
అలకనంద ఆఫీస్ లో పనిచేస్తుందన్న మాటే గాని ఏమాత్రం పని చేయాలనిపించటం లేదు అలాగని ఇంతకు ముందు పెద్దగా పనిచేసిన శుభ దినాలంటూ ఏమి లేవు కాకపోతే ఈ రోజు పనే చేయాలనిపించటం లేదు . ఆమె కళ్ళ ముందు అలకా మూవీస్ వారి లచ్చమ్మ నటించిన త్రిడి సినిమా మొదలైంది. అలా అలక స్నానాల గదిలోనుంచి నైటితో తన పడకగదిలోనికి వచ్చింది. ఇంతలో తన ముక్కు పుటాలకి ఘాటైన వాసన తగిలింది. కెమెరా క్లోజ్ షాట్లో భృకుటి ముడిపడి, ముక్కు, మూతి ఏకమై కళ్ళు చిన్నవిగా చేసి వాసన చూసిన ఆ ఆహ్లాదభరిత అందం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె చూపు తెల్లని మార్బుల్ టైల్స్ మీదకెళ్ళింది. అక్కడ..అక్కడా అతి చిన్న ఎర్రని మచ్చలలా కనిపిస్తున్నాయి. అప్పుడే అక్కడే చిపురు పెట్టి తుడిచినట్టుగా కనిపిస్తుంది. 'ఇది ముమ్మాటికి లచ్చమ్మ పనే అని అలకనంద తన అయొడిన్ ఉప్పు తెలివితో నిర్థారించుకుంది. ఇంకొక్క క్షణం ఆలోచించకుండ పరుగులాంటి నడకతో వంటగది దగ్గరకి చేరుకుంది. అప్రమత్తమైన లచ్చమ్మ అప్పటికే ఏమాత్రం అనవాలు లేకుండా నమునాలన్నంటిని చీపురుతో ఊడ్చేసింది., 'దీనికి మాయ మంత్రాలు తెలీక గాని గాలిలోని వాసనను కూడా ఊడ్చేసేదే' ఖాళి అయిపోయిన కారం డబ్బా ఉక్రోషంగా విసిరేసింది. ''అమ్మా !! అలకా ఇదేం చేసింది'' పక్కనున్న పంకజం కింద పడిన బాటిల్ తో నెత్తి మీద గట్టిగా ఒకటి మొట్టింది. దెబ్బకి అలకా మూవీస్ వారి 'లచ్చమ్మ'కి తెరపడి అలకనంద కళ్ళు తెరిచి చుట్టూ చూసి "అబ్బా పంకా గట్టిగా తగిలిందే" చిన్నగా అరిచింది "దీనికి ఇంకా గట్టిగా తగిలి,..సొట్ట కూడా పడింది" ఐసియు లో పేషెంట్ ను చూసినట్టు తన స్టీల్ బాటిల్ వైపు చూసింది పంకజం. " చిన్న చిన్న వాటికి పెద్దగా ఆలోచించకూడదు పంకా" అంది అలక. "ఏంటి !? గిద్దెడు కారం పోతే గిలగిలలాడిపోయే..నువ్వే చెప్పాలా విషయం" పంకజం బ్యాగు సర్థుకుంది. "అబ్బా!! పంకా నా బాధ కారం పోయిందని కాదు. అడిగితే నేనిచ్చేదాన్ని కదా!! ఇలా దొంగతనంగా తీసుకోవడం ఎందుకని!? ఇంతకీ గిద్దెడు అంటే ఏంటి?" పంకజం వైపు చూసింది. "దొంగకారంతో వండిన కూర రుచి నీకేం తెలుసు!? అట్టే ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించకలక ఆ బాటిల్ ఈ బ్యాగ్ లో పెట్టు…ఆ గిద్దెడు అంటే ఏంటో నాకూ తెలియదు నేను ఎదురింటమ్మ పంచాయతీ లో ఓ చెవితో విన్నా నీ ముందు ఉదా అంతే!! నీక్కావాలంటే గుగులవ్వనడుగు " అని తన బ్యాగ్ సర్థుకొని ఇంటి బాట పట్టింది పంక అలక ఇంటికి వెళ్ళడానికి స్కూటి స్టార్ట్ చేసింది. దారి మధ్యలో లచ్చమ్మ కనిపించి"హాయ్" చెప్పింది. లక్స్ సుందరి హోర్డింగ్ లా ఎక్కడ చూసిన ఈ లచ్చమ్మ దర్శనమేంటి అని ఆమెను చూడలేనట్టుగా ముందుకెళ్ళిపోయింది. తలపై హెల్మెట్ పెట్టుకొని రోడ్డు మీద చంద్రమండలపు ఆనవాలైన గుంతలకి, బంపులకి జాగ్రత్తలు చెబుతూ, పెద్ద పెద్ద లారీలకీ గౌరవంతో దారి ఇస్తూ చిన్న వాహానాలకి ముందుకెళ్ళడానికి ప్రోత్సాహాం అందిస్తూ. చుట్టు ఉన్న చెట్లని కుశల ప్రశ్నలు అడుగుతూ అలక అలా స్కూటి మీద ఇంటికెళ్తుంటే చూసేవాళ్ళకి ఆ స్కూటి తాబేలులా భ్రమిస్తుంది. అసలు షాజహాన్ ఇప్పుడు లేడుగాని ఉండి ఉంటే అలక ఆఫీసు నుండి ఇంటికొచ్చెలోపు రెండు తాజ్మహాళ్ళు కట్టేసేవాడు. అంత జిడ్డు స్పీడుతో వెళుతున్న అలక గొలుసు లాగారు దుండగులు. అలక కింద పడింది. "అమ్మగారు!!" అన్న లచ్చమ్మ పిలుపు విని కళ్ళు మూసింది అలక. కళ్ళు తెరిచే సరికి హాస్పటిల్ బెడ్డు మీదుంది . ఎదురుగా బ్రెడ్డు పట్టుకు కూచుంది లచ్చమ్మ. "నా గొలుసేది!?" గోదారి పుష్కరాల్లో తప్పిపోయిన పిల్లాడినడిగనంత ఆదుర్థాగా అడిగింది. "నేనుండగా మీ తాళిబొట్టెవరు తీసుకెళ్తారమ్మగారు" బహు వినయంగా అంది లచ్చమ్మ. 'నువ్వు తప్ప ఎవరు తీసుకెళ్తారు' అని లోపల అనుకుని "నేననుకుంటుంది అదే!" అంది బయటికి పల్లికిలిస్తూ. "మరి నా గొలుసు!" గట్టిగా అడిగింది. ఎటెండరు వచ్చి "మేమే తీసుకున్నాం ట్రీట్మెంట్కి!" అన్నాడు. తన కాళ్ళు, చేతులు చూసుకుని "అదేంటి నేను బాగానే ఉన్నా కదయ్యా!!" అంది "మీరు బాగానే ఉన్నారు మీ చైన్ లాగినవాళ్ళకి చిన్న ,చిన్న దెబ్బలు తగిలాయాని పెద్ద పెద్ద టెస్ట్ లు చేస్తే గాని తెలిలేదు" అసలు విషయం చల్లగా చెప్పి మెల్లగా వెళ్ళిపోయాడు ఎటెండర్. ఆ వెళుతున్న వైపే 'దొంగలు బాబోయ్!!" అని నోరెళ్ళబెట్టింది అలక ఎంతైనా ఇంటి కారం తిన్న విశ్వాసం ఎక్కడ పోతుంది. ఆ నోట్లో "బ్రెడ్డు ముక్క" పెట్టింది లచ్చమ్మ.