ఉత్తరాలయ్య - కామేశ్వర రావు

Vuttaralayya

"అయ్యా, ఉత్తరాలయ్య వచ్చాడా?"

"నేను చూడలేదమ్మా"

"అమ్మా, నీవు సూసావ?"

"లేదమ్మా"

"ఎప్పుడొస్తాడీబాబు, మద్దేనమైపోయింది, అయ్యా టైమెంతయింది"

"పది అవుతుంది"

"పదేనా, పొద్దు నెత్తి మీదకొచ్చినట్టుంతె, పన్నెండైపోయిందనుకుంతున్నాను"

"ఉత్తరాలయ్య ఎన్ని గంటలకొస్తాడు?"

"టైమయింది. ఇంకొక అరగంటలో వస్తాడు"

ఆమె పేరు కమల. పోస్ట్ మేన్ దామోదరం గురించి దారిన పోయే వాళ్ళందరిని వాకబు చేస్తుంది.

ఆ వీధి యువతలో సగానికెక్కువ మంది భిలాయిలో లేదా అండమాన్ లో పనుల కోసం వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వారందరు నిరక్షరాస్యులే. ఇక్కడ కూలి పనులు దొరక్క అక్కడ అవకాశాలున్నాయని తమ కంటె ముందు వెళ్ళిన వారు చెప్పడం తో అలా ఊళ్ళు వదిలి వెళ్ళి పోతుంటారు.

అవి దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్త రోజులు. అప్పటికే అండమాన్ లోని "పోర్టు బ్లైర్" ఓడ రేవు బాగా ప్రసిద్ధి చెందినది. వీళ్ళందరు పోర్టు కలాసీలుగా అక్కడ పని చేస్తారు. కొందరు భిలాయి స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో కూడ కూలి పనులు వెతుక్కుని వెళ్ళిపోయారు.

పోస్ట్ మేన్ దామోదరం ఆ ముందు రోజు వచ్చి ఆమె గురించి అడగ్గా ఆమె పొలం పనులకు వెళ్ళిపోయిందని తెలిసింది. ఆమెకు మనియార్డరు వచ్చిందని ఆ వీధిలో అందరికి పెద్ద దిక్కులా ఉండే బుచ్చమ్మకు సమాచారమిచ్చాడు. బుచ్చమ్మ ద్వారా విషయం తెలుసుకున్న కమలమ్మ ఈ రోజు ఎక్కడికి వెళ్ళకుండా బుచ్చమ్మ గారి ఇంటి అరుగుపై కూర్చొని పోస్ట్ మేన్ కోసం ఎదురు చూస్తుంది.

"నిన్న అలబొద్దు వచ్చాడని బుచ్చమ్మ సెప్పింది. ఈపొద్దు కూడ అలబొద్దే వస్తాడా?"

ఇంతకు ముందు టైము చెప్పిన ఆసామీని మళ్ళీ అడిగింది.

"ఉత్తరాలో మనియార్డర్లో ఉంటె రెండు పూటలు వస్తాడమ్మ"

"నాకు అందుమానం నించి మా వోడు పైసాలు పంపినాడట"

“నీ కొడుకా?”

"కాదు నా పెనిమిటి. నా కొడుక్కి పదేను నిండాయి మొన్న కొత్త అమాసకి"

కమలమ్మ భర్త అండమాను లోని పోర్టు బ్లైర్ లో ఓడ కళాసీ గా పని చేస్తున్నాడు.

తరువాత అరగంటలో పోస్ట్ మేన్ తన వాహనం, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళిచ్చిన పాత సైకిల్ పై వచ్చాడు.

"అమ్మా, ఆర్ కమలమ్మంటె నువ్వేనా?"

"అవును బాబు, మా ఇంటి పేరు రంగోయి. ఇంగిలేసులో ఆర్ అక్షరం పడతాది. నాపేరు కొమల.”

“కొమల కాదు కమల అని ఉంది”

“అవును బాబు ఆపేరే. మాకు నోరు తిరక్క అలాగ సెప్పుతాము. మీలాగ కూడు తిన్నోలకి కుదురుగా పలుకుతాది బాబు. మాలాగ అంబలి తిన్నోల నాలిక అడ్డడ్డగ తిరగతాది”

"నీకు మనియార్డరు వచ్చిందమ్మా, నీవు సదువుకోలేదు కదా, సంతకము పెట్టినోళ్ళెవరైనా ఉంటె పిలమ్మా"

"నా సెయ్యి సంతకమిస్తాను బాబు"

"అందుకే, ఎవరైనా సాక్షి సంతకము పెట్టాలి”

"అయ్యో! ఇప్పుడే నాకు టైము సెప్పిన బాబు ఎల్లిపోయాడు, ఇప్పుడెనాగ" అని చింతిస్తు కూర్చుంది.

"బుచ్చమ్మ గారి అబ్బాయి రాలేదా?"

"రాలేదయ్యా"

"అమ్మా బుచ్చమ్మ గారు" పోస్ట్ మేన్ దామోదరం బుచ్చమ్మను పిలిచాడు.

"వస్తున్నాను. కూకొండయ్యా" అంటు లోపలి నుండి అరుగు మీద ఉన్న బెంచిని చూపింది బుచ్చమ్మ.

ఆ వీధిలో చదువుకున్న కొద్ది మందిలో బుచ్చమ్మ కొడుకు రాజయ్య ఒకడు. రాజయ్య స్కూల్ కెల్లి చదవలేదు గాని ఒక ప్రైవేటు మాస్టర్ దగ్గర చదవడం రాయడం నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఆ ఊరి తాసీల్దారు ఆఫీసులో బంట్రోతు ఉద్యోగం చేస్తున్నాడు. ఆ వీధిలో ఎవరికొచ్చిన ఉత్తరమైనా చదవడం లేదా ఉత్తరం పంపించాలంటె రాయడం మొదలైన పనులు రాజయ్య గాని లేదా పోస్ట్ మేన్ దామోదరం గాని చేస్తుంటారు.

"రాజయ్య గారెప్పుడొస్తారమ్మా?”

"ఒంటి గంటవుతాది బాబు"

"నా మనవడున్నాడు. ఆడు పది సదవతన్నాడు. సంతకం సెయ్య గలడు బాబు"

"చిన్న పిల్లలు సాక్షి సంతకానికి పనికి రారమ్మా"

"మనియార్డరు ఫారం మీకు ఇస్తాను. మీ అబ్బాయి రాగానే సంతకం పెట్టించండి. నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను." అని చెప్పి బుచ్చమ్మకు మనియార్డరు ఫారం అందజేసాడు. కమలమ్మకు మనియార్డరుగా వచ్చిన సొమ్ము వంద రూపాయలు చెల్లించాడు దామోదరం.

"అయ్యా మనియాడ్రి రసీదు మీద నాలుగు ముక్కలు రాసుంతాయి కదా, సదవ్వా?" అడిగింది కమలమ్మ.

"నా మనవడు సదువుతాడు లేయే. ఆ బాబుని ఎల్లని" అంది బుచ్చమ్మ.

-----///-----

పోస్ట్ మేన్ దామోదరం అంటె ఆ ఊరి జనులకు వల్లమాలిన అభిమానం. అందరికి తలలో నాలుకలా ఉంటాడు. ఎవరికి ఏ అవసరమొచ్చినా తన పరిధిలో సాయం చేస్తుంటాడు. పోస్ట్ కార్డు, ఇన్ లేండ్ లెటరు, పోస్ట్ కవరు, మనియార్డరు ఫారం, తపాలా బిళ్ళలు, రెవెన్యూ బిళ్ళలు, టెలిగ్రాం ఫారం ఇలా ఎవరికి ఏది కావాలన్నా పోస్ట్ ఆఫీసుకు వెళ్ళే పని లేదు. అన్నీ ఆయనే తెచ్చి ఇస్తాడు. ఆ రోజుల్లోనే ఆయన ఒక మొబైల్ పోస్ట్ ఆఫీసు లా వ్యవహరించేవాడు.

