
అరే ఈ షాపు నేనెప్పుడూ చూడలేదే షాప్ పేరు ‘దిల్ పసంద్ ‘భలే ఉందే !ఎప్పుడో చిన్నప్పుడు నాన్నతో బయటకు వెళ్ళేటప్పుడు తిన్నానేమో! సరే వెళ్లి చూద్దాం!అనుకుంటూ హుషారుగా ముందుకు నడిచాడు మాధవ్.
“రండి సార్ !మీరు వెయిట్ చేయండి! నేను లోపలికి పంపిస్తాను” అంది రిసెప్షన్ లో కూర్చున్న అమ్మాయి. “దిల్ పసంద్ తినడానికి వెయిట్ చేయడం ఎందుకు అయోమయంగా అనుకున్నాడు మాధవ్. “మీరు వెళ్ళండి సార్!” అన్నారు ఎవరో వచ్చి.లోపల చాలామంది ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కో టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు
సుమారుగా పది టేబుళ్ళ వరకూఉన్నాయి. “ఇక్కడ దిల్ పసంద్ ఎక్కడ ఉంది” పక్కన ఉన్నతన్ని అడిగాడు మాధవ్. “మీకు దిల్ ఉన్నది కదా సార్! “దిల్ అంటే మనసు! ఉంది !ఉంది!” “అది పసందుగా ఉంటది సార్ ఇక్కడికి వస్తే గంభీరంగా అన్నాడు పక్కన ఉన్న వ్యక్తి. “ ఎలా!” ఆశ్చర్యంగా అన్నాడు మాధవ్. “ఇలా!”అంటూ ఒక లాగులాగాడు ఒక టేబుల్ దగ్గర ఉన్న మనిషి. “చెప్పండి సార్ !మీకు టీవీ సీరియల్ స్టోరీ కావాలా! సినిమా స్టోరీ కావాలా !ఇక్కడ ఏదైనా దొరుకుతది సార్!ఒక సంవత్సరం పాటు కొనసాగే సీరియల్స్ ఉంటాయి సార్! ఇంకా…..” “అరే!సార్!ఆడోహౌలా గాడు!నా దగ్గర చాలా కథలు ఉన్నాయి సార్!సీరియల్ మొదలయితే మూడు సంవత్సరాలు గ్యారెంటీ సార్!” “నీకు నేను ఉన్నాను సార్ మన హీరోయిన్ మస్తు త్యాగాలు చేస్తాది సార్. రండి సార్ మరొకళ్ళు పిలిచారు.
“సార్ నా దగ్గర ఉన్నది చెబితే మీకే ఆశ్చర్యం వేస్తది సార్! థౌజండ్ వాలా సార్!వెయ్యి రోజులు ఖుషి ఇస్తాది సార్!నా సీరియల్ !ఇంకా ఇందులో హీరో గరీబోడు సార్!చాలామంది ఉంటారు సార్! హీరో ఇంట్లో!మస్తు త్యాగాలు ఉంటాయి సార్! హీరో ని చూస్తే చాలా బాధగా ఉంటది సార్! ఏడుపు కూడా వస్తాది సార్!” కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు మరొకడు.
“అరే భాయ్ ఇట్లా రా!మా హీరోయిన్ మస్తు ఫైట్లు చేస్తది సార్! ఒక్క చేత్తో వందమందిని కొడతాది సార్!ప్రతి ఎపిసోడ్లోనూ కాలు స్లిప్పయి కింద పడిపోతుంది సార్! ఆమె పడకుండా హీరో పట్టుకుంటాడు సార్! మస్తు ఉంటది సార్!”అంటూ చెయ్యి పట్టుకుని లాగాడు. “అరే!సార్ నివదలరా!ఆయన నా కథ వింటే ఫిదా అయితడు !ఇంకా ఖుషిగా కూడా అవుతాడు!” అంటూ తనవైపులాగాడు లాగి కుర్చీలో కూర్చో పెట్టాడు.
“చూడండి సార్!హీరో బాగా డబ్బు ఉన్నోడు.వాడు ఏమి చేయడు సార్!” “ ఏం చెయ్యడా !మరి స్టోరీ ఎలా?” అన్నాడు మాధవ్. “అక్కడే ఉంటాది సార్ ట్విస్ట్! వాడికి అనుకోకుండా హీరోయిన్ తో పెళ్లి అయితది సార్!ఇకచూడండి సార్! వాడు పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయితాడు సార్!హీరోయిన్ అంతగొప్పగా తయారుచేస్తుంది సార్!తను మాత్రం ఇంట్లో ఉండిపోతాదిసార్!బయట ఫైటు చేస్తాది సార్ ఇంటికి వచ్చి ఏడుస్తాది సార్! ఇంట్లో అందరూ ఆమెని తిడతారు సార్!” “ ఎందుకు?” “అరే!అడ్డు రాకండి సార్! వాళ్ళందరికీ ఆమె నితిట్టడం అలవాటు సార్! ఆమె మాత్రం త్యాగాల మీద త్యాగాలు చేస్తాది సార్! ఆమె బాధనంత మనతో పంచుకుంటాది సార్! ఆమె ఏడుపు చూసి మనమూ ఏడుస్తాం సార్! ఇది ఇట్లా 500 ఎపిసోడ్లు సాగుతుంది సార్!”చెప్తూనే కళ్ళు తుడుచుకున్నాడు.
“ అరే! ఇట్లా రండి సార్! ఇక్కడ భూతాలు, దెయ్యాలు, పాములు ,దేవుళ్ళు ,దేవతలు ఉంటాయి సార్! హీరోయిన్ కి గొప్ప శక్తులు ఉంటాయి సార్! కానీ మనిషే! చాలా మామూలు స్టోరీ సార్! కానీ దేవుడు,దేవతలు కూడా వచ్చేస్తారు సార్!ఇంకా చాలా రకాలు మిక్స్ చేస్తాను సార్! “సార్! నా కథసార్!” “సార్!ఇలా రండి సార్!” “రండి!బాబు! రండి!” “టెన్ థౌ జెండ్ వాలా! సార్!” “సార్ ఐదుగురు చెల్లెళ్ళు,ఇద్దరు అత్తలు సార్!హీరో ఒక్కడే సార్!” “ హీరో అనుకోకుండా అందరికీ మంచి చేస్తాడు సార్!ఆ విషయం ఆయనకు తెలియదు సార్!” అందరూ రకరకాలుగా చెప్తున్నారు. బుర్రంతా పిచ్చిగా ఉంది
వీపు మీద గట్టిగా చరిచినట్లు అనిపిస్తే ఉలిక్కిపడి నిద్రలేచాడు మాధవ్. “ఒరేయ్ మధు!హాయిగా కలలు కంటున్నావా!నాకు ఒక టీవీ సీరియల్ కథ రాయమన్నానుగా! రాయడం మానేసి హాయిగా కలలు కంటున్నావా! గట్టిగా గదమాయించాడు హరి. “ఇదంతా కలా!”గట్టిగా అన్నాడు మాధవ్. “ఆ!కలే! కథ రాయడం మానేసి కలలు కంటున్నావా!” “ఇప్పుడే రాసి పెడతా! వెయ్యి ఎపిసోడ్లకా,రెండువేల ఎపిసోడ్లక చెప్పు ఎలా కావాలో అలా రాసి పెడతా!” ఉషారుగా అన్నాడు మాధవ్. “ ఇంతకాలం కథ రాయాలంటే చాలా టైం పడుతుందన్నావుగా!
మరి ఇప్పుడేంటి ఇలా!” ఆశ్చర్యంగా అన్నాడు హరి. “అదంతా దిల్ పసంద్ మహిమ! పద!నీకు మంచి స్టోరీ రాసిస్తా! నవ్వుతూ అన్నాడు మాధవ్. “దిల్ పసందా! నాకేం అర్థం కావడం లేదు!అయోమయంగా అన్నాడు హరి. “అదంతా తరువాత చెప్తాలే!”అంటూ మాధవ్ ముందుకు నడిచాడు. అక్కడ మరో అద్భుతమైన సీరియల్ మరో లోకంలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.మరో సీరియల్ ప్రపంచం పిలుస్తోంది.