ఇంకెంత సేపు - గరిమెళ్ళ సురేష్

Inkenta sepu

అది,1990-99 మధ్య కాలం అనుకుంటా! పంజగుట్ట, సాయంత్రం ఆరు- ఆరున్నర నడుమ కావచ్చు! శివరావు గారు ఓచేత్తో వెలిగించిన సిగెరెట్టు, మరో చేత్తో స్టీరింగ్ పట్టుకోని, హుషారుగా సుశీల- ఘంటసాలల ‘రేపంటి రూపం కంటి’ పాట రేడియోలో వింటూ, కారు నడుపుతున్నారు. జూబ్లీ హిల్సలో పని చూసుకొని, సికందరాబాద్ వైపుకి వెడెతున్నారు. ఆయన ప్రక్కన, పాతికేళ్ళ కుర్రవాడు, వారి అబ్బయి, గంగాధర్ కూర్చునాడు. ‘ఏంనాన్న ఇది! ఇలా సిగెరెట్టు కాలుస్తూ బండి నడపడం! మీ ధ్యస కూడా ఎక్కడో ఉంటోంది’, అన్నాడు గంగాధరం, విసుక్కుంటూ. ‘ఏమోయ్! నా డ్రైవింగ్ పైనే వ్యాఖ్యానమా! నువ్వు పుట్టక ముందు నుంచి కారు నడుపుతున్నాను. ఒక్క యాక్సిడెంటు జేసి గానీ, ఫైన్ కట్టి గాని యెరగను’, రావు గారి జబర్దస్తీ జవాబు కాని జవాబు! ‘అప్పట్లో, ఇంత ట్రాఫిక్ కాని, ఇన్ని సిగ్నల్సు గానీ లేవు నాన్నా. మీదే రాజ్యం, మీరే రాజు’, అంటూ కొడుకు మళ్ళీ విసుక్కున్నాడు! ‘అవునోయ్! ఈ స్టైలు చూసే గా మీ అమ్మ నన్ను చేసుకుంది’, తండ్రి గొప్పలు చాటుకుంటుంన్నాడు! ఆమాట వాస్తవమే! అప్టట్లో, సిగిరెట్టు కాలుస్తూ కారు నడపడం, ఓ స్టైల్! సినిమాలలో ANR ని అలాగున చూపించేవారు కూడాను. ఆ మునుపటి నవలా నాయకుల్ని కూడా, ప్రత్యేకించి, రచయిత్రులు, ఆలాగునే చిత్రించేవారు.

