
మోహన్ పేరుకు తగ్గట్టుగా పురుషులు కూడా అసూయ పడే అందగాడు. తన అందంతో ఏ ఆడదాన్నైనా తన కౌగిట్లో వాలేటట్టు చేసుకోగలననే ధీమా గల మోహన్, పురుషలక్షణంగా ఉద్యోగం చేయడానికై వేరే ఊరిలో అడుగుపెట్టేడు.
వారం రోజుల ప్రయాశ తరువాత ఒక ఇంటి మేడమీద రెండుగదుల ఇల్లు అద్దెకు దొరికింది. ఆ ఇంట్లో తనకు ఈడుజోడు అయిన అందమైన ఆడపిల్ల, ఆమెకు తోడుగా ఉండే నాయనమ్మ తప్పితే ఇంకెవరూ లేరని తెలిసిన మోహన్ సంతోషించేడు. ఆ అమ్మాయిని తన దానిగా చేసుకోవాలన్న ఆలోచన ఆ ఇంట్లో దిగిన దగ్గరనుంచీ అతని మెదడును తొలచనారంభించింది.
ఇంట్లో దిగిన మూడోరోజు ఉదయం క్రిందకు దిగి ఇంటివారి తలుపు తట్టేడు.
“ఎవరు కావాలండీ” అని పలకరించిన అమ్మాయిని చూసి –
“అమ్మమ్మగారితో మాట్లాడదామని” అంటూ అతి వినయంగా నిలబడి, లోపలికి తొంగి చూడసాగేడు.
“లోపలికి వచ్చి కూర్చోండి, నాయనమ్మని పిలుస్తాను” అని ఆమె లోపలికి ఆహ్వానించేసరికి మోహన్ మనసులో మోహనరాగం మేళవించసాగింది.
“వసంతా ఎవరు వచ్చేరు” అన్న లోపలినుంచి వచ్చిన కేకకు—
“మోహన్ గారు నాయనమ్మా, నీతోనే మాట్లాడాలట” అని జవాబు చెప్తూ లోపలికి వెళ్లిపోయింది వసంత.
‘అమ్మాయిది ఎంత చక్కటి పేరు’ అని సంతోషించింది మోహన్ మనసు.
“ఏం నాయనా” అంటూ వచ్చిన ఆవిడను చూసి కూర్చొని ఉన్న మోహన్ లేచి నిలబడి --
“నమస్కారం అమ్మమ్మగారూ, క్షమించండి మీరు పనిలో ఉండగా వచ్చి మిమ్మల్ని కలవడానికి వచ్చినట్టున్నాను. ఇల్లు తుడవడానికి, గిన్నెలు తోమడానికి, బట్టలు ఉతికేందుకు, వీలైతే వంట చేసి పెట్టేందుకు పనిమనిషి దొరుకుతుందేమో మిమ్మల్ని కనుక్కుందామని వచ్చేనండీ”
“మా పనిమనిషినికి ఎవరినైనా ఏర్పాటు చేయమని చెప్తానులే”
“నేను వస్తానండీ, బజారుకు వెళ్ళి వంటకు సామగ్రి సరుకులు కొనుక్కోవాలి,”
“వసంత కాఫీ తెస్తుంది తాగి వెల్దువుగాని కూర్చో, ఈరోజు సెలవే కదా”
“ఎందుకండీ వసంతగారికి శ్రమ” అంటూనే కూర్చున్నాడు.
“ఇంటికి వచ్చిన అతిథికి కాఫీ ఇవ్వడం శ్రమ ఎలా అవుతుంది నాయనా”
కాఫీ తాగి “వసంతగారు చేసిన కాఫీ అమృతంలా ఉంది అమ్మమ్మగారూ. వసంతగారూ, కాఫీ ఇంత బాగా చేసినందుకు అభినందనలు, నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక వస్తాను అమ్మమ్మగారూ” –
అని వెళ్తున్న మోహన్ వేపే చూస్తున్న వసంత అతను అందించిన అభినందనతో విరిసిన మందారమే అయింది.