ముఖ్యముగా ఈ వీధి వారికి మరీ ఆప్తుడు. "ఉత్తరాలయ్య" అంటు ఎంతో ఆప్యాయముగా పలకరిస్తారు. ఎందుకంటె వారికి పైన చెప్పిన సేవలు ఇవ్వడమే కాకుండా తమకు వచ్చిన ఉత్తరాలు చదివి వినిపిస్తాడు. తిరిగి జవాబు రాయడానికి ఇన్ లేండ్ లెటరో లేక పోస్ట్ కవరో కొని తెచ్చి వారికి ఉత్తరం రాసి పెడతాడు. ఇలాంటి పనులన్నీ ఆయన సాయంత్రం తన ఆఫీసు పనులు ముగించుకుని వచ్చి చేసేవాడు. ఈ సేవలన్ని వారికి ఉచితమే. ఉత్తరం రాసిన తరువాత కొందరు పావలో అర్ధ రూపాయో ఇచ్చేవారు కాని ఆయన తిరస్కరించేవాడు. అదీ ఆయన ఔదార్యం.

——-///——

"అయ్యా సుబ్బారావు గారు మీకు కోర్టు నోటీసు వచ్చింది. ఇక్కడ సంతకము పెట్టి తీసుకుంటారా?"

పోస్ట్ మేన్ దామోదరం గొంతు విన్న సుబ్బారావు తాను రాసుకుంటున్న వ్యాపార లెక్కల చిట్టా ఆపి తల పైకెత్తాడు.

"దామోదరం గారు.. ఆనోటీసు ఎవరి పేరు మీదుందో చూసారా, అది సుబ్బారావు జనరల్ స్టోర్ పేరు మీద ఉంది కదా" అన్నాడు సుబ్బారావు.

"అవునండి, మరి దానికి ప్రొప్రయిటర్ మీరే కదా"

"నేను లేనని రాసుకోండి"

"అలాగేనయ్యా"

"దామోదరం గారు, మీరు ఆఫీస్ కెల్లినప్పుడు ఈ టెలిగ్రాం ఇచ్చెయ్యండి, నాకు కొద్దిగ బిజీగా ఉంది షాపులో" ఆ పక్క షాపు యజమాని ఆనంద రావు విజ్ఞప్తి.

"అలాగేనయ్యా"

ఇలా ఆ ఊరి మెయిన్ రోడ్డు అంతా కవర్ చేసి తరువాత హైస్కూల్ వైపు వెళ్ళాడు దామోదరం.

"నమస్కారం మాస్టరు గారు" ఎదురైన జేమ్స్ మాస్టర్ గారికి నమస్కారం చేసాడు. జేమ్స్ గారు తనకు ఆ హైస్కూల్ లోనే యస్ యస్ యల్ సి లో లెక్కలు బోధించిన మాస్టర్.

"ఆ.. దామోదరం బాగున్నావా? "

"అయ్యా బాగున్నానయ్యా ఏదో మీ దయ వలన....

హెడ్ మాస్టర్ గారున్నారండీ?"

"ఆ...ఉన్నారు. ఆఫీసు రూం లో ఉంటారు చూడు"

"నమస్కారం సార్" హెడ్ మాస్టర్ ని విష్ చేసాడు దామోదరం.

బిజీగా ఉన్న హెడ్ మాస్టర్ గారు తల పైకెత్తి అక్కడున్న గుమస్తాకిచ్చెయ్యమని సైగ చేసారు.

హైస్కూల్ కొచ్చిన టపా మొత్తం ఒక కట్ట కట్టి గుమస్తా చేతిలో ఉంచాడు.

