శశాంకలు - మద్దూరి నరసింహమూర్తి

Shashankalu

“నాలుగు రోజులై మీతో మాట్లాడాలని తిరుగుతూంటే, నేటికీ మీతో మాట్లాడే అవకాశమొచ్చింది. ఇప్పుడు కూడా వారం రోజుల తరువాత రమ్మంటే ఎలా గోవిందు బాబూ”

“అందరూ చంద్రమండలం లేదా అంగారకమండలం మీద స్థలాలు కొనడానికి పోటీ పడి ముందుకు వస్తూంటే, మీరు మరీ వెనకపడిన వారి లాగ కొండాపూర్ కూకటపల్లి ప్రదేశాల్లో స్థలాలు కొనడానికి నా దగ్గరకు వస్తే నా వల్ల కాదండీ. అసలు అలాంటి ప్రదేశాల్లో స్థలాలు అమ్మడం మానేసి, ప్రస్తుతం నేను కేవలం చంద్రమండలం మరియు అంగారకమండలం మీద స్థలాలు మాత్రమే అమ్ముతున్నాను. మీకేమైనా కావాలంటే చెప్పండి”

“మేము మనసు మార్చుకొని చంద్రమండలం మీదనే స్థలం కొనాలని ఇప్పుడు వచ్చేము. మాకో చిన్న స్థలం ఇప్పిస్తే, మీ పుణ్యమా అని కొనుక్కుంటాము”

“నేను క్రిందటి సారి చెప్పినప్పుడే సరే అనక మరీ ఇంత ఆలస్యం చేస్తే ఎలా ? ఇప్పుడు చంద్రమండలం మీద కూడా ఖాళీ స్థలాలు లేవు. అంగారకమండలం మీద కొనాలనుకుంటే మనం మాట్లాడుకుందాం. అయినా, ఈరోజుల్లో ఇళ్ల స్థలాలు కొనే ఆలోచనలో జాప్యం పనికిరాదండీ. అంగారకమండలం మీద కూడా ఈ క్షణానికి నా దగ్గర కేవలం తొమ్మిది స్థలాలు మాత్రమే మిగిలేయి, ఏమంటారు”

సత్యవంతుడు అతని సగభాగమైన సావిత్రి గుసగుసలాడుకొని - “రేపు ఇదే సమయానికి వస్తాము గోవిందు బాబూ. రేపు మేము వచ్చేటప్పటికి, దయచేసి వీలైతే చంద్రమండలం మీద మాకు ఒక స్థలం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి. మీ కష్టం మేము ఉంచుకోము లెండి”

తాపీ పని చేసే గోవిందు సామాన్యుడు కాడు, కలల మహారాజు. క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొంటున్న తాను ఎప్పటికైనా ఒక పెద్ద స్థలం కొని, దాన్ని చిన్న చిన్న స్థలాల (ప్లాట్లు) కింద జనానికి ఎక్కువ లాభాలకు అమ్ముతున్నట్టు కలలు కంటూ ఉంటాడు. అటువంటి కలలు అప్పుడప్పుడు అతనికి తెల్లవారగట్ల కూడా వస్తూ ఉంటాయి. తెల్లవారగట్ల వచ్చే కలలు నిజమౌతాయి అని గోవిందుకి గట్టి నమ్మకం.

చేపలు అమ్మేవాడికి చేపల వాసన లేకపోతే ఎలా నిద్ర రాదో, తాపీ గోవిందుకి కూడా సిమెంటు వాసన తగలకపోతే నిద్ర రాదు, నిద్ర కరవైతే కలలు కనలేడు. అందుకే, తన ఇంట్లో సిమెంటు బస్తాలు ఉంచేందుకు కేటాయించిన గదిలోనే ఒక బొంత మీద పడుకొని కమ్మని కలలు కనడం గోవిందుకు అలవాటు.