మేడమీద అద్దెకు దిగిన మోహన్ తన మనవరాలికి ఈడూజోడూ అయినా, ఎలాంటి వాడో తెలియందీ తొందరపడకూడదనుకున్న వసంత నాయనమ్మగారికి ఇప్పుడు తగిన అవకాశం దొరికిందనిపించి, తగిన విధంగా ప్రణాళికలు ఏర్పాట్లు చేసుకొని ---
మరునాడు సాయంత్రం తలవంచుకొని మేడమీదకు వెళ్తున్న మోహన్ తో “నాయనా ఇలా రా” అని పిలిచి “ఇగో ఈ అమ్మాయి కనకం. నీ ఇంట్లో పని చేస్తుంది. వంట కూడా చేయగలదట. పదిహేను నిమిషాల తరువాత వస్తుంది. అన్నీ వివరంగా మాట్లాడుకొని నచ్చితే పనిలో పెట్టుకో” అని ఆవిడ చెప్పగానే –
“చెప్పిన వెంటనే పనిమనిషిని కుదిర్చిపెట్టేరు, ధన్యవాదాలు అమ్మమ్మగారూ” అని నమస్కారం చేసి వెళ్లిపోయేడు.
తరువాత వచ్చిన కనకంతో అన్నీ మాట్లాడుకొని “రేపటినుంచి పనిలోకి రా” అని పంపించేసేడు.
మరునాడు ఉదయం కనకం ఏడోగంటకు వచ్చేసరికి, పొట్టిలాగు కట్టుకొని వ్యాయామం చేస్తున్న మోహన్ వైపు కళ్ళు విప్పారించి చూస్తూ నిలబడి –
“పొట్టిలాగుతో మీరు కసరత్తులు సేస్తూంటే సూడ్డానికి బలే బాగుండారు” అని నవ్వుతూ లోపలికి వెళ్లిపోయింది. వసంత దక్కేలోపల కనకాన్నొక పట్టు పట్టాలి అనుకున్నాడు.
తయారు చేసిన టిఫిన్ భోజనం హాట్ పాక్ లలో పెట్టి, ఇల్లు ఊడ్చి, ఉతికిన బట్టలు ఆరవేసి “నాను సీకటి యేలకి ఒచ్చి ఒంట సేస్తానయ్యా” అని చెప్పి అతనివేపు చూసి నవ్వుతూ వెళ్లిపోయింది.
రాత్రి ఏడు గంటలకు వచ్చిన కనకం వంట చేసేందుకు ఉపక్రమించబోతూంటే –
“కనకం, ముందుగా నా బట్టలు ఇస్త్రీ చేసేయి” అని చెప్పిన మోహన్ వేపు చూసి సిగ్గు పడుతూ –
“నాకు బట్టలు ఉతకడమే ఒచ్చు, ఇస్త్రీ సేయడం రాదయ్యా”
“నేను నేర్పుతాను ముందుగది తలుపులు శబ్దం చేయకుండా గడియపెట్టి రా” అన్న మోహన్ వేపు విచిత్రంగా చూస్తూ “బట్టలు ఇస్త్రీ సేయడానికి ముందుగది తలుపులు గడియ యెట్టడం ఎందుకయ్యా”
“నేను నీకు నేర్పించడం ఎవరైనా ఎందుకు చూడాలి”
కనకం ముందుగది తలుపులు శబ్దం చేయకుండా గడియపెట్టి వచ్చింది.
ఇస్త్రీపెట్టెకు కరంట్ వచ్చేటట్టు చేసి, టేబల్ మీద బల్లపరుపుగా పరిచిన బట్టమీద నీళ్ళు చిలకరించి, ఇస్త్రీపెట్టె పట్టుకొని ఎలా ఇస్త్రీ చేయాలో చూపించి “ఏదీ ఇప్పుడు మరో బట్ట నువ్వు ఇస్త్రీ చేయి” అని చెప్పేడు.
