
ఆఊరిలోనిలోని కుళ్ళు,కల్మషాన్ని కడిగివేయాలని వచ్చిన వాన తనకు సహయంగా ఉరుములు,మెరుపులను తోడు తెచ్చుకుంది .కొంత సమయం గడచాక ఆపని తనవల్లకాదని నిరాశా,నిస్పుహతో సిగ్గుపడుతూ తన ఓటమీని అంగీకరిస్తూ క్రమంగా తగ్గుతూ వెళ్ళిపోయింది .
సాయంత్రం నాలుగుగంటల సమయంలో తన మనవడు,మనవరాలు బడినుండి ఇంటికి వెళ్ళుతూ తనవద్దకు వచ్చినిలుచున్నారు.ఇది రోజు ఉండే దినచర్యే, జేబులోనుండి రెండు ఐదు రూపాయల బిళ్ళలు తీసి ఇరువురికి ఇచ్చాడు రంగనాధం. నవ్వుతూ వెళ్ళారు పిల్లలు.
ఒకరు సైకిల్ నెట్టుకుంటూ,మరొకరు గొడుగు చేతపట్టుకున్న ఇద్దరు వ్యక్తులు రంగనాధం సైకిల్ షాపు ముందు ఆగి , ' వెనుక చక్రం పంచర్ అనుకుంటా రెండుసార్లు గాలి నింపినా మరలా తగ్గిపోయింది, అన్నాడు సైకిల్ స్టాండు వేస్తూ అన్నాడు ఆవ్యక్తి.
" అలా కూర్చొండి పదినిమిషాల సమయం పడుతుంది " అని తనపని ప్రారంభించాడు రంగనాధం.
'' మనిషి వందేళ్ళు బ్రతకమని తెలిసి వెయ్యేళ్ళకు సరిపడా సంపాదించి ఎందుకు తన ముందు తరలవారిని సోమరులను చేస్తూ, తన ఆస్తిపంపకాలలో గజం స్ధలంకొరకు అన్నదమ్ములు కోర్టుకు వెళ్ళం,కాసు బంగారం కొరకు అక్కా చెల్లెళ్ళు తగవులాడుకునే పరిస్ధితి ఎందుకు కలిగిస్తాడో నాకు అర్ధం కాదు, అన్నాడు సైకిల్ వ్యక్తి.
" నిజమే మనిషి తప్ప మరేప్రాణి రేపటి గురించి ఆలోచించవు. ఆశ ఉండవలసిందే ఇక్కడ దురాశ మనకు కనపడుతుంది సమాజానికి వినియోగపడని విద్య,ధనం వ్యర్ధమేకదా ! " అన్నాడు రొండోవ్యక్తి.
పంచర్ వేసి రెండు చక్రాలకు గాలి నింపిన రంగనాధం చేతిలో ఇరవై రూపాయల నోటు ఉంచి పార్కులోనికి వెళ్ళారు సైకిల్ వ్యక్తులు..
రంగనాధం అరవై ఐదేళ్ళ వయసులో కూడా నడుపుతున్న సైకిల్ షాపు చెక్క బంకును రోడ్డుకు అడ్డం అని కార్పోరేషన్ వాళ్ళు తొలిగించడంతో ,అక్కడే ఉన్న పార్కు ప్రహరి గోడ చెట్టటునీడన తన గాలిపంపు,పంక్చర్ సామాన్లు పెటట్టుకు కూర్చునేవాడు.
కూడబెట్టుకున్న ధనంతో ఏకైక కుమార్తె వివాహం ఉన్నంతలో ఘనంగానే జరిపించాడు,ఆరేళ్ళకు ఇద్దరు పిల్లలు కలిగిన అనంతరం అల్లుడిని కరోనా బలిఅయ్యడు.
పిల్లలతో తన వద్దకు వచ్చింది కుమార్తె . రంగనాధం కుమార్తె బట్టల అంగడిలో పనికి వెళుతుంది సొంత ఇల్లు కనుక అద్దెబాధ లేదు. సొంత ఇల్లు ఉన్నందున ప్రభుత్వ ఫించెను మంజూరుకాలేదు రంగనాధానికి.
ఒక రోజు రాత్రి రంగనాధం భార్య గుండెనొప్పి అనడంతో ప్రభుత్వ ధర్మాసుపత్రిలో ముఖ ధర్మం ఎదురౌతుంది అడిగిన వారందరికి ధనం ఇవ్వవలసివచ్చింది. రెండు రోజుల ప్రాణం కొ రకు పోరాడిన అనంతరం ఆమె మరణించింది రంగనాధం భార్య .ఆమె శవం ఇల్లు చేరడానికి మూడువేలు అయింది. తిండేకే నానాఅవస్ధలు పడే తను ఊహించని ఈకర్చుకు ఉక్కిరి బిక్కిరి అయ్యడు రంగనాధం.
