లోకం తీరు - టి. వి. యెల్. గాయత్రి.

Lokam teeru

ఉదయం పదకొండు గంటలు. అప్పుడే పనంతా ముగించుకుని టీవీ పెట్టుకుని సోఫాలో కూర్చుంది అపర్ణ. సెల్ఫోన్ మోగింది. 'ఎవరా!'అని చూస్తే తోడికోడలు వీణ.

గొంతులోకి కాస్త ప్రేమను తెచ్చుకొని "చెప్పు వీణా! ఎలా ఉన్నారు?" అడిగింది అపర్ణ

"బాగున్నాం!బాగున్నాం! పెళ్లి అలసట కాస్త తీరింది. మొత్తానికి మొగుడు లేకపోయినా పిల్లలిద్దరి పెళ్లిళ్లు వైభవంగానే చేసింది మన బృంద వదిన. మనకు సామాన్యమైన చీరలు పెట్టింది కానీ... పెళ్లివాళ్లకు ఖరీదైన చీరలు.. వెండి సామాను బాగానే ముట్టచెప్పింది..కూతుళ్ల పట్టుచీరలు చూసావా? ఒక్కొక్కటి పాతిక వేలకు తక్కువ ఉండవు!"

"అవునవును వీణా! ఇద్దరు కూతుళ్ళకి కెంపుల నెక్లెసులు కొత్తవి చేయించింది చూసావా! ఏవైనా చేయిస్తుంది!నెల్లూరులో రెండిళ్లు మూలుగుతున్నాయి.. ఆ పొలం మీద కూడా కౌలు బాగానే వస్తుంది!.. మన ముందు బయటపడదు కానీ డబ్బులు బాగానే కూడేసింది.. అనకూడదు కానీ మొగుడు లేకపోయినా జరుగుబాటుకి ఏమి లోటు లేదు.. మావగారు ఎప్పుడో పోయారు.. ముసలి అత్తగారు వాళ్ళ బావగారి దగ్గరే ఉంటుంది.. తనకు బాధ్యతలూ పాడూ లేవు.. మనకు మల్లే పొద్దస్తమానం డబ్బులకు చూసుకోవలసిన పనిలేదు.. తనకేం హాయిగా గడిచిపోతుంది!" అపర్ణ కంఠంలో కాస్త ఈర్ష్య ధనిస్తోంది.

"బాగా చెప్పావక్కయ్యా!అయినా పిల్లల పెళ్లిళ్లు చేసేసింది కదా!ఆ నెల్లూరులో ఉండి ఒక్కతే ఏం చేస్తుంది చెప్పు! అయిన వాళ్ళం మనం ఉన్నాం! ఆవిడను చూసుకుందాం! వదిన్ను ఒంటరిగా వదిలేస్తే 'ఒక్క అక్కయ్యను విధవరాలిని ఇద్దరు తమ్ముళ్లు వదిలేసా'రని రేప్పొద్దున లోకం మనల్నే అంటుంది!.. ఏమంటావు?"

వీణ తెలివితేటలకి 'ఔరా!' అనుకుంది అపర్ణ.

"నువ్వు చెప్పిందే కరెక్ట్... అయినా వదినకు ఎవరున్నారు? చూసుకునే వాళ్ళం మనమే కదా!మన దగ్గర వచ్చి ఉండమని మీ బావ గారితో చెప్పిస్తాను!.. మీ దగ్గర కొంత కాలం, మా దగ్గర కొంత కాలం ఉంటే సరిపోతుంది!వదినకు ఏ రోగమో రొప్పో వస్తే మనమే కదా చూడాలి!"

అపర్ణ మాటలకు సంతోషం వేసింది వీణకు.

"అవునక్కయ్యా! మీ మరిది చేత కూడా చెప్పిస్తాను!ఎప్పుడైనా తమ్ముళ్ళిద్దరి మాట కాదందా చెప్పు!నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడు!"

"అలాగే అలాగే!"అంది అపర్ణ

వీణతో మాట్లాడాక ఇక ముందు చేయాల్సిన పని గురించి ఆలోచనలో పడింది అపర్ణ

పదిరోజులక్రితం అపర్ణ ఆడబడుచు బృంద చిన్నకూతురు ప్రజ్ఞ పెళ్లయ్యింది. కొత్తజంట హనీమూన్ కు వెళ్లి ఆ తర్వాత లండన్ వెళ్తారు. బృంద చిన్న అల్లుడి ఉద్యోగం లండన్ లో. పెద్దకూతురు ప్రవీణ, అల్లుడు ఉండేది అమెరికాలో. వాళ్లు పెళ్లయిన వారానికే అమెరికా వెళ్లిపోయారు. బృంద భర్త సుధాకర్. సూళ్లూరుపేట దగ్గర షార్ లో ఇంజనీరుగా ఉద్యోగం. పిల్లలు కాలేజీ చదువుల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అప్పటికి సుధాకర్ నెల్లూరులో ఒక ఇల్లు, కొంత పొలము కొన్నాడు. నెల్లూరు కాలేజీల్లో పిల్లల చదువులు. భర్త పోయాక బృంద నెల్లూరు చేరి పిల్లల్ని చదివించుకొంది.భర్తకు ఆఫీసులో వచ్చిన డబ్బులతో, యెల్. ఐ. సి డబ్బులతో ఇంకో ఇల్లు కొని, మిగిలిన డబ్బులు పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు దాచింది. అద్దె డబ్బులతో, పొలంమీద వచ్చే కౌలుతో జాగ్రత్తగా పిల్లల చదువులు పూర్తి చేసి, ఉన్నంతలో మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది. తను మాత్రం చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతాన్ని సాధన చేసి, సంగీతలో ఎమ్మే చేసింది. సంగీతపాఠాలు చెప్తూ, అప్పుడప్పుడూ కచేరీలు చేస్తూ ఉండేది.

బృందకు ఇద్దరు తమ్ముళ్లు. రామకృష్ణ, మొహనకృష్ణలు. సుధాకర్ అన్నయ్య ప్రభాకర్. కాకినాడలో ఉద్యోగం. వాళ్ళ తల్లి ప్రభాకర్ దగ్గరే ఉంటుంది. ఆవిడకు ఎప్పుడు ఒంట్లో బాగలేకున్నా బృంద వెళ్లి ఆవిడకు తగ్గేదాకా చేసి వచ్చేది. ప్రభాకర్ ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళకు కూడా ఒక నెలముందు వెళ్లి నెల తర్వాత వచ్చింది. పుట్టింటి వాళ్లకు కానీ, అత్తగారింటి వాళ్లకు కానీ ఏ అవసరం వచ్చినా బృంద వచ్చి చాకిరీ చేయటం అలవాటయింది.'విడిమనిషి కదా!మొగుడు మొద్దులు లేడు 'అంటూ ప్రతి అవసరానికి ఇరువైపులవాళ్ళు బృందను పిలుస్తూ ఉంటారు.ఇక ఎండాకాలం వచ్చిందంటే అటు పుట్టింటి వాళ్లకు, ఇటు అత్తగారింటి వాళ్లకు పచ్చళ్ళ దగ్గర్నుండి వడియాలు, ఊరిన మిరపకాయల దాకా పెట్టి పంపిస్తూఉంటుంది. ఇక స్వీట్లు,హాట్లు అయితే చెప్పక్కర్లేదు.రెండు వైపుల కుటుంబాలకు నిరంతరం నెల్లూరు నుండి రవాణా అవుతుంటాయి.

బృందకు స్నేహితురాలు సుమతి.

"ఈ వెట్టి చాకిరీ ఏమిటి బృందా!నువ్వు ఇంత చేస్తున్నావు? రేప్పొద్దున నీకు ఒంట్లో బాగలేకపోతే వీళ్లెవరన్నా నీకు చేస్తారా?చెప్పు!నీ డబ్బుని, నిన్నూ మొహమాటం లేకుండా వాడుకుంటున్నారు. నీ బంధువుల కంటే జలగలు నయం!"అంటూ బృందను సన్నసన్నగా మందలిస్తూ ఉండేది సుమతి.

"రక్తసంబంధం ఎలా పోగొట్టుకుంటాను?నాకూ తెలుసు! వీళ్ళు నన్ను ఎక్స్ ప్లాయిడ్ చేస్తున్నారని. పిల్లలిద్దరి పెళ్లిళ్లు సవ్యంగా అయితే చాలు!ఆ తర్వాత నేను, నా సంగీతం!ఇక ఒంట్లో బాగలేకపోతే పిల్లల దగ్గరికి వెళ్లి ఉంటాను!చివరకు నన్ను చూడాల్సింది నా పిల్లలే అని నాకే కాదు నా పిల్లలకు కూడా తెలుసు!బంధువుల మీద ఆధారపడితే మనకు మిగిలేది చీత్కారాలే!అయితే నాకు సంగీతంలో అభిరుచి ఉంది.తర్వాత తర్వాత దాని కోసం కృషి చెయ్యాలి!"అంటూ వివరించేది బృంద.

పిల్లలు, బంధువులు వెళ్ళాక ఇల్లు సర్దుకొనేసరికి పదిరోజులు పట్టింది బృందకు.

మళ్ళీ సంగీతం నేర్చుకొనే పిల్లలకు పాఠాలు చెప్ప సాగింది. ఇంకో నెలరోజుల్లో ట్యూషన్ పిల్లలకు సంగీతం పరీక్షలు ఉన్నాయి.

ఆరోజు రాత్రి బృంద బావగారు ప్రభాకర్ బృందకు ఫోన్ చేశాడు.

"అమ్మాయ్!ఆఫీసు పనిమీద రేపు నెల్లూరు వస్తున్నా "అంటూ చెప్పాడు.

ఆఫీసు పనిమీద అప్పుడప్పుడూ నెల్లూరు వచ్చి వెళ్ళటం ప్రభాకర్ కు అలవాటే.

వంట చేసి పెట్టింది బృంద. భోజనం చేస్తున్నాడు ప్రభాకర్.

"అమ్మాయ్!చిన్నదాని పెళ్లి చక్కగా జరిగిందని అందరూ నన్నూ, మీ అక్కయ్యానూ ఒకటే పొగడటం! తమ్ముడి కూతురి పెళ్లి వైభవంగా చేశావని ఫోన్ల మీద ఫోన్లు...నా తమ్ముడి పిల్లలు నా పిల్లలు కాదూ!.." ఉత్సాహంగా చెప్తున్నాడు ప్రభాకర్.

"అవును బావగారూ!మీరు, అక్కయ్య నిబడ్డారు కాబట్టి పిల్లల బాధ్యతలు పూర్తి అయ్యాయి!"

ప్రసన్నంగా బృంద వైపు చూశాడు ప్రభాకర్.

"నా తమ్ముడి బాధ్యత నాది కాదూ!వాడుంటే ఎంత సంతోషించే వాడో!సరే కానీ!పది రోజుల్లో నువ్వు కాకినాడ బయల్దేరు!ఏదో పిల్లల చదువులంటూ ఇక్కడే ఉన్నావు కానీ..

వాళ్ళుంటే అదొక రకం.. ఒక్కదానివి ఇక్కడెందుకు? "

సమాధానం చెప్పలేదు బృంద.మౌనంగా ఉంది.

తలెత్తి బృంద ముఖంవైపు చూశాడు ప్రభాకర్.

"ఈ పోర్షన్ కూడా అద్దెకిచ్చెయ్! పిల్లలు వస్తే మన దగ్గరికే వస్తారు!.. ఏమంటావ్?"

"నాకు సంగీతం పాఠాలు చెప్పుకోవాలని ఉంది బావగారూ!కచేరీలు కూడా..."బృంద మాట పూర్తి కాలేదు అందకున్నాడు ప్రభాకర్.

"అక్కడే పాఠాలు చెప్పకోవచ్చు!నెల్లూరుకు, కాకినాడకు పెద్ద తేడాలేదు!కచేరీలంటావా!వెళ్లద్దువు కానీ!ఎవరొద్దారంటారు? ఇంకేమి ఆలోచించకమ్మాయ్! అయినా వాడు పోయాక ఇంత బాధ్యత మోసిన వాళ్ళం!.. నిన్ను ఒక్క దాన్ని చూసుకోలేమా? నిన్ను అనాధలాగా వదిలేశామంటే లోకం ఏమనుకుంటుంది? అయినా ఇక్కడ ఒంటరిగా ఉండటం మంచిది కాదు!"

ప్రభాకర్ చెయ్యి కడుక్కున్నాడు.

వక్కపొడిడబ్బా తెచ్చి ఇచ్చింది బృంద.

'ఈ సారి బృంద ఏమాలోచిస్తోంది?'అనుకున్నాడు ప్రభాకర్.

ఎప్పుడు బావగారు ఏమి చెప్పినా మాట్లాడకుండా తల ఊపే బృంద ఆలోచిస్తోంది తన గురించి.. తన భవిష్యత్తు గురించి.

రాత్రి ట్రైన్ ఎక్కి కాకినాడ వచ్చాడు ప్రభాకర్.

"ఏమంది బృంద?"భర్త ఇంటికి రాంగానే అడిగింది ప్రభాకర్ భార్య కౌసల్య.

"ఏమిటో!చప్పున వస్తాననలేదు కౌసల్యా!తమ్ముళ్ల దగ్గర ఉంటుందేమో!"అన్నాడు ప్రభాకర్.

కౌసల్యకు నిరుత్సాహంగా ఉంది. 'బృంద వస్తే కాలుక్రింద పెట్టకుండా చేసి పెడుతుంది.అత్తగారి గురించి అస్సలు పట్టించకొనక్కరలేదు. ఆవిడనీ చూసుకొంటుంది. పిల్లలకు పంపించే స్వీట్స్ దగ్గర్నుండి పచ్చళ్ళు, పొడుల దాకా అన్నీ చేసి పెడుతుంది. డబ్బులున్న బాతు.ఇంటి ఖర్చులు చాలా వరకు పెట్టుకుంటూ ఉంటుంది. మరిది ఆస్తి మీద వచ్చే ఆదాయంతో తమ పిల్లలకు కూడా బహుమానాలు పంపిస్తూ ఉంటుంది. అయినా ఆ నెల్లూరులో ఉండి ఏం చేస్తుంది? సా పా సా అంటూ ఆ దిక్కుమాలిన సంగీతం పాఠాలు చెప్పుకోవటమే కదా!ఆ పనికిమాలిన సంగీతం ఇక్కడే చెప్పకోవచ్చు!..లేకపోతే తమ్ముళ్ల దగ్గర చేరితే సగం డబ్బులు వాళ్ళు గొరిగిస్తారు... వీణకు, అపర్ణకు డబ్బు మీద ఆశ ఎక్కువ...'కౌసల్య మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది.

***** ***** ***** ***** ***** ***** *****

నాలుగురోజుల తర్వాత

పొద్దున్నే వీణకు ఫోన్ చేసింది అపర్ణ

"రాత్రి మీ బావగారు బృంద వదినతో మాట్లాడారు వీణా!వదిన మన దగ్గరికి రాదట!.. అలా అని కాకినాడలో కూడా ఉండదట!"

"నెల్లూరులోనే ఉంటుందటనా?"ఆశ్చర్యంగా అడిగింది వీణ.

"మద్రాసులో ఉంటుందట!వడపళనిలో ప్రవీణ చిన్న అపార్ట్మెంట్ కొన్నదట!తనతోపాటు కచేరీలు చేసే ఫ్రెండుతోపాటు ఉంటుందట! మద్రాసులో ఉంటూ కచేరీలు చేసుకుంటూ, పాఠాలు చెప్పకుంటుందట!"

"ఆమ్మో!ఏమనకున్నామో కానీ మన ఆడపడుచు పెద్దజాణ.. కచేరీలు చేసేంత పాండిత్యం ఎక్కడుంది? ఊరికే గొప్పలు చెప్పకోవటం అంతే!...ఏమన్నా ఎమ్మెస్ సుబ్బలక్ష్మా? విడో కదా ఎవడితోనో స్నేహం చేసుంటుంది! వాడి దగ్గర ఉండాలని బోడి ప్లాను. మనం కనుక్కోలేమని వెధవ తెలివితేటలు చూపిస్తోంది!.."అక్కసంతా వెళ్లగక్కుతోంది వీణ.

"ఊరుకో!ఊరుకో!నాతో అంటే అన్నావు కానీ ఇంకెక్కడా అనకు! మన మగవాళ్ళు మనల్నే తిట్టిపోస్తారు!"

"నేను, నువ్వూ నోరు మూసుకుంటాము!లోకం ఊరుకుంటుందా?తర్వాత తర్వాత అందరికీ తెలుస్తుంది.. ఈ మధ్య అరవైఏళ్ల వాళ్లకుకూడా పెళ్లి సంబంధాలు చూసే మ్యారేజి బ్యూరోలు పుట్టుకొస్తున్నాయి!నా మాట అబద్ధం అయితే నా చెవి కోసుకుంటా!"

"సరే!సరే!ఆవిడ ఎలా అఘోరిస్తే మనకెందుకు? చూద్దాము!రాబోయే సినిమా వెండితెర మీద.."అంటూ తోడికోడల్ని సముదాయించింది అపర్ణ.

ఇరువైపుల బంధువుల సూటిపోటి మాటల్ని పట్టించకోలేదు బృంద. నిందలెన్నో వేసినా ఆమె దిగులు పడలేదు.అంతకు ముందులాగా కాకపోయినా ఇరువైపుల బంధువుల ఇంట్లో శుభాశుభాలకు వచ్చి వెళతూనే ఉంది బృంద. అయితే ఇంతకు ముందులాగా రోజుల తరబడి ఉండటం లేదు. కచేరీలు ఉన్నాయంటూ, ట్యూషన్ పిల్లలకు ఇబ్బందని వెంటనే మద్రాసు వెళ్లిపోయేది.

పదేళ్లు గడిచాయి.

ఆరోజు ఉదయం పేపర్ చూస్తున్న రామకృష్ణ పెద్దగా"అపర్ణా!అపర్ణా!"అంటూ కేకలు పెట్టాడు.

చేస్తున్నపని ఆపి పరుగెత్తుకుంటూ వచ్చింది అపర్ణ.

"అక్కయ్య ఫోన్ చేసింది!అక్కయ్యకు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి స్మారక అవార్డు వచ్చిందట!పేపర్లో కూడా వార్త వేశారట!"అంటూ న్యూస్ పేపర్ పట్టుకొని వెదుకుతున్నాడు రామకృష్ణ.

నోట మాటరాక అయోమయంగా చూస్తూ నిలబడింది అపర్ణ. ఆమెకు తేరుకొనేసరికి కొంత సమయం పడుతుంది మరి!

(సమాప్తం)

**** ***** **** ****

మరిన్ని కథలు

Dongalu baboy
దొంగలు బాబోయ్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Navyapatham
నవ్య పధం
- కొడవంటి ఉషా కుమారి
Gamyam teliyani gamanam
గమ్యం తెలియని గమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vuttaralayya
ఉత్తరాలయ్య
- కామేశ్వర రావు
Naati tallula banah tatwam
నాటి తల్లుల భనఃతత్త్వం
- ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)
Garvabhangam
గర్వభంగం
- సరికొండ శ్రీనివాసరాజు
Inkenta sepu
ఇంకెంత సేపు
- గరిమెళ్ళ సురేష్
Ankela rahasyam
అంకెల రహస్యం
- కర్లపాలెం హనుమంతరావు