"అయ్యా దామోదరం గారు ఈ మనియార్డర్ ఫారం నింపాను. డబ్బులు మీకిస్తాను. శ్రీకాకుళం కాలేజి లో చదువుతున్న మా అబ్బాయికి పంపించెయ్యండి" గుమస్తా అభ్యర్థన.

"అలాగేనయ్యా, రసీదు రేపిస్తాను"

-----///-----

ఆ రోజు మధ్యాహ్నము మళ్ళీ ఆ వీధికి వెళ్ళి, రాజయ్య సంతకం చేసిన మనియార్డరు ఫారాన్ని బుచ్చమ్మ గారి దగ్గరనుండి తీసుకున్నాడు పోస్ట్ మేన్ దామోదరం.

ఆయన కోసం మళ్ళీ ఎదురు చూస్తున్న కమలమ్మ

"బాబు, నాకు సొమ్ము ముట్టినట్టు నా పెనిమిటికి ఉత్తరం జబాబు రాయాల, ఎప్పుడొస్తావ్?

"రేపు సాయంత్రం వస్తానమ్మా"

కమలమ్మ లాంటి వాళ్ళెందరికో ఈ ఉత్తరాలయ్య దేవుడిలా కనిపిస్తాడు. ఎందుకంటె వారి జీవన భృతి ఆయన తెచ్చిన మనియార్డర్ల మీదే ఆధారపడి ఉంది. మరియు వారి బంధువుల క్షేమ సమాచారాలు మోసుకొస్తాడు. వీరి క్షేమ సమాచారాల జాబులు ఆయనే రాసి పంపిస్తాడు.

-----///-----

మరుసటి రోజు దామోదరం గారు కమలమ్మ ఉత్తరం రాయడానికి వచ్చారు.

"అయ్యా, మా ఇంటికాడికి ఎల్లిపోదుమా, అక్కడకుర్సీ ఉంది" అని చెప్పి వాళ్ళింటి దగ్గరకు తీసుకెల్లింది కమలమ్మ.

అక్కడికి వెళ్ళి కుర్చీలో కూర్చున్న దామోదరం గారు

"ఆ…. చెప్పమ్మా" అన్నారు.

"అయ్యా ముందేటొ రాస్తావు కదా దండాలు దీవనలు అవి రాసీసావా"

"ఆ...ఆ... రాసీసాను. నీవు చెప్పు"

"నీవు పంపిన వంద రూపాయలకి ఏటొస్తాది, నెల బియ్యం కే ఇరవై రూపాయలైపోతాయి. సోడి పిండికి పది రూపాయలు. మరి కూరనారకి ఇరవయ్య, యాబయ్యైపోయింది. రేపు వర్సాలు పడితె దమ్ములుకి పైసాలెక్కడున్నాయి? దుక్కులుకి రోజుకి పది రూపాయలౌతాయి. ఆకు మడిలో ఇత్తనాలు ఎయ్యడానికి ముందు నాలుగు దపాలైనా దున్నాల. తర్వాత గాబు తియ్యించాల. నీవుంతె గాబు తీసేసే ఓడివి"

"మొన్న పైడిగాం బట్టి నుండి నీరొదిలారు. మీ మారటి అమ్మ కొడుకు మన పొలం కి రావల్సిన నీరు అడి పొలం కు తిప్పుకున్నాడు. "ఏం రా" అని అడిగితె "ఏటి సేసుకుంతావో సేసుకో" అని అన్నాడు. గట్టిగా అడిగితె కొట్టడానికొచ్చాడు. పోలీసు ఠానాలో పిరేదు సేసినాను. జమానులొచ్చి ఆడిని తీసుకెల్లి కుల్లబొడిసారట. ఇప్పుడైతె మారు మాట నేదులే"

“మన ఆడ పిల్ల మనువు బాగులేదు. అత్తింట్లో దానికి ముప్పు తిప్పలు పెడతన్నారు. మొగుడు తాగొచ్చి రోజు కొడతాడట. ఇడాకులు తీసుకుంతె బాగుంతాదని మన ఈదిలో పెద్ద మనుసులు దగ్గిర తగువు పెట్టాను. ఆ ముందు రోజు రేతిరి పెద్ద మనుసులుకి సారా ఇప్పించి ఆల్ల మూతి కట్టీసాడు మన అల్లుడు”.

