నీ కన్నానా!? - భాగ్యలక్ష్మి అప్పికొండ

Nee kannanaa

చీకటింకా చిక్కగా అవ్వలేదు …వెన్నెల పరుచుకున్న ఆ వెలుతురులోనే బాల్కనీలో వెదురు కుర్చీలో కూర్చున్న చక్రవర్తి ''గ్లాసులో ఉన్న ఓల్డ్మాంక్ రమ్ము లో దమ్మున్న సోడా ఎంతవరకు సరిగ్గా కలిపాను' అని మనసులోనే అనుకుంటూ గ్లాసుని కాస్త పైకెత్తి చూశాడు. "ఏంటి చందమామకి చీర్స్ చెబుతున్నారా!?" అన్న ప్రశ్నతో చక్రవర్తి కళ్ళు అప్రయత్నంగా ఆకాశం వైపు చూశాయి. నిజంగానే పౌర్ణమి కావటం వలన., పైగా వాళ్ళున్నది ఆరవ అంతస్తులో అవటం మూలాన చందమామకి చీర్స్ చెబుతున్నట్టుగానే ఉంది. చిన్న గుటక నోట్లో వేసుకుంటూ "భలే కనిపెట్టావే!!" పట్టుచీర కట్టుకుని, చేతికి పచ్చని గాజులు, సిగలో ముడిచిన జాజులు, నుదుటిన పసుపు రాసి అద్దిన కుంకుమ బొట్టుతో కుందనపు బొమ్మలా ఉన్న ఆమెవైపే కన్నార్పకుండా చూస్తూ అన్నాడు. స్విచ్ బోర్డు మీద చేయి వేసి "లైటన్నా వేసుకోవచ్చుగా!?" అంది ప్రేమగా ."వద్దొద్దు!!" అని కళ్ళతో వారించి "ఆ లైట్ వేస్తే చందమామ అందం తరిగిపోతుందోయ్" కొంటెగా కన్ను గీటి నోట్లో నాలుగు వేయించిన నాలుగు జీడి పలుకులు వేసుకున్నాడు. "అంతే గానీ నా చక్రవర్తి ఆరోగ్యం చెడిపోతుందని దిగులు లేదు మీకు.,అంతేగా!?" చీర కొంగుని మునివేళ్ళతో చుడుతూ చిన్న పాటి మూతివిరుపుతో అని లోపలికి వెళ్ళిపోయింది రాధిక. ఆ "నా" అన్నమాట ఎప్పుడూ వినలేదు చక్రవర్తి. ఆ మాట వినగానే అతని గుండె నాలుగు మూలల్లో కోటి పున్నముల వెలుగులు నిండి … వెన్నెల వర్షంలా కన్నీటి ఝరి చక్రవర్తి కళ్ళలో.ఆ కన్నీటి తెరపైనే తన యాభై ఐదేళ్ళ జీవిత చిత్రం కదలాడింది.

పదేళ్ళకే తల్లితండ్రి ఇద్దరిని కొల్పోయాడు చక్రవర్తి పద్దెనిమిదేళ్ళ వయసులో ఆర్మీలో సిపాయిగా చేరాడు. ఇరవై నాలుగెళ్ళకి తన పదహారేళ్ళ మేనకోడలితో పెళ్ళయింది. ఆ వెంటనే ఒక బాబు, పాప పుట్టారు. యవ్వనం మొత్తం దేశం అంటే ప్రేమ కుటుంబం అంటే బాధ్యత అన్న ఆలోచన ధోరణిలోనే గడిపాడు చక్రవర్తి. ఎందుకంటే కుటుంబం పట్ల ఏమాత్రం కాస్త ఎక్కవ ప్రేమగా ఉన్నా మళ్ళీ బోర్డర్ కి వెళ్ళి సేవలు అందించలేనేమొ? అనే సంశయం అతని మనసులో అంతర్లీనంగా వెంటాడేది. నలభై ఏళ్ళ వయసులో ఉద్యోగ విరమణ చేసి బార్యా పిల్లలే లోకంగా