రతీ మన్మథులు - కందుల నాగేశ్వరరావు

Ratee manmadhulu

విథాత సృష్టి ప్రారంభంలో పరమ పావనులు, పూజనీయులు అయిన సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురు మునులను, ఏకాదశ రుద్రులను సృష్టించాడు. వారంతా సంతానోత్పత్తికి విముఖత చూపించి తపస్సు చేయుటకు అడవులకు వెళ్ళారు. ఆతరువాత మానవలోకానికి అగ్రగణ్యులైనవారు, జీవుల అభివృద్ధికి కారణమైనవారు, బ్రహ్మతోనసమానమైన ప్రభావం కలవారు ఐన నారదుడు, పులహుడు, పులస్త్యుడు, భృగువు, క్రతువు, అంగిరసుడు, వసిష్టుడు, మరీచి. అత్రి మొదలుగాగల మహాత్ములైన మానసపుత్రులను సృష్టించాడు. దేవతలను, రాక్షసులను, దక్షుడు మొదలైన ప్రజాపతులను కూడా సృష్టించాడు. బ్రహ్మదేవుడు తను చేసిన సృష్టిని పరికించి చూసి మనస్సులో తానే మహోన్నతుడు అనే అహంకారాన్ని పొందాడు.

మానవ సృష్టి ఐన తరువాత బ్రహ్మ మనస్సు నుండి మనోహరమైన ఒక సుందర స్త్రీమూర్తి రూపం ఉద్భవించింది. త్రిలోకసుందరియైన ఆమె పేరు సంధ్య. బ్రహ్మ తన కుమారులైన మహర్షులను, ప్రజాపతులను గర్వంగా చూస్తూ లేచి నిలబడ్డాడు. అలా వారిని చూస్తూ ఉండగా ఆయన మనస్సు నుండి అత్యంత సౌందర్యవంతుడు, సుకుమారుడు అయిన పురుషుడు ఆవిర్భవించాడు. మేలిమి బంగారు రంగు, పున్నమి చంద్రునివలె ప్రకాశవంతమైన ముఖం, విశాలమైన వక్షస్థలం, కలవాడు. అట్టి శృంగారపురుషుని చూడగానే అక్కడున్న వారందరూ ఆశ్చర్యాన్ని, ఎవరో తెలుసుకోవాలనే ఉత్కంఠను పొందారు.

పంచ పుష్పాయుధుడు, నీలవస్త్రధారి, శృంగారరససేవితుడు, అత్యంత మనోహరుడు అయిన ఆ యువకుడు బ్రహ్మను చూసి తలవంచి నమస్కరించి “సృష్టికర్తవైన నా తండ్రీ! నన్నెందుకు సృష్టించావు? నా కర్తవ్యం ఏమిటి? నా స్థానం ఎక్కడ? నా భార్య ఎవ్వరు?” అని ప్రశ్నించాడు.

విధాత ఆ యువకుడితో “కుమారా! నువ్వు ఈ రూపంలో ఉండి పూలబాణాలు ప్రయోగించి స్త్రీపురుషులను మోహంలో ముంచి, వారిలో కామవాంఛను ప్రేరేపించి సృష్టికార్యాన్ని నిరంతరాయంగా కొనసాగించు. త్రిమూర్తులమైన మేము సహితం నీ బాణాల ప్రభావం నుండి తప్పించుకో లేము. అటువంటప్పుడు సామాన్య ప్రాణుల సంగతి చెప్పేదేముంది. అందరి మనస్సులలో అదృశ్యరూపంలో ఉండి వారి సుఖానికి కారణభూతుడుగా ఉంటూ సృష్టికార్యాన్ని చెయ్యి. దానితో జీవులు ధర్మాధర్మ విచక్షణ కోల్పోయి జనన మరణ రూపమైన సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు” అని చెప్పి కర్తవ్యాన్ని బోధించాడు.

బ్రహ్మ ఆ యువకునకు తగిన పేర్లను. స్థానాన్ని, భార్యను కల్పించమని ప్రజాపతులను, మహర్షులను ఆదేశించాడు. అప్పుడు మహర్షులు “ఓ మహా పురుషా! నవ్వు పుట్టగానే మా మనస్సులను మథించావు కనుక ‘మన్మథ’ నామంతో ప్రసిద్ధి చెందుతావు. వివిధ రూపాలలో ఉంటావు కనుక ‘కాముడు’ అని, మాధకద్రవ్యాలెన్ని ఉన్నా నీతో సమమైనది లేదు కనుక ‘మదనుడు’ అని, దర్పం నుండి పుట్టావు కనుక ‘కందర్పుడు’ అని లోకంలో నిన్ను పిలుస్తారు. దక్షప్రజాపతి నీకు భార్య కాగల కామినిని నీకు ఈయగలడు” అని చెప్పారు. ఆ విధంగా మన్మథునికి కాముడు, మదనుడు, పుష్పధన్యుడు, కందర్పుడు, అనంగుడు అనే నామాంతరాలు ఉన్నాయి.