శవం కాళ్ళవద్ద కూర్చున్న తండ్రిని చూస్తు " నాన్నా ఇల్లు తాకట్టుపెట్టి ఈఆపద నుండి బైటపడదాం '' అన్నది కుమార్తె .
"అమ్మమధ్యతరగతి వాళ్ళ జీవితాలు తేనెలో పడిన ఈగవంటివి ,
ఆచార,వ్యవహరాల ఊబిలోనుండి బైటపడేదాక మన జీవితాలు ఇంతే. ఏప్రభుత్వమైనా అభివృధి పధకాలు ఎన్ని చేసి ప్రయోజనం ఏముంది? ఒక ముక్కలో చెప్పాలంటే మధ్యతరగతి వారికి విద్యా,వైద్యం,చివరకు మరణం కూడా ఖరీదైనదే, చచ్చి స్మశాననికిపోయినా అక్కడా లంచం కావాలంటారు, అక్కడ ఉండేకర్చులు అధికారికంగా ప్రభుత్వ లెక్కల్లో తక్కువే అనధికారంగా అయ్యే కర్చు మోయలేనిభారం మనలాంటివారికి , ఇల్లు తాకట్టుపెడితే ఎలావిడిపిస్తాం,వడ్డితో వడికలిగిన గుర్రం కూడా పరుగు తీయలేదంటారు , ఇల్లు లేకుంటే ప్రతి నెల నెల అద్దెమనం కట్టలేము ఏలాగో తిప్పలుపడి గట్టెక్కుదాములే "అని తెలిసిన వారు,కుమార్తె బట్టలషాపు యజమాని,ఆమెతో పనిచేసేవారి సహయంతో ,రంగనాధం భార్యను సాగనంపాడు.
మరికొద్దిరోజులకు గుండెనోప్పితో కూలిపోయాడు రంగనాధం , ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరిక్షించిన వైద్యుడు ' అమ్మా ఈయనకు గుండెపోటువచ్చింది ,సాధ్యమైనంత త్వరగా ఈయనకు బైపాస్ సర్జరీ చేయించండి ఇతనికి విశ్రాంతి కలిగించండి మందులు రాసిస్తాను క్రమం తప్పకుండా వాడాలి 'అన్నాడు.
కూతురు కన్నీళ్ళతో తలఊపటం చూసిన రంగనాధం విరక్తితో నవ్వుకున్నాడు.రోజు తన సైకిల్ షాపుపై వచ్చే ముఫై ,నలభై రూపాయల ఆదాయంకూడా ఈరోజుతో ఆగిపోతుంది. సాయంత్రం బడినుండి వచ్చే మనమ సంతతికి చొరో ఐదు రూపాయలు ఇచ్చే అవకాశంకూడా కనుమరుగయింది.అన్నింటిని మించి తన బిడ్డకు తనవలన భరించలేని కష్టం కలుగుతుంది. ఉన్నఆర్ధిక సమస్యలకు తోడు తన మందుల కొనుగోలు అదనపు భారమౌతుంది. భర్తను కోల్పోయి తను ఉన్నాను అనే నమ్మకంతో తన వద్దకు వచ్చిన బిడ్డకు ఇప్పుడు తానే ఒక కష్టతరమైన సమస్యగా మారాను అనుకున్నాడు రంగనాధం.
ఆల్లు చేరిన ఆరాత్రి ఆలోచిస్తున్న రంగనాధాం రేపు తనకు ఏదైనా జరిగితే తనకుమార్తె ఎలా తట్టుకోగలుగుతుంది ? మట్టిచేయడానికి డబ్బు ఎలాతెస్తుంది? తనకోసం ఇల్లు కోల్పోపోతే తనకు వచ్చఆదాయంతో పిల్లలను ఎలా చదివిస్తుంది? అని తీవ్రంగా ఆలోచిస్తున్న అతనికి మరలా చిన్న గుండెనోప్పివచ్చింది. ఆలా ఆలోచిస్తూ ఓనిర్ణయానికి వచ్చిన రంగనాధం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఇల్లువదలి కట్టుబట్టలతో బయలుదేరి రోడ్డుపై వస్తున్న గుండెనొప్పిని కూడా లెక్క చేయకుండా వేగంగా నడవసాగాడు.
కోట్లాది ప్రజల జీవిత దినచర్య ప్రారంభం కావడానికి సూర్యుడు తూర్పున తన వెలుగు రేఖలు ప్రసరింపసాగాడు.
చీకటి మయమైన తన జీవితాన్ని తలచుకుంటూ గమ్యం తెలియని గమనంతో, ఆరైలు పెట్టెలో ఓమూల ముడుచుకుని కూర్చున్నాడు రంగనాధం.
వేలమంది ప్రయాణీకుల ఆనందాలను,వ్యధలతోవస్తున్నవారిని తనతో తీసుకువెళుతున్న ఆరైలు చీకటిని తరుముతూ వెలుగులు విరజిమ్ముతూ తన గమ్యం దిశగా దూసుకుపోతుంది.