బ్రతుకుదామనుకున్న చక్రవర్తి కి తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని తెలిసి బాధపడ్డాడు. తర్వాత తన భార్యకి విడాకులు ఇచ్చి ఆమె ఇష్టపడిన వాడితోనే పెళ్ళిచేసి ఆమె అక్రమ సంబందాన్ని సక్రమం చేసాడు. పిల్లలని తన దగ్గరే పెట్టుకున్నాడు. ఆ సమయంలో అత్తమామతతో సహ అందరూ "నీకు పిచ్చి పట్టిందిరా" అని ఈసడించుకొని తిట్టారు. "అది నా మేనకోడలు. నాకు ఇద్దరు పిల్లలనిచ్చిన తల్లి. ఇంతకు మించి అది నాకేం చేయాలి. దాని మనసు అతనిని కోరుకుందేమొ!? మనిషిని ఆపగలం., మనసుని ఎవరు ఆపగలరు. యుద్దంలో ఎదురుగా వస్తున్న శత్రువులని చంపగలను కానీ వారి మనసుల్లో ఉండే దేభక్తిని చంపలేంగా" అని చెప్పేవాడు. పిల్లలిద్దరిని కన్నుల్లో పెట్టుకొని పెంచి., ప్రయోజకుల్ని చేసిన తర్వాత పెళ్ళిళ్ళు చేశాడు. ఇప్పటి వరకు బాధ్యతలనే ప్రేమించాడు. బరువునే భరించాడు కానీ ఏనాడు ఒక అనురాగ సహచర్యాన్ని అతను అనుభవించలేదు. మనిషి బుద్దితో ఎన్నెన్నో పనులు పెట్టుకుని ఊగిసలాడే మనసుని అదుపు చేద్దామనుకుంటాడు మనసుకి ప్రేమను కోరుకునే సహజబుద్ది ఉంటుంది.అది ఆ ఆశతో లోలోపల మరింత గిర్రున తిరుగుతుంది. ఆ లోపల తిరిగేదాన్ని అదుపు చేయటం ఎలాగో తెలియక నెమ్మదిగా మందుకి అలవాటు పడ్డాడు చక్రవర్తి.

అమెరికా నుంచి తండ్రిని చూడటానికి అన్నాచెల్లెలిద్దరు కలిసి వచ్చారు. " నాన్న ఏంటిది!? కొత్తగా ఈ అలవాటు" ఇంట్లో కొత్తగా ఏర్పాటు చేసిన బార్ క్యాబిన్ ని చూపించి అంది కూతురు. " ఆర్మీ వాళ్ళకి అలవాటేరా …..సరదాగా అప్పుడప్పుడు అంతే" ఎటో చూస్తూ అన్నాడు. మాటలు అప్పుడప్పుడే అన్నాయి కానీ ఆర్మీ సుశిక్షణలో మరియు అతని సక్రమమైన జీవనశైలిలో బలిష్టంగా ఉండే ఆయన శరీరం అదుపు తప్పిందని చూసేవారి కళ్ళకి ఇట్టే అర్థమైపోతుంది. "నాన్న నీకు పెళ్ళి చేద్దామనుకుంటున్నాం" ఒకే స్వరంతో అన్నారు అన్నా చెల్లెలిద్దరు. "నాకు పెళ్ళెంట్రా!!" బిగ్గరగా నవ్వుతు గట్టిగా అన్నారు. "ఇప్పుడు డబ్బై, ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళే చేసుకుంటున్నారు…నీకు మొన్నెగా యాభై దాటింది..మేము నిర్ణయించుకున్నాం" ఏ మాత్రం తడబాటు లేకుండా అన్నారు. 'వాళ్ళు, వీళ్ళు చేసుకుంటున్నారని చేసుకుంటారేంట్రా పెళ్ళిళ్ళు. మనకనిపించాలి. నాకు ఇలానే సంతోషంగా ఉంది" పెదాలపై విరభూసిన నవ్వుతో అన్నాడు. "ఎవరు అడ్డు చెప్పరు కనుక ఇలా తాగుతూ శరీరాన్ని పాడుచేసుకుంటూ సంతోషంగా గడిపేద్దాం అనుకుంటున్నారు కదా!నాన్నా" ప్రేమతో కూడిన వ్యంగ్యం ధ్వనించింది ఆమాటలలో. ఏమనాలో తెలియక "అలా కాదురా నాన్నా…" అన్నాడు "ఇంకేంచెప్పకండి నాన్నా!!" గొంతు పెంచి కొడుకన్నాడు. ఇంతలో ఉరిముల్లేని పిడుగులా సుమతి ఏడుపు మొహం పెట్టుకుని ఇంట్లోకి వస్తునే "మావయ్యా!!" అంది గద్గద స్వరంతో. కూతురు ఛీత్కార చూపులు, కొడుకు ఆమె ఎక్కడ కనబడినా అక్కడి నుంచి మొహం తిప్పుకు వెళ్ళిపోవడమూ ఆమెకు కొత్త కాదు అందుకే ఆమె అటు ఇటు చూడకుండా చక్రవర్తి ఎదురుగా కూర్చుని "మావయ్యా" అని పిలిచింది. "ఏంటే!" అన్నాడు ఎప్పట్లానే యథాలాపంగా "మావయ్య ఆయన చనిపోయిన తర్వాత నన్నెవరు ఆ ఇంట్లో మనిషిలా చూడట్లేదు. నన్నెవరు కడుపుకి అన్నం కూడా తిననివ్వటంలేదు. ఇప్పుడేమొ ఆ ఇంట్లో ఉండటానికి కూడా ఒప్పుకోవటం లేదు. ఆ ఇంటికి నాకు సంబంధం లేదని.,వాళ్ళాస్తిలో నాకు వాటా లేదని ఉన్నపలంగా ఇంటి నుంచి బయటికెళ్ళిపొమ్మంటున్నారు మావయ్యా. ఆయన నాకు ఏ ఏర్పాటు చేయలేదు" చెంపపై కారుతున్న కన్నీటి చుక్కలని తుడుచుకుంటూ అంది. "అవునా!?" అని అడిగాడు 'ఇప్పుడేం చేయమంటావు అనే అర్థం ధ్వనించింది ఆ ప్రశ్నలో "మావయ్య నేను నీతో ఇక్కడే ఉండిపోతాను" నెమ్మదిగా లో గొంతుతో అడిగింది. ఆ మాట వినబడిన వెంటనే కూతురు కళ్ళు అగ్నిజ్వాలలు కురిపించి నోరు తెరవటానికి సివంగిలా అమ్మ మీద పడుతున్న ఆమెను తండ్రి కళ్ళతోనే అదిలించాడు. "ఏంటే సుమతి అంత డీలా పడిపోతావు. ఓ పదిరోజుల్లో నీకు ఏదో ఒక ఏర్పాటు చేస్తానులే. నెలకు ఇంతని నువ్వు ఉండటానికి, తినటానికి ఏమాత్రం లోటు లేకుంటా ఏర్పాటు చేస్తానులే " ఓదారుస్తున్నట్టుగా అన్నాడు. "నీ డబ్బులెందుకులే మావయ్యా!!" ఇబ్బందిగా అంది. "నా డబ్బులు కాదు. నీ డబ్బులే మీ అమ్మ అదే మా అక్క నా పేరు మీద రాసిచ్చిన పొలం ఉంది. అది అమ్మి ఈ ఏర్పాట్లన్ని చేస్తాన్లే. నువ్వేం దిగులుపడకు..నిశ్చింతంగా వెళ్ళు" అన్నాడు లాలనగా. సుమతి అడుగు బయటపెట్టగానే "ఎందుకు నాన్న ఆవిడ మీద నీకంత ప్రేమ" ఆవేశంగా ప్రశ్నించింది. "ఆవిడకాదమ్మా!..మీ అమ్మ!!. ఒకవేళ నాకేమైనా అయితే ఆమెను నువ్వే చూసుకోవాలి" అనునయంగా అన్నాడు. "నీకంటే ప్రేముంది కనుక చేస్తావు నాన్న. నాకు ఆవిడ వల్ల పడ్డ ఇబ్బందులే గుర్తొస్తాయి" పౌరుషంగా గద్దించినట్టుగా అంది. "నీకు తెలియకపోవచ్చు, సుమతికి గుర్తులేకపోవచ్చు కానీ నేను చూశాను నీలాంటి బంగారు తల్లిని నా చేతుల్లోకివ్వటానికి ఆవిడ ఎన్ని నొప్పులు పడ్డదో. ఆ నొప్పులకు నువ్వెప్పుడు గౌరవం ఇవ్వాలి. తల్లి అంటే ఇలానే ఉండాలి అనే ఆలోచనా పరిధి నుంచి నువ్వు బయటకి వచ్చి. ఎలా ఉన్నా అమ్మ అమ్మే అన్న విషయం నీకు అర్థం కావటానికి కొంత సమయం పట్టొచ్చు అంతే. ఇక ప్రేమంటావా!? దానిమీద అంత ప్రేమే ఉంటే అది ఉంటానన్నప్పుడు నాతో ఉండనిచ్చే వాణ్ణి కానీ అది వేరే ఉండటానికి ఏర్పాటు చేసేవాణ్ణి కాదు కదా! నేను అంత గొప్పొణ్ణి కాదురా …మనిషిని మనిషిలా చూడాలనుకునే వాణ్ణి మాత్రమే. గడ్డం పట్టుకొని అర్థం చేసుకో తల్లి అన్నట్టుగా చెప్పాడు. అప్పటికే 'ఇంతటి పిచ్చిమారాజు ఏమైపోతాడో' అనుకుంటున్న కూతురు కళ్ళల్లో అప్రమేయంగా రాలిపడుతున్న కన్నీటి చుక్కలని చూసాడు చక్రవర్తి. "ఏం తల్లి., ఏరా ఎందుకు ఏడుస్తున్నావు" కూతురి భూజాలపై చేయి వేసి కుర్చీ మీద కుర్చోబెడుతూ అడిగాడు. "అలా కాదు… నాన్న నీకు ప్రపంచం అవుతుందా! నీ ధోరణిలో నువ్వుంటావు. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె చేసుకుంటూపోతుంది. కనీసం ఆమెను తప్పు పట్టవేం నాన్న" సమాధానం చెప్పు అన్నట్టుగా తండ్రి భూజాన్ని కుదుపి అడిగింది. "అందరూ ఇలానే ఉండాలి గిరి గీసుకుని బ్రతుకుతున్నప్పుడు కొంత మంది ఆ గిరి దాటలనుకుంటారు లేకపోతే తెలిసో తెలియకో పరిస్థితుల ప్రభావమో ఆ గిరి దాటేస్తారు అంతేరా!. అయినా ఇంత మంది చుట్టుముట్టి తప్పుపట్టినప్పుడు.,నేనూ ఆమెను తప్పు పట్టి హింస పెట్టమంటావా!? అలా మానసికంగా హింసిస్తే బ్రతికుండగా చనిపోతుంది. దాని బ్రతుకు దాన్ని బ్రతుకనిద్దాం సరేనా!" బుజ్జగిస్తున్నట్టుగా కూతురితో చెప్పాడు. "అయితే సరే నాన్న మరి నీ బ్రతుకు నువ్వు బ్రతకాలిగా మంచి అమ్మను చూసి నీకు పెళ్ళిచేస్తాం మారు మాట్లాడకుండా పెళ్ళిచేసుకోవాలి" మరో మాట మాట్లాడటానికి తండ్రికి అవకాశం ఇవ్వలేదు.

