
“లే..నవతా..లే.. ఈరోజు పండుగ” అంటూ అమ్మ అనడంతో నవత కళ్ళు నులుముకుంటూ లేచింది. నవతకి పండగ అంటే రోజు సెలవు ఉంటుంది కాబట్టి ఇష్టం. కానీ పండగ రోజు చేయాల్సిన పనులు అంటే మాత్రం అసలు ఇష్టం ఉండదు. కానీ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ పండుగ సంబరాలు చేసుకొని పండగ విందు భోజనాలు చేసుకుంటూ పిండివంటలు చేయడము ఒకళ్ళకొకళ్ళు వాటిని ఇచ్చుకోవడం చూసి నవత ఎంతగానో ఆశ్చర్యపడిపోయేది. “అందరూ ఎందుకు ఇలా ఒకళ్ళకి ఒకళ్ళు పిండివంటలు ఇచ్చుకుంటూ ఉంటారు” అంటూ అమ్మని అడిగింది. “పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరం కలిసిమెలిసిగా ఉంటం కాబట్టి అందరితో బాగా ఉంటే మనతో అందరు కూడా కలిసి ఉంటారు. దానికి పండగ వాతావరణం తోడవుతుంది. ఆ పండుగలో మనమందరం ఇలా పంచుకొని తినడంలోనే ఉంటుంది ఆనందము. లేకపోతే ఎవరైనా ఏమీ పట్టించుకోకుండా ఎవరిది వాళ్లే ఉంటే ఏం లాభం.. అది పండుగ అనిపించుకుంటుందా” అని అంది అమ్మ నాతో. నవతకి మాత్రం పండుగ అంటే, పొద్దున్నే లేవడం లేచి ఇష్టం ఉన్నా లేకున్నా తలార స్నానం చేయడం, పండుగ ముగ్గులు వేయడం, అమ్మకి పండగ విందు భోజనాల్లో హెల్ప్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి, అంతేకాకుండా ముఖ్యంగా దీపావళి ఇలాంటి పండగలు అయితే సాయంత్రానికి పటాసులు కాల్చడం, అందరితో కలిసి బయటికి గుడికి వెళ్లడం దీపాలు వెలిగించడం ఇలాంటివన్నీ ఉంటాయి. వీటిల్లో కొన్ని నవతకి ఇష్టమే కానీ పొద్దున్న లేవడం, తలంటు పోసుకోవడం లాంటివి బొత్తిగా ఇష్టం ఉండవు. నవత సరళలు ఇంటర్ ఒకే కాలేజీలో చదువుతున్నారు. సరళ కూడా నవత ఇంటికి దగ్గరలొనే ఉంటుంది. పండుగ రోజులంటే సెలవు కాబట్టి ఎక్కువ సేపు పడుకోవడం హ్యాపీగా ఆలస్యంగా లేవడము, తనకు నచ్చింది చేయడము, అంటే అదే నవతకి పండుగ డెఫినిషన్. సరళ సాయంత్రం వచ్చింది వస్తూనే అడిగింది “ఏంటి నవత..ఏంటి తయారవ్వకుండా ఇలా కూర్చున్నావు, ఏంటి దీపాలు పెట్టలేదా.. రారా మనం కలిసి పటాసులు కాలుద్దాం” అంది. నవతకి అంతగా ఇష్టపడకపోయినా సరళ అంటే ఇష్టం కాబట్టి “సరేలే ..నువ్వు కాబట్టి వస్తున్నాను లేపోతే నాకు ఇవన్నీ ఇలా పటాసులు కలవడం అంతగా ఇష్టం ఉండదు..” అంది. “పండుగ రోజు పటాసులు కాలడం లేకపోతే ఇక ఏముంటుంది వేరే రోజులకి ఈ రోజులకి తేడా ..మామూలుగా రోజు కాలేజీకి వెళ్లడం మళ్ళీ రావడం, రాగానే మామూలు రొటీన్ గా ఇంట్లో చదువుకోవడం, తర్వాత టీవీ చూడ్డం, చదువుకొని పడుకోవడం ఇలాంటివి తప్పిస్తే పండగ రోజు అంటే కొంచెం ప్రత్యేకంగా ఉండాలి కదా అప్పుడే కదా పండగ వాతావరణం ఉంటుంది ..” అంది సరళ. “ మనము ఇల్లింటి పాదీ, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరం కలిసి ఈ పండగ రోజుల్లో ఒక ప్రత్యేకమైన పోటీ పెట్టుకుందాం ఎలాగంటే ఎవరు చక్కటి ముగ్గులు వేస్తారో వాళ్లకు మొదటి ప్రైజ్ గా ఎవరు బాగా మంచిగా సేఫ్ గా బాణాసంచా కాలుస్తారో వాళ్లకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ గా పెడుతూ ఉంటే అందరికీ ఇంట్రెస్ట్ గా ఉంటుంది “ అంటూ సరళ ఆంటీ తో గుసగుసగా చెప్పి ఆంటీని అంటే నవత అమ్మను ఒప్పించింది. అయిష్టంగా ఒప్పుకున్న నవత కొన్ని ముగ్గులు మాత్రం చాలా బాగా వేసింది. అయితే సాయంత్రం కల్లా అందరూ వచ్చారు. అందరిలోకి పెద్దాయనను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఆయన రావడము, నవత వేసిన ముగ్గుని మెచ్చుకొని నవతకి మొదటి ప్రైజ్ గా ఇవ్వడం జరిగాయి. నవతకి చాలా సంతోషం వేసింది. ఉత్సాహం కలిగింది. వెంటనే సరళతో చెప్పింది “ఇలాంటి పండుగ రోజులు వస్తే ఎంత బాగుంటుందో.. నేను మళ్ళీ మంచి మంచి ముగ్గులు వేసి మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ తెప్పించుకుంటాను “ అంటూ నవ్వుతూ అంది సరళతో. దానికి సరళకి ఎంతో సంతోషం వేసి, “ఎలాగైతేనే నవతని తన ప్లాన్ తో గెలిపించి తనకి పండుగ అంటే ఇష్టం కలిగేలా చేసాను కదా గెలిపించింది కదా ..” అనుకుంటూ ఆంటీ వైపు ఓరగా చూస్తూ నవ్వింది సరళ.