ఆక్రందన - జి.ఆర్.భాస్కర బాబు

Akrandana

రామబద్రం ఓసారి ఆకాశం వంక చూశాడు. ఓసారి బీటలు బారిన పొలం వంక చూశాడు దాహం వేసిన పసిపిల్లలా కనిపించింది పొలం. తిండి లేక సోష వచ్చి స్పృహ తప్పి నట్లు కనిపించింది పొలం.చాతక పక్షిలా చూస్తున్నాడు అతను ఆకాశం వైపు. చినుకు పడక పైరులన్నీ ఎండిపోతున్నాయి నారుమళ్ళల్లో నారు ఎందుకు కొరగాకుండా పోతోంది. ఆ సంవత్సరం అసలు వర్షమే పడలేదని కాదు అకాలంలో వర్షాలు దంచి కొట్టాయి అప్పటికే పొలంలో ఉన్న పంట వానదేవుడి పాలబడింది. ఎలాగోలా శాయశక్తులు కూడగట్టుకుని మళ్లీ సాగు ప్రారంభించారు.మొదటి పంట చేతికి రాకపోవడంతో వ్యవసాయం ఎగసాయంగా అయిపోయింది. ప్రభుత్వం రుణమాఫీ అంటూ ప్రకటించి చేతులు దులుపుకుంది.భారీ వర్షాలకు పంట నష్టం జరిగిందని మొరపెట్టుకుంటే మరోసారి బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవచ్చని ప్రకటించింది ప్రభుత్వం. కురిసిన నీరు కురిసినట్టుగా నదుల్లోంచి సముద్రంలోకి జారిపోయింది. ప్రాజెక్టులో నీరు మళ్ళీ అరకొర గానే ఉండిపోయింది . అప్పటికే రెండో పంట వేశారు రైతులు. నారుమళ్ళ వరకు సాగిన నీటి సరఫరా కొద్దికాలంలోనే ఆగిపోయింది. సాగునీటి కంటే తాగునీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం సాగునీటి సరఫరా మీద కోత పెట్టింది. ఇదంతా వివరం తెలియని బడుగు రైతులు ఇంకా నీళ్లు వస్తాయని ఎదురుచూ స్తున్నారు. వాళ్ళల్లో రామబద్రం కూడా ఒకడు. “ఏందయ్యా అట్ట కూసుండావు”అడిగింది అతని భార్య సాంబమ్మ . “ఏముండాది, పొలానికి నీళ్లు దొరకనట్టే తోస్తా ఉండాదిగా నాకు” అన్నాడు రామబద్రం. “నీళ్లు రాకపోతే నువ్వేం సేస్తావయ్యా? అప్పటికీ ఆయకట్టు రైతులందరూ మునుసోబు గారి దగ్గరికి యెళ్లి వచ్చారు గందా .ఆయన ఏం సెప్పాడు”అడిగింది భార్య సాంబమ్మ. “నిజమేలేయే మన సేతుల్లో ఏముండాది? తోటి రైతులందరూ గూడా నాలాగానే ఉన్నారు గందా” అన్నాడు రామబద్రం. “మరే.. ఇంతకీ మునిసేబు గారు ఏమన్నారో సెప్పనేలేదు నీవు”అంది సాంబమ్మ. “ఆ ఏమంటాడు,.. ఆయన కట్టాలు ఆయన సెప్పాడు. అన్నాడు రామబద్రం “అయినా ఆళ్ళు పెద్దోళ్ళు గందా.. ఆరికినట్టం లచ్చల్లో ఉందంట దాన్ని ఎలా పుడ్సాలో తెలీక ఆయన తల పట్టుకుంటా వున్నాడు”. “అది సరేనయ్యా నీళ్ల గురించి ఏం సెప్పలేదా” అడిగింది సాంబమ్మ. నీళ్ళానిప్పులా?మన ఊరికి ఇంక నీళ్లు రావంట. బోరు మోటర్లు వేయించుకొని సాగు చేసుకోండి అని చెప్తా వున్నాడు ఆయన”అన్నాడు రామబద్రం. “బోరు మోటరా..మనలాంటోళ్ళకి ఎంత కట్టమది. ఎంత లేదన్న ఒక లచ్చ రూపాయలు కర్సు అవుతాయి గందా, మనం అంత డబ్బు యాడ నుంచి తేవాలి మామా”అంది సాంబమ్మ. “ఆళ్ళుమటుకు ఏం సేస్తారులేయే… పైన వోళ్ళు ఏం సెప్తే అదే మన దగ్గర సెబుతారు “అన్నాడు రామబద్రం. “మరి ఏమి సేద్దా మనుకుంటుండావయ్యా” అడిగింది సాంబమ్మ. “నిన్న నాగరాజు అగుపించాడు. ఆడి పొలానికి పక్కనున్న ఇంజనీర్ గారి సెడ్డు మోటారు నించి నీళ్లు అడిగాడంట. నన్ను కూడా ఇంజనీర్ గారినే అడగమంటావున్నాడు అడిగి సూద్దాం ..