స్వర్గలోకం వర్ధిల్లాలి - సదాశివుని లక్ష్మణరావు విశాఖపట్నం

Swargalokam vardhillali
ఒక రోజు సృష్టి కర్త భారతీ పతి శ్రీ బ్రహ్మదేవుడు, స్థితి కర్త లక్ష్మీ పతి శ్రీ మహా విష్ణువు మరియు లయ కర్త పార్వతీ పతి శ్రీ మహేశ్వరుడు. ఈ మువ్వురు త్రినాధ స్వాముల వారు కొలువయి ఉండగా వారి అర్ధాంగినులు ఎంతో వినయంగా వేడుకుని
“మీ ముగ్గురి భక్తులయిన భూలోక వాసులందరిని ఒకసారి స్వర్గలోకానికి రప్పించి ఒక మహా జన సభను ఏర్పాటు చేసి మంచిని ప్రోత్సహించే మాటలు చెప్పవలసినది” అంటూ కోరారు.
“ఎందుకంటే గత కొంత కాలంగా స్వర్గానికి వచ్చేవారు బాగా తగ్గిపోయారు..విచ్చలవిడిగా పాపాలు చేసి ఎక్కువ మంది నరకానికి వస్తున్నారు.అందు వలన స్వర్గలోకంలో సిబ్బందికి పనిలేక పోయింది.నరక లోకంలో సిబ్బంది కొరతఉంది. అందు వలన స్వర్గలోక సిబ్బందిని నరక లోకానికి బదిలీ చేయడం కూడా జరుగుతోంది..ఈ విషయంగా దేవేంద్రుల వారు సలహాదారుని నియమించి స్వర్గ లోకానికి ఆక్యుపెన్సీ పెంచడానికి ప్రణాళికలు వేయమన్నారు. స్వర్గ లోక సుఖాల గురించి ప్రవచనకారులు ఋషులు పీఠాధిపతులతో చెప్పించినా ప్రజలలో మార్పు రాలేదు. సలహాదారు లిచ్చిన సూచనలలో భాగంగా భూలోకవాసులయిన సకల జనుల్నీ ఒకసారి స్వర్గ లోకంను ప్రత్యక్షంగా చూపించాలని కూడా నిర్ణయించిన సంగతి మీకు తెలిసినదే కదా ప్రభూ!” అంటూ పార్వతి విన్నవించుకుంది.
వారి విన్నపము సమంజసముగా తోచి భోళాశంకరుడు అంగీకరించారు. విష్ణుమూర్తి అడ్డు చెప్ప బోయినా బ్రహ్మదేవుడు కూడా సై చెప్పడంతో, మెజారిటీ మాట ప్రకారం దానికి ఏర్పాట్లు చేయమని ఇంద్రున్ని ఆదేశించారు..
"అయితే ఒక షరతు. ఆ ఒక్క దినము మాత్రము భూలోక జనులందరికి స్వర్గ లోక సుఖాలను కల్పించి ఆ దినము ముగిసిన వెంటనే తదుపరి తిరిగి వారందరినీ భూలోకమునకు పంపించవలెను" అని ఇంద్రునికి తమ ఆజ్ఞలను తెలిపారు
అపుడు ఇంద్రుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటుచేశాడు. అన్ని జనపదాలలోకి అతి తక్కువ జనాభా గల ఊరిలో పుష్పక విమానాన్ని దింపాలని అక్కడి నుండే అందరిని ఎక్కించుకుని తిరిగి ప్రయాణం స్వర్గలోకానికి చేయాలని ఆజ్ఞ వేశారు.
ఒక రోజు జంబూద్వీపం లోని భరతఖండం లోని శ్రీకాకుళం జిల్లా లోని పోలాకి మండలం లోని అతి తక్కువ జనాభాగల ఇద్దరే నివాసముంటున్న కరణాలపేట గ్రామంలో మిరుమిట్లు గొలుపుతూ పుష్పకవిమానం దిగింది.
ఈ విషయం గురించి వివిధ వాట్సాప్ గ్రూపుల్లో , సోషల్ మీడియాలో, మీడియాలో బాగా వైరల్ చేయడం వలన ప్రపంచం మొత్తం ప్రజలందరికి తెలిసిపోయింది. అందువలన అందరూ స్వర్గ లోకానికి ప్రయాణించడానికి ఉత్సుకత చూపి మారుమూల పల్లెల నుంచి కూడా అందరూ కరణాలపేట చేరుకోవడం మొదలుపెట్టారు. గౌరవనీయ మంత్రులు, అమెరికా, చైనా, రష్యా తదితర దేశాధినేతలు కుటుంబాలతో సహా వస్తున్నారు. అందుకని కరణాలపేట గ్రామానికి పది లేన్ల పక్కారోడ్డు, మరుగుదొడ్లు, ఆసుపత్రి, రక్షిత మంచి నీటి సదుపాయం, ఫైవ్ స్టార్ హొటల్స్ , వంద ఎకరాల్లో కార్ల పార్కింగు సదుపాయం, ఐదు ఎయిర్ పోర్టులు, వంద బస్టాండులు మొదలయిన సదుపాయాలు ప్రభుత్వం కల్పించింది. మతాల కతీతంగా ప్రపంచంలోని ప్రజలందరూ కనీసం ఒకసారన్నా స్వర్గ లోకం సందర్శించాలనే కోరికతో బృందాలుగా తరలివస్తున్నారు.
పుష్పక విమానం కరణాలపేటకు వచ్చి ఉన్న విషయం అందరికి తెలిసింది.భూగోళం మీది ప్రజలందరూ అధిరోహించేంత వరకూ ఉంటుందని..అందరూ అధిరోహించిన తరవాతే స్వర్గ లోకానికి పయనమవుతుందని తెలియజేశారు.
అయితే ప్రజలలో ఈ లోపున వదంతులు వ్యాప్తిచేశారు. రెండు రోజుల్లోనే పుష్పకవిమానం వెళ్ళిపోతుందని..త్వరపడండి అంటూ..అందు వలన బస్సు, రైళ్ళు మరియు విమానం టికెట్ల ధరలు పదిరెట్లు పెరిగాయి. ఉరుకులు పరుగులమీద జనాలున్నారు. అయితే ఎవరూ ఏ తిండి పదార్ధాలు, నీరు గానీ తీసుకురానక్కరలేదని, పుష్పక విమానం ఎక్కితేచాలు స్వర్గలోక సదుపాయాలు అంటే ఆకలి దప్పులు లేకపోవడాలు లాంటివి సమకూరుతాయనడం వలన ఎవరూ దాని కోసం చింత పడడంలేదు. ఎలాగయినా పుష్పక విమానం ఎక్కితే చాలు అనుకుంటున్నారు
ఇలా ఉంటే ఈ రద్దీలో వాహన ప్రమాదాలు, క్యూలో తొక్కిసలాటలు, నడకదారిలో తోపులాటలలో ఎంతో మంది చనిపోవడం జరిగింది.
చివరికి అందరూ కూడా పుష్పక విమానానికి కట్టిన తాడు ని పట్టుకుని వరసగా క్యూలో నడుస్తూ ఒక్కోరూ ఎక్కుతున్నారు..ముందుగా కరణాలపేటలో నివసిస్తున్న ఏకైక కుటుంబంలోని దంపతులు ఎక్కారు. చాలామందికి తెలియక వీరిద్దరి వలననే ఈ భాగ్యం కలిగిందని వారిని దేవతల్లాగా పూజిస్తూ పూలు జల్లుతూ విమానం ఎక్కుతున్నారు.వారిద్దరూ తమకందుతున్న పూజలకు గౌరవానికి తబ్బిబ్బవుతున్నారు.సిగ్గు పడుతున్నారు.
అయితే ఎవరో ఈరోజే పుష్పకవిమానం బయలుదేరిపోతుంది అనే పుకారు లేవనెత్తడంతో బాగా తొక్కిసలాట జరిగింది.చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పుష్పకవిమానంలో సీటు దొరకదేమో అని అనుమానంతో తొందర పడడంవలన దొమ్మీలో చిక్కుకుపోవడం చనిపోవడం జరిగింది.
ఆ రోజు అంత మంది ఎక్కిపోయారు. చివరిగా ఒక ముసలి అవ్వ నిదానంగా నడుచుకుంటూ వస్తూ ఉన్నది. ఎవరి తొందరలో వారుండి ఆమెకు ఎవరూ సాయమందించక పోవడంవలన పేదరాలయిన ఆవిడ వయోభారంతో నెమ్మదిగా నడుస్తూ వస్తోంది. అయితే పుష్పక విమానంలో ఆవిడకు సీటుండదేమోనని అందరూ అనుకుంటున్నారు. ఒకామె అయితే తను కూచున్న సీటులో కాళ్ళు చాపేసి పక్కసీటుకూడా ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తూ ఉంది..కానీ ఆశ్చర్యంగా ఆవిడ ఎన్ని సీట్లు ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తున్నా సరే.. పక్కన మరొక సీటు కి ఖాళీ ఉంటోంది.. అదే ఆవిడకి అర్ధంకాలేదు. అసలు పుష్పకవిమానమంటేనే ఎంత మంది అధిరోహించినా ఇంకా ఒక్కరికి ఖాళీ ఉంటుంది..అలాంటి సదుపాయం పుష్పక విమానానిది. ఈ విషయం చాలా మంది ప్రజలకు తెలియక సీటు ఉండదేమోనని అనుకుని తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు..పుష్పకవిమానం ప్రవేశ ద్వారం వద్ద బోర్డు మీదకూడా ఇలా రాసి ఉంది.
“ఈ విమానంలో ఎంత మంది అధిరోహించినప్పటికి మరొక్కరికి సీటు ఉంటుంది.అందుకని తోపులాట వద్దు”
అందుకని చివరిగా ఆ ముసలమ్మ అధిరోహించిన తరవాత చివరిగా ఇంకోసీటు ఖాళీ గా ఉండగానే ...పుష్పక విమానం ఆకాశంలో లేచి స్వర్గ లోకం వైపు ప్రయాణించింది..ఆ లోకాల నుండి ఇంద్రాది దేవతలు ఎదురు చూస్తూ ఉన్నారు. భక్తులందరికి ఒకరోజు స్వర్గ లోక సందర్శనానికి. ప్రతి ఒక్కరికి అందే విధంగా పెద్దపెద్ద గంగాళాలలో మధువుని, సురాపానాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞలు జారీచేయడం కూడా జరిగింది. అలాగే మహాజన సభ ఏర్పాట్లూ పూర్తయాయి..రంభ ఊర్వశి మేనక..తో పాటు భూగోళంనుండి చేరుకున్న శ్రీదేవి ,సౌందర్య ల నృత్యాలు కూడా ఏర్పాటు చేశారు.
ఒక రోజు స్వర్గ లోకంలో స్వర్గ సుఖాలననుభవించిన భూలోక జనులందరూ తిరిగి భూలోకం లోని వారి వారి స్వస్థలాలకు దింపి వేయబడ్డారు. అందరూ ఇంద్రునికి, శ్రీశ్రీశ్రీ త్రినాధస్వాముల వారికి జయ జయధ్వానాలతో కీర్తించారు.
అలా భూలోక వాసులందరూ స్వర్గ లోకం నుండి భూ లోకానికి క్షేమంగా చేరుకున్నారు. ఈ శుభ పరిణామం ఫలితమేమో గానీ ఇద్దరు మాత్రమే నివాసమున్న కరణాలపేట గ్రామం ఇపుడు అన్నిసదుపాయాలూ అమరి ప్రపంచంలోనే అద్భుతమైన మహానగరంగా మారింది. ఎక్కువ మంది ప్రజలు ఈ ఊరిలోనే ఉండడానికి మక్కువ చూపడం జరిగింది. ఇది చూసి ఆ ఊరి ఏకైక దంపతులు ఆనందపరవశులయినారు. శ్రీరామనవమి అత్యంతవైభవంగా నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు.
ఒక రోజు స్వర్గ లోకవాసం వలననేనేమో అందరూ మంచివారుగా మారారు. భూగోళమే పుష్పక విమానం లాంటిదని గుర్తించారు. ఎంతమంది ఉన్నా ఇంకొకరికి చోటు ఉంటుందని ఎవరూ గాబరా పడద్దని, మితిమీరిన స్వార్ధం వద్దని, ఉరుకుల పరుగుల జీవనం వద్దని ,అందరికి చోటు ఉంటుందని, భూగోళంపై ప్రజలందరి అవసరాలకు సరిపడా సదుపాయాలుంటాయని, గర్వంతో అసూయతో పోట్లాడుకోవద్దని,కలతలు లేకుండా, కలహాలు లేకుండా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, అందరూ బాగుండాలి అందులో నేనుండాలని ప్రతిఒక్కరూ అనుకుంటూ శాంతియుత సహజీవనానికే పెద్దపీట వేయాలని తెలుసుకున్నారు.
ఇది సత్ఫలితాలనిచ్చింది.ఆ మరునాడు నుండి ప్రజలెక్కువమంది పాపపు పనులు మానేసి మంచి పనులు చేసి స్వర్గలోకానికి రావడం ప్రారంభించారు. భూగోళాన్ని నాశనంచేయకుండా, జాగ్రత్తగ కాపాడుకుంటూ పరస్పరం కలిసుంటూ జీవనం సాగించడం ప్రారంభించారు. స్వార్ధాన్ని పూర్తిగ వదిలేశారు.
భూలోకంలో మంచిగా జీవిస్తూ,మంచి పనులుచేస్తూ,పుణ్యం సంపాదించుకుంటూ,దేవున్ని ఎల్లవేళలా స్మరించుకుంటూ ఉండడం వలన అందరికి స్వర్గలోక ప్రవేశం దొరుకుతోంది. ఎక్కువ మంది స్వర్గ లోకానికి చేరుకోవడం మొదలు పెట్టారు. అతితక్కువ మంది పాపపు పనులు చేయడం వలన నరకానికి జనాలు రావడమే తగ్గిపోయింది. నరకంలోని యమకింకరులకు ఇతర సిబ్బందికి, చిత్రగుప్తుల వారికి పని లేకుండా పోయినందు వలన స్వర్గ లోకంలో ఉద్యానవనాలు పెంచడానికి డెప్యుటేషన్ మీద పంపబడుతున్నారు.జనులందరూ స్వర్గ లోకం జిందాబాద్ అంటూ నిరంతరం మంచిగా ఒకరికొకరు సాయంచేసుకుంటూ బతుకుతున్నారు.
సర్వేజనా సుఖినో భవంతు.
...సమాప్తం...
ఇది పూర్తిగ కల్పితకథ.ధన్యవాదాలు

మరిన్ని కథలు

Dongalu baboy
దొంగలు బాబోయ్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Lokam teeru
లోకం తీరు
- టి. వి. యెల్. గాయత్రి.
Navyapatham
నవ్య పధం
- కొడవంటి ఉషా కుమారి
Gamyam teliyani gamanam
గమ్యం తెలియని గమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vuttaralayya
ఉత్తరాలయ్య
- కామేశ్వర రావు
Naati tallula banah tatwam
నాటి తల్లుల భనఃతత్త్వం
- ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)
Garvabhangam
గర్వభంగం
- సరికొండ శ్రీనివాసరాజు
Inkenta sepu
ఇంకెంత సేపు
- గరిమెళ్ళ సురేష్