మరునాడు మధ్యాహ్నం ఒంటి గంటకు సావిత్రి సత్యవంతులు ఉట్టి చేతులతో వెళ్ళే బదులు గోవిందు తినడానికి భోజనం తీసుకొని వెళ్ళేరు. వారిద్దరినీ లోపలి గదిలోనికి తీసుకొని వెళ్ళిన గోవిందు వారు తెచ్చిన భోజనం చూసి తెగ ఆనందపడి “మీరు ఇద్దరు మనుషులకు సరిపోయే విందు భోజనం తెచ్చి నన్ను మరీ మొహమాటం పెట్టేస్తున్నారు”

“గట్టిగా తింటే ఇది ఒక్క మనిషికి కూడా సరిపోయే భోజనం కాదు. మీకు నచ్చితే అదే పదివేలు”

“మీరు ఆ సోఫాలో విశ్రాంతిగా కూర్చోండి, నేను కావలసినది వడ్డించుకొని భోజనం చేస్తూనే మనం మాట్లాడుకుందాము” అని గోవిందు తాపీగా భోజనం చేయనారంభించేడు.

భోజనం చేస్తూనే ---

“మీకు చంద్రమండలం మీద స్థలమే కావాలి అని ఎందుకు అనుకుంటున్నారు”

“ఇక్కడ మనం అనుభవిస్తున్నట్టే అక్కడ కూడా విద్యుత్ కొరత ఉంటే, చంద్రుని మీద ఉండే వెన్నెలతోనైనా కనీసం ఇల్లు వెలుగులతో నింపుకోవచ్చు కదా అని”

“మంచి ముందు చూపు ఉంది మీకు” అంటూ ఒక నవ్వు నవ్వి ---

“నిన్నటినుంచి మీగురించే ఆలోచిస్తూ, చంద్రమండలం మీద నాకోసం ఉంచుకున్న రెండు స్థలాలలో ఒకటి మీకు ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. మీరు సరే అంటే, మనం లావాదేవీలు ఈరోజే మాట్లాడుకొని పని అయింది అనిపించుకోవచ్చు”

తాము తెచ్చిన మిఠాయి తింటున్న గోవిందు నోట్లోనుంచి వచ్చిన ఆ మాటలు వినగానే –

సావిత్రి సత్యవంతులకు తామే మిఠాయి తింటున్నంత హాయి అనిపించింది.

“చల్లని కబురు చెప్పేరు గోవిందు బాబూ. మీ యెడల మాకున్న నమ్మకాన్ని వమ్ముచేయని మీకు ఎన్ని నమస్కారాలు చేసినా సరిపోదు. ఆ పాయసం కూడా కానివ్వండి. తరువాత తాపీగా మనం అన్నీ వివరంగా మాటలాడుకుందాము”

భోజనం కానిచ్చిన గోవిందం “రుచికరమైన భోజనం తినిపించేరు. అన్నదాత సుఖీభవ” అంటూ తృప్తిగా లేచిన తరువాత ముగ్గురూ కలిసి ల్యాప్టాప్ ముందర కూర్చున్నారు. ల్యాప్టాప్ లో గోవింద్ చంద్రమండలంలో ఉన్న స్థలాలు వివరంగా చూపిస్తూ --

“నాకోసం ఉంచుకున్న స్థలాలు అంటే అన్నివిధాలుగా బాగానే ఉంటాయి కదా”

“అందులో మాకు ఎటువంటి సందేహమూ లేదు”

“రెండు స్థలాలు కలిపి నాలుగు వందల గజాలు. అంటే, ఒక్కొక్కటి రెండు వందల గజాలు. తన్ను మాలిన ధర్మం పనికి రాదన్నారు కాబట్టి, రెండింటిలోనూ చివరగా ఉన్న స్థలం నాకోసం ఉంచుకుంటాను, ఆ స్థలానికి ఆనుకొని ఇటు పక్కగా ఉన్న స్థలం మీరు తీసుకోండి, ఏమంటారు”

