
కాలింగ్ బెల్, ఎడతెరపి లేకుండా రింగ్ అవడం తో , హడావిడిగా వంట ఇంట్లో నుంచి వచ్చి తలుపు తీసింది రాజ్యం .
తలుపు తీసేసరికి , ఎదురుగా కూతురు రేఖ, ఆయస పడుతూ.
తల్లి ని తోసుకుంటూ లోపలకి వచ్చి , తల్లి ని పక్కకి నెట్టి తలుపు గడియ వేసింది.
" ఏమయిందే ?... " ఆశ్చర్యం గా అడిగింది రాజ్యం.
గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ " హెజ్రా , ... అమ్మా! ..." అంది, రేఖ .
ఒకసారి కూతురు వైపు అసహనంగా చూసి. , " బాగుందే ! ... నీ హడావిడి చూసి , ఏమయిందో అని కంగారు పడ్డాను ." అంది, రాజ్యం, వంట ఇంట్లోకి దారి తీస్తూ .
" అదేమిటీలా అంటావు ! ఎంత భయపడ్డాను ! ...". అంది రేఖ .
" దేనికి హెజ్రాకా ?! ఊ ! బాగుంది ...." స్టొవ్ మీద వున్న మూకుడిలో కూర, ఒకసారి కలిపి, మూత పెట్టింది.
రేఖ , హడావిడిగా , రెండు గ్లాసుల నీళ్ళు , గాప్ ఇవ్వకుండా తాగి, కొంచెం కుదుటపడి , డైనింగ్ హాల్ లోవున్న కుర్చీ లో కూలపడింది. .
వండిన వన్నీ , డిషెస్ లోకి సద్ది, టేబెల్ మిదకి తిసుకు వచ్చి పెట్టి, రాజ్యం కూడా ఒక కుర్చీ లాక్కుని కూర్చుంది.
" ఇప్పుడు చెప్పు . ఏమిటి నీ హడావిడి ? హేజ్రా ఏమిటి ? ఎవరు?? " అంది రాజ్యం.
" నన్ను ఒక హెజ్రా వెంబడించాడమ్మా "
ఏందుకు ? అన్నట్లు , భృకుటి ముడి వేసి చూసింది రాజ్యం .
" అతను మన ఏరియా లోనే వుంటాడుట. యూ ట్యూబ్ చానెల్ లో మా ప్రోగ్రాం , 'ప్రకృతి లో మూగ జీవులు సైతం భాగస్వాములే ' , నచ్చిందిట . హెజ్రా ల గురించి ఒక ప్రోగ్రాం చేయ మని ."
" దానికి భయపడడం , ఎందుకు? ". రాజ్యం ప్రశ్న కి
" ఏమిటమ్మా , హెజ్రాల ని చూస్తే , ఎవరికి భయం కాదు? .."
" ఎవరికో అవుతే , నేను అర్ధం చేసుకోగలను ... కానీ నీకు ? జర్నలిస్ట్ కావాలనుకున్న వ్యక్తికి, భయం వేసిందంటే, ..అర్ధం లేదు .
మాస్ కమ్యూనికేషన్స్, చదివావు . జర్నలిజం , డిప్లొమో చేసావు . హెజ్రా ని చూసి భయ పడ్డావంటే, ...నీ చదువు కి అర్ధం ఏముంది ఇంక ?! " అంది రాజ్యం .
" అందరికీ వేస్తుంది. నీకు వెయ్యదా ఏమిటి ? " అంది కోపంగా రేఖ ..
" కాస్త కామన్ సెన్స్, ఉపయోగించు. వాళ్ళు మన లాంటి మనషులేగా . ఎందుకు భయం ? " అంది రాజ్యం.
కాస్సేపుండి రాజ్యం మళ్ళీ అంది . " అతను ఏదో వాళ్ళ గురించి , ఏదో ప్రోగ్రాం చేయమన్నాడే అనుకో , ఆలోచిస్తాను అనో, చేస్తాను అనో , చెప్పాలి కానీ , భయపడి పారిపోవడం ఏమిటి , చిన్నతనం , కాకపోతే ! " అంటూ నవ్వింది.
***
రేఖ మాస్ కమ్యూనికేషన్ చేసి , జర్నిలిజం లో , డిప్లొమ చేసింది. మంచి జర్నలిస్ట్ కావాలని, ఆమె కోరిక .
" నీకు మంచి జర్నలిస్ట్ అవాలని వుందా ? ఫేమస్ జర్నలిస్ట్ అవాలని వుందా ? అమ్ములూ! రెండింటికీ తేడా వుంది . గుర్తించకపోతే, కష్టపడతావు. ఏ పత్రిక అయినా , ఏ చానెల్ అయినా , వాటికంటూ కొన్ని నిర్దిష్టమయిన, లక్ష్యాలు వుంటాయి. నీ మంచి చెడులు , వారి మంచీ చెడులు, ఒకటి కావల్సిన అవసరం లేదు. వారి లక్ష్యాలు , నీ లక్ష్యాలకి పూర్తిగా భిన్నంగా వుండొచ్చు.