ఇస్త్రీపెట్టె పట్టుకుందుకి భయపడుతున్న కనకం దగ్గరకు వచ్చి, వెనకనుంచి ఆమె కుడిచేత్తో ఇస్త్రీపెట్టెను పట్టుకోనిచ్చి ఆమె చేయి మీద తన కుడిచేయి వేసి, ఆమె ఎడమచేత్తో పరచిన బట్టను పట్టుకోనిచ్చి ఆమె చేయి మీద తన ఎడమచేయి వేసి, ఇస్త్రీపెట్టెను ఆమె కుడిచేత్తో అటూ ఇటూ నడుపుతూ –
“ఇంతే, తెలిసిందా” అని, “నిన్ను వెనకనుంచి హత్తుకొని నేర్పుతూంటే ఎలా ఉంది” అంటూ చిలిపిగా నవ్వుతూ అడిగితే, కనకం మోహన్ కు దూరంగా జరగలేక జరుగుతున్నట్టు జరుగుతూ –
“మీరలా నేర్పుతూంటే ఎందుకు బాగుండదయ్యా, రేపు ఇంకేదేనా నేర్పండి నేర్సుకుంటాను” అంటూ సిగ్గుల మొగ్గలు కురిపిస్తున్న కనకం తన వలలో పడడానికి పెద్ద శ్రమ అక్కరలేదని నిశ్చయించుకున్నాడు.
“నీకు పెళ్లైన్దా కనకం”
“లేదయ్యా” అంటూ మెలికలు తిరిగిపోతున్న కనకంతో –
“పెళ్లైతే మొగుడితో సరసాలు ఎలా ఆడాలో నీకు తెలుసా”
“సా, అదేం మాటలు. పెళ్ళికి ముందర అయన్నీ ఎలా తెలుస్తాయి”
“రేపు రాత్రి నీకు అవన్నీ నేర్పుతాను సరేనా”
“మీకు పెళ్లైన్దా అయ్యా”
“లేదు, ఎందుకు”
“మరి మీకయన్నీ ఎలా తెలుసు”
“కంప్యూటరులో చూసి తెలుసుకున్నాను. నీకు కూడా కంప్యూటరులో చూపించి అందులో హీరో హీరోయిన్ ఎలా సరసాలు చేసుకుంటూంటారో చూసి ఇట్టే నేర్చుకుందువుగాని”
“మీరలా సెప్తూంటే రేపటి దాకా ఆగాలా అనిపిస్తోందయ్యగోరూ” అంటూ నయగారాలు కురిపిస్తున్న కనకం వలలో పడిందని ఖుషీ అయిపోయేడు మోహన్.
“మరీరోజు నువ్వు వంట చేయాలి కదా. రేపు ఉదయమే పొద్దున్నకి రాత్రికి కలిసి వంట చేసేసేయి. హాట్ పాక్ లలో పెట్టేసుకొని, రాత్రి అవన్నీ నేర్చుకొని, ఇద్దరం కలిసి భోజనం చేసిన తరువాత నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు”
“మీ బుర్రలో మంచి ఊసులున్నాయి” అంటూ చిలిపి నవ్వులు చిందించింది కనకం.
మరునాడు ఉదయం రెండు పూటలకి కలిపి వంట చేసి హాట్ పాక్ లలో పెట్టి వెళ్లిపోతున్న కనకంతో –
“ఈరోజు నేర్చుకోవలసినవి గుర్తున్నాయి కదా, రాత్రి కొంచెం త్వరగా వచ్చేయి” అని గుర్తు చేసేడు.
