స్వార్ధపూరిత పని - మద్దూరి నరసింహమూర్తి

Swardha poorita pani

“గురువుగారూ, ప్రణామం”

“ఆయుష్మాన్భవ. చెప్పు నాయనా”

“గురువుగారూ, చాలా రోజులుగా నాకు ఒక గురుతర బాధ్యత ఇస్తానని చెపుతూ వస్తున్నారు. కానీ, ఇంతవరకూ ఆ బాధ్యత ఏమిటో మీరు నాకు తెలియచేయలేదు, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు”

“నీవు నిస్వార్ధపూరిత పని ఏదైనా చేసినట్టు నాకు అనిపిస్తే తప్పకుండా నీకు ఆ బాధ్యత ఇస్తాను నాయనా”

“నేను తప్పకుండా త్వరలోనే ఆ పని చేసి ఆ బాధ్యత స్వీకరించేందుకు సిద్ధమవుతాను గురువుగారూ”

“సరే, వెళ్ళి నీ అధ్యయన కార్యక్రమం సాగించు”

గురువుగారైన సదానంద సరస్వతిగారి దగ్గర సెలవు తీసుకొని వచ్చిన శిష్యుడు సహాయోగికి స్వల్పంగా ఉన్న వినికిడి సమస్య వలన గురువుగారు ‘నీ స్వార్ధపూరిత పని’ ఏదైనా చేసి చూపించమన్నట్టుగా వినిపించింది. వింతగా ఈరోజు గురువుగారు ఇలా సెలవిచ్చేరేమిటి’ --- అని ఆలోచిస్తూ, అయినా, గురువుగారి ఆజ్ఞ శిరోధార్యం అనుకొన్నవాడై , సరైన సమయం కోసం వేచి చూడాలి అని నిర్ధారించుకున్నాడు.

“నాయనా ఒకసారి వస్తావా” అన్న నారాయణమూర్తిగారి కేక విన్న వారి అబ్బాయి ఆనందం పరుగు పరుగున వచ్చి “ఏమిటి నాన్నా పిలిచేవు” అని తండ్రిని అడిగేడు.

“నీకు కోడలికి కలిసి సమయమైనప్పుడు వచ్చి నాదగ్గర పది నిమిషాలు కూర్చుంటే కోడలి సముఖాన నీతో మాట్లాడాలి”

“అలాగే నాన్నా, మీ భోజనం అయిన తరువాత మాట్లాడదాం. ఈలోగా నేను నా ఆఫీసు పని పూర్తి చేస్తాను”

“సరే, వెళ్ళి పని చేసుకో”

మరో పది నిమిషాలకు వచ్చిన లక్ష్మి “మామయ్యా, మీకు భోజనం వడ్డించేసేదా” అని అడగగానే –

“అలాగే అమ్మా” అని జవాబిచ్చిన ఆయనని చేయి పట్టుకొని లేపి మెల్లిగా నడిపించుకుంటూ భోజనం టేబల్ దగ్గర కూర్చోపెట్టింది.

ఆయన భోజనం చేసిన తరువాత మరలా అతన్ని నడిపించుకుంటూ తీసుకొని వచ్చి వాలుకుర్చీలో కూర్చోపెట్టింది.

భోజనాలు కానిచ్చిన అనంతరం ఆనందం లక్ష్మి మూర్తిగారి దగ్గరకు వెళ్ళి ఆయన కూర్చున్న వాలుకుర్చీ దగ్గరగా చెరో కుర్చీ వేసుకొని కూర్చున్నారు.

