
అర్ధరాత్రి పక్కమీద పతి కనిపించక, తమ పడకగది తలుపు సందులోంచి వస్తున్న వెలుతురు చూసి, ఎక్కడనుంచి ఆ వెలుతురు అనుకుంటూ ఆవలకు వెళ్ళితే, చిన్నగా లైట్ వెలుగుతూన్న డ్రాయింగ్ రూమ్ సోఫాలో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న భర్త సత్యమూర్తిని చూసిన సావిత్రి --
"ఏమిటి పడుకోకుండా ఇలా కూర్చున్నారు, ఎంత సేపైంది ఇలా కూర్చొని, ఏమిటి ఆలోచిస్తున్నారు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
జీవంలేని నవ్వు ఒకటి నవ్విన ఆయన "నిద్ర పట్టకపోతే, సుమారు గంటై ఇలా కూర్చొని ఉన్నాను. నీకు నిద్రాభంగం అవుతుందని ఇక్కడ వచ్చి కూర్చున్నాను"
"ఏమిటి ఆలోచిస్తున్నారు" అంటూ నేను తోడుగా ఉన్నాను అన్నట్టుగా ఆయన చేయి తన చేతిలోకి తీసుకుందామె.
"నా పదవీ విరమణకి ఆరు నెలలే సమయం ఉందని తలచుకుంటే భయం వేస్తోంది సావిత్రీ"
"భయం ఎందుకు, ఉద్యోగబాధ్యతలనుంచి విముక్తి పొందుతుంటే ఆనందించక" అంటూ చిన్నగా నవ్వింది ఆమె.
"అబ్బాయి చదువైంది కానీ ఉద్యోగంలో స్థిరపడలేదు. అమ్మాయి పెళ్లికి చేసిన అప్పులు నా కళ్ళ ముందు కరాళ నాట్యం చేస్తున్నాయి. పైగా, దాని కడుపు పండితే, పురిటికి తీసుకొని రావడం తదితర ఖర్చులు ఉన్నాయి. నేనేమైనా సొమ్ము వెనకేసేనా అంటే ఏమీ లేదు.
పదవీ విరమణ చేసిన రోజు ఉద్యోగికి రావలసిన సొమ్ము ప్రభుత్వం వారు తొంభై శాతం ఇచ్చి తీరాలి అన్న నియమం ఉన్నా, ఏదో కారణం చెప్పి ఆరోజున అలా ఎవరికీ ఇవ్వడం లేదు. నా పరిస్థితి కూడా అలాగే ఉంటుందో ఏమో. అదే జరిగితే, అలా దొరకవలసిన సొమ్ము దొరికే వరకూ మన ఇల్లు ఎలా గడుస్తుంది, అప్పులవారికి ఏమి చెప్పాలి - ఈ ఆలోచనలన్నీ నా తలలో గిరగిరా తిరుగుతూంటే కంటికి నిద్ర ఎలా వస్తుంది చెప్పు"
"మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చున్నంత మాత్రాన మన సమస్యలు తీరిపోవు కదా. పైగా, రక్తపోటు చక్కర పరిమాణాలు పెరిగి ఆరోగ్యం పాడవుతుందని మీకు నేను చెప్పాలా. మీ పదవీ విరమణకు ఇంకా ఆరు నెలలుంది. మనిషికి మనోధైర్యం ముఖ్యం. పదండి, పడుకుందురుగాని. రేపు ఆదివారం కలిసి వచ్చింది. తాపీగా లెండి. మీరు లేచేసరికి నేను అన్నీ సిద్ధం చేసి ఉంచుతాను. అబ్బాయితో కలిసి మనం శ్రీసత్యనారాయణస్వామి వ్రతం చేసుకొని ఆ దేవదేవుని శరణు వేడుదాము. అన్నీ సర్దుకుంటాయి అన్న నమ్మకం నాకుంది. మీరు కూడా భగవంతుడిని పరిపూర్ణంగా విశ్వసించి మంచి రోజులు ముందున్నాయని ధైర్యంగా ఉండండి. ‘మనఃపూర్వకంగా నన్ను నమ్మి నన్నే శరణు వేడిన వాడి బాగోగులు పూర్తిగా నేను చూసుకుంటాను’ అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాటలు జ్ఞప్తిలో ఉంచుకొని, ఆ దేవదేవుని త్రికరణశుద్ధిగా నమ్మండి, ఆయనే మనల్ని కాపాడతాడు"
సగటు మనిషికి దైవమే ధైర్యం, ఆ దేవదేవునికి శరణాగతి సమర్పించుకోవడమే సమస్యలకు
సమాధానం, సతీపతుల ఒండొరుల సహకారమే ఇరువురికీ అసలైన ఆశ్వాసన – అని నమ్మిన
సావిత్రి భర్త సత్యమూర్తిని తనదైన ఆలోచనల్లోకి తీసుకొనివొచ్చి, ఆయనకు ఆశ్వాసననిచ్చి,
అండగా నిలిచిన సహధర్మచారిణి అనిపించుకుంది.
** శ్రీరామ**