రాత్రి వచ్చిన కనకంతో ----
“నువ్వు ముందుగది తలుపు శబ్దం చేయకుండా గడియ పెట్టి నా గదికి వచ్చేయి”
“నేను రావడం ముసలావిడ సూసింది. ఇప్పుడే గడియ పెట్టకుండా కొంత సేపాగి, కిందకెల్లి ఒంట సేయడానికి ఏదైనా అడిగి తీసుకొని ఒచ్చి గడియ పెడతాను”
“మంచి తెలివైన ఆలోచన, అలా చేస్తే నువ్వు వంట చేస్తున్నావు అనుకుంటారు కింద ఇంటివారు”
కనకం వచ్చేలోపల కంప్యూటరు తెరిచి పెట్టి, నడిపేందుకు తయారుగా ఉంచి, కనకం కోసం ఎదురు చూస్తూంటే, నెమ్మదిగా గదిలోనికి వచ్చింది.
“ముందుగది తలుపులు గడియ పెట్టేవా”
“మీరు సెప్పినట్టు శబ్దం రాకుండా పెట్టేసినాను”
కనకాన్ని కుర్చీలో కూర్చో పెట్టి, ఆమె వెనకనుంచి ముందుకు తెచ్చిన తన చేతులతో కీబోర్డు సహాయంతో తక్కువ శబ్దంతో కంప్యూటరు నడపగానే, రెండు నిమిషాలలో ఒక్కసారిగా గదిలోనికి వచ్చిన నలుగురు మగవారు నలుగురు ఆడవారు మోహన్ ను పట్టుకొని కింద పడేసి కాళ్ళు చేతులు కట్టి –
“యెదవా, ఒయసులో ఉన్న ఆడపిల్లకు రంకు నేర్పుతావా, ఉండు నిన్ను నీ కంపూటర్ను పోలీసులకు పట్టిస్తే ఆళ్లే నీకు ఇంకా బోలెడు నేర్పుతారు” అని పోలీసులను పిలవడానికి ఇద్దరు బయలుదేరబోతూ ఉంటే, లోపలికి వచ్చిన ఇంటావిడ నడుస్తున్న కంప్యూటరును ఆపి –
“వెధవా, పనిమనిషిని కుదర్చమన్నది ఇందుకా” అని మోహన్ తల మీద రెండు మొట్టి కాయలు వేసింది.
“మీ అందరికీ దండం పెడతాను క్షమాపణ చెప్తాను. దయచేసి నన్ను పోలీసులకు పట్టించకండి” అని ప్రాధేయపడుతున్న మోహన్ తో ఆవిడ –
“నీ వెధవ బుద్ధులకు శిక్ష ఏమంటే –
నువ్వు కనకాన్ని ఇప్పుడే ఇక్కడే వాళ్ళ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకూవాలి. మా ఇల్లు వెంటనే ఖాళీ చేసి, ఉద్యోగానికి నీ రాజీనామా లేఖ వ్రాసి నాకిచ్చి, కనకం కుటుంబం నిఘాలో వాళ్ళింట్లోనే కాపరం చేయాలి. భవిష్యత్తులో కనకానికి కానీ వారి కుటుంబానికి కానీ ఎటువంటి హాని కలిగినా, దానికి నీదే బాధ్యత అని అంగీకరిస్తూ నీ స్వహస్తాలతో మరొక లేఖ వ్రాసి సంతకం చేసి నాకు ఇవ్వాలి. ఎప్పుడైనా ఏమైనా వెధవ్వేషాలు వేస్తే ఈ రుజువులతో నిన్ను పోలీసులకు పట్టిస్తాను. ఈ షరతులకు నువ్వు ఒప్పుకోకపోతే ఇప్పుడే పోలీసులను పిలవక తప్పదు”
అంతకంటే గత్యంతరం లేదని తెలుసుకున్న మోహన్,
ఆవిడ మాటలకు ‘సరే’ అని, ఆమె చెప్పినట్టే చేసేడు.
అనుభవజ్ఞురాలైన ముసలావిడ –
పనికి కుదిర్చిన కనకంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, జరుగుతున్నది జరగబోతున్నది తెలుసుకుంటూ, తీసుకోవలసిన జాగ్రత్తలు బోధపరుస్తూ, ధైర్యం చెప్తూ --
మోహన్ ఒకటి తలుస్తే మరొకటి జరిగేటట్టుగా చేసింది.
**శ్రీరామ**