యూ కలర్ పాంటు క్రీమ్ కలర్ షర్ట్ తో చేతిలో ఎర్ర గులాబీ పువ్వుతో టికెట్ కౌంటర్ దగ్గర నీకోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు కనకాంబరం రంగు చీరతో కనిపించి నా కళ్ళలో వెలుగులు నింపాలి. ఇక కబుర్లన్నీ సముఖానే. నువ్వు వస్తున్నావు”
ఆ సందేశం చదువుకున్న ప్రియ ఒక్కసారిగా తుళ్లిపడింది. ఆగ్రాకి బాగా దగ్గరగానే ఉన్న మధురలో ఉన్న తాను ఇంట్లో అబద్ధం చెప్పి ఒంటరిగా వెళ్లడమా, అదీ కూడా ప్రేమ్ ని కలిసేందుకా. ఏమని నిర్ణయం తీసుకోవాలి. వెళ్లకపోతే పాపం ప్రేమ్ నిరాశకు గురి అవుతాడే, ఏమి చేయాలి” అని ఆలోచిస్తున్న ప్రియకు ఆరాత్రి నిద్ర కరవైంది.
యుక్త వయసు, ప్రేమలో పడిన మనసు, యుక్తాయుక్త విచక్షణ లోపించిన బుద్ధికి తోడై ప్రియ ఆలోచన ఇంట్లో అబద్ధం ఆడడానికే మొగ్గు చూపింది.
అందరూ ప్రేమ గుడ్డిది అంటారు. కానీ, ప్రేమాంకురాన్ని మొలకెత్తింపచేసే మనసు అందుకు దోహదపడే బుద్ధిని మించిన గుడ్డివాళ్లు ఈ భూప్రపంచంలో లేరన్నదే అసలైన నిజం.
మనసు అబద్ధం ఆడడానికి సిద్ధపడాలే కానీ ఒకటి తరువాత ఒకటి అబద్ధాలు అలా అలా అల్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చేస్తాయి అన్నది ఎవరికి వారికే అనుభవైకవేద్యం.
ప్రియ చేత అందమైన అబద్ధాలు ఆడించి తాజ్ మహల్ ముందర తనను కలుసుకొనేలా చేయడంలో ప్రేమ్ సఫలీకృతుడయ్యేడు.
ప్రేమికుల దినం సందర్భంగా తాజ్ మహల్ నిర్వాహకులు -- 30 ఏళ్ల వయసు మీరిన వారికి, 16 ఏళ్ల వయసు రాని వారికి, ఆరోజు తాజ్ మహల్ సందర్శనం పూర్తిగా బహిష్కరించేమని ప్రకటిస్తూ, వయో ప్రమాణ పత్రం చూపించిన యుక్తవయసులో ఉన్న ప్రేమైక జీవులకు మాత్రం ప్రవేశ రుసుము వసూలు చేయకుండానే తాజ్ మహల్ సందర్శనానికి అనుమతి ప్రకటించేరు.
ఆరోజు పౌర్ణమి కాబట్టి, తాజ్ మహల్ ఆరుబయటన ప్రేమికులు ఆరోజు రాత్రి పది గంటలవరకూ విద్యుత్ దీపాలు లేని నిండు వెన్నెల్లో గడిపేందుకు అనుమతి కూడా ప్రకటించి ప్రేమికుల మనస్సులలో హాయిని ద్విగుణీకృతం చేసేరు.
ఈ ప్రకటనలతో ఆరోజు తాజ్ మహల్ ప్రాంతం యుక్తవయసులో ఉన్న ప్రేమికులతో నిండిపోయింది. ఎటు చూసినా చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ కనిపించే యుక్తవయసులో ఉన్న జంటలే.
తాజ్ మహల్ ప్రవేశానికి ఇష్టపడక –
బయటనున్న పొదల చాటున అధరామృతాలు గ్రోలేవారు కొందరైతే, కౌగిళ్ళలో కువకువలాడేవారు మరి కొందరు.
మనల్ని చూసేవారిదే తప్పు కానీ, మనది కాదనుకొని, మనం ఎలా ఉందామనుకుంటామో అలానే ఉందాం అనుకుంటూ సరసాల సరదాలు తీర్చుకొంటూ మురిసిపోయే వారు ఇంకొందరు.
అలా పై పై సరసాలతో తృప్తి పడని కొందరు ప్రేమికులలో -- కొంత కాలహరణం తరువాత -- పరకాయ(కాయంలో)ప్రవేశం చేయాలని తాపత్రయం పడే పురుష ప్రేమికులకు, ఆ అనుభవం ఎలా ఉంటుందో చవి చూడాలన్న తహతహతో మనసా సహకరించే స్త్రీ ప్రేమికులు తోడవసాగేరు.
ఆ దృశ్యాలు చూసి ఉద్రేకపడి అనుసరణకు ‘అ ఆ’ లు దిద్దేవారు ఇంకొందరు.
