నీ జీవితం నీ చేతల్లో - జి.ఆర్.భాస్కర బాబు

Nee jeevitam nee chetallo

“తాతా నాకు డొమినోస్ పిజ్జా తెప్పించవూ” అని అడిగాడు ఆరేళ్ల మనవడు చరణ్. “నిన్ననే కదరా నీకు కేఎఫ్సీ నుండి బర్గర్ తెప్పించాను. అవి రోజు తినకూడదు .అది జంక్ ఫుడ్ అందుకనే తినకూడదు’ అని వివరించిబోయాడు రామచంద్రం. “నాకు తెలుసులే తాత ఒక్కటి తింటే ఏమీ కాదు, దాంతోపాటే నాకు ఫ్రెంచ్ ఫ్రైస్, కోక్ కూడా కావాలి” అన్నాడు మనవడు చరణ్. రామచంద్రం కోడలు భవ్య వంక చూశాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె కొడుకు ఏం అడిగినా చేయాలని అనుకుంటుంది. ఆమెకు వాడి ఆరోగ్యం కంటే అడిగింది చేయటంలోనే ఆనందం ఎక్కువ. రామచంద్రం భార్య లక్ష్మి వంక చూశాడు. ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు. ఆమె ,ఇక్కడ ఈ మనవడికి తెప్పించిన పిజ్జా పూనాలో ఉన్న మనవడికి కూడా ఎలా ఆర్డర్ చేయించాలా అని ఆలోచిస్తున్నదని తెలుసు రామచంద్రానికి. “సరేలేరా ఈ ఒక్కసారికి తెప్పిస్తాను మళ్లీ మంగళవారం వరకు నన్ను ఏమీ అడగకూడదు” అన్నాడు రామచంద్రం. “థాంక్యూ తాత” అని టాబ్ పుచ్చుకొని వేరే గదిలోకి వెళ్ళిపోయాడు మనవడు చరణ్. “పెద్దవాడి కొడుక్కి కూడా ఒక పిజ్జా ఆర్డర్ చేసి పంపండి” అంది భార్య లక్ష్మి *

***. **** *****. ***** *****. ***** రామచంద్రం ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేశాడు. ఈమధ్యనే అతనికి అరవై మూడు నిండి అరవై నాలుగు ఏళ్లు వచ్చాయి.ఇక పని చేయలేను అనుకొని రిటైర్మెంట్ తీసుకున్నాడు. రామచంద్రం తన ఆరోగ్య రీత్యా పని చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. రామచంద్రం ఒక రోగాల గని. అతనికి హార్ట్ ప్రాబ్లం, బీపీ ,షుగరు ,కంటి సమస్యలు,నరాల సమస్య ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే లిస్టు అవుతుంది. రామచంద్రం చిన్న వయసులోనే ఉద్యోగం చేయటం మొదలుపెట్టాడు. మొదట ఉద్యోగం లో చేరినప్పుడు అతనికి ఇరవైరెండు ఏళ్ళు ఉంటాయి. చదివింది కామర్స్ డిగ్రీ కావడంతో అతను ఆఫీస్ అసిస్టెంట్ గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టాడు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడు. కానీ అతనికి ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. అతనిలోని చురుకుతనం గమనించిన యాజమాన్యం అతనికి ఎక్కువ టూరింగ్ ఉండే పనులే అప్ప చెప్పేవాళ్లు. మొదట్లో అది సరదాగా అనిపించినా రాను రాను ఆ ఉద్యోగం చేయటం రామచంద్రానికి విసుగు అనిపించ సాగింది. ఏ రోజు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఏమి తింటాడో తెలియదు.