ఆయన నీళ్లు ఇత్తే ఈఏడాది గడిసి పోతది” అన్నాడు రామబద్రం. “దానికి ఎంత కరుసవుతాది” అంది సాంబమ్మ “యామోనే.. నాకు తెలియదు గందా.సూద్దాం ఏం సేయాలో”అన్నాడు రామబద్రం. ఆరోజు సాయంకాలమే రామబద్రం ఇంజనీర్ గారిని కలిశాడు ఆయన పంటలో పాతిక వంతు ఇవ్వాలని చెప్పాడు అది కూడా ముందుగానే కొన్ని డబ్బులు ఇస్తేనే అని చెప్పాడు. చేసేది ఏమీ లేక రామబద్రం తలూపి వచ్చేసాడు. *****. ***********. ********" నీళ్ల సమస్య దూరం చేసుకోవాలంటే కొత్తగా డబ్బు సమస్య తలకు చుట్టుకున్నట్లయింది. డబ్బు సర్దుబాటు ఎలానా అని ఆలోచిస్తూ ఉంటే మరుసటి రోజు ఉదయం మరో సమస్య బాంబులా నెత్తి మీద పడింది. ఆరోజు ఉదయం బ్యాంకు నుండి ఒక మనిషి వచ్చి ఏవో కాగితాలు ఇచ్చి నిశాని వేయించుకొని వెళ్ళాడు. అది ఏమిటో వివరం చెప్పమంటే నీళ్లు నవుల్తూ ఏదో చెప్పాడు రామబద్రానికి ఏం చేయాలో పాలు పోలేదు. ఆ కాగితాలు పట్టుకొని కరణం మాణిక్యరావు గారి ఇంటికి పరిగెత్తాడు. ఆయన ఆ కాగితాలను చదివి “నీవు ఎక్కడన్నా సంతకాలు చేశావా” అని అడిగాడు. “ నేను సంతకం ఏడ సేస్తాను నిశానీయేగా” అన్నాడు రామబద్రం. “నీవు కిందటి సంవత్సరం తీసుకున్న పంట రుణం యాభై వేలు ఇంకా పది రోజుల్లో కట్టకపోతే నీ పొలం జప్తు చేస్తామని కాగితం పంపారు బ్యాంకు వాళ్లు” అన్నాడాయన. “అదేంటి బాబు పాత రుణం కట్టకపోయినా కొత్త రుణం బ్యాంకులు ఇత్తారని మా ఇంటిది అంటా ఉంది గంద” అన్నాడు రామబద్రం. “అది నాకు తెలియదు కదా ఈ కాగితాలలో అయితే అదే రాసి ఉంది ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో” అన్నాడు ఇంక వెళ్ళమన్నట్లు అతనితో కరణం గారు. రామబద్రానికి మిన్ను మన్ను ఏకమవుతున్నట్టు అనిపించింది. నడి సముద్రంలో కొట్టుకుంటున్నట్లు అనుభూతి చెందుతున్నాడు .తను ఆరుగాలం కష్టించి పనిచేస్తే నోటికి ఇంత ముద్ద దొరకటం కూడా గగనం అయిపోయింది. ఏటెల్లకాలం పాటుపడినా తనకు ఏమీ సుఖం లేదనిపించింది. ఏం చేయాలో తెలియటంలేదు. దిగులుగా గుడిసెకెళ్ళి కూర్చున్నాడు. “ఏందయ్యా అట్టా ఉండావు ఎప్పుడు అనగా ఎల్లావు నీళ్లోసుకురా ఓ ముద్ద తిందువు గాని” అని సాంబమ్మ ఏదో చెప్తూంది. అతని చెవులకు ఏమీ వినపడటం లేదు. కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. సాంబమ్మ అతన్ని ఆ స్థితిలో చూసేసరికి ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. “ఏమైందయ్యా, ఆ ఎర్రి సూపులేంది? ఆ కాగితాల్లో ఏముండాది సెప్పయ్యా”కుదుపుతూ అడిగింది సాంబమ్మ. “పంట రుణం కట్టకపోతే పొలం లాగేసుకుంటారంటే” అని భోరున విలపిస్తున్నాడు అతను. “అదేంటి మామ కిందటేడు మనం చాలా డబ్బులు కట్టాం కదా” అంది సాంబమ్మ. “అవును కదా మనం బ్యాంకులో పని చేసే కామేశం కు ఆ డబ్బు ఇచ్చాం కదా” అన్నాడు రామబద్రం గుర్తు తెచ్చుకుంటూ. “పద