
“ఒరేయ్, ఒరేయ్ చవటా! ఆ చదవడం ఏమిట్రా?”
“బామ్మా! మరీ అంత డామేజింగ్ గా? …”
“తిట్టనా మరి! పుస్తకం చూస్తూ కూడా తప్పు చదువుతావా?”
“బామ్మా! మా స్కూల్ లో నేను టెలుగు సూపర్ గా చదువుతానని…”
“నీ స్నేహితులు, గురువులు…?”
“అవును. వాళ్ళు నన్ను ఎంత మెచ్చుకొంటారో టెలుసా?”
“అబ్బో! నువ్వు సత్య హరిశ్చంద్రుడవనీ తెలుసు.”
“మరి నా గొప్పతనం తెలిసి కూడా…”
“అక్కడే ఉందిరా నీతో చిక్కు.”
“ వాట్చిక్కు? బామ్మ!”
“అదే…ఇందాక చదివినదే…”
“మల్లీ చదవాలా?”
“అవును. అఘోరించు.”
“అంటే… చదవమనా?”
“ఊ…”
“బామ్మా! టివి చూడటం ఆపి, సరీగ్గా విను. మల్లీ చదవను.” “వన్డే విష్ణుం. బావ భయం, హారం…”
“ హరి హరీ... మళ్ళీ అదే…”
“బామ్మా! నీ నవ్వు లెంపలేసుకోవడం ఆపి…”
“నీ తప్పు ఏమిటో చెబుతా, అది వన్డే కాదురా. వందే. తెలిసిందా?”
“అంతేనా!”
“బావ భయం…హారం కాదు.”
“కాదా? వాట్?”
“కాదు. భవ భయ హరం.” ఇప్పుడు పుస్తకం సరిగ్గా చూస్తూ మళ్ళీ సరిగ్గా ఏడు.”
“ఏడ్వనా? వై బామ్మా?”
“ఆ ఏడ్పు ఏదో నేనే ఏడుస్తా గానీ…నువ్వు చదువు నాయనా.”
“సరే బామ్మ. టాంక్ యు.”
“ఏం చేస్తాం నాయనా! ఇంగ్లీషు మీడియం చదువుల ప్రభావం. అదే నా ఏడుపు. అందుకే ఈ ఏడ్పు.” ********