వారి మాటలు విన్న మన్మథుడు మనస్సులో ఇలా అనుకున్నాడు “బ్రహ్మ పలుకులలోని యధార్థాన్ని ఇప్పుడే పరీక్షిస్తాను. నా పరాక్రమానికి ఈ ఋషులు, ప్రజాపతులు సాక్షులు అవుతారు. సంధ్యాదేవి కూడా ఇక్కడే ఉంది. వీరందరికీ ఆమె యందు మోహం కలిగేటట్లుగా చేస్తాను. హర్షణము, రోచనము, మోహనము, శోషణము, మారణము అనే పేర్లుగల ఐదు పుష్పబాణాలను వీరిపై ప్రయోగిస్తాను!”

ఈ విధంగా మనస్సులో నిశ్చయించుకొని అక్కడున్న వారందరినీ గురి చూసి కుడికాలు ముందుకు వంచి, ఎడమకాలు వెనుకకు జరిపి ధనస్సును బలంగా లాగి చక్రాకారంగా చేసి బాణప్రయోగం చెయ్యబోయాడు. ఒక్కసారిగా దిక్కులన్నీ నానావిధ పరిమళ పుష్ప సువాసనలతో నిండిపోయాయి. బాణప్రయోగం చేసేసరికి బ్రహ్మతో సహా అక్కడ ఉన్న అందరి హృదయాలలో కామవికారం పుట్టింది. వారంతా విరహతాపంతో సంధ్యాదేవిని చూస్తూనే మన్మథ భావాన్ని పొందారు. వారందరి హృదయాలలో సంధ్యాదేవిని పొందాలనే కోరిక చెలరేగింది. బ్రహ్మ ఇచ్చిన బాధ్యతను నెరవేరచగలననే విశ్వాసం మన్మథునికి కుదిరింది.

అప్పుడు అక్కడ ఉన్న ‘ధర్ముడు’ పాప చింతనలో ఉన్న తండ్రిని, సోదరులను చూసి ధర్మరక్షకుడైన శంకరుని స్మరించి స్తుతించాడు. ధర్ముని ధర్మబుద్ధికి సంతోషించిన శంకరుడు అక్కడ ప్రత్యక్షమై అక్కడ ఉన్న వారందరూ సిగ్గుపడేటట్లుగా ఇలా అన్నాడు. “ఓ బ్రహ్మా! నీ కుమార్తెయందు నీకు కామభావం ఎలా కలిగింది? వివేకి అయినవాడు తల్లిని, సోదరిని, సోదరుని భార్యను, కుమార్తెను కామభావంతో చూడరాదు. వేదం నీ మొహంలో ఉంది. అటువంటి నిన్ను ఈ కాముడు వేదమార్గం నుండి ఎలా తప్పించగలిగాడు? నీ మానసపుత్రులైన దక్షుడు, మరీచుడు మొదలైనవారంతా స్త్రీ వ్యామోహాన్ని ఎలా పొందారు? వివేకాన్ని తెచ్చుకొని మీ మనస్సును నియంత్రణ చేసుకోవాలి” అని జ్ఞానబోధ చేసి శంకరుడు నిష్క్రమించాడు.

శంకరుడు ఈ విధంగా జ్ఞానబోధ చేసేసరికి బ్రహ్మ సిగ్గుపడ్డాడు. సంధ్యను పొందాలనే కోరికను నిగ్రహించుకొన్నాడు. ఆ సమయంలో ఆయన శరీరం చెమటతో తడిసి ముద్దయింది. ఆ చెమట నుండి పుణ్యాత్ములు, సంసార విముఖులు అయిన ఎనబై యారు వేల మంది పితృదేవతలు ఉదయించారు. అప్పుడు దక్షుని శరీరం నుండి శ్వేదజలం భూమిపై పడింది. దాని నుండి సర్వావయ సుందరి, గుణవంతురాలు అయిన వనితారత్నం పుట్టింది. మునులను సైతం మోహింపచేయగల ఆమెకు ‘రతి’ అని పేరు పెట్టారు.