నీకు తెలియదు, అని కాదు . బాగా ఆలొచించి నీ కేరీర్ ని ఎంచుకో . హా!..". ... తండ్రి మాటలు అర్ధం చేసుకో గలిగిన తెలివి కలిగి వున్నదే రేఖ .
ఆమె డిగ్రీ పూర్తయాక కొన్నాళ్ళు , లోకల్ పేపర్ కి, పని చేసింది, అనుభవం కోసం . తర్వాత ఆమె యు ట్యూబెర్ గా అరంగేట్రం చేసింది.
ఆమె కి ,సాయంగా ఆమె క్లాస్ మేట్స్ రోహిణి, సందీప్, చందూ ఆమె దగ్గర చేరారు. ఒకరు షూటింగ్ కి , ఒకరు కంటెంట్ కి, ఒకరు ఎడిటింగ్ కి, ఒకరు యాంకరింగు కి అలా ఒక్కక్కరు ఒక్కొక్క పని చేసే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే సబ్జేక్ట్ ఎన్నుకున్నాక ముందు గా ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన వివరాలు సంపాదించడం లో అందరూ పాల్గొనేలా ఒక ఏర్పాటు చేసుకున్నారు .
అలా వారందరూ కలిసి చేసిన మొదటి షో , 'ప్రకృతి లో మూగ జీవులు సైతం భాగస్వాములే ' బాగా సక్సెస్ అయింది. చాలా వ్యూస్, సబ్ స్క్రిప్షన్స్ వచ్చాయి . ఆ షో ప్రకాష్ చూసాడు. . ప్రకాష్ ఒక హెజ్రా . అదే ఏరియా అయ్యేసరికి , వాళ్ళ గురించి ప్రోగ్రాం చేయమని, ఆమెని రిక్వెస్ట్ చేయసాగాడు . చిన్నప్పటినుండీ హెజ్రాలంటే భయం ఏర్పడింది రేఖకి . "ఆ భయం ఎందుకు వచ్చింది ? హెజ్రాలు భయపడాల్సిన వ్యక్తులా ? "ఇలాంటి ప్రశ్నలు. ఆలోచనలు , ఎప్పుడూ రాలేదు రేఖకి. ఆలొచించాల్సిన అవసరం కూడా రాలేదు.
కానీ ఆ రోజు " వాళ్ళూ మనలాంటి మనుషులే ! " అని తల్లి అన్న మాటలు, ఆమె కి మళ్ళీ మళ్ళీ గుర్తుకు రాసాగాయి.
అలా తల్లి మాటలు, చాలా ప్రభావితం చేసాయి రేఖని , హెజ్రా ల గురుంచిన సమాచారం సేకరించడానికి ప్రేరేపించాయి.
****
రేఖ మర్నాడు స్టూడియో రూం కి వెళ్ళినప్పుడు, ఆమె అందరితో , ఈ విషయం పంచుకుంది, " హెజ్రాల గురించి షో చెయగలమా ?..చెద్దామా ??... " అంటూ.
అందరూ తలోకాస్తా , మాట్లాడి,
" ముందుగా , మనం సమచారం సెకరిద్దాం . తర్వాత , ఏసంగతీ, ఆలో చిద్దాం . " అనే నిర్ణయానికి వచ్చారు.
*****
ఆ తర్వాత పది రోజుల కి, ఒక రోజు, రేఖ ఇంటికి రాగానే, గది లోకి వెళ్లి , తలుపులు వేసుకుంది.
బట్టలు మార్చుకుంటోంది ఏమో, అనుకున్న రాజ్యాం , ఎంత సేపటికీ , రేఖ బయటకి రాకపోవడం తో , ఆమె గది దగ్గరకి వెళ్ళింది, " అమ్ములూ ! ..." అంటూ పిలుస్తూ.
లొపల్నుంచి రేఖ ఎడుపు వినిపించడం తో , ఆశ్చర్య పోయి , కంగారుగా తలుపు తోసుకుని లోపలకి వెళ్ళింది.
వెక్కి వెక్కి ఏడుస్తోంది రేఖ .
"ఏమయిందిరా ??..." ఆదుర్దాగా అంటూ, దగ్గరకి తిసుకుని , గుండెలకి హత్తుకుంది రాజ్యం .
తల్లి అక్కున చేర్చుకునేసరికి రేఖ ఇంక గట్టిగా ఏడ్వ సాగింది.
"ఏమయింది రా ?...చెప్పకపోతే ఏమి తెలుస్తుంది ???..."
"ఎవరయినా, ఎమయినా అన్నారా ??"
"ఎందుకు అలా ఏడుస్తున్నావు ? ... నా బంగారం కదూ !! చెప్పు , తల్లి !..." అంటూ బుజ్జగించసాగింది రాజ్యం .
కాస్సేపటికి, రేఖ ఏడుపు ఆపి
"అమ్మా !... ఇది ఎంత అన్యాయం !!!. మనం సమాజం , ప్రభుత్వాలు అంతా ...అంతా.. దుర్మార్గులమ్మా ! .." ఇంకా వెక్కు తూనె అంది.