"ఇంకో సమచ్చరం కాపరం సేసుకోండి ఆ తర్వాత సూస్తుమ" అని చెప్పి ఎల్లిపోయారు ఆ పెద్ద మనుసులు. ఇప్పుడు పిల్ల మనింట్లోనే ఉంది. ఇరపోరొచ్చి పిలుపు సేసి తీసుకెల్లరు. మన అల్లుడు ఎలాటోడో నీకు తెలుసు కదా. ఆడికి తడి తక్కువ తమాసెక్కువ. మనింటిలె తినీసి అలింటికెల్లి సెయ్య కడిగెస్తాడు. అలాటి రకం. ఏటి సెయ్యాలో సెప్పు"

"పిల్లడు ఈ సమచ్చరం పది పేస్ అయ్యాడు. పై సదువులు సదివించలేము కదా అందుకని బజారీదిలో బట్టలకొట్టులో పనికి కుదిర్సాను. నీవు ఈ పరేయం ఒచ్చినప్పుడు ఆడిని కూడ అందుమానం తీసుకెల్లిపోదువు గాని."

ఉత్తరం రాస్తున్న దామోదరం గారికి అకస్మాత్తుగా పదేళ్ళ క్రితం సింహాచలం కొండ మీద తప్పిపోయిన తన కొడుకు హేమంత్ గుర్తొచ్చాడు. "వాడు అయిదో ఏట తప్పి పోయాడు. వాడికి కూడ ఇప్పుడు పదిహేనేళ్ళు అవుతుంది. పది పాస్ అయ్యే వాడు"అని అనుకున్నాడు.

కమలమ్మ ఉత్తరం పూర్తి చేసి ఇంటికెల్లిపోయాడు దామోదరం.

-----///-----

పోస్ట్ మేన్ దామోదరంకు ఒక్కగానొక్క కొడుకు తప్పి పోయిన తరువాత ఆ విచారముతో భార్య మంచాన పడి కొద్ది రోజుల్లో ఆమె కాలం చేసింది. ఇప్పుడు తనకంటు ఎవరు లేరు. పాపం! దామోదరం ఒంటరి వాడు.

దామోదరం కొడుకు సింహాచలం కొండపై తప్పి పోయిన తరువాత కొండపైన పూసల గొలుసులు, గాజులు అమ్ముకునే సంచార జాతి వారికి దొరికాడు. వచ్చీరానిమాటలతో వాడు చెప్పిన విషయాన్ని బట్టి తన పేరు హేమంత్ అని, వాళ్ళ నాన్న పోస్ట్ మేన్ అని వారు గ్రహించారు. కాని ఏ ఊరో తెలియక శ్రీకాకుళం జిల్లా వాసి అయుంటాడని గ్రహించి అన్ని పోస్ట్ ఆఫీసులకు ఉత్తరాలు రాయించారు. అడ్రస్ లో "పోస్ట్ మేన్, ఆ ఊరి పేరు" రాసారు. దామోదరం పని చేస్తున్న సోంపేటకు కూడ ఆ ఉత్తరం చేరింది. కాని పేరు లేని ఆ ఉత్తరాన్ని వాళ్ళు "ఆకాశ రామన్న" ఉత్తరం గా తలచి పక్కన పడేసారు.

ఏనాడు ఉత్తరం ముక్కకు నోచుకోని దామోదరంకు, కొన్నాళ్ళ తరువాత ఆఫీసులో పాత చెత్తను వదిలించుకునే పనిలో, ఆ ఉత్తరం దొరికింది. వెంటనే సింహాచలం కొండకు వెళ్ళి తన కొడుకు ఆచూకి కోసం ప్రయత్నించాడు. కాని లాభం లేక పోయింది.