ఎలా ఉంటాడో తెలియదు . ఇలాంటి పరిస్థితుల్లో అతను టూరింగ్ ఉద్యోగాలు మానివేయదలుచుకున్నాడు. కానీ అతనికున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ కంపెనీకి వెళ్ళినా యాజమాన్యం అతనికి అటువంటి ఉద్యోగాలే ఆఫర్ చేసింది. టూర్ లో ఉంటే ఏ సమయానికి ఏం చేయాల్సి వస్తుందో అతని కూడా తెలియదు. వెళ్లిన కంపెనీలో అతని పని పూర్తి కావటానికి చాలా తంటాలే పడాల్సి వచ్చేది. పగలంతా బిల్లులని, ఇన్వాయిసులని ,టాక్స్ అని రకరకాల విషయాలు మీద అతను చాలామందిని కలవాల్సి వచ్చేది. అవన్నీ సరిగానే ఉండి అతనికి రావాల్సిన బిల్లుల మీద సంతకం పెట్టించుకోవడానికి సాయంత్రం పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఆ వచ్చిన వాళ్లతో పాటు రామచంద్రం కూడా ఆ పార్టీలో పాల్గొనాల్సి వచ్చేది. తప్పేది కాదు. ఆ పార్టీలో రకరకాల తిండ్లు రకరకాల డ్రింకులు రుచి చూడాల్సి వచ్చేది. పార్టీకి వచ్చే వాళ్ళకి ఆ ఒక్కరోజే పార్టీ అయినా రామచంద్రానికి రోజూ అదే తిండి అదే తాగుడు ఉండేది. రామచంద్రం రెస్ట్ తీసుకోవటానికి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టనిచ్చేది కాదు అతని భార్య లక్ష్మి. పనులన్నీ ఆమే చక్కబెట్టుకునేది. సంపాదనకి ఏమి కొదవ లేకపోవడంతో ఇంట్లో కూడా బయట ఉన్నట్లే ఉండేది. ఏ వంట చూసినా అందులో నూనె ఎక్కువగా ఉండేది. భర్త ఇంటి దగ్గరే ఉన్నాడని లక్ష్మి నాలుగు పదార్థాలు ఎక్కువగానే చేస్తూ ఉండేది. అవన్నీ తినటం, ఏమాత్రం వ్యాయామం లేకపోవడంతో రామచంద్రానికి మెల్లగా బరువు పెరగటం మొదలైంది. బట్టలు బిగుతుగా అవసాగాయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరీవిసుగనిపిస్తే అప్పుడప్పుడు సాయంత్రం పూట అతను స్నేహితులదగ్గరికి వెళ్లి కూర్చునేవాడు. ఎప్పుడోకాని రాని రామచంద్రం వచ్చాడని వాళ్ళు కూడా పార్టీ ఏర్పాటు చేసేవాళ్లు. అక్కడా పరిస్థితి అంతే!!! ఇలా రోజుల్లో దొర్లిపోతున్నాయి. రామచంద్రం ఇల్లు కట్టుకొని ఆ ఊర్లోనే స్థిరపడ్డాడు. కంపెనీల్లో హోదాలు మారినా చేసే పని మాత్రం మారలేదు. అతనికి టూర్లు ఎక్కువ అయాయే గాని తగ్గలేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. పెద్దవాడు పూనాలో ఉంటాడు.చిన్నవాడు రామచంద్రంతో ఆ ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళిద్దరూ వేరే వేరే శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. నియమ బద్ధమైన జీవితాన్ని గడపుదామనుకున్న రామచంద్రానికి ఆ కోరిక తీరకుండానే అరవై మూడు ఏళ్లు వచ్చేసాయి. వయసు పాటే హోదా పెరిగింది , రోగాలూ పెరిగాయి. అతని అస్తవ్యస్తమైన జీవనశైలితో ఆరోగ్యం గాడి తప్పి చాలా రోజులు అయింది.. కాదు సంవత్సరాలే అయింది. షుగర్ తో మొదలైన అతని అనారోగ్యం ఇప్పుడు బిపి, కొలెస్ట్రాల్, గుండె జబ్బు, లివర్ జబ్బు, కంటి జబ్బు, నరాల సమస్య…. ఇలా పెరుగుకుంటూ పోయింది. ఒళ్ళు విపరీతంగా పెరిగి పోయింది. కొడుకుల ప్రోద్బలంతో అతను రిటైర్మెంట్ తీసుకున్నాడు. జబ్బుకొక డాక్టర్ చొప్పున అతను ప్రస్తుతానికి నలుగురు డాక్టర్ల దగ్గరికి వెళ్లి చూపించు కుంటున్నాడు . అందరూ వైద్యులూ చెప్పేది ఒకటే ..ఆరోగ్యాన్ని చాలా అశ్రద్ధ చేశారుఅని. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమీ లేదు. మనిషి మనుగడకు ముఖ్యమైన ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని ఉన్నా అన్ని వ్యర్ధంగానే కనిపిస్తాయి.

