క్షంతవ్యం - భాస్కర చంద్ర

Kshantavyam

ఆఫీస్ లో సేల్స్ మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, ఇంటర్వ్యూ రెండో రౌండు చాలా కీలకం దాన్ని తీసుకునే బాధ్యత నాది. మొదటి రౌండు హెచ్చారు వారు తీసుకొని , ప్రిలిమినరీ స్క్రీనింగ్, సాధారణ అవగాహన తెచ్చుకొని రెండో రౌందు కు క్వాలిఫై చేస్తారు.రెండోది టెక్నికల్ రౌండ్. ఒక్కోసారి ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ తీసుకుని ఫైనల్ చేస్తాము. రెండో రౌండే చాలా కీలకం కాబట్టి వీలును బట్టి వేరువేరుగా లేదా కలిసి తీసుకుంటాము.

ఈ రోజు మరో ముఖ్యమైన ఆఫీసు పని ఉండడటం వలన ,వచ్చిన అభ్యర్థికి వేర్వేరుగానే ఇంటర్వ్యూ చేయదలచుకున్నాము. ఆఫీసులో సాధారణ పనులు చూసుకున్న ఓ గంట తరువాత మధు దగ్గర నుండీ కాల్ వచ్చింది. మధు అంటే హెచ్చార్ మేనేజర్.మంచి అనుభవం ఉన్న వ్యక్తి మరియు ఉధ్యోగి. "హలో " అంటూ కాల్ తీసుకున్నాను. మధు చెప్పడం మొదలు పెట్టాడు,"సర్ ,కాండిడేట్ బాగానే ఉన్నాడు ఎడ్యుకేషన్, ఫ్యామిలీ విషయాలు అన్నిటి గురించి క్షుణ్ణంగా డిస్కస్ చేశాను, టెక్నికల్ రౌండుకి క్వాలిఫై అయ్యాడు ,మీరు టెక్నికల్ రౌండ్ తీసుకుంటాఅంటే ఇప్పుడే పంపిస్తాను " అన్నాడు. అంతే కాకుండా, "అభ్యర్థిలో సరుదుకు పోయే గుణం ఉంది . అతన్ని మాటల్లో కూడా కనిపిస్తోంది " అని అన్నాడు. అతని జడ్జిమెంట్ సాధారణంగా ఎప్పుడూ కరెక్ట్ అవుతుంది. "సరే నా గది లోకి పంపండి" అంటూ ఫోన్ పెట్టేసాను.

కొద్ది సమయం తరువాత, డోర్ నాక్ శబ్దం విని "కమింగ్ "అన్నాను ఆశ్చర్యం, ఇతను అతనే .... నేను అతన్ని, అతడు నన్ను గుర్తు పట్టడం జరిగినా ,ఇద్దరం హుందాగా మరియు ప్రొఫెషనల్ గా వ్యవహరించాము . టెక్నికల్ గా కూడ అతను ఓకే. అన్నీ ప్రశ్నలకు కన్విన్సింగ్ జవాబులు ఇచ్చాడు. కానీ ఒకటే సందేహం, అతను ఈ ఆఫీసు వాతావరణం లో ఇమడ గలడా అని.ఆదే ఇప్పుడు నా ముందున్న పెద్ద ప్రశ్న ఇక్కడ సరుదుకు పోయే గుణం లేకుంటే చాలా కష్టమని అనుకుంటూ డెసిషన్ కామెంట్స్ ని మధుకు మెయిల్ చేశాను. సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే ఇక్కడ రాణించగలడు ఇక ఎడ్యుకేషన్,అనుభవం, పనిసామర్థ్య అన్ని తరువాతే,ఆని మనసులో అనుకుంటూ ఉండగా ఉదయం ఆఫీసుకు బయలు దేరే సమయంలో జరిగిన సంఘటన అవలీలగా గుర్తు కొచ్చింది.

రోజూ కారులో ఆఫీసుకు బయలు దేరే నేను, కారును సర్వీసింగ్ ఇవ్వడం మూలాన మెట్రోలో రావాల్సి వచ్చింది. మెట్రో స్టేషన్ నుండి మా ఆఫీసు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.అక్కడి నుండి ఆటో లేదా బస్ లో వెళ్ళ వలసీ ఉంటుంది. మెట్రో దిగి బస్టాండులో నిలుచున్నాను.అది ఎప్పుడూ రద్దీగా ఉండే బస్సు స్టాండ్. పదిహేను నిమిషాలు అయినా ఒక్క బస్సు రావటం లేదు.ఆఫీసుకి ఆలస్యం అయ్యేలా ఉంది. పక్కనే షేర్ ఆటోలు లైనుగా నిలిచి ఉన్నాయి, అవి మా ఆఫీసు వైపే వెళతాయి.గమ్య స్థానం పేరును గట్టిగా అరిచి ప్రయాణికులను ప్రోగు చేస్తున్నాడు ఓ డ్రైవరు. కాని ఆ ఆటో వాడు ముందు ఇద్దరూ, వెనక ముగ్గురూ కూర్చుంటేను గానీ కదలడు, ఏది ఏమైనా, ఆలస్యం అవుతుందని వెళ్లి ఆటోలో కూర్చున్నాను .నన్ను చూసి ఇంకో ఇద్దరు అమ్మాయిలు కూడా వచ్చి కూర్చున్నారు.ఇంకా ఇద్దరు వస్తే కాని ఆటో కదలదు, మా అదృష్టం కోసం మరో అతను వచ్చాడు, హమ్మయ్య ఇంకో అతన్ని పంపించురా దేవుడా అని అనుకుంటూ ఉండగానే మరో అతను చేతిలో ఫైలుతో,నీటుగా డ్రస్ వేసుకుని వెళ్ళవలసిన ప్రదేశం చెప్పి డ్రైవరుతో ఎంక్వైరీ చేస్తున్నాడు. "ఇది అటే వెళ్తోంది సార్, ఇట్టా కూర్చోండి" అని తన పక్క జాగా చూపించాడు. మా అందరి ముఖాలు వెలిగి పోయాయి.

అతను మాత్రం ఇబ్బంది పడుతూ, ఇక్కడ కూర్చొని ఎలా ప్రయాణం చేయాలి! అన్నట్టు చూసాడు. "ఎంత?" అని అడిగాడు "ఇరవై రూపాయలు" అన్నాడు డ్రైవర్. అతను బదులుగా "బస్సు టికెట్ పది రూపాయలేగ "అన్నాడు ఆశ్చర్యంగా డ్రైవరు అతని ప్రశ్నకు జవాబుగా,"అవును సవారికి ఇరవై , అంతే,పక్కన లైనులో ఉన్న ఎవ్వరి నైనా అడిగి చూడు,"అన్నాడు. సదరు వ్యక్తి డ్రైవరు వైపు అదోలా చూడ సాగాడు. డ్రైవరే కలుగ చేసుకొని "వస్తే రా! లేకుండా లేదు!!"అని కొంచం కటువుగా చెప్పేశాడు. మాకు మాత్రం టెన్షన్ ,అతనిది ఎం పోయింది లేటు అయ్యేది మాకు . 'ఇరవై రూపాయలు ఇవ్వాలి ,పైగా ముందున్న డ్రైవర్ సీట్లో అడ్జస్ట్ అయ్యి కర్చుకొని కూర్చుని వెళ్లాలి, నేను రాను' అని ఆటో కు కాస్త దూరంగా నిలబడి పోయాడు. మేమంతా నిరాశగా, ఒకరి ముఖాలు ఒకరం చూసుకోవడం తప్ప మరేమీ చేయలేక పోయాం. మరో ఐదు నిముషాలు గడిచాయి వెనుక మేము ముగ్గురo, ఇద్దరు అమ్మాయిలు, నేను ఉన్నాం.అమ్మాయిలు ఎలాగు ముందు ,డ్రైవరుని ఆనుకుని కూర్చోలేరూ ,ఇక మిగిలింది నేను !? వెనుక నుండి డ్రైవరు భుజాన్ని తట్టుతూ, "అతన్ని పిల వండి, నేను ముందుకి వస్తాను" అన్నాను, "అతన్ని వెనుక సీటులో కూర్చో మననండి "అంటూ నా బ్యాగు పట్టుకొని లేవబోయాను. "మీరు ఎందుకూ లేస్తారు సార్, ఇతను కాకుంటే మరో సవారి వస్తుంది లెండి"అన్నాడు డ్రైవర్. "లేదు ,ఐదు నిమిషాల ప్రయాణమేగా సర్దు కొని పోతా"నని వెనుక సీటు నుంచి ముందుకు వచ్చాను.

అతన్ని పిలిచి, వెనుక సీట్లో కూర్చో బెట్టి ప్రయాణం మొదలు పెట్టాము. 'వయసు పైబడిన వాడు ఇలా ఇరుకుగా, డ్రైవరు పక్క సీటులో ఎలా వదిగి కూర్చో గలడు' అన్న ఇంగిత జ్ఢానం కూడ లేకుండా అతను వెనుక సీట్లో దర్జాగా కూర్చున్నాడు'. ఆటో స్టార్ట్ అయ్యి, రయ్యిన ముందుకు సాగింది. కామన్ సెన్స్ అన్నది కరువై పోతుందని లోలోన అనుకున్నాను.రోజురోజుకి సర్దుకు పోయే గుణం జనాల్లో మాయం అయిపోతుంది పోతుంది అని మనసులో వాపోతున్న నాకూ నేను దిగాల్సిన ప్రదేశం ఎప్పుడు వచ్చిందో తెలియనే లేదు. దిగి ఆటో వానికి డబ్బులు ఇచ్చి ఆఫీసు వైపుకు కదిలా... ఇప్పుడు అతనే ఈ కాండిడేట్.

అక్కడ ,చిన్న విషయమైన ,ఆటో సీటు దగ్గర సర్దుకు పోలేని వాడు, ఇక్కడ ఈ వాతావరణంలో ఎలా మనగలడు?? అలా అని ఓ చిన్న సంఘటన ఆధారంగా అతన్ని రిజెక్ట్ చేయడం ఎంత వరకు సబబు??? ఖచ్చితంగా చెప్పాలంటే, ఆ రోజు అతను నాకూ ఆటోలో కలవడం మరియు తదనంతరం ఆ సంఘటన జరగకుంటే , నేను అతన్ని గురించి ఈ విధంగా ఆలోచించే వాడినా??? అతడిని రిజెక్ట్ చేయడానికి వేరే కారణం అంటూ ఏదీ లేదు. యాదృచ్చికంగా జరిగిన చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఒకరి కెరీర్ ని పాడుచేయటాన్ని నా మనసు ఒప్పుకోవటం లేదు.. మధుకు కాల్ చేసి,"ఆ అభ్యర్థి సెలెక్ట్ అయినట్లు మెయిల్ పంపించాను చూడండి "అన్నాను, "ఒకే సార్ ఆఫర్ లెటర్ మెయిల్ చేస్తాను",అన్నాడు మధు. నాలుగైదు రోజుల తరువాత, అభ్యర్ధి దగ్గర నుంచి రిఫ్లై మెయిల్ వచ్చింది, అది అతను మధూకి రాశాడు,నేను సీసీ లో ఉన్నాను. అక్షరాల వెంట మనసు పరుగులు తీసింది.

డియర్ మధు, హెచ్ఛార్ మేనేజర్ గారికి, నమస్కారము!! నన్ను సెలెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. కానీ ఎందుకో మీ ఆఫర్ ను స్వీకరించ లేక పోతున్నాను. మీ దగ్గర పని చేసే అర్హత నాకూ లేదు, ఆ అర్హత ఏమిటో మీతో బహిరంగంగా చర్చించలేను. ప్రస్తుతం, అడ్జస్ట్ అవడం లో కొంచం వెనుక బడి ఉన్నాను ఆని మాత్రం చెప్పగలను. మీరు అన్ని విధాల ఆలోచించియే నాకూ ఈ ఆఫర్ ఇచ్చి ఉంటారు, అయినా ఎక్కడో ఓ మూల ఏదో తెలియని వెలితి. క్షమించండి ఇట్లు ఏదైనా చిన్న పొరపాటు చెస్తే,మనం చూసీ చూడ నట్లు వ్యవహరించి క్షమించి వదిలేసినా,నేటి యువత దాన్ని తేలికగా తీసుకోవట్లేదు. క్షమాపణకు తాము అర్హులమా లేదా అన్న అంశం పై కూడా ఆలోచిస్తుంది ఆ మెయిల్ని ఆర్కీవ్ చేస్తూ,మరో కాండిడేట్ ను వెతికే ప్రయత్నం లో నిమగ్నమై పోయా...

సమాప్తం

మరిన్ని కథలు

Dil pasand
దిల్ పసంద్
- కొడవంటి ఉషా కుమారి
Shashankalu
శశాంకలు
- మద్దూరి నరసింహమూర్తి
Chadastam
చాదస్తం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Akrandana
ఆక్రందన
- జి.ఆర్.భాస్కర బాబు
Eeroju pandaga
ఈ రోజు పండగ
- Sreerekha Bakaraju
Ide naa Ugadhi
ఇదే నాఉగాది.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Amma nerpina sadgunam
అమ్మ నేర్పిన సద్గుణం
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kaay kaay
కాయ్.. కాయ్ ( కథ )
- హరి వెంకట రమణ