మావా అడిగొద్దాం” అంటూ సాంబమ్మ బ్యాంకు కు బయలుదేర తీసింది. తీరా బ్యాంకు కు వెళ్లేసరికి ఆ కామేశం అనే అతనికి చాలా దూరంలో ఉన్న ఊరికి బదిలీ అయింది అని తెలిసింది. దేవుడు ఉన్నాడు కదా అని గుడికి వెళ్తే గుడి మీదే పిడుగు పడినట్లు అయింది వాళ్ళ పరిస్థితి. ఆలుమగలు ఇద్దరూ అక్కడ మేనేజర్ ని కలవడానికి ప్రయత్నం చేశారు ఆయన చాలా చిరాగ్గా వాళ్ల వంక చూసి చూసి పక్కనున్న అటెండర్ తో ఏదో చెప్పాడు. “సారుకి తెలుగు రాదయ్యా నీవెంత మొత్తుకున్నా ఆయనకేం అర్థం కాదు నీ సమస్య నాతో చెప్పు ఏం చేయాలో నేను చెప్తాను” అన్నాడు ఆ అటెండర్. అతనితో తమ గోడంతా వెల్లబోసుకున్నారు వాళ్ళు “సరే ఈ విషయాలన్నీ చూసే ఆయన దగ్గరకు మిమ్మల్ని తీసుకువెళ్తాను ఆయన మీకు ఏదో ఒక దారి చూపిస్తాడు” అన్నాడు ఆ అటెండర్. అతను అక్కడే ఉన్న అసిస్టెంట్ మేనేజర్ దగ్గరకు తీసుకువెళ్లి విషయం అంతా చెప్పాడు. ఆయన వీరి బట్టలు వాలకం చూసి చీదరించుకుంటూనే కంప్యూటర్లో ఏదో చూశాడు. “అసలు వీళ్ళ ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు కదా. రాస్కెల్.. ఆ కామేశం గాడు డబ్బులు అన్నీ తినేసాడు” అని చెప్పాడు. “మరి వీళ్ళ పరిస్థితి ఏంటి సార్” అడిగాడు అటెండర్. “మనం ఏం చేస్తాం. డబ్బు కట్టారా సరే లేదా ఇంకో వారం తర్వాత వాళ్ళ పొలాన్ని వేలం వేసి డబ్బులు తీసుకుంటాం ఏమైనా మిగిలితే వారికి ఇచ్చేస్తాం” చాలా తేలిగ్గా చెప్పాడు ఆ మేనేజర్. “అయ్యా కాస్త దయ ఉంచండి అయ్యా సదువుకోని వాల్లం పేదవాల్లం… మేం చేయని తప్పుకి మమ్మల్ని బలి చేయొద్దండయ్యా’ అని కాళ్లు పట్టుకున్నంత పని చేశారు వాళ్ళు. “ఈ విషయంలో ఎవరము ఏమీ చేయలేమయ్యా. మీరు మోసపోయారు అని నాకు తెలిసినా కాగితాలకు కంప్యూటర్లకు తెలియదు కదా. నేను ఏమీ చేయలేను. మీరు మీ పొలం పోకుండా ఉండాలంటే డబ్బు కట్టడం మినహా వేరే దారి లేదు”అని కరాఖండిగా చెప్పేశాడు అతను. ఇంకా అక్కడ ఉండి ఏమీ చేయలేం అనుకుని గుడిసె దారి పట్టారు వాళ్ళిద్దరూ. ఒకరినొకరు ఓదార్చుకోవటానికి కూడా వాళ్లకు శక్తి లేదు. ఎవరికైనా చెప్పుకునే దారి కూడా వారికి కనపడలేదు. ఆ రాత్రి వారికి కంటిమీద కునుకు లేదు. రెండో జాము కి వారి ఆకలికి పురుగుమందు పాయసం అయింది. తెల్లారితే ఏమిటనే బాధ లేకుండా ఆ రెండు ప్రాణాలు మలిగిపోయాయి.

మరిన్ని కథలు

Eeroju pandaga
ఈ రోజు పండగ
- Sreerekha Bakaraju
Ide naa Ugadhi
ఇదే నాఉగాది.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Amma nerpina sadgunam
అమ్మ నేర్పిన సద్గుణం
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kaay kaay
కాయ్.. కాయ్ ( కథ )
- హరి వెంకట రమణ
Tana daakaa vaste
తనదాకా వస్తే..!
- - బోగా పురుషోత్తం
Kotta konam
Kotta konam
- Prabhavathi pusapati
Sagatu manishi andolana & aswasana
సగటు మనిషి ఆందోళన & ఆశ్వాసన
- మద్దూరి నరసింహమూర్తి