“మీరెలా అంటే అలాగే”

“గజం ధర వేయి శశాంకలు. అంటే, ఆ స్థలం మొత్తం రెండు లక్షల శశాంకలు అన్నమాట. ఆ పైన రిజిస్ట్రేషన్ ఖర్చు సుమారుగా పాతిక వేల శశాంకలు అవుతుంది. నాకంటూ ఉంచుకున్న స్థలం మీకు ఇస్తున్నందుకు మీరు నాకు ఏభై వేల రూపాయలు వేరుగా ఇవ్వాలి. మీరు స్థలం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారా లేక తరువాత చేసుకుంటారా”

“తరువాత చేసుకుంటాము”

అలాంటప్పుడు స్థలం ధరలో ఇరవై శాతం అనగా నలభై వేల శశాంకలు రెండు రోజుల్లో కట్టేయాలి. అలా మీరు కట్టిన తరువాత –

(అ) స్థలం మీ పేరున అట్టేపెట్టినట్టు;

(ఆ) రెండు నెలల్లో మిగతా ఒక లక్షా అరవై వేల శశాంకలు కట్టాలి అన్నట్టు ;

(ఇ) రెండు నెలల్లో మీరు ఆ మిగతా ఒక లక్షా అరవై వేల శశాంకలు కట్టలేకపోతే, ఇప్పుడు కట్టే నలభై వేల

శశాంకలలో సగం, అంటే ఇరవై వేల శశాంకలు, నష్టపోవడమేకాక మీకు లభించే మిగతా ఇరవై వేల

శశాంకల మీద ఎటువంటి వడ్డీ రాదన్నట్టు –

--ఒడంబడిక పత్రం వ్రాయడం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినదంతా మీకు అర్ధమైనట్టేనా”

“అంతా అర్ధమైంది కానీ, లావాదేవీలు రూపాయాల్లో కదా ఉంటాయి, మరి ఆ శశాంకలేమిటో అర్ధం కాలేదు”

అన్న సత్యవంతుని మాటలకు గోవిందు ఒక పెద్ద నవ్వు నవ్వి –

“మన దేశంలో లావాదేవీలు మీరన్నట్టు రూపాయల్లోనే జరుగుతాయి. కానీ, మీరు కొనే స్థలం చంద్రమండలంలో ఉంది కదా. అందుకని అక్కడ చలామణిలో ఉన్న డబ్బు రూపంలోనే మనం లావాదేవీలు చేయక తప్పదు. మన దేశంలో డబ్బుని రూపాయి అని ఎలా అంటామో, చంద్రమండలంలో డబ్బుని శశాంక అంటారు, అమెరికాలో డాలరు లాగా”

“ఇంకొక సందేహం కూడా మీరు తీర్చాలి”

“కానివ్వండి, అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడూ లోకువే”

“అది కాదు. అవసరమైనప్పుడు చంద్రమండలం ఎలా వెళ్లడమో కొంచెం తెలియచేసి పుణ్యం కట్టుకోండి”

“ఇక్కడినుంచి చంద్రమండలం వెళ్ళి రావడానికి రాకెట్లు ఉన్నాయి. వాటిలో టికెట్ మీరు నేరుగా కొనుక్కున్నా సరే లేదా నా ద్వారా కొనుక్కోనైనా ఎప్పుడు కావలిస్తే అప్పుడు హాయిగా వెళ్ళి రావొచ్చు. ఆరౌ గంటలు మాత్రమే ప్రయాణం. ఉదయం వెళ్ళి పని చూసుకొని రాత్రి సరికి తిరిగి వచ్చేయవచ్చు. సరేనా, ఇంకా ఏమైనా సందేహాలున్నాయా”

“ఆ శశాంకలు మాకు ఎలా దొరుకుతాయి అన్నది కూడా చెప్పండి మరి”

“అన్నీ సమకూర్చిపెట్టడానికి పాపాలభైరవుడిని నేను లేనూ”