అన్నట్టుగానే వారం రోజుల్లో ముప్పైఐదేళ్ళకే భర్త చనిపోయి.నలభై ఐదేళ్ళకి కూతురికి పెళ్ళి చేసి అమెరికా పంపించి. ఐదేళ్ళ నుంచి తనకు ఎవరు లేరనే కుంగుబాటులో ఉన్న రాధికతో పెళ్ళిచేసారు. పొడి పొడి మాటలతో మొదలైన వారి వైవాహిక బంధం నెమ్మదిగా గాజుల సవ్వడి, మువ్వల సందడిగా మారింది.జాజుల పుప్పొడి అలముకుంది. అప్పుడప్పుడు పారాణి పులుముకుంటుంది. ఆ ఇంట్లో లక్ష్మీ కళ వచ్చి చేరింది. "ఏండి …ఏండి" అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన చక్రవర్తి "ఆ…ఏంటి!?" అని ఉలికి పడ్డాడు. "ఇదిగొండి" అని బల్లపై కంచంలో పెట్టిన కోడికూర చూపించింది. "ఆ..అదేంటి!? ఈ రోజు శుక్రవారం నువ్వోండవుగా!?" ఆశ్చర్యంగా అడిగాడు. "మరి మీరు శుక్రవారమైనా ఆ గ్లాసు పక్కన పెట్టట్లేదుగా. ఆ మందుతో ఈ చికెన్ తింటే కొంచెం అయినా లివర్ దెబ్బతినకుండా ఉంటుందని నా ఆశ అంతే!!" నవ్వుతూ అంది. తనే మళ్ళీ "మీ కన్నా శుక్రవారం నాకేం ఎక్కువ కాదు. ఇంకో ప్లేటు తెస్తానుండండి" అని లోపలికెళ్ళింది. ఆమె వెంటే వెలుతున్న బొండుమల్లెల గుభాళింపులు చక్రవర్తి ముక్కుపుటాలను చేరి ఆమె అన్న ఒకమాటను గుర్తు చేసాయి. "తెలుసా అండి. నాకు ఈ పువ్వులు, గాజులు, పట్టీలు అంటే ఎంతిష్టమో కాని అతను చనిపోయిన తర్వాత ఎవరైనా ఏమైనా అనుకుంటారనో, అంటారనో చాలా భయమేసి ఎప్పుడు ధైర్యంగా పెట్టుకోలేకపోయాను. ఇప్పుడైతే నాకు ఇష్టం వచ్చినట్టుగా సంతోషంగా పెట్టుకోగలుగుతున్నాను. ఈ మధ్య నన్ను పెరంటానికి కూడా పిలుస్తున్నారు" అని ఎంతో అమాయకంగా అతని గుండెలపై చిన్నపిల్లలా ఒదిగిపోయింది. ఆ మాట గుర్తుకు రాగానే చక్రవర్తి మనసంతా ఆర్థ్రతతో నిండిపోయింది. 'నా కన్నా ఏది ఎక్కువ కాదు అంటున్న ఈమెకు నేను ఏమి చేస్తున్నాను., తన ఆనందాన్ని, సంతోషాన్ని నా ఆరోగ్యంతో ముడి పెట్టుకుంటూ నన్ను అల్లుకుపోతూ ఉన్న ఈ మల్లె తీగకు కనీసం ఆధారంగా అయినా నిలబడగలుతున్నానా!? ఆమె అనురాగానికి నేను ఏమివ్వగలుగుతున్నాను!? ' అని తనని తానే ప్రశ్నించుకొని, తనకు తానే ఆలోచించుకొని ఎప్పుడూ బాధ్యత తో నిర్ణయాలకొచ్చే చక్రవర్తి మొదటి సారి ప్రేమతో ఒక నిర్ణయానికొచ్చాడు. "రాధికా!!" అని పిలిచాడు. "ఆ…తెస్తున్నానండి!! అంటూ ప్లేటుతో బయటకు వచ్చింది. "ఆ రమ్ము, గ్లాసు అసలు మొత్తం ఆ మందు సరంజామా అంతా చెత్త బుట్టలో పడేయ్" ఆమెవైపే చూస్తూ అన్నాడు. "అదేంటండీ!ఇంకా ఆ సీసాలో మందుందండీ!" ఆమె సీసా వైపు చూసి అంది. "నేను ఇక తాగను రాధిక" అవన్నీ తీయడానికి సహాయం చేస్తూ అన్నాడు "నిజంగానా!?" కళ్ళలో నిండిన ఆనందాశ్చార్యాలతో అడిగింది "నీకన్నా ఆ మందేం ఎక్కువకాదు" గాలికి చెదురుతున్న ఆమె కుంకుమని సరిదిద్దుతూ మురిపెంగా ముద్దుగా అన్నాడు. అక్కడ ఎవరికి కనబడని ఆ మనసుల మనువు వెన్నెల చూస్తూనే ఉంది.

మరిన్ని కథలు

Inkenta sepu
ఇంకెంత సేపు
- గరిమెళ్ళ సురేష్
Ankela rahasyam
అంకెల రహస్యం
- కర్లపాలెం హనుమంతరావు
Manam maaraali
మనం మారాలి !.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kshantavyam
క్షంతవ్యం
- భాస్కర చంద్ర
Dil pasand
దిల్ పసంద్
- కొడవంటి ఉషా కుమారి
Shashankalu
శశాంకలు
- మద్దూరి నరసింహమూర్తి
Chadastam
చాదస్తం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు