
“సాధనా! అక్కడ రైల్వే ట్రాక్ మీద ఎవరో ఉన్నారు. నీకు కనిపిస్తోందా?”అడిగింది సుజాత. “అవును నిజమే!పద! పరిగెట్టు!”అంది సాధన. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. సాధనని చూడటానికి వచ్చింది. చాలా స్పీడుగా పరిగెడుతున్నారు. కాసేపట్లో ఒకగూడ్స్ అక్కడినుంచి క్రాస్ అవుతుంది. సిగ్నల్ కూడా పడింది. ఒక్కసారిగా బయటకు లాగింది సాధన. వెంటనే గూడ్స్ పెద్ద శబ్దం చేసుకుంటూ వెళ్ళింది. సాధనకి చెయ్యి కొద్దిగా గీరుకుంది “ధాంక్ గాడ్! సేవ్ చేయగలిగాం! అరె సాధనా! నీచేతికి రక్తం!”గాబరాగా అంది సుజాత. “ఫర్వాలేదులే! చిన్నదెబ్బే!”అంటూ రైలు కింద పడబోయిన అమ్మాయి కేసి పరిశీలనగా చూసింది సాధన. వయసు చిన్నదే! ఏ డిగ్రీ చదువుతున్న అమ్మాయో అయ్యుండచ్చు. చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తున్న ఆఅమ్మయినిచూసి భుజంమీద చేయివేసి అనునయంగా… “ఏమిటీ పిచ్చిపని! మేము రావడం ఒక్క నిమిషం ఆలస్యంఅయితే ఈపాటికి నీ జీవితం ముగిసిపోయి ఉండేది.”అందిసాధన. “నన్నెందుకు బ్రతికించారు “అని ఏడుస్తున్న అమ్మాయిని ఇద్దరూ పైకి లేపారు. “నీ పేరు”అంది సుజాత. “నా పేరు రజియా సుల్తానా”నెమ్మదిగా అంది ఆ అమ్మాయి. “గుడ్ మంచి పేరు! ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు. పద అక్కడికి వెళ్లి మాట్లాడుకుందాం”. అంది సాధన. “వద్దా౦టీ! నాకు రావాలని లేదు .నాకు లోకం అంతా శూన్యంగా అనిపిస్తుంది.” అంటూ మళ్ళీ ఏడవడం మొదలు పెట్టింది. “అవన్నీ తర్వాత ముందు పద కాస్త గట్టిగానే అంది సుజాత “నెమ్మదిగా ఇంటికి తీసుకువచ్చారు
హాల్లోపేపర్ చదువుకుంటున్నజై శంకర్ అలికిడికి తలతిప్పిచూశాడు. “హలో సుజాత ఎలా ఉన్నారు? “నవ్వుతూ అన్నాడు జయశంకర్. “ఫైన్ మీరు ఎలా ఉన్నారు” “బాగానే ఉన్నాం! అరే సాధన !రక్తం వస్తోంది !ఉండు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను.” అలా అంటూనే గబగబా అన్ని తెచ్చికట్టు కట్టాడు. “ఇంతకీ నీకీ దెబ్బ ఎలా తగిలింది “ఆందోళనగా అడిగాడు. సాధన జరిగినదంతా చెప్పింది జై శంకర్ ఒక్క నిమిషం ఆలోచించాడు. “ఓకే !మీరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండండి నేను మీకోసం మంచి కాఫీ తెస్తాను. నేను చేసిన కాఫీ తాగితే నీకు మళ్ళీ జీతం మీద ఆశ కలుగుతుంది.” అని రజియా కేసిచూసి నవ్వాడు. “థాంక్యూ! జై! నువ్వు అర్థం చేసుకుంటావని తెలుసు” అంది సాధన రజియా ఇంకా ఎక్కుతూనే ఉంది. ఆమెని కాసేపు అలాగే వదిలేశారు ఈలోగా జై కాఫీలు తేవడంతో ఒక కప్పు తీసుకుని రజియాకి ఇచ్చింది సుజాత. “వద్దాం టీ!అంటున్న రజియా చేతిలో బలవంతంగా కప్పు పెట్టింది సుజాత. అందరూ కాఫీలు తాగుతున్నారు. “రజియా ఇప్పుడు చెప్పు నువ్వు చావాలనుకోవడానికి కారణం ఏమిటి?” అంది సాధన. “నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సూర్య నా క్లాస్ మేట్. తను హిందూ ;నేను ముస్లిం. కానీ మేము ప్రేమించుకున్నాం .పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నాం .కానీ ఆఖరి నిమిషంలో ఏమైందో కానీ అతను రాలేదు. రైలు వచ్చింది. వెళ్ళింది. నేను మాత్రం ప్లాట్ ఫారం మీద ఒంటరిగా మిగిలిపోయాను.” కన్నీళ్లు తుడుచుకుంటూ అంది రజియా. “రాస్కెల్ ఏమనుకుంటున్నాడు !వాడి మొహం పగలగొడతా!” ఆవేశంగా అన్నాడు జై. “నేనైతే వాడి మొహం పచ్చడి చేస్తా!” మరింత ఆవేశంగా అంది రజియా. “వాడో పిరికిపంద!కానీ నువ్వు కావుగా!” “కాను గా!” “మరి ఎందుకు వాడి గురించి ఆత్మహత్య చేసుకోవడం.” “అవును వాడి గురించి నేనెందుకు…..”సగంలో ఆపి అందరి కేసి చూసింది .ముగ్గురు నవ్వాపుకుంటూ చూస్తున్నారు. రజియా నవ్వింది .ఆ ముగ్గురూ కూడా గట్టిగా నవ్వారు. “నేను చేసింది అర్థంలేని పని అని నా చేతేచెప్పించారు. అవునా! కానీ అందరి జీవితాలు మీ మీజీవితం లా ఆనందంగా ఉండవుగా!” బాధగా అందిరజియా. “రజియా! నా జీవితం వడ్డించిన విస్తరి లాంటిదని నువ్వు అనుకుంటున్నావు.అవునా!కానీ నా జీవితం లో నేను చాలా బాధలు పడ్డాను.” అంటూ సాధన తన గతం గురించి చెప్పడం మొదలు పెట్టింది. ***** తల్లి తండ్రి రైల్ యాక్సిడెంట్ లో పోవడంతో వంటరిది అయింది సాధన.బరువు బాధ్యతలు పెరుగుతాయని బంధువులు దూరమయ్యారు.సాధన అందమే ఆమెకు శాపం అయింది. అదే సమయంలో సమీర్ ఆమెకు దగ్గరయ్యాడు.చుట్టూ ఉన్న రాబందుల నుంచి తనంతాను రక్షించుకోవాలంటే పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గమని ఆమెకు అనిపించింద.పెళ్లయింది, సాధన కిముందు నుంచి కొంచెం హుషారు ఎక్కువే.ఎందుకో అక్కడి వాతావరణం కొంచెం గంభీరంగా ఉన్నట్టు అనిపించేది. అత్తమామలు కొడుకుని సార్! సార్! అని అనడం కూడా గమనించింది. ఆ రోజు హాల్లో ఎవరూ లేరు. సమీర్ బాత్రూంలో ఉన్నాడు. స్నానానికి వెళ్తే అరగంట తర్వాత గాని బయటకు రాడు. ఫోన్ రింగ్ అవుతోంది. సాధనలో చిలిపితనం తొంగి చూసింది. సాధనకి మిమిక్రీ వచ్చు.ఎవరి కంఠాన్నయినా అనుకరించి మాట్లాడగలదు. “హలో!”అంది సాధన సమీర్ వాయిస్ అనుకరిస్తూ. “హలో! అంతా ఓకే కదా!” “ఎస్!” “మీ అమ్మానాన్నలుగా నటిస్తున్న వాళ్లని అక్కడ నుంచి పంపించు. సాధన అడిగితే వాళ్లని తీర్థయాత్రలకు పంపుతున్నారని చెప్పు. నీకు రావాల్సిన అమౌంట్ పది లక్షలు నీ అకౌంట్లో పడుతుంది. గుర్తుందిగా ఎల్లుండి రాత్రికి ఎయిర్ పోర్ట్ కి తీసుకురా. సాధనని దుబాయ్ పంపించాలి. ఓకే!” ఫోన్ కట్ అయింది. ఆమె ఒక్క నిమిషం బిత్తర పోయింది. లోకమంతా శూన్యంగా అనిపించింది. ఆమె మనసు మొద్దు బారింది.’ అంటే నన్ను అమ్మాలని ప్లాన్ చేశాడా సమీర్ ‘ఇంత మోసమా? ఇంత రాక్షసత్వమా!మరు నిమిషంలోనే మామూలుగా అయ్యింది సాధన. ఆమె మెదడు పాదరసంలా పనిచేయ సాగింది.ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్ తీసి బ్యాగ్ లో పెట్టుకుంది. కాసేపటికి సమీర్ రెడీ అయి వచ్చాడు. “ సాధనా! చిన్న పని ఉంది ఒక్క అరగంటలో వస్తాను.”అంటూ బయటకు నడిచాడు. “ ఓకే!” అంది. తర్వాత స్టెప్ ని అంచనా వేస్తూ! అన్నట్టుగానే అరగంటలో వచ్చాడు సమీర్. “ అమ్మా!నాన్న! నీకో సర్ప్రైజ్!ఏంటో చెప్పుకోండి!” నవ్వుతూ అన్నాడు. “ నువ్వు చెప్పందేమాకు ఎలా తెలుస్తుంది బాబు!” అన్నారు ఇద్దరూ. “ మీ ఇద్దరికీ తీర్థయాత్రలకు టికెట్లు బుక్ చేశాను.రేపే ప్రయాణం!”సంతోషంగా నవ్వుతూ అన్నాడు సమీర్. “ సంతోషం బాబు! అన్నారు ఇద్దరు.సాధన జాగ్రత్తగా వింటోంది. అంటే ఫోన్ లో విన్నదంతానిజమే అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి తనలో తనే అనుకుంది. వాళ్లు ముగ్గురు పక్క గదిలోకి వెళ్లడం గమనించి వాళ్లకు తెలియకుండా వాళ్ళని ఫాలో అయింది. “ఇదిగో మీకు రావాల్సింది మీ అకౌంట్లో పడుతుంది.మొత్తం మీ సామానంత సర్దుకోండి. ఇక మీ అవసరం లేదు. ఉదయాన్నే లేచి సంతోషంగా తీర్థయాత్రలకు పెడుతున్నట్టు నటిస్తూ వెళ్ళిపోండి.”రహస్యంగా చెప్పాడు సమీర్ సాధన చప్పుడు చేయకుండా హాల్లోకి వచ్చి కూర్చుంది. కాసేపటికి సమీర్ వచ్చి సాధన పక్కన కూర్చున్నాడు. “చాలా కాలం నుంచి నాకు నీతో బయటికి ఎక్కడికైనా వెళ్లాలని ఉంది. అమ్మానాన్న తీర్థయాత్రలకు వెళ్లాక మనం ఢిల్లీ,ఆగ్రా వెళదాం! సరేనా!”అన్నాడు సమీర్. “అయితే తాజ్ మహల్ చూడాల్సిందే!” “ రేపు అమ్మానాన్న తీర్థయాత్రలకు పెడతారు గా!మనం ఎల్లుండి పెడదాం!” “ ఓ! ఇంత తొందరగా! చాలా హ్యాపీ!”