
"అలా... యూ ట్యూబులో వీడియోలు చూసి జ్ఞానం సంపాదించకపొతే వెళ్లి కారం ఆడించుకురండి" అంది మోహన సుందరంతో భార్య సూర్యకళ.
ఒక్క నిముషం ఈ లోకంలోకి వొచ్చి " అలాగే" అని పైకి అని నీకు సూర్యకళ కాదు, సూర్యకాంతం అని పేరు పెట్టాల్సింది అనుకున్నాడు.
భార్య ఇచ్చిన ఎండు మిరపలు,ధనియాలు తీసుకొని పిండి మరకి బయలుదేరాడు.
అక్కడ మొన్న ఎలక్షన్ లో ఉన్నంత క్యూ వుంది.
రకరకాల లుంగీవాళ్ళు, నైటీల వాళ్ళు, హాఫ్ నిక్కర్ వాలాలు అందరూ వరసలో వున్నారు.
ఇంటికెళ్లి తిట్లు తినడం కంటే ఇక్కడే కాలక్షేపం చేయడం మంచిదని ఫోను చూసుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ చాలా గంటలు గడిపాక మోహన సుందరం వొంతు వొచ్చింది.
కారం ఆడుతుంటే ఆ కమ్మని వాసనకి " హాచ్హ్ ... హాచ్హ్ ... " అని తుమ్మాడు.
"పనికి మాలిన ఎదవా " అంది మెల్లగా లైన్ లో తన వెనక వున్న నైటీ బ్యూటీ.
* * *
"ఏంటి కారం ఇంతే వొచ్చింది, కారం సరిగ్గా ఆడించారా లేదా ?నిజం చెప్పండి అక్కడ ఇచ్చేసి బలాదూర్ తిరిగారు కదూ? "
" అయ్యో లేదే ? అక్కడే నుంచున్నాను ఇంతసేపూ ".. అని కాళ్ళీడ్చుకుంటూ వెళ్లి సోఫా లో కూలబడ్డాడు.
" అప్పుడే అలా కాళ్ళీడ్చేస్తే ఎలాగండీ ? వెళ్లి కోలంగోవా మామిడి కాయలు పట్రండి ఆవకాయ్ ముక్కలు కట్ చేద్దాం. "
ఆవకాయ్ అన్న మాటకు బేగు తీసుకొని బయటకు తుర్రుమన్నాడు మోహన సుందరం.
బజార్లో వున్న కాయలు సూర్యకళకి వాట్సాప్ పెట్టి, వీడియో కాల్స్ లో చూపించి కొనేసరికి తల ప్రాణం తోకలోకి వొచ్చింది.
జాగ్రత్తగా ఇంటికొచ్చాక " అయ్యో నువ్వులనూనె తీసుకురమ్మని చెప్పడం మర్చిపోయానండీ.. ప్లీజ్.. ప్లీజ్.. తెచ్చేయండి " అంది గోముగా.
ఆ గోముతనానికి బండి వేసుకెళ్ళకుండా పరిగెత్తుకెళ్లి నూనె కూడా తెచ్చేసి, మంచం మీదకు వెళ్లే ఓపికలేక వరండాలోనే పడి నిద్దరపోయాడు.
పొద్దున్నే వొళ్ళు నొప్పులన్నా వినకుండా నిద్దురలేపి మామిడి కాయలన్నీ తుడిపించి కోయించింది సూర్యకళ.
* * *
"ఒక చిన్న సీసాడు ఆవకాయ ఇయ్యవే, మా బాస్ కి ఇస్తాను " బతిమిలాడాడు మోహన సుందరం.
" బాసూ లేదు పీసూ లేదు , మీ అమ్మకు కూడా ఒక్క ఆవకాయ బద్ద ఇవ్వని దానిని మీ ముష్టి మొహం బాస్ కి ఎలా ఇస్తాననుకున్నావ్ " అని ఉతికి పారేసింది.
* * *
మరుసటి రోజు స్నానం పాణం అన్నీ సమయానికి ముగించి, సమయానికి బుద్ధి మంతుడిలా టిఫిన్ కానిచ్చేసి సూర్యకళ ని తెగ బతిమాలుకొని, ఒక చిన్న ప్లాస్టిక్ సీసాడు ఆవకాయ్ పట్టుకెళ్ళాడు.
ఆఫీసుకు చేరి సరాసరి బాస్ రూమ్ లో దూరి ఒక కాకా నవ్వుతో " షార్ .. గుడ్ మార్నింగ్ సార్ ర్ మన తెలుగు ఆవకాయ సార్... మీ కోసం నేను స్వయంగా నా స్వహస్తాలతో పెట్టింది సర్ " అన్నాడు హొయలు పోతూ.
అంతే అప్పటికప్పుడు తాను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న టిఫిన్ బాక్సు తీసి దోసెల్లో ఆవకాయ వేసుకొని తన ముందే ఆత్రంగా తినేయసాగాడు బాస్.
టిఫిన్ తినేసాక చేతులు కూడా నాకేస్తూ " బాగుందయ్యా అద్భుతం ... అమోఘం... నువ్వొక పని చేయి , ఈ సంవత్సరం మా ఆవిడకు వొంట్లో బాగోలేక మేము ఆవకాయ పెట్టుకోలేక పోయాము, సమయానికి నువ్వు దేవుడిలా వొచ్చావు, నీ హస్తవాసి అదుర్స్.. "
అని చిన్నగా ఒక సారి త్రేనించి ... " నువ్వొక జాడీడు ఆవకాయ పెట్టేసి నాకు జాడీ తో సహా ఇచ్చేయాలన్నమాట .. ఇదే ఈ సంవత్సరం నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్, అన్నట్టు మొన్న న్యూ ఇయర్ కు నువ్వు నాకు ఏమీ గిఫ్టు ఇవ్వలేదు కదా " అన్నాడు.
అలా చెప్పేసిన బాసు కళ్ళు మూసుకొని మంచి నీళ్లు గట గటా తాగేసి, ఎదురుగా చూస్తే, అక్కడ మోహన సుందరం లేడు.
అప్పటికే " ధబ్ " మన్న శబ్దంతో కిందపడి వున్నాడు,
కాయ్.. కాయ్ .. ఆవకాయ్ ..ధరల కాయ్ ..అంటూ సీలింగు వైపు వెర్రి చూపులు చూస్తూ గిలా.. గిలా కొట్టుకుంటున్నాడు ,పాపం సూర్యకళ గుర్తొచ్చి.
సమాప్తం