దామోదరం పరిస్థితికి అందరు విచారం వెలిబుచ్చారు కాని ఆయన బాధను తీర్చలేరు కదా!

అలా ఒంటరిగానే బ్రతికేస్తున్న దామోదరం ఆ ఊరంతా తన కుటుంబమే అనుకుంటాడు. ఆ ఊరి వాళ్ళందరికి పగటి పూట చంద్రుడు. నేలపై తిరుగాడే చందమామ. చల్ల చల్లని మాటలు, తీపి కబుర్లు మోసుకొచ్చే చల్లనయ్య.

-----///-----

ఏళ్ళు గడిచాయి... కాలం పరుగులు తీసింది.

దామోదరం గారికి పోస్ట్ ఆఫీసుతో ఋణం తీరిపోయే రోజు దగ్గరికి వచ్చింది. ఆయన పదవీ విరమణ సభా కార్యక్రమం ఘనముగా జరిపించాలని ఊరి వారందరి విజ్ఞప్తి మేరకు ఆ ఊరి పోస్ట్ మాస్టర్ గారు, శ్రీకాకుళం డివిజినల్ ఆఫీసుకు కొత్తగా నియమితులైన ప్రధాన అధికారి, సూపెరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, శ్రీ హేమంత్ కుమార్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

ఊరిలోని పెద్దలందరి సహకారముతో, ఉత్తరాలయ్య దామోదరం పదవీ విరమణ సభ అట్టహాసముగా ఒక పెళ్ళి వేడుకలా చేస్తున్నారు.

సభా ప్రాంగణములో అటు ఇటు తిరుగుతు అందరి ఆదరాభిమానాలు, అభినందనలు అందుకుంటున్న ఆ నాటి సన్మాన గ్రహీత దామోదరం ను చూడగానే డివిజినల్ ఆఫీసు నుండి వచ్చిన ప్రధాన అధికారి హేమంత్ కుమార్ లో ఏదో తెలియని అలజడి మొదలయింది.

దామోదరం కుటుంబ సభ్యులెవరు రాలేదేమని అడగ్గా, పోస్ట్ మాస్టర్ “దామోదరం కొడుకు తప్పి పోవడం తరువాత భార్య చనిపోవడం” మొదలైన విషయాలు చెప్పాడు.

హేమంత్ కుమార్ లో అలజడి ఇంకా ఎక్కువయింది.

ఇన్నాళ్ళు ఎద లోయల్లో అట్టడుగున పడి శిథిలమైపోయిన చిన్ననాటి స్మృతులు సజీవముగా ఒక్కొక్కటి కళ్ళ ముందు కదిలాయి.

మరో సారి కళ్ళను కర్చీఫ్ తో తుడుచుకుని చూసాడు.

“యస్, ఈయన మా నాన్నే” అనుకుంటు ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచి వెళ్ళి "నాన్నా" అంటు దామోదరంను కౌగలించుకున్నాడు.

దామోదరం కళ్ళ నుండి వెచ్చటి ఆనంద భాష్పాలు జాలువారాయి.

"విధి ఎంత బలీయమైనదో ఇన్నేళ్ళ తరువాత తండ్రీ కొడుకుల్ని కలిపింది" అని ఆ సభకు విచ్చేసిన వాళ్ళందరు ఏక కంఠం తో హర్షాతిరేకం వెలిబుచ్చారు.

-----///-----

మరిన్ని కథలు

Naati tallula banah tatwam
నాటి తల్లుల భనఃతత్త్వం
- ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)
Garvabhangam
గర్వభంగం
- సరికొండ శ్రీనివాసరాజు
Inkenta sepu
ఇంకెంత సేపు
- గరిమెళ్ళ సురేష్
Ankela rahasyam
అంకెల రహస్యం
- కర్లపాలెం హనుమంతరావు
Nee kannanaa
నీ కన్నానా!?
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Manam maaraali
మనం మారాలి !.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kshantavyam
క్షంతవ్యం
- భాస్కర చంద్ర