ఏసి వాహనాలు మన దేశంలో అప్పుడప్పుడే ప్రచూర్యంలోకి వస్తున్నాయి. రావుగారి కారులో ఏసి లేనందున, కిటికీ అద్దాలు క్రిందికి ఉంచి, నడపడమే వారి అలవాటు. బేగంపేట్ వైపుకి వెళ్ళే బళ్ళు రెడ్ సిగ్నలకని ఆగాయి! కాని, శివరావు తన గొప్పతనాన్ని తానే మెచ్చుకుంటూ, బ్రేకు కాస్త ఆలస్యంగ వేయడంతో, ముందున్న కొత్త మారుతి కారును రావు గారి కారు నెమ్మదిగా తాకింది. పెద్దగా ఏ కారుకీ, ఎవ్వరికీ ఎటువంటి గాయం కాలేదు. కాని, మారుతి కారు నడపుతున్న అరవై ఐదేళ్ల సరస్వతి గారు, ప్రక్కన కూర్చున్న, ఆవిడ భర్త శ్రీనివాస మూర్తి గారు ఒకింత ఉలిక్కి పడ్డారు! సరస్వతి గారు కారు దిగి, కారు వెనక వైపు ఏమన్నా బలమైన దెబ్బ తగిలిందేమోనని చూచి, శివరావు గారి తో ‘ కొంచెం చూసుకోని రావాలండి’, అని కసురుకున్నారు. శివరావు గారు ఉరుకుంటే, సరి పోను. ‘మీ కారే వెనక్కి వచ్చిందండి, నన్నంటారే’, అంటూ వాదనకు దిగారు. సరస్వతి మామూలుగా సౌమ్యురాలే కాని, వాళ్ళ ఆయన కంటి పరీక్ష చేయించుకున్నదున ఆయన కారు నడపలేడు. మనవరాలు, వైష్ణవి ఆసుపత్రికి, వస్తానన్నది. ఆఫీస్లో హటాత్తుగ ఏదో పని బడి రానందున, అయిష్టంగానే కారు, సరస్వతి గారే నడుపుతున్నారు. శ్రీనివాస మూర్తి గారు ఆర్మి లో ఆఫీసర్ గా చేసి, పదిహేనేళ్ళ క్రితం సైనిక్ పురి లో ఇల్లు కట్టుకొని భార్య, కొడుకు, కోడలు, మనుమరాలితో ఉంటున్నారు. కొడుకు, కోడలు ఎవరిదో పెళ్ళికని మద్రాసు వెళ్ళారు. ఆ కారణాన, సరస్వతి గారు, కారు నడుపుతున్నారు. ఆ విసుగుకు తోడు, కార్లు గుద్దుకోవడం ఆమె అసహానానికి ఆజ్యం పోసినట్టయ్యింది. ఇప్పుడ శివరావుగారు తనది తప్పనందుకు, ఇంకింత కోపం హెచ్చి అక్కడే ఉన్న పోలీసును రమ్మని పిలిచారు, సరస్వతిగారు. దగ్గరకు వచ్చిన ఇన్స్పెక్టర్ కి జరిగింది అర్థమైంది. ప్రక్కనే ఉన్న పోలీస్ స్టేషణ్ కి అందరినీ తీసుకెళ్ళాడు, వారి వాహనాలతో బాటు. శివరావు గారిని, సరస్వతి గార్లను లోపలి గదిలో కూర్చో బెట్టి, అక్కడున్న కానిస్టేబల్ తో ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళారు ఇన్స్పెక్టర్. ఇన్నేళ్ళకి పోలీస్టేషన్ మెట్లెక్కినందుకు లోలోపల మధన పడుతున్నారు శివరావు. గోచారంలోని కారాగృహ యోగం, ఈ విధంగ రూపందుకున్నదని ఆయన మనసులోనే అనుకున్నాడు. తన పంతం నెగ్గి ఎదుటి వ్యక్తిని స్టషన్ గుమ్మం దాటించినందుకు ఒకింత గర్వం ఉన్ననూ, పొరపాటున పోలీస్ను పిలిచి, తానుకూడా స్టేషణ్లో కూర్చున్నందుకు బాధగాను ఉన్నది సరస్వతిగారికి. ఆర్మీ ఆఫీసర్ భార్యగా, ఎన్నసార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా, ఈలాగు ట్రాఫక్ సమస్య వలన రావడం అదే మొదటి సారి. శ్రీనివాస మూర్తి గారు, గంగాధరం బయట ఓ బల్ల మీద కూర్చున్నారు. ఎదురుగా నించున్న హోమ్గార్డ్ని జూచి, ‘ఇంకెంత సేపు అవుతుంది’ అని అడిగారు శ్రీనివాసమూర్తి. ‘ఏమో, సార్, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ లో ఉన్నారు కదండి. చెప్పలేము. ఒక్కో సారి తొమ్మిది కూడా అవ్వొచ్చు’, అన్నాడతను.