పగలే ఈ కాముక సన్నివేశాలతో ఆ ప్రదేశం నిండిపోతూంటే, వెన్నెల విరబోస్తే ఈ ప్రదేశం ఇక ఎన్ని వింతపోకడలకు నిలయంగా మారబోతూందో అన్నది ఊహాతీతం.
మొత్తం మీద –
‘ప్రేమికుల రోజు’ అంటే ‘కాముకుల రోజు’ మరియు ‘ప్రేమ’ అంటే ‘కామం’ మాత్రమే అని నిఘంటువులలో అర్ధాలు మార్చి వ్రాయబడేలా –
ఆ ప్రదేశంలో ఉన్న ప్రేమికులందరూ ఖజారహో శిల్పాలకు మారు రూపాల వలె మారిపోయి –
‘తాజ్ మహల్’ ఉత్తరప్రదేశ్ రాష్టంలో ఉందా లేక మధ్యప్రదేశ్ రాష్టంలో ఉందా అని భౌగోళిక శాస్త్రజ్ఞులకు కూడా సందేహం వచ్చేటట్టు విచ్చల విడిగా వ్యవహరించ సాగేరు.
ఆరోజు ఉదయం 11 గంటల తరువాత కొంచెం భయపడుతూ వచ్చిన ప్రియ కళ్ళకి ఉంటానన్న ప్రదేశంలో ఉండి కనబడవలసిన ప్రేమ్ కనబడక పోయేసరికి కాస్తా కంగారు కలిగింది. బహుశా, తనకోసం చూసి చూసి తాజ్ మహల్ లోపలికి వెళ్ళి ఉంటాడేమో అనుకున్న ప్రియ లోపలికి వెళ్ళి తాజ్ మహల్ అంతా చూస్తూనే ప్రేమ్ కోసం కలయచూడసాగింది.
రమ్మన్న వస్త్రధారణతో వచ్చిన ప్రియను సులభంగా పోల్చుకున్న ప్రేమ్, తాను వస్తానన్న వస్త్ర ధారణతో రాకుండా మరో విధంగా వచ్చి, దూరం నుంచి ఆమెనే గమనిస్తూ ఆమె వెనకాలే తిరుగాడసాగేడు.
తిరిగి తిరిగి అలసి పోయి, ఏదో కాస్తా తిని మరలా ప్రేమ్ కోసం వెతకవచ్చు అనుకుంది ప్రియ. ఆమె తింటున్న చోటుకి కొంచెం దూరంలో ఆమెనే గమనిస్తూ తింటున్న ప్రేమ్ ని గమనించలేక పోయింది ప్రియ. తినడానికి వెళ్ళిన ప్రదేశంలో ఉన్న జనసందోహం వలన ఆమె తిరిగి తాజ్ మహల్ దగ్గరకు వచ్చేసరికి సాయంత్రం 5 గంటల సమయం దాటింది.
ప్రేమ్ కనిపించకపోయినా వెన్నెల్లో తాజ్ మహల్ వీక్షణం అనుభవించి, ఇక్కడికి వచ్చినందుకు కనీసం ఆ తృప్తితోనైనా త్వరగా వెనుతిరిగి పోవాలనుకుంది ప్రియ.
ప్రేమ పేరుతో చుట్టూ సాగే కాముక విహారాలు చూడలేక, చూడకుండా ఉండేందుకు దారి లేక, చూడాలనే తహతహతో మనసును వేధించే వక్ర బుద్ధితో వేగలేక, ఏమి చేయాలో తోచక, ప్రేమ్ కనబడక పోతే పోయే వెనక్కు వెళ్లిపోదాము అని మనసుని నచ్చ చెప్పుకోలేక – అయోమయావస్థలో కొట్టుమిట్టాడుతున్న ప్రియ – సూర్యాస్తమయం అవడం చంద్రోదయం అవడం గమనించలేకపోయింది.
పగటి వెలుతురు దూరమై, వెన్నెల పూర్తిగా పరచుకోక, ఎదురుగా వచ్చే వ్యక్తులు దగ్గరగా వస్తే కానీ ఎవరో పోల్చుకోలేని సమయాన –
అపరిచితుడైన వ్యక్తి ఎవరో విప్పారిన పెద్ద కళ్ళతో తననే చూస్తూ తన వైపు వస్తున్నట్టు అనిపించి, అసభ్యత మరియు అనాగరికత విశృంఖలంగా వెల్లివిరిసి ఉన్న పరిసరాలలో ఒంటరిగా ఉన్న తాను మాన ప్రాణాలను రక్షించుకోవలసిన అగత్యం ఏర్పడిందని భావించిన ప్రియ –
వెను తిరిగి చూడకుండా తాజ్ మహల్ దాటితే వచ్చే రోడ్ చేరుకునేందుకు తన శక్తినంతా కూడగట్టుకొని పరుగులు తీయసాగింది.