*

బ్రహ్మ కుమార్తె అయిన సంధ్య తను కూడా మన్మథబాణం వల్ల కామపీడితురాలైనందుకు చింతించింది. శంకర సందర్శన భాగ్యంచేత ధర్మకర్మపరాయణురాలైంది. తన మనస్సు పాపపంకిలమైనందుకు దుఃఖిస్తూ అక్కడ నుండి చంద్రభాగానది తీరాన గల బృహల్లోహితం అనే సరస్సు దగ్గరకు వెళ్ళింది. అక్కడ వశిష్ఠమహర్షి ఆమెకు “ఓం నమః శంకరాయ ఓం” అనే ఆద్యంతముల యందు ఓంకారము గల మంత్రాన్ని ఉపదేశించాడు. వసిష్ఠమహర్షి ఉపదేశం మేరకు ఆమె ఒక మహాయుగ కాలం తపస్సు చేసి పాపవిముక్తురాలైంది. అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై “నీవు మూడు లోకాలలోను ఇతర స్త్రీలందరి కంటే పాతివ్రత్య భావాన్ని పొందగలవు. నీ మరుజన్మలో గొప్ప మహర్షి నీకు భర్త కాగలడు. నీ భర్త తప్ప నిన్ను కామంతో చూసినవాడు నపుంసకుడుగా మారును. నీ కోరిక ప్రకారం ప్రాణులకు పుట్టుకతోనే కామవాంచ కలుగదు” అని వరాలు ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. తరువాత సంధ్య తన దేహాన్ని వేదమార్గంలో అగ్నికి ఆహుతి చేసింది. దాని ఫలితంగా మరుజన్మలో అరుంథతిగా జన్మించి వసిష్ఠమహర్షిని వివాహమాడింది.

*

శంకరుని వాక్యాలకు సిగ్గుపడ్డ బ్రహ్మ కోపంతో మన్మథుని “మంచి చెడ్డలు మరచి మాపై నీ బాణాలు సంధించి దుష్కర్మకు పాల్పడ్డ ఫలితంగా, పరమేశ్వరుని విషయంలో నువ్వు సాధించలేని పనికి పూనుకొని విఫలుడవై ఆయన పాలాగ్నిచే దహింపబడతావు” అని శపించాడు. బ్రహ్మదేవుని శాపవచనాలు విన్న మన్మథుడు భయంతో వణుకుతూ, తన ధనుర్బాణాలను దూరంగా పారేసి ఆయన పాదాలపై పడి “తండ్రీ! నన్ను అంత దారుణంగా ఎందుకు శపించావు? మీరాదేశించిన విధినే నేను నెరవేర్చాను. త్రిమూర్తులు సైతం నా బాణాలకు వశులౌతారు అని మీరన్న మాటను పరీక్షించాను. ఇందులో నా అపరాధం ఏముంది? నిరపరాధినైన నన్ను ఇంత దారుణంగా ఎందుకు శపించారు” అని ప్రార్థించాడు.

మన్మథుని ధార్మిక వచనాలను విన్న బ్రహ్మ తన్ను తాను నిగ్రహించుకొని “కుమారా! నా కుమార్తె అయిన సంధ్యపై నాకు కామవికారాన్ని కలిగించినందుకు నిన్ను శపించాను. ఇప్పుడు శాంతించాను. నీ భయాన్ని వదిలిపెట్టు. శంకరుని శాపంతో బస్మమైన నీవు త్వరలోనే మరల శరీరాన్ని పొందగలవు. శివుడు తన ఇష్టప్రకారం వివాహం చేసుకున్న తరువాత ఆయనే నీకు మరల శరీరాన్ని అనుగ్రహిస్తాడు” అని శాపవిమోచన మార్గం తెలియపరిచాడు.

అపుడు దక్షప్రజాపతి “ఓ మదనా! మహాలావణ్య, తేజోరాశియైన ఈ సుందరి ‘నా దేహం నుండి పుట్టింది. ఈమెకు ‘రతి’ అని నామకరణం చేశాను. రూపంలోనే కాదు గుణంలో కూడా ఈమెకు సాటి ఎవరూ లేరు. ఈమెను నీ బార్యగా స్వీకరించు. నీ కన్నివిధాలా తగినది. నీకు శుభం కలుగుతుంది” అని చెప్పాడు. దక్షుని ఆజ్ఞానుసారంగా మన్మథుడు రతీదేవిని వివాహమాడాడు. మహాదేవుడు గంగను స్వీకరించినట్లు, మన్మథుడు రతీదేవిని స్వీకరించి అపరిమతానందాన్ని పొందాడు.

*

తనకు హితోపదేశం చేసి అంతర్ధానమైన శంకరునియందు బ్రహ్మ ఈర్ష్యను పొందాడు. ఎలాగైనా సరే శంభుని కాంతా వ్యామోహపీడితునిగా చేస్తే తప్ప తన అవమాన భారం తొలగదని తలంచాడు. రతీమన్మథులను పిలిపించి “కుమారా! నీవు నా పుత్రులలో శ్రేష్ఠుడవు. నీవు రతీదేవితో కూడి ప్రకాశమానంగా ఉన్నావు. నీ వలె శివుణ్ణి కూడా ఒక ఇంటివాడిని చెయ్యి” అన్నాడు. అప్పుడు మదనుడు “ తండ్రీ! నీ ఆజ్ఞ తప్పక నెరవేరుస్తాను. ముందు శంకరుని మోహింపగల స్త్రీని సృష్టించు” అన్నాడు.

మన్మథుని మాటల్లో నిజాన్ని గ్రహించిన బ్రహ్మ ‘శంకరుని మోహింపగల స్త్రీ ఎవరా’ అని ఒక దీర్ఘ నిశ్వాస వదిలాడు. దాని నుండి వసంతుడు పుట్టాడు. ఆ వసంతుడు పుష్పమాలావిభూషితుడు, మరియు సర్వాంగ సుందరుడు. వసంతుడు పుట్టగానే సుగంధ బంధురమైన మలయానిలం మందంగా వీచింది. సకల లోకాలు ఆహ్లాదభరితమయ్యాయి. బ్రహ్మ వసంతుని మన్మథునికి సహాయకుడిగా నియమించాడు. హరుని మోహింప చేయగల సుందరాంగిని ప్రయత్నపూర్వకంగా సృష్టిస్తానని చెప్పాడు.

బ్రహ్మ పలుకులకు సంతృప్తి చెందిన మదనుడు, వసంతుడు కలిసి శివస్థానానికి బయలుదేరి వెళ్ళారు. వసంతుని రాకతో వనంలోని పూలతోటలు పూలతో నిండి సుగంధవాయువులు వీచాయి. పక్షుల కలకలారావంతో గానం చేశాయి. శంకరుడు సమాధిలో ఉన్నప్పుడు, హిమవత్పర్వత మైదానాలలో సంచరిస్తున్నప్పుడు మదనుడు వెంబడించి తన ప్రభావాన్ని ప్రకటించాడు. అయినా సరే శివునిలోను శివగణాలలోను ఏ విధమైన కామవికారం పుట్టలేదు. తన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో మదనుడు బ్రహ్మ వద్దకు వచ్చి “తండ్రీ! యోగనిష్ఠడైన శంభుని మోహింపచేయడం అసాధ్యం” అని విచారంగా పలికాడు.

పుష్పధన్వుని మాటలు విన్న బ్రహ్మ మనస్సు దుఃఖంతో నిండిపోగా ఒక నిట్టూర్పు విడిచాడు. ఆ నిట్టూర్పు నుండి అసంఖ్యాకమైన భయంకరులు, చంచలులు అయిన గణాలు పుట్టుకువచ్చి “చంపండి, చంపండి” అని అరవడం మొదలెట్టాయి. బ్రహ్మ వారికి ‘మారులు’ అని నామకరణం చేశాడు. “వీరంతా నీ వెంట ఉండి నీ పుష్పబాణాలకు వశమైన మానవులకు చిత్తభ్రాంతిని కలుగ జేస్తారు. వీరి సహాయంతో నువ్వు శివుని మోహింప చెయ్యి” అని బ్రహ్మదేవుడు మన్మథుని ఆదేశించాడు.

మన్మథుడు దైర్యం తెచ్చుకొని రతీదేవిని, వసంతుని, మారగణాలను వెంటపెట్టుకొని మరల శివధామానికి వెళ్ళాడు. ఇంతకు ముందు కంటే ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా శివునికి ఎట్టి మోహము పుట్టలేదు. తిరిగి వచ్చి “శంకరుని విషయంలో నాప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. నన్ను క్షమించండి. మీకంత పట్టుదల ఉంటే వేరే ఉపాయాలు అన్వేషించండి” అని చెప్పి తన అనుచరులతో నిష్క్రమించాడు.

