
ఆ అడవిలో ఒక జింక చాలా అందంగా ఉండేది. దాని అందాన్ని చాలా జంతువులు పొగిడేవి. జింక అందాన్ని చూసి దానితో పెద్ద పెద్ద జంతువులే స్నేహం చేసేవి. దానితో జింకకు పొగరు బాగా పెరిగింది. చిన్న చిన్న జంతువులను, తనకు అందంలో నచ్చని జంతువులను హేళన చేసేది. కొన్ని జంతువులతో అసలే మాట్లాడక పోయేది. పలకరిచినా వాటిని గుర్రుగా చూస్తూ వెళ్ళిపోయేది. దానికి ఎలా బుద్ధి చెప్పాలా అని చాలా జీవాలు ఆలోచించేవి. ఒకరోజు జింక ఒక కుందేలుని చూసి హేళన చేయసాగింది. కుందేలు అందంగా ఉన్నదని విర్రవీగ వద్దని, తన అందం ముందు కుందేలు ఎందుకూ పనికిరాదని హేళన చేస్తుంది. కుందేలు ఎంతో సహనంతో హేళనలను భరిస్తుంది. కుందేలు జింకతో తనను పరుగు పందెంలో ఎవరూ ఓడించలేరని అంటుంది. "అవును." అంది అక్కడే తిరుగుతున్న నెమలి. జింకకు పౌరుషం వచ్చింది. ఇప్పుడే పరుగు పందెం పెట్టుకుందాం అన్నది. ప్రారంభం అయ్యింది. కుందేలు జింక రెండూ దాదాపు సమాన వేగంతో పరుగెత్తుతున్నాయి. కాకపొతే కుందేలు ముందు, దానికి వెంట్రుక వాసి దూరంలో జింక పరుగెత్తుతున్నాయి. కుందేలు జింకకు పొగరు అణచడానికి ఈ పందెం పెట్టింది. దాని మనసులో ఒక వ్యూహం ఉన్నది. కుందేలు అకస్మాత్తుగా పక్కకు దిశ మార్చింది. దానికి వెంట్రుక వాసి దూరంలో ఉన్న జింక బాగా మురికిగా ఉన్న బురదలో పడి, చాలా అసహ్యంగా అయ్యింది. చెట్టు మీద ఉన్న రామ చిలక ఎగురుతూ వెళ్ళి, అడవి అంతా ప్రచారం చేసింది. చాలా పక్షులు, జంతువులు అక్కడ గుమికూడాయి. జింక పరువు పోయింది. పొగరు అణిగింది. జింక ఆ అడవిని విడిచి, వెళ్ళి పోయింది. ఎప్పుడూ విర్ర వీగలేదు.