“చెప్పు నాన్నా”

“నాకు క్రిందటి నెలలో 83 కూడా దాటేయి అని మీకు తెలుసు. ఇప్పటికి సుమారు పదేళ్లుగా నేను మందులమీదనే బ్రతుకుతున్నాను అని కూడా మీకు తెలుసు”

“ఆరోగ్యావసరాలబట్టి మందులు వేసుకోవాలి కదా మామయ్యా”

“నిజమే. కానీ పగలు పదహారు రాత్రి ఇరవై మాత్రలు మింగుతుంటే విసుగు వస్తోందమ్మా. గుండె వైద్యుడు మీరు రోజూ కనీసం అరగంట నడవాలి అంటాడు. మోకాలి వైద్యుడు నొప్పులతో మీరు ఎక్కువ సమయం నడుస్తే మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయి కానీ తగ్గవు అంటాడు. తింటే అరగదు, తినకపోతే నీరసం. కూర్చుంటే లేవలేను లేస్తే కూర్చోలేను. ఒక మనిషి సాయం లేకుండా నా పనులు నేను చేసుకోలేని బ్రతుకు ఇంకా ఎన్నాళ్లు భరించాలో నేను. ఏ లోకంలో ఉందో కానీ మీ అత్తయ్య అదృష్టవంతురాలు. ఇటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా హాయిగా వెళ్లిపోయింది. నాకు విదేహ ముక్తి ఎప్పుడో అని అనుకోని క్షణం లేదు”

“ఎందుకు నాన్నా ఆ మాటలు. మనకంటే కష్టపడుతున్నవాళ్లని చూసినా తలచుకున్నా మనం ఎంత సుఖంగా ఉన్నామో తెలుస్తుందని నీకు నేను చెప్పాలా”

“కానీ, నేను ఇంకా ఎన్నాళ్లు ఇలా బ్రతకాలి, బ్రతికి మాత్రం ఎవరికి ఉపయోగం అనిపిస్తోంది”

“అదేమిటి మామయ్యా అలా మాట్లాడతారు. మీరు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నారన్నది మాకు ఎంతో గుండె ధైర్యానిస్తుంది. మీ అబ్బాయన్నట్టు అలాటి మాటలు మాటలాడకండి. అలాటి ఆలోచనలు పెట్టుకోక మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మీ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది అని మీకు వేరుగా చెప్పాలా”

“ప్రతీరోజూ ఉదయం లేచిన దగ్గర నుంచీ నాకు సేవ చేయడంతోనే అయిపోతుంది తల్లీ నీకు. మీ పుట్టింటికి వెళ్ళి పుష్కర కాలం దాటిందన్న సంగతి కూడా నీకు గుర్తున్నట్టు లేదు”

“ఫరావాలేదు మామయ్యా, మొబైల్లో మాట్లాడుతున్నాను, అవసరమైతే స్కైప్ లో ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుతున్నాము. మా నాన్నని చూసుకుందికి అక్కడ మా అన్న వదిన ఉన్నారు కదా. నా అవసరం ఉన్న ఈ ఇంటిని మిమ్మల్ని వదిలి ఊరికే అక్కడకి వెళ్ళి ఉండడానికి నా మనసు ఒప్పుకోదు”

“అది నీ గొప్ప మనసు తల్లీ”

“ఈ అనవసరమైన ఆలోచనలు ఆపి హాయిగా పడుకోండి మామయ్యా”

“ఇంకా ఏమైనా చెప్పాలా నాన్నా”

“అసలు విషయానికి వస్తున్నాను. వీలైనంత త్వరలో మన ఊళ్లో ఉన్న సదానంద సరస్వతిగారి దగ్గరకు వెళ్ళి నా జాతకం ఒకసారి ఆయనకు చూపించి ఈ బ్రతుకు భారం నాకు ఇంకా ఎన్నాళ్ళో కనుక్కొని నాకు ముక్తి ఎప్పుడు లభిస్తుందో తెలుసుకొని రా రా”

“అగో మళ్ళా అదే మాట. అయినా ఎవరైనా ఆ విషయం తెలుసుకుందికి జాతకం చూపిస్తారా”

“జాతక బ్రహ్మ అని బిరుదున్న ఆయన జాతకం చూసి ఏదైనా చెప్తే ఆయన చెప్పినట్టుగా అది జరిగితీరుతుంది అన్న గొప్ప పేరుందిరా ఆయనకు. అనారోగ్యబాధలు పడలేని మానాన్న తన తన ఆఖరు రోజు ఎప్పుడో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు, దయచేసి అదేదో చెప్పి ఆయనకు మనశ్శాంతి ప్రసాదించండి’ అని వేడుకుంటే, ఆయన తప్పకుండా చెప్తారని నాకు నమ్మకంగా ఉందిరా”

“ఆయన చెప్పేరనుకో, తెలుసుకొని నువ్వు ఏమి చేస్తావు”

“నాకు విదేహముక్తి ఎప్పుడో తెలిసిపోతే, ఈ అనారోగ్యబాధలు ఇంకా ఎన్నాళ్లు అనుభవించాలో అవగాహన వస్తుంది. అప్పుడు, ఇన్ని రోజులే కదా ఈ బాధలు పడేది అన్న ఆలోచనతో విచార రహితంగా ఆ బాధలు అనుభవించగలను అనిపిస్తోంది. నా మాట కాదనక నాకు ఈ ఒక్క సాయం చేయరా. నా మాట విని అలా చేయమని నువ్వేనా చెప్పు తల్లీ వీడికి”

“మీ ఆలోచన సబబుగా లేదు మామయ్యా. మనిషి అన్నవాడికి మరణం ఎప్పుడో తెలియనంతవరకే బాగుంటుంది. ఎప్పుడైతే ఆ రహస్యం తెలిసిపోతుందో, అప్పుడు మనసు పెట్టే బాధ అంతా ఇంతా కాదు”

“మీరిద్దరూ ఈ ముసలి ప్రాణం మీద దయతోనైనా నేను చెప్పినట్టు చేయండి. ‘ఆత్మహత్య పాపం’ అని వెనకడుగు వేస్తున్నాను కానీ, లేకపోతే ఈ పాటికి నేను అందుకు వెనకాడేవాడిని కాను. మీరు నా మాట వినకపోతే, పాపం అయితే అయిందని నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప, ఈ అనారోగ్యబాధలు భరించే ఓపిక ఇంక నాకు లేదు. నా మాట మీరు వినకపోవడం వలన నేను ఆత్మహత్య చేసుకుంటే, ఆ పాపానికి నన్ను పురిగొల్పిన పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. ఆ పైన మీ ఇష్టం”

తండ్రితో ఇక వాదించి లాభం లేదనుకున్న ఆనందం “నువ్వు చెప్పినట్టు వెళ్ళి వస్తానులే, అతను ఏదో చెప్పినవరకూ నువ్వు మరి ఏమీ ఆలోచించక ప్రశాంతంగా ఉండు”

తండ్రి జాతకం పట్టుకొని సదానంద సరస్వతిగారిని కలవడానికి వెళ్ళిన ఆనందం ద్వారా మూర్తిగారి కోరికను వినిన ఆయన ఒక నవ్వు నవ్వి—

“అంతా విధి ప్రేరితం నాయనా, మనం నిమిత్తమాత్రులం. మీ నాన్నగారి జాతకం పరిశీలించి కబురు చేస్తాను, అప్పుడు వద్దువు గాని” అని చెప్పి –

అక్కడే ఉన్న శిష్యుడు సహాయోగితో -- “వీరి నాన్నగారి జాతకం మొదటి పుటలో ఉన్న జాతకచక్రం ఒక కాగితం మీద వ్రాసి జాగ్రత్త చేసి ఉంచి, జాతకం తిరిగి వారికి ఇచ్చేసేయి. నువ్వు వ్రాసి ఉంచిన ఆ జాతకచక్రం నేను అడిగినప్పుడు ఇద్దుగాని” ---

అని చెప్పి ఆయన ధ్యానముద్రలోకి వెళ్లిపోయేరు.

సహాయోగి దగ్గర సదానంద సరస్వతిగారు చెప్పిన పని అయిన తరువాత ఆనందం మూర్తిగారి జాతకం తీసుకొని వెళ్లిపోయేడు.

వెతకపోయిన తీగ కాలికి తగిలింది అనుకున్న సహాయోగి –

గురువుగారు తనకు ఆరోజు ఆదేశించిన ‘నీ స్వార్ధపూరిత పని’ చేసే సమయం వచ్చిందని నిశ్చయించుకొని -- మూర్తిగారి జాతకచక్రం వ్రాసిన కాగితం తన దగ్గర వేరుగా దాచేసేడు.

ఆశ్రమంలో అణువణువూ తెలిసిన సహాయోగి గురువుగారి పుస్తకాలుండే సొరుగులో అట్టడుగున ఉన్న గురువుగారి జాతకం తీసుకొని, ఒక కాగితం మీద గురువుగారి జాతకం మొదటి పుటలో ఉన్న జాతకచక్రం వేరే కాగితం మీద వ్రాసి – అదే మూర్తిగారి జాతకచక్రంగా గురువుగారికి అందివ్వాలని -- భద్రంగా తన దగ్గర అట్టిపెట్టుకున్నాడు.

సదానంద సరస్వతిగారు జాతకాలు పరీక్షించేటప్పుడు సమయాన్ని వృధా చేయక ఏది ఎక్కడ ఎంత చూడాలో అంతే చూసి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించే అలవాటున్నవారు అని కూడా సహాయోగికి అవగతం.

మరునాడు సదానంద సరస్వతిగారు తనకు సహాయోగి ఇచ్చిన జాతకచక్రంలో ఆయుః పరిమాణం తెలిపే స్తానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఆ జాతకచక్రాన్ని సహాయోగికి తిరిగి ఇచ్చివేస్తూ ఆనందంకి కబురు చేయమని సహాయోగికి చెప్పేరు.

కబురు అందుకుని వచ్చిన ఆనందంతో సదానంద సరస్వతిగారు “నాయనా, నేటికి పదహారో రోజున ఈ జాతకుడికి విదేహముక్తి వ్రాసిపెట్టి ఉంది. కనుక, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని ఈ జాతకుడికి ఆరోజు తుది వీడ్కోలు ఇచ్చేందుకు మానసికంగా మీరు సిద్ధం కాక తప్పదు, అది విధి లిఖితం” అని చెప్పేసరికి –

ఆనందంకి కూర్చున్న చోటునే భూమి కృంగిపోయినట్టు అనిపించి బరువెక్కిన గుండెతో విచారంగా వెనుతిరిగి భారంగా ఇంటికి చేరుకున్నాడు.

ఈ వివరణ విన్న సహాయోగి కాస్త ఆశ్చర్యపోయినా, తేలుకుట్టిన దొంగ చందాన కిక్కురుమనక నిశ్శబ్దంగా ఉండిపోయేడు.

ఆరోజుకి పదహారో రోజు అపరాహ్నం వేళ – సదానంద సరస్వతిగారు విదేహముక్తులవగా -----

సహాయోగికి పీఠాధిపత్యం లభించింది.

నారాయణమూర్తిగారు ఎప్పటిలాగే అనారోగ్య సమస్యలతో ఆ పదహారో రోజు దాటి, పదిహేడురోజు ఆపైన రోజులు కూడా చూడడంతో –

ఆయన జాతక పరిశీలన తప్పుగా పరిణమించినందుకు ----

ఆనందం లక్ష్మి దంపతులు చాలా ఆనందించేరు.

తన విషయంలో సదానంద సరస్వతిగారి జాతక పరిశీలన ఎందుకు తప్పిందని ఎంత ఆలోచించినా –

నారాయణమూర్తిగారికి అంతుచిక్కలేదు.

** శ్రీరామ**

మరిన్ని కథలు

Ratee manmadhulu
రతీ మన్మథులు
- కందుల నాగేశ్వరరావు
Aparichitudu
అపరిచితుడు
- మద్దూరి నరసింహమూర్తి
Shivude guruvainaa
శివుడే గురువైనా….
- గరిమెళ్ళ సురేష్
Vinta acharam
వింత ఆచారం
- తాత మోహనకృష్ణ
Nela paalu
నేల పాలు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Manavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Mutyalannam
ముత్యాలన్నం
- మద్దూరి నరసింహమూర్తి