బ్రహ్మగారికి దుఃఖం రెట్టిపయ్యింది. అప్పుడు విష్ణువును స్మరించి శంకరుడు వివాహమాడే ఉపాయం చెప్పమని కోరాడు. అప్పుడు విష్ణువు “కుమారా! నీవు శంకరుని ప్రార్థించి లోకకల్యాణార్థం వివాహం చేసుకోమని ప్రార్థించి ఒప్పించు. ఉమాదేవిని ప్రార్థించి దక్షునికి కుమార్తెగా జన్మించమని కోరు. ఆమె దక్షప్రజాపతికి కుమార్తెగా సతీ నామదేయంతో మానవ శరీరంతో జన్మిస్తుంది. శివభక్తురాలై శివునికొరకు తపస్సు చేసి శివుని మెప్పించి వివాహమాడుతుంది” అని ఉపాయం చెప్పాడు. బ్రహ్మదేవుడు శ్రీహరి సలహాను పాటించి సతీశంకరుల వివాహాన్ని జరిపించాడు.

*

రతీమన్మథులు స్వర్గలోకంలో నివసిస్తూ జీవుల హృదయాలలో కామభావన కలిగిస్తూ బ్రహ్మదేవుని ఆదేశానుసారం సృష్టికార్యం నిర్వర్తిస్తూ వచ్చారు. కొన్ని యుగాలు గడిచాయి. శివునిపై విరోధభావం పెంచుకున్న దక్షుడు తన ఇంట్లో జరిగే యజ్ఞానికి శంకరునికి తప్ప అందరికీ ఆహ్వానం పంపాడు. పిలవకపోయినా తండ్రి ఇంట జరిగే యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి. అక్కడ తండ్రి తన భర్తను దూషించడం విన్న సతి యజ్ఞకుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది.

*

దేవేంద్రుడి పిలుపు మేరకు మన్మథుడు రతీదేవితో కలిసి ఇంద్రసభకు వచ్చి నమస్కరించి “దేవేంద్రా! నాకు వర్తమానం పంపిన కారణమేమిటి. నా సచివుడు వసంతునితో కలిసి నేను త్రిమూర్తులను సైతం కామపీడితులను చేయగలను. నాకు మీరు సరియైన పని చెప్పండి. నేను తప్పక చేస్తాను” అన్నాడు.

అప్పుడు దేవేంద్రుడు “మిత్రమా!నువ్వు తప్ప నాకు ఎవరూ ఈ సాయం చేయలేరు. నీ ద్వారా ఒక గొప్పకార్యం నెరవేరవలసి ఉంది. తారకాసురుడు బ్రహ్మదేవుడి వలన వరాలు పొంది దేవతలను హింసిస్తున్న సంగతి నీకు తెలుసు. శంకరునికి జన్మించిన కుమారుడు మాత్రమే ఆ దానవుని సంహరించగలడు. దక్షయజ్ఞంలో సతీదేవి అగ్నిప్రవేశం చేసిన తరువాత శివుడు సతీవియోగం భరించలేక యోగసమాథిలో ఉండిపోయాడు. సతీదేవి ఇప్పుడు మేనకా హిమవంతులకు కుమార్తెగా జన్మించింది. గిరిజాదేవి నామంతో వారింట గారాబంగా పెరుగుతోంది. శంకరుడు ప్రస్తుతం హిమవత్పర్వత శిఖరంపై తపస్సు చేస్తున్నాడు. హిమవంతుని కోరికపై పార్వతి శంకరునికి సేవలు చేస్తోంది. నీవు అక్కడకు వెళ్ళి శివ పార్వతుల యందు ప్రేమ పుట్టేటట్లు చేయాలి. వారి వివాహం జరిగితేనే లోక కల్యాణం జరుగుతుంది” అని చెప్పాడు. ఇంద్రుని కోరిక మేర మన్మథుడు తన సఖులతో కూడి శంకరుని ఆశ్రమప్రాంతానికి చేరుకున్నాడు.

కాముని ప్రభావంతో శివుడు తపస్సు చేసే ఆశ్రమం చుట్టూ వసంతం ప్రవేశించింది. ఆ తపోవనం అంతా కోకిల కూతలు, పుష్పపరిమళాలు, తుమ్మెద ఝుంకారాలతో నిండిపోయింది. మన్మథుడు అరవిందము, అశోకము అనే రెండు పుష్పబాణాలను ప్రయోగించాడు, కాని శివునిపై వాటి ప్రభావం లేదు. అప్పుడు రతీదేవితో కలిసి శంకరునిపై ‘సమ్మోహనాస్త్రాన్ని’ సంధించి వదిలిపెట్టాడు. అయినా శంకరునిలో ఎట్టి వికారం కలుగలేదు.

అదే సమయంలో గిరిజాదేవి తన చెలికత్తెలతో కలిసి పూజాద్రవ్యాలను పట్టుకొని శంకరుని సమీపించింది. అప్పటి వరకు ధ్యానంలో ములిగి ఉన్న చంద్రశేఖరుడు కన్నులు తెరిచి ఆమె వైపు చూసాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మన్మథుడు మరల అరవిందపుష్ప బాణాన్ని ప్రయోగించాడు. పార్వతి కన్నులు తెరచిన శంకరుని చూచి ఎంతో భయ భక్తులతో పుష్పాలను సమర్పించి పాదపూజ చేసింది. శివుడు ఆమె ఆదరంగా అందించిన పూలమాలను సాదరంగా అందుకున్నాడు. అదే అదనుగా మన్మథుడు మరల సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. చంద్రముఖి, ఆకర్ణాంత విశాల నేత్రాలుగల పార్వతి ముఖాన్ని చూసిన చంద్రమౌళి హృదయంలో అనురాగం వెల్లివిరిసింది. ఆమె ముఖ సౌందర్యాన్ని మరల మరల చూడాలని కోరికతో క్షణకాలం వికారాన్నిపొందాడు శంకరుడు. వెంటనే తన చిత్త చాంచల్యానికి కారణం తెలుసుకున్నాడు. దిక్కులు పరికింపగా తనపై ఇంకొక పుష్పబాణాన్ని వేయడానికి సిద్ధమవుతున్న మన్మథుడు కనుపించాడు. వెంటనే తన మూడవనేత్రం తెరిచి బాణాలతో సహా మన్మథుణ్ణి దహించివేశాడు. ఇది చూసిన పార్వతి ఎంతో భయపడింది. భయపడుతూ చెలులతో కలిసి తన నివాసానికి వెళ్ళిపోయింది.

భర్త మరణానికి రతీదేవి నేలకూలి శంకించింది. దేవతలందరూ దుఃఖితులయ్యారు. అప్పుడు దేవేంద్రుడు వచ్చి “ఈ పని చేయడంలో మన్మథుని స్వార్థం లేదు. లోకకల్యాణం కోసం దేవతల కోరిక మేరకు ఈ పని చేశాడు. కాముడు లేనిచో సృష్టి కార్యం ఎలా కొనసాగుతుంది. మీరు అతనిని క్షమించి రతీదేవికి పతిబిక్ష పెట్టండి” అని శంకరుని ప్రార్థించాడు.

“రాబోయే ద్వాపరయుగంలో ఈ మన్మథుడు రుక్మిణీశ్రీకృష్ణులకు ప్రద్యుమ్నుడుగా పుట్టి శంబాసురుడనే రాక్షసుణ్ణి వధిస్తాడు. రతీదేవిని వివాహం చేసుకుంటాడు. అంతవరకు కాముడు శరీరంలేనివాడై ఉంటాడు. నేను ఇప్పుడే మన్మథుణ్ణి జీవింప చేస్తున్నాను. అంతవరకు మన్మథుడు నా భక్తగణాలలో ఒకడిగా ఉంటాడు” అని శంకరుడు దేవేంద్రుడికి చెప్పి పంపాడు.

*

శ్రీహరి ద్వాపరయుగంలో యాదవవంశంలో శ్రీకృష్ణునిగా జన్మించాడు. రుక్మిణీదేవిని ఆమె కోరికపై రాక్షస వివాహం చేసుకున్నాడు. రుక్మిణీదేవి స్వయంగా శ్రీదేవి అవతారం. వారి ప్రేమ ఫలితంగా వారికి ఉదయించిన జ్యేష్ఠపుత్రుడే ప్రద్యుమ్న కుమారుడు. శ్రీకృష్ణుని సంతానంలో పేరుపొందినవాడు. పరాక్రమశాలి. శంకరుని పాలాగ్నికి బూడిదయైన మన్మథుడే ప్రద్యుమ్నకుమారుడిగా అవతరించాడు.

ఒకనాడు రుక్మిణి పురిటిగదిలో కుమారునికి పాలిచ్చి నిద్రపుచ్చింది. తరువాత అలసటతో తాను కూడా నిద్రపోయింది. అంతఃపురంలో ఉన్న దాసీలు కూడా ఒక్కొక్కరుగా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. అందరూ అలసి సొలసి నిద్రిస్తున్న సమయంలో శంబరుడు అనే రాక్షసుడు మారు వేషంలో వచ్చి ప్రద్యుమ్నుని దొంగిలించి తీసుకు పోయాడు. ఆ బాలుణ్ణి తీసుకువెళ్ళి సముద్రంలో పారవేశాడు. కృష్ణునిపై పగబట్టి ఆ బాలుణ్ణి కూడా తన శతృవుగా భావించి శంబరుడు ఇలా చేశాడు. ఆ బాలుడు సముద్రపు నీటిలో మునగగానే ఒక పెద్ద చేప అమాంతంగా అతణ్ణి మ్రింగేసింది.

