
నారాయణపురంలో నివసించే సుందరం, సుమతి దంపతుల ఏకైక సంతానం శివ. అల్లారుముద్దుగా శివను పెంచారు తల్లిదండ్రులు. ఆరవ తరగతి చదువుతున్నాడు శివ. బడికి వెళ్లి బుద్ధిగా చదువుతాడు. వీధిలో పిల్లలతో కలసి బడి మైదానంలో ఆడుకుంటాడు.
బడి నుండి శివ ఇంటికి వచ్చేసరికి ఏవైనా చిరుతిళ్ళు పెట్టేది సుమతి. అమ్మ ఇచ్చిన పదార్ధాలను పళ్ళెంలో వేసుకుని వీధి అరుగు మీద కూర్చుని తినడం శివకి ఇష్టం. ఆ సమయంలో దొడ్లోంచి పరిగెత్తే కుక్కపిల్లలు, ఎదురింటి ముందున్న చెట్టుమీద వాలే పక్షులు, గింజలు ఏరుకుని తినే కోళ్ళు, ప్రక్క ఇంటి ముందున్న పశువుల శాలలో పచ్చగడ్డి మేస్తుండే ఆవులను చూస్తాడు శివ.
ఒక రోజు బడి నుండి శివ వచ్చిన తరువాత బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు ఇచ్చింది సుమతి. ఎప్పటిలాగానే వీధి అరుగు మీద కూర్చుని తింటున్నాడు శివ. అప్పుడే అటువైపుగా వచ్చాడు శంకర్. శివ ముందు నిలబడి “ఒరేయ్ నాకొకటి ఇవ్వవా!’ అని అడిగాడు.
శంకర్ తండ్రి ఒక ఉల్లిపాయల వ్యాపారి దుకాణంలో మూటలు మోస్తాడు. తల్లి పొలం పనులకు వెళుతుంది.
“ఊహూ ..నేనివ్వను” అన్నాడు శివ. “ఒరేయ్ ...ఒక్కటి పెట్టరా!. ఈసారి నేను కొన్నప్పుడు నీకు ఇస్తాను” అని అన్నాడు శంకర్.
“నేనివ్వను. పో ... మీ అమ్మను అడుగు” అన్నాడు శివ.
వీళ్ళిద్దరి మాటలు లోపల ఉన్న సుమతి చెవిలో పడ్డాయి.
వెంటనే గడపలోకి వచ్చిన సుమతి ‘శివా ! వాటిలో ఒకటి శంకర్ కి ఇవ్వు’ అని చెప్పింది.
‘నేనెందుకివ్వాలి?. వాళ్ళ అమ్మను అడగమని చెప్పు!’ బదులిచ్చాడు శివ.
‘ఎదుటివాళ్ళకి పెట్టకుండా తినకూడదు. ఒకటి శంకర్ కి ఇవ్వు’ చెప్పింది సుమతి.
‘నాకు చెప్పే బదులు డబ్బాలో నుండి తీసి నువ్వే ఇవ్వొచ్చు కదా!’ అన్నాడు శివ.
‘ఎదుటి వాళ్లకి ఇవ్వడం నేర్పడానికే నీకు చెప్పాను. శంకర్ కి ఒకటి ఇచ్చావంటే నీకు రెండు ఇస్తాను’ అంది సుమతి. తల్లి అలా చెప్పగానే శివ ఆనందంగా ‘ఇది తీసుకో’ అని ఒక నువ్వుల ఉండ యిచ్చాడు శంకర్ కి.
అది అందుకున్న శంకర్ ముఖంలో కనిపించిన మెరుపు చూసి తృప్తిగా నవ్వుకుంది సుమతి. శంకర్ వెళ్ళిపోగానే లోపలి నుండి రెండు ఉండలు తెచ్చి శివకు ఇచ్చింది సుమతి. కొడుకు ప్రక్కనే కూర్చుని తల నిమురుతూ ‘మనం మనుషులం కాబట్టి పొరుగు వారికి సాయపడాలి. శంకర్ నాన్నకు మనలా డబ్బు లేదు. అడిగినవన్నీ కొని ఇవ్వలేరు. అందుకే నీకు ఇచ్చిన తినుబండారాలు నువ్వొక్కడివే తినెయ్యకుండా శంకర్ లాంటి పిల్లలకి పెట్టు. నీ స్నేహితులు నిన్ను సాయం అడిగితే చెయ్యు” అని బోధపరిచింది సుమతి. శివకు తల్లి మాటలు నచ్చలేదని వాడి ముఖం చూడగానే అర్ధమయింది ఆమెకు.
‘నువ్వు చెప్పినట్టే ఎందుకు చెయ్యాలి? వాళ్ళ అమ్మానాన్నలు కొంటారు కదా!’ అని అడిగాడు శివ.
మంచి అలవాట్లు, మంచి లక్షణాలు పిల్లలకు చిన్న వయసు నుండే అలవాటు చేయాలని అనుకుంది సుమతి. తమ శివకు మంచి బుద్ధులు ఎలా చెబితే అర్ధం చేసుకుంటాడా అని ఒక్క క్షణం ఆలోచించింది. అంతలో ఎదురింటి గోడ మీద కూర్చున్న కాకిని చూసింది సుమతి. లోపలికి వెళ్లి ఒక చపాతీ తీసుకువచ్చి కాకి చూస్తుండగా ముక్కలు చేసి దొడ్లోకి విసిరింది సుమతి.
‘శివా ఇప్పుడేo జరుగుతుందో చూస్తుండు’ అంది సుమతి.
కాకి కిందకు వచ్చి ఒక చపాతి ముక్కను నోట కరచుకుని వెళ్లి ఎదురింటి గోడ మీద కూర్చుని కావ్ కావ్ మని గట్టిగా అరిచింది. ఆ కాకి అరుపులు విన్న చుట్టుప్రక్కల కాకులన్నీ అక్కడకి వచ్చి మిగిలిన చపాతి ముక్కలు అందుకుని ఎగిరిపోయాయి.
‘కాకుల్లో ఎంత ఐక్యత ఉందో బోధపడిందా? మొదటి కాకి ఒక్క చపాతీ ముక్కను మాత్రమే తీసుకుంది. అక్కడ ఉన్నాయి కదా అని ఎక్కువ ముక్కలు మోసుకుపోయి దాచుకోలేదు. మిగతా కాకుల్ని పిలిచింది. తన తోటి కాకుల ఆకలి తీరాలని కోరుకుంది. పక్షులే అంత ఉన్నతంగా ఆలోచించినప్పుడు మనుషులమైన మనం ఎలా ఆలోచించాలి. అందుకే నువ్వు కూడా తోటి పిల్లలకు సాయపడాలి’ అంది సుమతి.
తనకి బోధపడినట్టుగా తలాడించాడు శివ.
‘నువ్వు చెప్పినట్టే చేస్తాను’ అన్నాడు ఆనందంగా.
తల్లి మాటలు శివ మదిలో నాటుకు పోయాయి. అప్పటి నుండి తినడానికి తల్లి ఏమిచ్చినా అందులో కొంతభాగం స్నేహితులకు పెట్టడం అలవాటు చేసుకున్నాడు శివ.
----*--------