“ఒక శశాంకం అంటే మన రూపాయల్లో ఎన్ని”

“ఒక శశాంకం అంటే ఈరోజు లెక్క ప్రకారం వంద రూపాయలుంది. ఈ లెక్కన స్థలానికి మీరు కట్టవలసినది రెండు కోట్ల రూపాయలు మాత్రమే”

“అమ్మో! అంత డబ్బైతే మేము పిల్లలతో ఒకసారి మాట్లాడి రేపు లేదా ఎల్లుండి సరికి వచ్చి మీ దర్శనం చేస్తుకుంటాము” అని దంపతులు గోవిందుకి నమస్కారం చేసి తెచ్చిన భోజనం కారీరు కూడా అక్కడే వదిలేసి బయటకు వెళ్లబోతూంటే –

“రేపు లేదా ఎల్లుండి వచ్చినప్పుడు నాకు ఇవ్వవలసిన ఏభై వేల రూపాయలు ముందుగా ఇస్తేనే మీ పని జరిగేది” అని గోవిందు గుర్తుచేసేడు.

“అలాగే సెలవు” అని బయటకు వెళ్లిపోయేరు సావిత్రి సత్యవంతులు.

ఆరోజు మధ్యాహ్నం తను తినగా మిగిలినవి ఎక్కువ సమయం ఉంచితే పాడైపోతాయి అని, సాయంత్రం ఆరు సరికే మిగిలినవన్నీ ఆబగా తినేసి, ఇంటికి చేరుకొని భుక్తాయాసంతో త్వరగా నిద్రపోయేడు.

సావిత్రి సత్యవంతుడు దంపతులకు చంద్రమండలం మీద తనకంటూ ఉంచుకున్న రెండు స్థలాల్లో ఒకటి రెండు కోట్ల రూపాయలకు అమ్మినట్టు, ఆ స్థలం వారికి ఇచ్చి వేస్తున్నందుకు ఏభై వేల రూపాయలు కూడా వారి దగ్గరనుంచి అందుకున్నట్టు, మరో బకరాని పట్టి మిగతా రెండో స్థలం కూడా మరింత ఎక్కువ ధరకు అమ్మినట్టు, అతని దగ్గర కూడా మరో ఏభై వేల రూపాయలు సంపాదించినట్టు, ఆ మొత్తం డబ్బంతా బాంకులో దాచుకొని దండిగా వడ్డీ పొందుతున్నట్టు కల కన్న గోవిందు –

తన కంటే తెలివి కలవాడు మరొకడు లేడు అని సంతోషంతో పెద్దగా కేకలు వేస్తూ డిస్కో డాన్స్ కూడా చేయనారంభించేడు.

కలలో చేస్తున్న ఆ నాట్యంలో జోరుగా ఊపుతున్న కాళ్ళు చేతులు పక్కనే ఉన్న సిమెంటు బస్తాల గుంపుకు తగిలి, నాలుగు బస్తాలు అతని కాళ్ళ మీద పడి రెండు కాళ్ళ ఎముకలు నుజ్జు నుజ్జయేయి.

అవి బాగు పడడానికి శశాంకల లెక్కలోనే బాగా ఖర్చు అయింది.

**శ్రీరామ**

మరిన్ని కథలు

Chadastam
చాదస్తం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Akrandana
ఆక్రందన
- జి.ఆర్.భాస్కర బాబు
Eeroju pandaga
ఈ రోజు పండగ
- Sreerekha Bakaraju
Ide naa Ugadhi
ఇదే నాఉగాది.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Amma nerpina sadgunam
అమ్మ నేర్పిన సద్గుణం
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kaay kaay
కాయ్.. కాయ్ ( కథ )
- హరి వెంకట రమణ
Tana daakaa vaste
తనదాకా వస్తే..!
- - బోగా పురుషోత్తం
Kotta konam
Kotta konam
- Prabhavathi pusapati