సముద్రజలాల్లో చేపల వేటకు వెళ్ళిన జాలరులు తమ వలలతో చేపలను పట్టడం మొదలెట్టారు. అందులో ఒక జాలరి వలలో ప్రద్యుమ్నుని మింగిన పెనుచేప పడింది. జాలరులందరూ అంత పెద్ద చేపను తమ రాజుగారికి కానుకగా ఇవ్వాలనే నిర్ణయించారు. వారు మరికొన్ని చేపలతో బాటుగా ఆ పెనుచేపను వారికి రాజైన శంబరునికి భక్తితో కానుకగా సమర్పించారు. శంబరుడు ఆ చేపలను వండి తెమ్మని వంటశాలకు పంపాడు. వంటవాడు ఆ చేప కడుపు కోయగా అందమైన చంద్రబింబంతో సమానమైన ముఖంతో ప్రకాశిస్తున్న బాలుడు కనుపించాడు. వారు ఆ విషయాన్ని వంటశాలకు అధిపతియైన మాయావతికి విన్నవించారు.

నారదమహర్షి రతీదేవికి మన్మథుడు తిరిగి ప్రద్ముమ్నునిగా పుడతాడని, ఆ బాలుని చంపడానికి శంబరుడు ప్రయత్నం చేస్తాడని చెప్పాడు. శంకరుని కోపాగ్నికి ఆహుతియైన మన్మథుడు మరల జన్మిస్తాడని తెలిసిన రతీదేవి తన భర్త ఎప్పుడు సాక్షాత్కరిస్తాడా అని ఎదురుచూస్తూ స్వర్గం నుండి దిగి వచ్చి శంబరుని గృహంలో మాయాదేవి అనే పేరుతో కొలువులో చేరింది. వంటశాలలో చేప కడుపులో దొరికిన ఆ బాలుడే మన్మథుడు అని రతీదేవి తెలుసుకొన్నది.

రతీదేవి ఆ బాలుని పుత్రుని వలె పెంచుకోవడానికి శంబరుని అనుమతి తీసుకున్నది. ఆ బాలుని వంటవారి వద్ద నుండి తీసుకొని పోషించడం మొదలుపెట్టింది. శీఘ్రకాలంలోనే ఆ బాలుడు యౌవనవంతుడయ్యాడు. అత్యంత సుందరంగా తయారయ్యాడు. ప్రద్యుమ్నుని చక్కదనం చూసిన సుందరీమణులకు అతనితో కామసౌఖ్యా లనుభవించాలనే కోరిక కలుగుతుంది. ఆయన సౌందర్యాన్ని వర్ణించడం ఎవ్వరితరమూ కాదు. చెరకువింటితో ప్రపంచాన్ని జయించి సమ్మోహితం చేయగల మన్మథుడి అవతారమైన ప్రద్యుమ్నుని, మాయావతి కోరికతో కూడిన చూపులతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు ప్రద్యుమ్నుడు ఆమెతో ఇలా అన్నాడు. “ఓ తల్లీ, నేను నీ కుమారుడననే ఆలోచన లేకుండా సిగ్గువీడి కామిని వలె ప్రవర్తిస్తున్నావు. నన్ను పెంచిన మాతృభావం వదిలివేశావు. నీవిట్లు మోహించుట ధర్మం కాదు”.

ఈ విధంగా పలికిన ప్రద్యుమ్నునితో రతీదేవి ఇలా పలికింది. “నీవు గతజన్మలో బ్రహ్మ మానసపుత్రుడైన మన్మథుడవు. నేను నీ భార్యనైన రతీదేవిని. శంకరుని పాలాగ్నికి దగ్ధమై, ఈ జన్మలో శ్రీకృష్ణరుక్మిణులకు జన్మించావు. నీవు బాలుడవై ఉండగా దయలేని శంబరుడు నిన్ను తల్లితండ్రుల నుండి వేరుచేసి తెచ్చి నిన్ను సముద్రంలో పారవేశాడు. అప్పుడు నిన్నొక పెద్ద చేప మ్రింగింది. ఆ చేప కడుపు నుండి నీవు బయట పడ్డావు. నారదుని వల్ల జరుగబోయేది నాకు ముందే తెలియడం వల్ల నేను మాయావతిగా మారువేషంలో నీ కోసమే ఇక్కడ ఉన్నాను”.

మరల అతనితో “ఈ శంబరుడు మాయలమారి. దుర్మార్గుడు. యుద్ధాలలో దేవతలను జయించి విర్రవీగుతున్నాడు. ఇతనిని సమ్మోహనానిది బాణాలతో నీవు సంహరించు. పాపాత్ముడైన శంబరుడు నిన్ను అపహరించి నప్పటి నుండి నీ తల్లి రుక్మిణీదేవి దుఃఖిస్తూనే ఉంది” అని చెప్పింది. ఈ విధంగా చెప్పి మాయావతి రూపంలో ఉన్న రతీదేవి ప్రద్యుమ్నునికి “మహామాయ” అనే విద్యను ఉపదేశించింది.

ప్రద్యుమ్నుడు కవచము ధరించి, ధనుర్బాణములను చేత దాల్చాడు. శంబరుణ్ణి రణానికి ఆహ్వానించాడు. శంబరుడు తోకతొక్కిన త్రాచులాగ కఠోరంగా గర్జిస్తూ తన గదాదండంతో ప్రద్యుమ్నుని కొట్టాడు. ప్రద్యుమ్నుడు అన్ని రకాల మాయలను నాశనం చేయగల “సాత్త్వికమాయ” అనే విద్యతో ఆ శరపరంపరను ఆపాడు. తన కరవాలంతో ఆ రాక్షసుని శిరస్సును ఖండించాడు. దేవతలు ప్రద్యుమ్నుని విజయానికి ఆనందంతో అతనిపై పుష్పవర్షం కురిపించారు.

శంబరుణ్ణి సంహరించిన తరువాత రతీప్రద్యుమ్నులు ఆకాశమార్గాన ద్వారకలోని రుక్మిణీదేవి మందిరం దగ్గరకు చేరారు. ప్రద్యుమ్నుని ఏమరుపాటుగా చూసిన అంతఃపుర కాంతలు అతనిని కృష్ణుడు అని బ్రమపడ్డారు. శ్రీకృష్ణుని పట్టపుదేవి ప్రద్యుమ్నుని చూసి “ఈ సుకుమారుడు ఎక్కడినుండి వేంచేశాడో, ఈ బాలుని కన్న తల్లి పూర్వజన్మలో ఎన్ని నోములు నోచిందో. నా కుమారుడే బ్రతికి ఉంటే ఇప్పటికి ఇంత పెద్దవాడయ్యేవాడుగా. ఇతడు నా పుత్రుడు కావచ్చు. లేకపోతే శ్రీకృష్ణుడి పోలికలు ఎందుకు వచ్చాయి” అని భావించింది.

ఈ విధంగా రుక్మిణి ఆలోచిస్తుండగా కావలివాడి వలన విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, దేవకీ వసుదేవులు అక్కడకు చేరుకొన్నారు. సర్వం తెలిసినా కృష్ణుడు మౌనం వహించాడు. అప్పుడు నారదుడు అక్కడకు వచ్చి శంబరుడు బాలుని అపహరించినప్పటి నుండి జరిగిన వృత్తాంతం వివరించాడు. రుక్మిణీ దేవి తన పుత్రుని కౌగలించుకొని ఇంత కాలానికి నిన్ను చూసి ధన్యురాలనయ్యాను అని ఎంతో ఆనందించింది. కోడలి సద్గుణాలకు, తన కుమారుని రక్షించినందుకు సంతోషించింది. రతీదేవి పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకొని స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోయింది. శ్రీకృష్ణావతారం తరువాత మన్మథుడు స్వర్గలోకంలో తనకోసం ఎదురుచూస్తున్న రతీదేవిని కలిసాడు. రతీ మన్మథులు త్రిమూర్తుల దీవెనలు తీసుకున్నారు. తమ సహచరులైన వసంత మారగణాలతో కలిసి బ్రహ్మదేవుడు తమకు ఆదేశించిన సృష్టికార్యాన్ని నిర్వహిస్తూ చిరంజీవులుగా ఉన్నారు.

*శుభం*

మరిన్ని కథలు

Aparichitudu
అపరిచితుడు
- మద్దూరి నరసింహమూర్తి
Shivude guruvainaa
శివుడే గురువైనా….
- గరిమెళ్ళ సురేష్
Vinta acharam
వింత ఆచారం
- తాత మోహనకృష్ణ
Nela paalu
నేల పాలు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Manavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Mutyalannam
ముత్యాలన్నం
- మద్దూరి నరసింహమూర్తి
Parishkaram
పరిష్కారం
- తాత మోహనకృష్ణ