గంగాధరం, మూర్తి గార్లు, ఒకర్నొకరు చేసుకున్నారు. ఇద్దరి లోనూ,ఒకటే యోచన. అనవసరంగా, పిలిచి, దుఃఖం కొనుక్కుంటిమన్న భావన. ఎంత సేపైనా ఇన్స్పెక్టర్ రాలేదు. ఆ మాటనకుండా ఉంటే బాగుండేదేమోనని శివరావు గారు, పోలీస్ని పిలవకుంటే బాగుండేదని సరస్వతి గారు అనుకుంటున్నారు. అయినా ఇద్దరి మధ్యా మాటలు సూన్యం. బయట బల్ల వద్ద పరిస్థితి అదో మాదిరి. మనసులో తండ్రిని, గంగాధరం, భార్యను మూర్తిగారు బాగా ఉతికేస్తున్నారు. పైకి మాత్రం వెర్రి నవ్వుల అలంకారం! ఇక, హోమ్గార్డు, జరగ బోయేది ఎరిగున్నట్టు వీళ్ళను పట్టించుకోవడంలేదు. బయట హోమ్గార్డు కి మల్లే, లోపలున్న కానిస్టేబుల్ కూడా అన్నీఎరిగున్నట్టే ఉన్నాడు. ‘మా పరిస్థితి ఏవిటి’ కానిస్టేబెల్ని అడిగారు రావు గారు. జవాబు తనకీ అవసరమన్నట్టు సరస్వతి గారు, కానిస్టేబుల్ వైపె చూస్తున్నారు. ‘సిఐ గారు వచ్చాక కంప్లైంటు రాయించి కోర్టుకి తీసుకెళతాంమండి’, అన్నారు కానిస్టేబుల్. ‘ఇంకెంత సేపు అవుతుంది ఆయనకి’ , సరస్వతి గారి, అనుబంధ ప్రశ్న. జోడు కట్టి వినడం, రావు గారి వంతు. ‘ ఏదో వి ఐ పి కదలిక ఉందండి. కా స్సేపే, అవ్వొచ్చు. అయినా ఏవిటండి కేసు’ తెలియనట్టు అడిగాడు కానిస్టేబుల్. ‘పొరపాటున, నా కారు ఆవిడ కారుకి తాకింది’, అన్నారు రావు గారు, బాగా నెమ్మదిగ. ‘ఓ!, ఏవైనా, డామేజ్ అయ్యిందా, అమ్మ’, అడిగాడు, కానిస్టేబుల్. ‘పెద్దగా, ఏమీ లేదయ్యా’, అన్నారు సరస్వతి గారు. ‘బాగా,చదువకున్న వారిలా వున్నారు! కొట్లాడిర్రా!’ అసహ్యించుకుంటునట్టు ప్రశ్నించాడు. ‘అబ్బే, అట్లాండిది ఏమీ లేదయ్యా’, ముక్త కంఠంగా ఇద్దరూ అన్నారు. ‘ఛాయ్ తీసుకుంటారా సర్’, అంటూ ఓ కుర్రాడు గాజు గ్లాసులు, థర్మాసు పట్టుకొచ్చాడు. ‘ముగ్గురికీ, యిచ్చేసేయ్! గంట సేపైంది,ఇక్కడ కూర్చోని’, అన్నారు రావు గారు ఆ కుర్రాడికి డబ్బులిస్తూ. ‘బయట బల్ల మీద, ఓ అబ్బాయి, ఓ పెద్దాయన ఉన్నారు. వాళ్లని కూడా అడుగు’, అన్నారు సరస్వతి గారు. వాతావరణం, కాస్త ప్రశాంతంగా మారడం గమనించిన కానిస్టేబుల్, ‘డ్యామేజీ లేదు, కొట్లాడుకుందీ కాదు. ఇంకేవిటి కేసు! కాంప్రమైస్ చేసుకోని, చక్కగా వెళ్ళండి’, అన్నాడు. బయట బల్ల మీద టీ తాగుతున్న ఇద్దరి అసహనాన్నీ గమనించన హోమ్గార్డు, ‘ఇంకో ఐదు నిమిషాల్లో బయటికి వచ్చేస్తార్లెండీ! ఎంత మందిని చూడ్లేదు సార్’ అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా! ఇంకా ఐదు నిమిషాలు కూడా అవలేదు. శివరావు గారు, సరస్వతి గారు నవ్వుకుంటూ బయటికి వచ్చారు. అదే సమయానికి, ఇన్స్పెక్టర్ లోపలికి వస్తూండడం గమనించి, సంగతి ఏమీ లేనట్టు, ఇన్స్పెక్టర్ కి ఇద్దరూ ఒకే సారి Thank You చెప్పేసారు. కంటి చూపుతోనే సంగతి తెలుసుకున్నా ఇనస్పెక్టర్కి చిరు నవ్వు దాగలేదు!

మరిన్ని కథలు

Ankela rahasyam
అంకెల రహస్యం
- కర్లపాలెం హనుమంతరావు
Nee kannanaa
నీ కన్నానా!?
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Manam maaraali
మనం మారాలి !.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kshantavyam
క్షంతవ్యం
- భాస్కర చంద్ర
Dil pasand
దిల్ పసంద్
- కొడవంటి ఉషా కుమారి
Shashankalu
శశాంకలు
- మద్దూరి నరసింహమూర్తి
Chadastam
చాదస్తం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు