
బ్రహ్మ ముహుర్తంలో లేచి తయారై పుస్తకం తిరగేస్తూ మధ్య మధ్యలో వంటగదిలో గరిటె తిప్పుతూ చదువు, వంట కలగలిపి చేస్తుంది భారతి. చేతికి పెట్టుకున్న వాచ్ ని చూసేసరికి సమయం ఏడున్నరవటం గమనించి భుజానికి బ్యాగ్ తగిలించుకొని బెడ్ రూమ్ లోకి వెళ్ళి"శ్యామ్ లేవండి!.... ఎగ్జామ్కి టైమ్ అవుతుంది. కొంచెం బస్ స్టాప్ వరకు దిగబెట్టండి" ఒక చేత్తో బ్యాగ్ లో హాల్ టికెట్, ఆధార్ కార్డు పెట్టుకుందో లేదో అని సరిచూసుకుంటూ మరో చేత్తో వాళ్ళాయన భుజంపై తట్టింది. "హా ....లేస్తున్నా ప్రశాంతంగా ఇంట్లో ఉండక ఈ పరీక్షలవి నీకెందుకు అంటే వినవు కదా!?" "టేబుల్ పై పిల్లలకి, మీకు అన్నీ చేసి సర్థిపెట్టాను చూసుకొండి" అని చెప్పింది. శ్యామ్ హెల్మెట్ పెట్టుకుని ఆమె చెప్పిన విషయం పట్టించుకోలేనట్టు " టైమవుతుంది ముందు బైకెక్కు" అన్నాడు భారతి బైక్ దిగి బస్టాప్ లో నుంచుంది. "జాగ్రత్త!! ..ఆల్ ది బెస్ట్" అని బైక్ తిప్పి శ్యామ్ వెళ్ళిపోయాడు.
వెళుతున్న బైక్ వైపు చూస్తున్న భారతి కళ్ళ ఎదురుగా 55k ఆర్.టి.సి. బస్ వచ్చి ఆగింది. "మల్కాపురం టు పెందుర్తి" బోర్డుపై రాసి వున్న అక్షరాలని కళ్ళు తన ప్రమేయం లేకుండానే చదివాయి. బస్సు ఎక్కుతూ,...తెలిసినా అలవాటుగా ఎందుకైనా మంచిదని "బస్సు చిన్న ముషిరివాడ వెళ్తుందా!?"అని అడిగింది. ఇలాంటి ప్రశ్నలకి అలవాటు పడిపోయిన డ్రైవర్ "వెళ్తుంది" అన్నట్టు తల ఆడించాడు. బస్సు కొంచెం ఖాళిగా ఉండటంతో ఎండ తగలని కిటికి సీటు వెతుక్కుని తీరిగ్గా తన చేతిలో అట్టని ఒక వైపు హ్వాండు బ్యాగుని ఒకవైపు పెట్టి కూచుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక్క నిమిషం విరామంలేకుండా అలసిపోయి ఉన్న ఆమెకి కూర్చోగానే ప్రాణం లేచొచ్చినంత హాయిగా అనిపించింది. "ఎక్కడికి!?" అని కండక్టర్ అడిగాడు. "చిన్న ముషిడివాడ" తన హ్యాండ్బ్యాగ్ జిప్ తెరుస్తూ అంది. "చిల్లర వుందా!?"అని అడిగి టికెట్ ఇవ్వకుండా వెనక సీటు దగ్గరకు వెళ్ళిపోయాడు. 'నువ్వు ఏమైనా తిన్నావా? నీ దగ్గర డబ్బులున్నాయా? అని కనీసం అడగలేదు శ్యామ్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి ఒక్క కండక్టరు చిల్లరవుందా అని అడిగేవాడే అందరూ ఇచ్చిన చిల్లర వీళ్ళేం చేస్తున్నారో? ' అని కట్టుకున్న వాణ్ణి, కండక్టర్ ని మనసులోనే చెడా మడా వాయించేసింది. గజిబిజి గందరగోళంగా హ్యండ్ బ్యాగ్ వెతక్కా మూడు పది నోట్లు దొరికాయి. "ఇదిగోండి" అని మూడు నోట్లు ఇచ్చింది. "నేనడిగింది మీ దగ్గర చిల్లర వుందా అని " తన దగ్గర వున్న చిల్లర లెక్క పెట్టుకుంటూ అన్నాడు. "నా దగ్గర ఇదే వుందండి " అని ముభావంగా చూసింది కండక్టరు వైపు. "అమ్మా! అలా కాదు ..ముందు నీ దగ్గర వున్న వంద నోటు ఇలా ఇవ్వు!!" తదేకంగా చూస్తూ అడిగాడు. ఇక చేసేదేమి లేక వందనోటు ఇచ్చింది. 'టికెట్, చిల్లర' ఆమె చేతిలో పెట్టాడు. చేతిలో ఉన్న ఇరవై నాలుగు రూపాయల టికెట్, డభ్భై ఆరు రూపాయలు లెక్కపెట్టుకుని కండక్టర్ వైపు అయోమయంగా చూసింది. "ఆ ఎగ్జామ్ సెంటర్ కే కదా! అక్కడ అవసరం పడతాయ్" అని వేరే సీటు దగ్గరకు వెళ్ళిపోయాడు. 'చిల్లర వుందా? అని అడిగింది ఇందుకా నేనే అనవసరంగా ఏదో అనుకున్నాను' అని మనసులోనే లెంపలు వేసుకుంది. "బాబాయ్ కొంచెం ముందుకు వెళ్ళి ఆపు" అక్కడ వున్న బామ్మని లేవమని సైగ చేస్తూ డ్రైవర్ కి చెప్పాడు కండక్టర్ "ఎందుకబ్బాయ్ ఈ గోల మనకి ఆ స్టాప్ లో దించేస్తే వెళ్ళిపోద్దిగా" అని ముందుకెళ్ళి విసుగ్గా ఆపాడు. "పోనిలే బాబాయ్ ఇక్కడ నుంచి అయితే మామ్మకి నడక తగ్గుద్ది." సమాధానమిచ్చాడు. "మేడమ్, తర్వాత మీరు దిగాల్సిన స్టాపే రెడిగా ఉండండి" భారతి వైపు చూసి అన్నాడు బస్సు దిగి ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళుతున్నప్పుడు సెంటర్ పక్కన పెట్టిన టిఫిన్ కొట్టు చూసి ఆకలి గుర్తొచ్చింది భారతికి. వాచ్ చూసుకుని ఇంకా 'అరగంట టైముంది' అని నిర్థారణ కొచ్చి టిఫిన్ కొట్టు దగ్గరకెళ్ళి "ప్లేట్ ఇడ్లి ఇవ్వండి" అని అడిగింది "నలభై రూపాయలు ఉందా!?" అని టీ ని వేరొకరికి ఇస్తూ అడిగాడు . "హా! ఉంది" అని "అవసరం పడుతుంది" అని కండక్టరు ఇచ్చిన నోట్లు అతని చేతిలో పెట్టింది. వేడి వేడి ఇడ్లీ తన వేళ్ళతో తీసుకుంటున్నప్పుడు 'తను చూసినవి, తనకు తెలిసినవి జతకలిపి అవతలి వారి గురించి ఏమి తెలియకుండా లోలోపలే మనసు ఎన్ని అపవాదులు వేసెస్తుంది. బయటికి చెప్పకపోయినా .నేను కాస్త చులకనగా అసహనంతో చూసిన చూపు అతనికి తెలిసే ఉంటుంది అయినా సరే పక్కవారి అవసరం తెలుసుకుని తదనుగుణంగా పని చేసిన అతడి సేవ ఎంత సంస్కారవంతమైనది' అని మనసులోనే అనుకొని ఆ 'చిల్లర' క్షణాలకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది భారతి.