సంతోషం నటిస్తూ అంది. “ సరే నువ్వు కూడా బట్టలు ప్యాక్ చేసుకో!” “ఓకే! రేపు అత్తయ్య మామయ్య బయలుదేరుతారు గా! కావాల్సిన బిస్కెట్స్, కేకులు, కూల్డ్రింక్స్ ఇంకా నాకు ఏం కొనాలి అనిపిస్తే అవి కొంటాను.” “ఇంకా అత్తయ్య మామయ్యలకి బట్టలు కూడా!” హుషారుగా అంది సాధన. “ఓకే నీకు ఎలా చేయాలనిపిస్తే అలాచెయ్యి!” అన్నాడు సమీర్! “సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నేను మా ఫ్రెండ్ సుజాతను తీసుకుని వెళ్తాను. వచ్చేసరికి లేట్ అవుతుంది. నాకోసం ఎదురు చూడకండి.” “సాధన!నాకు బయట కాస్తపనుంది.” అంటూ బయటికి నడిచాడు సమీర్. “ అత్తయ్య! నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తాను.” అంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది సాధన. ఇంతవరకు అయితే ఆ గదిలో ఏం కాగితాలు ఉన్నాయో ఎప్పుడు చూడలేదు. అవసరమూరాలేదు. జాగ్రత్తగా ప్రతి కాగితం వెతక సాగింది.ఏవో ఫోన్ నెంబర్లు, ఇంకా కొన్ని కాగితాలు, పాస్పోర్ట్ లు కొన్ని పేపర్లుఉన్నాయి. ఏదో కోడ్ లో ఉన్నట్టున్నాయి. ఏమీ తెలియడం లేదు.అన్ని ఫోన్లో ఫోటో తీసింది. ఎందుకైనా మంచిది అని, సుజాత ఫోన్ కి పంపించి వెంటనే తన ఫోన్లో అన్ని డిలీట్ చేసింది.బయటకు వచ్చేసరికి సమీర్ వచ్చి ఉన్నాడు. మళ్ళీ వచ్చాడు,నా మీద డౌట్ వచ్చిందేమో! అనుకుంది సాధన! “ఏమైనా మర్చిపోయారా!” లేదులే కానీ, నీ ఫోన్ ఒకసారి ఇవ్వు.నా ఫోన్ పని చేయడం లేదు”అన్నాడు.అంటే నేను ఫోన్లో ఏమైనా కాపీ చేశానని అనుమానంఅన్నమాట!కానీ డిలీట్ చేశానుగా మనసులో అనుకుంటూ ఇదిగో తీసుకోండి.” అంటూఫోన్ అందించింది. ఫోన్లో అన్ని చెక్ చేసి తిరిగి ఇచ్చేసాడు. “ నువ్వు బయటకు వెళ్తానన్నావు!” అన్నాడు సమీర్ . “ఇదిగో బయలుదేరుతున్నా!”అంటూ బయటకి నడిచిందిసాధన.
***** “సుజాత! నీ భర్తవిక్రం ఎ స్సైకదా ! ఏం చేయాలో నువ్వేచెప్పాలి!”అంది సాధన. సుజాత విక్రమ్ కి ఫోన్ చేసింది. అరగంటలో విక్రమ్ ఇంటికి వచ్చాడు. జరిగిందంతా వివరించి చెప్పింది సుజాత. ఫోన్ లో ఉన్న వివరాలన్నీ విక్రమ్ కి ఇచ్చింది. “మై గాడ్ !ఇది ఇంటర్నేషనల్ గ్యాంగ్!మేము వెతుకుతున్నది వీళ్ళ గురించే!వీళ్ళుఅమ్మాయిల్ని విదేశాలకి అమ్మడం, డ్రగ్సు సప్లై చేయడం చేస్తారు. “ఓకే!ఏం చేయాలో నేను ఆలోచించి చెప్తాను.”అన్నాడు విక్రమ్. “మనం ఈలోగా షాపింగ్ చేసి వద్దాం! నేను అలాగే చెప్పి వచ్చాను కదా! లేకపోతే వాళ్ళకు అనుమానం రావచ్చు!” అంది సాధన. చీరా పంచెల చాపు,కొన్ని కూల్ డ్రింక్స్,బిస్కెట్స్ లాంటివి తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఇద్దరినీ కూర్చోమన్నాడు విక్రం. “వీళ్ళుఇంటర్నేషనల్ గ్యాంగ్! చాలా ప్రమాదకరమైన వాళ్ళు! నువ్వు చాలా తెలివిగా సమాచారాన్ని మాకు అందించావు. నువ్వూపంపినసమాచారన్ని సుజాతవెంట నేసేవ్ చెయ్యడంనువ్వు డిలీట్చెయ్యడముమంచిదయ్యింది! నిన్ను మళ్ళీ వాళ్ళ దగ్గరికి పంపించడం ప్రమాదమే!కానీ తప్పడం లేదు! ఒక పని చేద్దాం!మా స్టేషన్ లోలేడి కానిస్టేబుల్ ని పంపిస్తాను. తను మీ చిన్ననాటి స్నేహితురాలు అని చెప్పు. అనుకోకుండా కలిసిందని ఈ రెండు రోజులు ఉంటుందని చెప్పు. అలాగే నేను ఆ ఏరియాలో అడుగడుగునా మఫ్టీలో పోలీసుల్ని పెడతాను .ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది” “లేడీ కానిస్టేబుల్ ప్రొటెక్షన్ ఇవ్వగలదా”అడిగింది సుజాత. “ ఆ విషయంలో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆమెచాలా పవర్ ఫుల్ లేడీ! ఒంటి చేత్తో పదిమందిని పడగొట్టగలదు! తన పేరు సారంగి! తను అచ్చమైనతెలుగుఅమ్మాయిలావస్తుందికాసేపట్లో.”అన్నాడు విక్రమ్. కాసేపట్లోనే సారంగి వచ్చింది. “హాయ్ సాధన! ఎలా ఉన్నావ్? నువ్వు ఇప్పటికి ఏమీ మారలేదు. అవును! బావగారు ఇక్కడికి రాలేదా! చిన్నప్పుడు దాగుడుమూతలు ఆడుకునేవాళ్ళం,ఇంకా మామిడి తోటలో మామిడికాయలు కోసి,ఉప్పు కారం వేసుకుని…..” అంటూ విరగబడినవ్వింది. సాధన పరిశీలనగా చూసింది.సారంగి లంగాఓణీలో బొద్దుగా ఉంది.నిజంగానే తను నా చిన్ననాటి స్నేహితురాలా!అనిపించింది ఒక క్షణం. “ మీరు!” అంటూ మొహమాటంగా అంటున్న సాధనను చూసి, “మొద్దు! మీరు లేదు, ఏమీ లేదు నేను నీ చిన్ననాటి స్నేహితురాలు సారంగిని! ఇకనుంచి మన రిలేషన్ ఇలాగే ఉండాలి. ఇప్పుడు చెప్పానుగా అదే నా క్యారెక్టర్! ఓకే!”అంది. “ఓకే “అందిసాధన చిన్నగా నవ్వుతూ. విక్రమ్,సుజాత కూడా నవ్వారు. ***** సారంగిని తీసుకుని సాధన ఇంటికి వచ్చింది తెచ్చిన సామానంతా లోపల పెట్టి పెట్టింది.ఈలోగాసమీర్ గదిలో నుండి బయటకు వచ్చాడు. “ఏమండీ తను నా చిన్నప్పటి ఫ్రెండ్!” బజార్లో కనబడింది వాళ్ళు ఈ మధ్యనే ఈ ఊరు వచ్చారట పేరు సారంగి.ఉత్త కొంటె కోణంగి సుమండి!” నవ్వుతూ అంది సాధన.లాస్ట్ మినిట్స్ లో ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది! చిరాగ్గా అనుకున్నాడు సమీర్. “ బావగారు పెళ్లికి ఎలాగా పిలవలేదు కనీసం ఈ రెండు రోజులైనా మీ మరదల్ని జాగ్రత్తగా చూసుకోండి.”గలగల నవ్వుతూ అంది సారంగి. “సరేలేవే లేకపోతే నువ్వు ఊరుకుంటావా! అసలే నీకు ముక్కు మీద ఉంటుంది కోపం.”గట్టిగా నవ్వుతూ అంది సాధన. ఇద్దరికేసి అయోమయంగా చూసిచిన్నగానవ్వాడు సమీర్. “బావగారు!మీకోసం ఒక చిన్న గిఫ్ట్”అంటూ ఒక పంజరాన్ని అందించింది సారంగి. అందులో ఒక చిన్న చిలుక ఉంది. పంజరం ఎంతో అందంగా ఉంది “ఇల్లుచూపించు!”అంటూ అక్కడినుండి లాక్కెళ్ళింది సారంగి. “పద!ఎక్కడా కాలు నిలవదు కదా!నీకు!”అంటూ నవ్వింది సాధన.ఇల్లంతా చూసి సోఫాలో కూర్చుంది సారంగి.ఈ పంజరం ఇక్కడే ఉండిపోయింది.దీని కోసం మంచి ప్లేస్ వెతకాలి. ఆ! ఇది నేను బావగారి కోసం కదా ఇచ్చాను!మీ బెడ్ రూమ్ లో పెడదాం! పద!” అంటూ బెడ్రూంలో ఒక ప్లేస్ పెట్టింది పంజరం చుట్టూ స్పైకెమెరాస్ ఉన్నాయి. “ సాధనా!తలనొప్పిగా ఉంది! కాసేపు రెస్ట్ తీసుకుంటాను అన్నాడు సమీర్. “సాధనా!రెండు స్ట్రాంగ్ కాఫీలు తీసుకురా! నేను ఈ లోగా బావ గారితో మాట్లాడుతూ ఉంటాను”అంది సారంగి. ‘అబ్బా ఈ సారంగని ఎలా వదిలించుకోవాలి! బాస్ ఫోన్ చేసే టైం అయింది!’మనసులోనే బాధగా అనుకున్నాడు. పైకి మాత్రం నవ్వుతూ “ అబ్బే! మీ ఇద్దరు తాగండి! అసలు ఇంటికి వచ్చాక కాఫీ కూడా ఇవ్వలేదు మీ ఫ్రెండ్ కి!”అన్నాడు “ ఓకే బావ! నీ తలనొప్పి తగ్గగానే మాతో జాయిన్ అవ్వాలి మరి. “ఓకే!” “సరేలే!పద!కాఫీ పెడతాను!” అంటూ అక్కడినుంచి తీసుకెళ్ళింది సాధన. అమ్మయ్య! అనుకుని తలుపులు మూసుకున్నాడు. ఓరకంట గమనిస్తూ చిన్నగా నవ్వింది సారంగి. “బావగారు కాస్త ,బావ అయిందా?”నవ్వుతూ అంది సాధన. “ అవును మరి కాసేపు ఉంటే ఒరేయ్ బావ!అంటా!”పెద్దగా నవ్వుతూ అంది. “ నెక్స్ట్ ఏంటి!” అంది సాధన. “ టాపు లేపడమే!మీ అత్తగారు మామగారు ఉన్నారుగా!ఓ పట్టు పడతాను అన్నట్టు కాఫీ అక్కడికే తెచ్చే సై!”అంటూ ముందుకు నడిచింది సారంగి. ***** ఎస్సై విక్రం అతని ఆఫీసర్స్ చాలా జాగ్రత్తగా లాప్ టాప్ లో గమనిస్తున్నారు సారంగిచ్చిన పంజరం చుట్టూ ఉన్న స్పైకెమెరాస్ పనిచేయడం ప్రారంభించాయి.సమీర్ తలుపులు మూసిన కాసేపటికి ఫోన్ రింగ్ అయింది. అది వీడియో కాల్! “ ఎస్!”అన్నాడు సమీర్. “ అంతా ఓకే కదా!” “ ఓకే బాస్!” “ నేను ప్లేస్ మార్చాను!ఇప్పుడు మనం ఉండే ప్లేస్ కాదు! ఎందుకంటే పోలీసులు మన గురించి చాలా ఎక్కువగా వెతుకుతున్నారు! నువ్వు రేపు అక్కడికీరావాల్సి ఉంటుంది!” “ ఓకే బాస్!అడ్రస్ చెప్పండి!” “ సుజాతనగర్! టెంపుల్ స్ట్రీట్!అక్కడ ఒక పాడుబడిన భవనం ఉంది! లోపల అంతా బాగానే ఉంటుంది .నేరుగా రేపు ఉదయాన్నే అక్కడికి 7వచ్చేసేయ్! నీతో చాలా డిస్కస్ చేయాలి!” “ఓకే బాస్!” “ బావ !తలుపు తియ్యి! అత్తయ్య పిలుస్తోంది!”తలుపు గట్టిగా చప్పుడు చేసింది సారంగి. “ ఎవరు ఇంట్లో! బావ అంటున్నారు!” “ నా భార్య ఫ్రెండ్! కొంచెం మోటుగా ఉంటుంది! కానీ కలుపుగోలు తనంఎక్కువ!ఈరోజే వచ్చింది రేపు వెళ్ళిపోతుంది!” “ఓ! ఇంకో కేసు! జాగ్రత్తగా డీల్ చెయ్! దుబాయ్ పంపించేద్దాం.” “ఏం పంపడమో చెయ్యి లేపిందంటే పదిమందిని పడగొట్టేలా ఉంది!” “ అయినా ఎంతటి వాళ్ళయినా మన ఉచ్చులో పడితే అంతే; సరే నేను చెప్పింది గుర్తుందిగా! ఉదయం ఆరు కల్లా వచ్చే సెయి!”ఫోన్ కట్ చేశాడు బాస్. తరువాత కార్ డ్రైవర్ కి ఫోన్ చేశాడు. “బాసు ప్లేస్ మార్చాడు!” అంటూ అడ్రస్ చెప్పాడు తర్వాత తలుపులు తీసుకుని ఇవతలకి వచ్చాడు. “బావ ఎంతసేపు అయింది!ఇదే నా మరదలు కిచేసే మర్యాద!” అంటూ దబాయించింది “అబ్బాయి! అందరం కలిసి భోజనం చేద్దాం!”అంది సమీర్ తల్లి. “” వన్ మినిట్!మీరు పెడుతూ ఉండండి!నేను వెళ్లి స్వీట్స్ తెస్తాను!” అన్నాడు సమీర్. “ నేను బయటకు వెళ్లినప్పుడు తెచ్చాను. రండి!అందరికీ వడ్డించేస్తాను. “నువ్వు కూర్చో సాధన!ఎవరికి వాళ్ళు పెట్టుకుందాం!”అంది సారంగి. ముందుగానే తను స్వీట్స్ సెలెక్ట్ చేసింది సాధన పైన జీడిపప్పులు ఉన్న స్వీట్స్ స్పెషల్ గా అత్తగారికి మామగారికి భర్తకి వేసింది “ నాకు ఆ స్వీట్ వెయ్యి!” అంటూ మరో రకం స్వీట్ వేయించుకుంది సారంగి. సాధన కూడా మరో రకం వేసుకుంది. అది చూసి చిన్నగా తల ఊపింది సారంగి. తింటున్నంత సేపు, బావ!బావ! అంటూ మాట్లాడుతూనే ఉంది సారంగి అందరిభోజనం అయిన అరగంట తర్వాత, “ నాకు నిద్ర వస్తోంది.” అంటూ వెళ్ళిపడుకున్నాడు. కాసేపటికి అత్తగారు, మామగారు కూడా పడుకున్నారు. “ స్వీట్స్ లో కలిపిన మత్తుమందు బాగానే పనిచేస్తోంది. ఉదయం వరకు లేవరు. అయినా బయట నుండి గడివే వేసి మన పని కానిద్దాం”అంటూ రెండు గదులకి బైట నుండి గడియ పెట్టింది సారంగి. “సార్!మన ఆపరేషన్ కంప్లీట్ అయింది! ఇంక వీళ్ళని షిఫ్ట్ చేయడమే!” “ఓకే!సారంగి!మన సిబ్బంది అక్కడికి వస్తారు.నేను వీళ్ళ బాస్ ని పట్టుకోవడానికి వెళుతున్నాను. బి కేర్ఫుల్!” కళ్ళు నలుపు కుంటూలేచి కూర్చున్నాడు సమీర్. చుట్టూరా ఆశ్చర్యంగా చూశాడు.ఇదేమిటి?నేనెక్కడున్నాను!”అయోమయంగా అన్నాడు.” “ అత్తారింట్లో బావ!సరిగ్గా చూడు!”అంటూ క్ల లాఠీతోకాళ్ళ మీద గట్టిగా కొట్టింది సారంగి. “ అబ్బా!”అంటూ ఇటూ అటూ చూశాడు. “నన్నే అమ్ముదాం అనుకున్నావు రా! బేవకూఫ్!”అంటూ తల గోడకేసి కొట్టింది సారంగి. ఈ లోగ విక్రమ్ మిగతా వాళ్ళని తీసుకొని వచ్చాడు! “సారంగి! బావ ఏమంటున్నాడు!”నవ్వుతూ అన్నాడు విక్రమ్. “ అత్తగారింట్లో మర్యాదల కోసం ఎదురు చూస్తు న్నా డు” అంది సారంగి. “ మరి ఇంకేం! దరువై!సారంగి!”మరింతగా నవ్వాడు విక్రమ్. “ సాధన!” అంటున్న సమీర్ కేసి అసహ్యంగా చూసింది సాధన. “సారంగి!మీరందరూ లేకపోతే నా బతుకు ఏమయ్యేదో!”అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సాధన. “ నీకు మేమంతా ఉన్నాం సాధన! నువ్వు నీ భర్తని పోగొట్టుకొని ఉండొచ్చు! కానీ మనం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం! ఈ సారంగి నీకు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్! ఓకే!”అంటూ భుజం తట్టింది. సాధన స్నేహితుల సాయంతో ఎన్నో విజయాలు సాధించింది. ఉన్నతమైన స్థానంలో నిలబడింది.ఆమె పెళ్లి అనే మాటను మరిచిపోయింది. జీవితం అంతా ఇంతే అనుకుంటూ నిర్లిప్తంగాఉండిపోయింది అనుకోకుండా ఆమె జీవితంలోకి జై ప్రవేశించాడు. జీవితాన్ని జీవించడం ఎలాగో నేర్పాడు.ఆమె మొహంలో చిరునవ్వులు విరిసాయి. చెప్తున్న సాధన ఒక్క నిమిషం ఆగింది. “ ఆంటీ !”నా తప్పు నాకు తెలిసింది జీవితం ఎంత విలువైనదో అర్థమయ్యింది.సూర్య రాకపోవడం కూడా నా మంచికే అనుకుంటా! అమ్మానాన్నలను ఆదుకోవాల్సిన నేను ఇలా వాళ్ళని వదిలివేయడం ఎంత తప్పో తెలిసింది నా బతుకు కూడా అగమ్యంగా ఉండేది .ఇప్పుడు నా ధ్యాస అంతా మా అమ్మ నాన్నలను బాగా చూసుకోవాలని”అంది రజియా “ పద! నిన్ను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాను” అంది సాధన.
ఎనిమిదిసంవత్సరాల తరువాత,ఇంటి ముందు లైన్ గా నాలుగు కార్లు ఆగడంతో ఆశ్చర్యంగా చూశారు సాధన,జై. “సాధన!ఎవరో వచ్చారు!” అన్నాడు జై. “ అవును! ఎవరంటారు ఆశ్చర్యంగా అంది సాధన. “హలో! ఆంటీ! హలో; అంకుల్! నేను రజియా సుల్తానా!” నవ్వుతూ అంది. “ ఓ!రజియా! నువ్వా!” ఆనందంగా అన్నాడు జై. “అవును!ఈ జిల్లా కలెక్టర్! జై అంకుల్ ఇచ్చే కాఫీ కోసం వచ్చింది.”నవ్వుతూ అంది. ఆమె నవ్వుతో శృతి కలిపారు ఇద్దరు. “ చూసావా! నాకాఫీ ఎంత పని చేసిందో!”అన్నాడు జై. * మరే!మీ కాఫీ వల్లే రజియా కలెక్టర్ అయ్యిందంటారా ఏంటి!” నవ్వుతూ అంది సాధన. “ అంతేగా! అంతేగా! నవ్వుతూ అంది రజియా.అక్కడ వెన్నెల నవ్వులు కురిపించింది. *****