అర్ధం కాలేదు రాజ్యానికి . అయినా కూతురి ని అలానె గుండెలకి హత్తుకుని, " ఊ ! ..ఊ !.. " అంటూ ఊ కొట్ట సాగింది.
" నువ్వు అన్నది కరెక్టే అమ్మా !.....హెజ్రాలు మన లాంటి మనుషులే ! ... . హర్మోనల్ ఇంబేలెన్స్ ! ... వాళ్ళు అందరిలాగే లేరని వాళ్ళని , బహిష్కరించడం, అంగీకరించ క పోవడం ఎంత అన్యాయం !.."
" వాళ్ళకి, ఎటువంటి మద్దతూ ఇవ్వకుండా వాళ్ళ బతుకు భారం చేస్తూ , అందరమూ ఎంత అన్యాయాన్ని మూట కట్టుకుంటున్నాము !.
అందరి ఉద్దేశం, వాళ్ళకి బతికే అర్హత లేదనే ! కాకపోతే , అందరూ, వాళ్ళని ఒక బతక లేని దుర్భర పరిస్తితికి , ఎలా నెట్టేస్తారు ??
ఈ వివక్షతని తట్టుకుంటూ , వాళ్ళు బతికి , జివిస్తున్నారంటే , వాళ్ళు చాలా గ్రేట్ అమ్మా .!
ఈ ప్రపంచమంత వాళ్ళని క్షమించ మని అడగాలి అమ్మా !
వాళ్ళ తప్పు కాకపోయినా వాళ్ళని ఎందుకు వెలి వెయ్యాలి ? అందరికీ వుండే హక్కులు, వాళ్ళకి లేకుండా ఎందుకు పోవాలి?? "
వుండి వుండి వెక్కుతూ అంది రేఖ.
కొంచెం ,కొంచెం ,కుదుట పడుతున్న , కూతురి వీపు నిమురుతూ అంది రాజ్యం.
" నువ్వు చెప్పేది , సరి అయినదే రా ! కానీ , ఏడవడం , బాధపడడం వల్ల ఏమీ ప్రయోజనం వుంటుంది ?!, ప్రయోజనం వుండే పనులు, ఏమయినా చేయాలి కానీ . "
" ఇలాంటి వివక్షతలకి, ప్రజలలోంచే మార్పు రావాలి. అందరూ శాస్త్రీయం గా ఆలొచించ గలగాలి . అప్పుడే సరిగా అవగాహన చేసుకోగలరు.
ప్రభుత్వాలు ఎవరి కోసం ఏమి చేయవు. ఏది చేసినా ప్రజలే చేయాలి . నీలాంటి సెన్సిబెల్ వ్యక్తులు కలిసి , ఈ వివక్షతకి వ్యతిరేకం గా, అందరినీ ఆలోచించే విధం గా , ప్రచారం చేపట్టాలి . ఆ విధం గా , కాస్తయినా వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు "
తల్లి మాటలకి , ఆశ్చర్య పో తూ ఆమె కేసే చూస్తూ వుండి పోయింది , కళ్ళు తుడుచుకుంటూ.
" అమ్మా! ఎంత బాగా మాట్లాడుతున్నావు ? ", అంటూ ఆరాధనగా చూసింది తల్లి వైపు.
అప్పటికే , ఆఫీసు నుంచి వచ్చి న శ్యాం , కూడా రాజ్యం మాటలకి విస్తు పోయాడు. "రాజ్యం!, యూ. ఆర్ గ్రేట్ ! . ", అంటూ చప్పట్లు కొట్టాడు.
" మీరు ఎప్పుడు వచ్చారు ? " అంది రాజ్యం.
" కృష్ణుడు, అర్జున్ కి గీత బోధించినట్లు , నువ్వు మాట్లాడావు , చూడు !... అప్పుడు ! ..." అంటూ నవ్వాడు.
కాస్త సిగ్గుపడింది రాజ్యం.
" ఇంతవరకూ , ఈవిడ గారు హెజ్రా ల కి , అన్యాయం అయిందని ఒకటే ఏడుపు ! ఇప్పుడే ఆపింది." అంది
" చిన్నది కదా ! ఇంకా మనలాగ సెన్సిబిలిటీస్ , ఇంకా పోగొట్టు కోలేదు . అయినా , నువ్వు బాగానే ఉపదేశించావుగా ! ", అంటూ నవ్వాడు. నవ్వుతూనే, అతనూ , కూతురి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు.
రేఖ , భుజం చెయి వేసి, " ఇటువంటి సెన్సిబిలిటీ వుండడం , గొప్ప విషయం రా . ఎప్పుడూ పోగొట్టుకోకు ." అన్నాడు.
" ఎవరికి ఏదయినా , నిర్లిప్తం గా పక్కకి వెళ్ళిపోయి , ఏమీ చలించకుండా దైనందిక కార్యక్రమాల లో మునిగి పోతున్నాం. జీవం లేని యంత్రాలు లానే ,బతికేస్తున్నాం .
మన చుట్టూ, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా , మనకి ఏ మాత్రం సంబంధం లేనట్లే వుంటాం . ఇంత ఎందుకు , పక్క వాళ్ళకో, స్నేహితులకో, చివరకి మన ఇంట్లో వాళ్ళకి అయినా , ఎ కష్టం వచ్చినా , శెలవు పెట్టాల్సి వస్తుందని గిల గిల లాడుతాము తప్ప , ఏమాత్రమూ బాధపడం .
ఇంక నోరు లేని ప్రాణులు గురించి వేరే చెప్పాలా ! ఒక కుక్క బస్సు కిద పడి చచ్చిపోతే , 'అయ్యో ' అనం . పిచికలు మొబైల్ టవర్స్ వలన అంతరించి పోతే, గుర్తించం ! పెద్ద పెద్ద చెట్లని నిర్దాక్షిణ్యం గా కొట్టి వేస్తే , కాస్త కూడా చలించం .
రక రకాల ఒత్తిళ్ళు ...ఆలోచించే సమయం కూడా లేకుండా చేసుకుని , చివరకి , సంపాదించే యంత్రాలు లానే మిగిలి పోతున్నాం. కాస్తా అయినా సెన్సిబిలిటీ వుంటే , మన చుట్టూ జరుతున్న వాటికి , నీ లానే, .. అంతా ఏడ్చే వాళ్ళమే !.
నీ లాంటి వ్యక్తులు ఎడారిలో ఒయాసిస్సులు . కాకపోతే మీ అమ్మ చెప్పినట్లు బాధ పడడం తో అపు చేయకుండా, కొంచెము అయినా , పరిష్కారం కోసం సాధ్యం అయినంత కృషి చేయాలి ." అన్నాడు శ్యాం .
రేఖ , కళ్ళు తుడుచుకుంటూ వచ్చిరాని నవ్వు నవ్వింది .
*****
అందరూ సమాచారం సేకరించి , ఏవిధం గా ప్రజెంట్ చేయాలి, అనే విషయం చర్చించు కోవడానికి , ఒక రోజు సమా వేశం అయ్యారు.
మొదటగా రేఖ మొదలు పెట్టింది.
". మొదట సారిగా , నన్ను హెజ్రా ... అతని పేరు ప్రకాష్. నాతో మాట్లాడినప్పుడు, నేను భయ పడి పోయాను. అతని ని తప్పించుకు తిరిగేదాన్ని . ఒకరోజు అతను. నాతో మాట్లాడడానికి, నా వెనకే వస్తూంటే భయపడి , పరిగెట్టి ఇంట్లొకి వెళ్ళి తలుపులు వేసేసుకున్నా . అమ్మ నన్ను కోప్పడింది, " చిన్నపిల్లవా ఏమిటి ! " అని .
" నీకేమిటి ? నాకూ భయమేసేది .... వాళ్ళు ఎప్పుడు కనిపించినా ! . " అన్నాడు చందూ.
" చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది " వాళ్ళు పిల్లలని తీసుకుపోతారు. వాళ్ళని కూడా, హజ్రా లుగా చేసేస్తారు అని .". అన్నాడు సందీప్
" ఇప్పుడు కూడా, అలా అనుకునేవారు లేకపోలేదు " అన్నాడు చందూ.
" వాళ్ళ గురించి సమాచారం ,సేకరిస్తూంటే ఏడుపు వచ్చింది. ఏడ్చి ఏడ్చి ఇంట్లో పెద్ద సీను క్రియేట్ చేసాను కూడా . " అంటూ నవ్వింది , రేఖ . మళ్ళీ అంది ,
" ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు ప్రచారం లో కి రావడానికి కారణం వారి గురించి , శాస్త్రీయ దృక్పధం తో కూడిన సరి అయిన అవగాహన లేకపోవడం . "
" వారి గురించి తెలుసుకుంటూ వుంటే , బాధ వేస్తుంది మరి . వారిని బహిష్కరించడం , వారికి బతక డానికి కూడా లేకుండా , పనులులో చేర్చుకోకపోవడం ..ఎందుకు చేసేవారో ,.... చేస్తున్నారో , నాకిప్పుడు కూడా అర్ధం కాదు . " సందీప్ అన్నాడు.
" వాళ్ళని అలా ఇరుకున పెట్టడం , బతక డానికి సరి అయిన అవకాశాలు ఇవ్వకపోవడం , ...దాని తో చాలా మంది , ముష్టి వాళ్ళుగానో , సేక్స్ వర్కెర్స్ గానూ , మిగిలిపోయారు. పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో , డాన్స్ చేయడానికి తప్ప , వాళ్ళని మైన్ స్ట్రీం లోకి రానివ్వరు. " అన్నాడు చందూ.
" వాళ్ళ తప్పు ఏమీ లేకపోయినా. ఆ విధం గా వాళ్ళని గౌరవం గా బతికే, అవకాశాలన్నిటికీ దూరం చేయడం, ఎంత వరకూ సమంజసం , అని ఎవ్వరూ ఆలోచించరు . " రేఖ అంది.
అందరూ కాస్సేపు మౌనం గా వుండి పోయారు.
సందీప్ నెమ్మదిగా అన్నాడు,
" ఒక వ్యక్తి, హెజ్రా అవుతే ఎవరికి , ఏమి ఇబ్బంది ? కానీ ఎందుకో , వాళ్ళని అందరితో ను కలవ నివ్వరు . కుటుంబలో నే , వాళ్ళ పట్ల వివక్షణ వుంటుంది. ఒక విధమయిన టాబూ అ విషయం చుట్టూ ! .. మాట్లాడనివ్వరు . ఆలోచించనివ్వరు . ఆ టాబూ , తల్లి తండ్రులని, వాళ్ళని దూరం పెట్టెలా చేస్తుంది. వాళ్ళని చూసి , అందరూ భయ పడేలా చేస్తుంది. ఆవిధం గా పని చేసే అవకాశానికి కూడా దూరమవుతారు.
సహజం గానే, పేదరికం అన్ని సమస్యల నీ ఎక్కువ చేస్తుంది. ఈ సమస్య నీ , ఏమీ దయ చూపి , వదలిపెట్టదు. కనీసపు చదువు కి దూరం చేస్తుంది. చదువు లేక, పని లేక , వాళ్ళకి ,..... ఏ విధం గానూ , ఆత్మ గౌరవం గా బతకడానికి అవకాశం లేకుండా , చేస్తుంది. ఒక విధం గా ,"మీకు బతికే అర్హత ఏమాత్రం లేదని చెప్పడమే! !.. " " , సందీప్ గొంతు బాధ తో జీర
పోయింది.
" ఇది ఒక వైకల్యం అనుకున్నా , చాల రకాల వైకల్యాలకి, లేని టాబూ , దీనికి ఎందుకో అర్ధం కాదు ! . " అన్నాడు చందూ.
" నేను చదివాను ! .. హెజ్రాలు , ...వీళ్ళని ట్రాన్స్జెండెర్స్ అని కూడా అంటారు . వీరిలో లాయర్, జడ్జ్ , మేయర్ , నటి, కవి, ఇలా అందరూ , అన్ని రంగాలలో వున్నారు. .. వాళ్ళ గురించి చదువుతూంటే నాకు చాలా ఇన్సపై రింగ్ గా అనిపించింది . ఇటువంటి టాబూస్ ని అధిగమించి ఇలా అన్ని రంగాలలోకి ప్రవేశించి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. ఎంత గొప్ప విషయం అది ! ఎంత మెచ్చుకోవాలి వారిని ?! . " అంది రేఖ.
" అదే ! ఒకసారి ఆర్ధికం గా స్వయం ప్రపత్తి లు సంపాదిస్తే , టాబూస్ వాటంత అవే సన్నగిల్లుతాయి అని అనిపిస్తోంది." అన్నాడు చందూ. కాస్సేపు ఉండి మళ్ళీ అన్నాడు , నవ్వుతూ , రెఖ కేసి రోహిణి కేసి చూస్తూ,
" ఒకప్పుడు అంటే ,.... మన అమ్మమ్మలు , నానమ్మల కాలం, అనుకోండి . అప్పుడు ఆడవాళ్ళ హక్కులు ,స్వతంత్రం గురుంచి చాలా చర్చలు జరిగేవి. ఇప్పుడు , అవి మాట్లాడుతే ,అందరికీ హాస్యా స్పదం గా వుంటుంది. "
మళ్ళీ అన్నాడు " మా అంకుల్ ఒకరు ఒకసారి నవ్వుతూ నాతో , అన్నారు,
" చందూ! చాలామంది సంఘ సంస్క ర్తలు , చేయలేని పని , ఒక్క టెక్నాలజీ చేయ గలిగింది. .. .. టెక్నాలజీ వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు చూడు ఆడపిల్లలు ఉద్యోగం లేకుండా ఎవరు ఉంటున్నారు. వాళ్ళకి ఏ హక్కుల గురుంచి అయినా , చెప్పాల్సిన అవసరం వుందంటావా ?! చెపితే ఎంత హాస్యాస్పదం అవుతుంది?! "
'ఎంత బాగా చెప్పారు! ' అని , అనిపించింది. ఎప్పుడూ గుర్తుకు వస్తాయి ఆమాటలు. "
అతనితో అంగీకరిస్తున్నట్లు అంతా తలలు ఊపారు.
" అదొక్కటే కాదు. ఆడవాళ్ళ పీరియడ్స్ గురించి ..... ఒకప్పుడు , మాట్లాడడం టాబూ గా వుండేది . మరి ఇప్పుడు ఆడవాళ్ళే కాదు , మగ వాళ్ళు కూడా, ఈ విషయం ఎటువంటి సంకోచం లేకుండా మాట్లాడ గలుగుతున్నారు. " నవ్వుతూ అన్నాడు సందీప్
" అవును ! " , అంటూ రేఖ వుండి , వుండి ,.... మాట్లాడ సాగింది.
" ఆర్ధిక స్వాతంత్ర్యం అన్నీటికీ పరిష్కారం చూపిస్తుంది. అదీ ఒక పరిష్కారమే . కానీ దానికి కూడా , వాళ్ళకి, అవకాశాలు లేకుండా చేస్తున్నారు .
అందుకే హెజ్రాల గురించి ఒక శాస్త్రీయ పరమయిన అవగాహన కలిగే విధం గా ఎక్కువగా ప్రచారం అవసరం . అందుకు, వారి గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశాలు కల్పించాలి. ఎక్కువ మంది మాట్లాడాలి .
ఆ విధం గా , వారి పట్ల వున్న అపోహలు ,పోయే అవకాశం కలుగుతుంది.
హెజ్రా ల పట్ల భయాలు. అపోహలు పోతే, వాళ్ళకి పనులు దొరికే అవకాశం, ....గౌరవం గా బతికే అవకాశం, కలుగుతాయి. "
" అవును ! అవును ! .... " అంటూ కోరస్ పలికారు చందూ, సందీప్ .
" ఇంత సేపూ మనమే మాట్లాడుతున్నాము. రోహిణీ ! ఏమిటి ఏమీ మాట్లాడవు? .." అన్నాడు చందూ. రేఖ , సందీప్ కూడా ఆమే కేసి చూసారు , ఏమి చెప్పబొతోందొ అనే ఉత్కంఠ తో .
తలవంచుకుని అంతవరకూ మౌనం గా వున్న రోహిణి, ఒకసారి తల ఎత్తి " అందరి కేసి ఒక సారి
చూసి " నేను, ఒక ట్రాన్స్ జెండెర్ ని .." అంది .
అందరూ ఒక్కసారి షాక్ తిన్నట్లు అయ్యారు. రేఖ , చందూ, సందీప్ ముగ్గురూ , ఒకరి మొహాలు ఒకసారి చూసుకుని మౌనంగా, తల వంచుకున్నారు.
ఏమి మాట్లాడాలో తెలియ లేదు వాళ్ళకి.
" మీకు ఇది షాక్ గా వుంటుందని తెలుసు. సారీ! .." అంది రోహిణి.
" మీరు చెప్తున్నది ...అంతా విన్నాక , నన్ను గురించి నేను చెప్పుకోకపోతే , నాకు నేను అన్యాయం చేసుకుంటున్నట్లే ! , అని
అనిపించింది.
నాగురించిన, ఈనిజం, మొదటిసారిగా , ఇదే , నేను చెప్పడం. . నా ఫేమిలీ కానీ, నేను కానీ ఈ విషయం ఇంతవరకూ ఎవరికీ చెప్పలేదు. మా అందరిలోనూ న్యూనతా భావం. ఎవరికి అయినా తెలుస్తుందేమొ, అని భయం. ఇన్నేళ్ళూ ఈ నిజం తెలియకుండా జాగ్రత్త పడడం లో నే , గడిచిపోయింది.
సెక్స్ మార్పిడీ ఆపరేషన్ చేయించుకోవడం తో , ఈ సమస్య కి ముగింపు వస్తుందని అనుకుంటూ వస్తున్నాము. దానికి అన్ని ఏర్పాటులూ చేస్తున్నారు నా పేరెంట్స్ .
నా పేరెంట్స్ ,ఇద్దరూ వర్కింగ్. మెరుగయిన ఆర్ధిక పరిస్తితి వలన, నన్ను బాగా ప్రొటెక్ట్ , చేసారు. ట్రాన్స్జెండెర్ అని చెప్తే, అందరూ చూపించే వివక్షత ని, భరించడమూ కష్టమే . అంతకు మించి ఉద్యోగాల అవకాశాలు కూడా ఉండక పోవచ్చు, అనే భయం . అందుకే ఈ విషయం , గుట్టుగానే వుంచదలుచు కున్నాము. " వుండి వుండి మాట్లాడుతున్న రోహిణి ,
అందరికేసి ఒక సారి చూసి , " నావల్ల మీరు ఏదయినా ఇబ్బంది ఫీలవుతే,...... నేను మానేస్తాను!. " అంది.
" నో !... అంతా ఒకసారే అన్నారు. "
" ఇంత సేపు మాట్లాడింది , వట్టి గొంతు శోష , అనుకుంటున్నావా ? నిజాయితీ కనిపించలేదూ ?.." అంది రేఖ ఆవేశం గా.
" నిజాయితీ కనిపించింది కాబట్టే , నేను చెప్ప గలిగాను .." అంది రోహిణి.
అందరూ మౌనం గా వుండిపోయారు, చాలా సేపు.
" ఇది నాకు మంచి అవకాశం . నన్ను నేను న్యూనతా భావం నుంచి బయట పడేసుకోగలిగే అవకాశం . అందుకే ! నన్ను నేను ట్రాన్స్జెండెర్ గా పరిచయం చేసుకుని ఈ ప్రోగ్రాం కి నీ తో పాటు యాంకరింగ్ చేస్తాను , రేఖా !. ." అంది. రోహిణి.
" సారీ ! ... " అంటూ ఇంకా మాట్లాడబోతున్న రోహిణి కి అడ్డు పడుతూ అంది రేఖ " ఇంతకాలం గోప్యం గా వుంచిన ఈ విషయం నువ్వు ఈ ప్రోగ్రాం గురించి బహిరంగం చేయనవసరం లేదు రోహిణీ. మనం ముందే అనుకున్నాం . మన లక్ష్యం వ్యూస్ కోసం, సబ్స్క్రి ప్షన్స్ కోసం కాదు అని. .."
" వ్యూస్ కోసం, సబ్స్క్రి ప్షన్స్ కోసం కాదు రేఖా , నేను చెప్పేది ! ఇన్నాళ్ళూ నన్ను నేనే అంగీకరించ లేక పోయాను . అది , నాకు తెలుసు . నన్ను నేనే అంగీకరించకో లేక పోతే , బయట వాళ్ళు, అంగీకరించాలని ఎలా అనుకోగలను.? .. .."
" రోహిణీ ! ఆవేశం లో తీసుకునే నిర్ణయం కాదు ఇది. ఎందుకంటే, నీ తల్లి తండ్రుల గురించి కూడా నువ్వు ఆలోచించాలి. ఇన్నాళ్ళు, నీకు అన్ని రకాలుగా, సపోర్ట్ చేస్తూ వస్తున్నారు . వారికి ఏ ఇబ్బందీ కలిగించ కూడదు నువ్వు. నేను ఈ ప్రోగ్రాం డ్రాప్ చేస్తాను కానీ , నువ్వూ , నీ తల్లి తండ్రులూ , ఇబ్బంది పడేలా నేను చేయలేను. మీరేమంటారు ? ".... అంటూ చందూ కేసి, సందీప్ కేసి, చూసింది.
"చాలా బాగా చెప్పావు రేఖా ! ... అంటూ, రోహిణి కేసి తిరిగి. రోహిణీ ! ఇది చాలా సున్నితమయిన విషయం. ఆవేశం లో ఏ నిర్ణయం తీసుకోవద్దు. కొన్నాళ్ళకి నీ ఆపరేషన్ అయి పోతుంది. ఎవరికీ , తెయకుండానే , అన్నీ చక్క బడతాయి . ఎవరికీ చెప్పాల్సిన అవసరం. కూడా కలగదు. " అన్నాడు సందీప్ .
అవును, అన్నట్లు తల పంకించాడు, చందూ.
రోహిణి నవ్వుతూ " నాపైన మీరు చూపిస్తున్న అభిమానానికి , కన్స ర్న్ కి , థెంక్స్ . కానీ , ఇంత చర్చ జరిగేక, నన్ను నేను ట్రన్స్ జెన్డెర్ , అని చెప్పుకొలేకపొతే, నాకు నేను ఏ విధం గా నిజాయితీగా వున్నట్లు ? ...చెప్పుకోవడం వల్ల, నాలో ఆత్మ న్యూనతా భావం , పోగోట్టుకో గలుగుతాను. అప్పుడే, నన్ను నేను అంగీకరించి నట్లు! ఒక విషయం లో మాత్రం , నువ్వు చెప్పినది కరెక్ట్ . నా తల్లితండ్రుల తో ఈ విషయం చర్చిస్తాను. వాళ్ళ అనుమతి తప్పకుండా తీసుకుంటాను . " అంది ఉద్విగ్నంగా.
మళ్ళి అంది, " నా లాంటి వాళ్ళు, కాస్త బాగా బతక గలిగే అవకాశాలు వున్న వాళ్ళు కూడా, ఆత్మ విశ్వాసం తెచ్చుకుని ముందుకు రాకపోతే, మైన్ స్ట్రీం లోకి ఎలా రాగలము . ? ట్రాన్స్జెండెర్ , ' లక్ష్మీ నారాయన్ త్రిఫాఠీ ' గురించి చదువుతూ ఆమె ట్రాన్స్జెండెర్స్ హక్కుల కోసం చేసే , పోరాటం తెలుసుకుని , ఆమె ఆత్మ విశ్వాసానికి ఆశ్చర్య పోయాను. నా లాంటి వాళ్లు బయటకి వచ్చి, " మేము వేరుగా వుండొచ్చు , కానీ , అందరి లాంటి వాళ్ళమే ", అని , ధైర్యం గా చెప్ప డం ద్వారానే , మా లాంటి వాళ్ళ , ఆత్మ గౌరవం , హక్కుల కోసం చేసే , పోరాటాల కి, బలం కలుగుతుంది. ఆమె గొంతులో ఒక ఉత్తేజం .
" నువ్వు చెప్పేది కూడా సరి అయినదే ! ట్రాన్స్జెండెర్స్, అందరి లాంటి వారే అని చెప్ప డానికి , నువ్వు , ఇప్పుడు మా కళ్ళముందు కనిపిస్తున్న ఒక ఉదాహరణ ! " అన్నాడు చందూ, రోహిణి వైపు ఆశక్తి గా చూస్తూ.
" అందుకే ! నన్ను నేను ట్రాన్స్జెండెర్ గా, పరిచయం చేసుకుని , ఈ ప్రోగ్రాం కి , నీ తో పాటు యాంకరింగ్ చేస్తాను , రేఖా !. ." మళ్ళీ , అంది రోహిణి.
" మీ పేరేంట్స్ అనుమతి తీసుకున్నాకే, ఏదయినా రోహిణీ ! ... ఈ ప్రోగ్రాం ఎక్కడికీ పోదు . నువ్వే చేద్దువు గానీ . కానీ, ఒక రెండు రోజులు, బాగా నిలకడగా ఆలోచించు " అంది రేఖ.
*****
ఆతర్వాత రోజు , రోహిణి పేరెంట్స్ , స్టూడియో కి వచ్చారు.
" ఏదొ ఒక వైకల్యం వుందని పిల్లలని తల్లితండ్రులు వదిలి వేయరు కదా. ఏదయినా వివక్ష చూపిస్తున్నారు అనుకోడానికి కూడా ,... అది ఆ పిల్లల గురించిన ఆందోళణ లోంచి వచ్చేదే తప్ప, వేరే రకమయినది కాదు. కొందరు తల్లి తండ్రులు ఆ ప్రెజర్ తీసుకోలేరు. దానికి తల్లి తండ్రులని, తప్పు పట్ట లేము.
ఇది ఒకరమయిన వైకల్యం అనుకున్నా , కాదనుకున్నా , మేము చేయ్యాల్సింది మా బిడ్డకి సాధ్యం అయినంత, సాధ్యాన్ని , మించి కొంత , సపోర్ట్ చేయాలను కున్నాం . అదృష్ట వశాత్తు, నేను నా భర్త ఈ విషయం లో గట్టిగా నిల బడ గలిగాం. " అంది, రోహిణి తల్లి.
" ఇప్పుడూ, అంతే . ఈ విషయం లో , రోహిణి నిర్ణయం ఏదయినా సరే , మాకు అంగీకారమే ! మేము తనకి మద్దతు ఇస్తాం ! . ఈ విషయం లో , చెప్పుకునేందుకు సిగ్గు పడాల్సింది , ఏమి లేదనే, మేము భావిస్తున్నాం . బయట వాళ్ళ గురించి , మాకు అనవసరం. మేము కూడా, ఈ విషయానికి సిగ్గుపడితే, మా రోహిణికి ఏ విధం గా న్యాయం చేసిన వాళ్ళం, అవుతాం . ఇన్నాళ్ళూ , మేము గోప్యం గా వుంచినది ఆమె కోసమే . తను ధైర్యం గా నిలబడితే , మాకు సంతోషమే . దీనిలో తల వంచుకోవాల్సింది , కూడా ఏమీ లేదు . " ఆన్నాడు రోహిణి తండ్రి.
రోహిణి తల్లి తండ్రులు ఇద్దరూ, అలా వాళ్ళ అంగీకారం తెలిపారు. వారి మాటలకి , రేఖ , సందీప్ , చందూ , అభినందించారు . గౌరవం తో శిరస్సు వంచి నమస్కారం చేసారు .
తర్వాత రేఖ , రోహిణీ నే ప్రోగ్రాం యాంకరింగ్ చేయమంది. సందీప్ చందూ కూడా రేఖ కి మద్దతు పలికారు.
"ట్రాన్స్జెండెర్స్ వేరుగా వుండొచ్చు . కానీ, వారు కూడా , అందరి లాంటి మనుషులే ! వారికీ , గౌరవం గా బతికే అవకాశం కల్పిద్దాం . అది మన అందరి బాధ్యత. వారి చుట్టూ అలుముకున్న, భయాలు , అపోహలూ తొలగించుకుందాం .. ట్రాన్స్ జెండెర్ రోహిణి .. నేను !.. " అంటూ , మొదలు పెట్టింది , రోహిణి. ...... "
షో , లైవ్ లో కి వెళ్ళినప్పుడు , ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో , మరి వేచి చూడాల్సిందే ! ...అనుకున్నారు ఆతృతగా, రేఖ, సందీప్, చందూ , రోహిణి ...
***
( ట్రాన్స్ జెండెర్స్ , వేరుగా వుండొచ్చు , కానీ , వారూ మనుషులే అంటూ ట్రాన్స్ జెండెర్స్ హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్న , ఎందరో మహనుభావులు ! ...అందరికీ ఈ సమాజం తరపున వందనాలు ... కృతజ్ఞతలు . ముఖ్యం గా , ఈ విషయంలో ట్రాన్స్జెండర్ సమూహాలతో కలిసి , వారి హక్కుల సాధనకై , ఉద్యమిస్తున్న నా స్నేహితురాలు ఆప్తురాలు , కె.సజయ గారికి , సమాజం అందరి తరపునా వందనాలు ! కృతజ్ఞతలు ! .)