*********. *********. ********* ఒకరోజు రామచంద్రం షుగర్ డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్ళాడు. అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు ప్రసాదరావు కలిశాడు. అతను కూడా రామచంద్రం ఈడు వాడే. రామచంద్రం పక్క కాలనీలోనే ప్రసాదరావు కూడా ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. వాళ్ళిద్దరికీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రసాదరావు సొంతగా ఒక ఇండస్ట్రీ పెట్టుకొని నడుపుతూ ఉండేవాడు. అతను లాభాల కంటే కూడా తన అవసరాల కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. అందువల్లే అతను ఎక్కువ డబ్బు వెనక వేయలేకపోయాడు కానీ తృప్తిగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ కారణంతోనేమో రామచంద్రం ప్రసాదరావుని ఎక్కువ మార్లు కలిసేవాడు కాదు. ప్రసాదరావు ని హాస్పిటల్ లో చూసిన రామచంద్రం “ఏమిరా ఇటు వచ్చావు” అని అడిగాడు. “ఏమీ లేదురా మా ఆవిడకి మొన్న ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్లు అయింది .అందుకని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన షుగరు, థైరాయిడ్ చెక్ చేయించమని చెప్పాడు. అందుకనే ఇవాళ ఆమెను తీసుకొని ఇక్కడికి తీసుకుని వచ్చాను .డాక్టర్ గారిని కలిసాము .ఆయన జనరల్ వీక్నెస్ అని దానికి తగిన మందులు కొద్ది రోజులు వాడితే సరిపోతుంది అని చెప్పారు”అన్నాడు ప్రసాదరావు. రామచంద్రానికి చాలా అసూయగా అనిపించింది. వాళ్లకు ఏమీ రోగాలు లేకపోవడం అతనికి వింతగా అనిపించింది. అదే మాట ప్రసాదరావుతో కూడా అన్నాడు. ప్రసాదరావు సన్నగా నవ్వాడు. “మా ఆరోగ్య రహస్యం చాలా సింపుల్. మితమైన తిండి ఆత్మ తృప్తితో కూడిన జీవితం ఇదే మా ఆరోగ్య రహస్యం” అన్నాడు ప్రసాదరావు. “నువ్వు ఇంకా పని చేస్తున్నావా లేదంటే ఆ ఇండస్ట్రీని మూసేసావా” అని అడిగాడు రామచంద్రం. “అది మూసేయాల్సిన అవసరం ఏముంది? ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఓ యాభై అరవై మంది వాళ్ళ జీవనాలు సాగిస్తున్నారు .నాకు వచ్చే లాభాల్లో వాళ్లకు కూడా వాటా ఇస్తుంటాను. నా ఇద్దరు పిల్లలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి వాళ్ళ జీవితాలు వాళ్లు గడుపుతున్నారు. నేను వాళ్లను గురించి పట్టించుకునే అవసరం ఏమీ లేదు”అన్నాడు ప్రసాదరావు. అటుగా వెళుతున్న ఒక అతను వీళ్లను చూసి ఆగి దగ్గరకు వచ్చి ప్రసాదరావుకి నమస్కారం చేశాడు “బాగున్నారా గురువుగారూ” అంటూ అడిగాడు. “నేను బాగున్నాను రామకృష్ణా ,మీరు ఎలా ఉన్నారు? ఈమధ్య యోగాకు రావటం లేదు ఎందుకని” అని అడిగాడు ప్రసాదరావు. “మరి ఏమీ లేదండి మా అమ్మగారికి కొంచెం ఒంట్లో సుస్తీ చేసింది .ఆవిడని చూసుకుంటూ నేను ,మా ఆవిడ ఇంటి దగ్గరే ఉండిపోయాము. అందుకని నాకు కుదిరింది కాదు” అన్నాడు రామకృష్ణ. “అరెరే అలాగా ఆవిడ ఇప్పుడు ఎలా ఉన్నారు” అని అడిగాడు ప్రసాదరావు. “ఆవిడ చాలా బాగున్నారు సార్” అన్నాడు రామకృష్ణ”మీరు మీ స్నేహితులా అండీ” అని అడిగాడు రామచంద్రం వంక చూస్తూ. “అవును రామకృష్ణా”అన్నాడు ప్రసాదరావు. “మిమ్మల్ని ఎప్పుడూ మా యోగా క్లాసులో చూడలేదు సార్ అందుకని అడిగాను మరి ఏమి అనుకోకండి” అన్నాడు రామకృష్ణ. “మా గురువుగారు పొద్దున్నే యోగా నేర్పుతారు. జీవిత సత్యాలు నేర్పుతారు , ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఎలా బతకాలో నేర్పించారు.ఆయనకు మా ఇంటిల్లిపాది చాలా రుణపడి ఉంటామండీ. మాకు డాక్టర్ల చుట్టూ తిరగటానికి అవకాశమే లేదు, మా ఆరోగ్యాలు అంత బాగుంటాయి అదంతా మా గురువుగారి చలవేనండీ” అన్నాడు రామకృష్ణ. రామకృష్ణ అంతలా పొగుడుతుంటే ప్రసాదరావు అడ్డుపడి “అందులో నా గొప్పతనం ఏముంది రామకృష్ణా అదంతా మన పూర్వీకులు మనకు అందించిన విజ్ఞానం, దానిలో నుంచి మనం మన జీవితాలకు అన్వయించుకునే విధానం అంతే”అన్నాడు. “సరే గురువుగారూ నాకు ఇక సెలవు ఇప్పించండి మళ్ళీ నేను యోగా క్లాస్ లో మిమ్మల్ని కలుస్తాను” అంటూ వెళ్లిపోయాడు రామకృష్ణ. రామచంద్రం ఉండబట్టలేక ప్రసాదరావుతో “నీవు వీళ్ళ జీవితాన్ని ఇంతలా ఎలా ప్రభావితం చేసావు” అని అడిగాడు. “నేను వాళ్లకు మనిషి ఎలా బతకాలో నేర్పుతాను. అందులో భాగంగా యోగాభ్యాసం, ఆహార విహార నియమాలు, సత్యనిష్ట, తృప్తితో కూడిన జీవన విధానం,ఒకరితో మరొకరు సహకరించాల్సిన విషయాలు వాటి పద్ధతులు, ఇలా ఎన్నో విషయాలు నాకు తెలిసిన మేరకు వాళ్లకు నేర్పుతాను”అన్నాడు ప్రసాదరావు. “వీటి వల్ల వాళ్లకు ఉపయోగం జరిగిందా” అని అడిగాడు రామచంద్రం. “నేను చెప్పటం దేనికి నువ్వే విన్నావు కదా” అన్నాడు ప్రసాదరావు. “మరలాఅయితే అవన్నీ నాకు కూడా నేర్పుతావా” అభ్యర్థనగా అడిగాడు రామచంద్రం. “దానివల్ల నీ సమస్యలు కొద్దిగా అయినా దూరమవుతాయి అనుకుంటే నేర్పడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది” అన్నాడు ప్రసాదరావు. “సరే అయితే రేపు కలుస్తాను” అంటూ రామచంద్రం ,ఆ మరుసటి రోజు ప్రసాదరావుని కలవడానికి సమాయుత్తమవుతూ అక్కడ నుండి బయలుదేరాడు. రేపటి ఉదయం కోసం సూర్యుడు మెల్లమెల్లగా పశ్చిమాద్రిలో లీనమవుతున్నాడు.

మరిన్ని కథలు

Aseerwada mahima
ఆశీర్వాద మహిమ
- ambadipudi syamasundar rao.
Okati tliste marokataindi
ఒకటి తలుస్తే మరొకటైంది
- మద్దూరి నరసింహమూర్తి
Swargalokam vardhillali
స్వర్గలోకం వర్ధిల్లాలి
- సదాశివుని లక్ష్మణరావు విశాఖపట్నం
Dongalu baboy
దొంగలు బాబోయ్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Lokam teeru
లోకం తీరు
- టి. వి. యెల్. గాయత్రి.
Navyapatham
నవ్య పధం
- కొడవంటి ఉషా కుమారి
Gamyam teliyani gamanam
గమ్యం తెలియని గమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vuttaralayya
ఉత్తరాలయ్య
- కామేశ్వర రావు