
ఒక నది ఒడ్డున ఉన్న నేరేడు చెట్టు మీద ఒక కోతి ఉండేది. ఆ చెట్టు నేరేడు పండ్లు చాలా తియ్యగా ఉండేవి. కోతి చెట్టు మీద రుచికరమైన పండ్లు తిని, చెట్టు మీద ఆడుకుంటూ చాలా సంతోషంగా జీవించేది. ఒకరోజు, ఒక మొసలి దారి తప్పి ఆ నేరేడు చెట్టు దగ్గరికి వచ్చింది. అది చాలా అలసిపోయినట్లు ఉండడం చూసి జాలిపడి ఆ కోతి దానికి చెట్టు నుండి కొన్ని రుచికరమైన నేరేడు పండ్లను ఇచ్చింది. ఆ మొసలి ఆ పండ్లను తిని సంతోషపడి, కోతి తో స్నేహం చేసింది. ఒకరోజు మొసలి తన భార్య కోసం కొన్ని నేరేడు పండ్లను తీసుకెళ్లింది. అతని భార్య ఆ నేరేడు పండ్లు తిని, ఆ పండ్ల రుచికి ఆశ్చర్యపడి, ఈ నేరేడు పండ్లను క్రమం తప్పకుండా తినే ఆ కోతి హృదయం ఎంత రుచికరంగా ఉంటుందో అనుకుని ఆమె మొసలిని ఒక కోరరాని కోరిక కోరింది. ఆమె కోతి హృదయాన్ని తన కోసం తీసుకురావాలని ఆదేశించింది. మొసలి దిగులుతో తన స్నేహితుడిని మోసం చేయడానికి నిరాకరించింది. మొసలి భార్య కోతి హృదయాన్ని ఎలాగైనా తినడానికి నిర్ణయించుకుని చాలా రకాల ఆలోచనలు చేసి ఆమె మొసలితో తన ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. ఆమె తెలివితో వైద్యులు ఆమె కోలుకోవడానికి కోతి హృదయాన్ని తినమని సూచించారు. మొసలి భార్య తనకు కోతి హృదయాన్ని ఇవ్వకపోతే, తాను చనిపోతానని బెదిరించింది. మొసలి ఆమె ఆజ్ఞకు లొంగిపోవాల్సి వచ్చింది. బరువెక్కిన హృదయం తో, మొసలి కోతిని తీసుకురావడానికి బయలుదేరింది. అతను కోతి దగ్గరకు వెళ్లి, “మిత్రమా, నా భార్య నువ్వు పంపిన నేరేడు పండ్లను చాలా ఇష్టపడింది. నీకు కృతజ్ఞతలు చెప్పడానికి నిన్ను మా ఇంటికి ఆహ్వానించింది” అని చెప్పింది. కోతి అంగీకరించి మొసలి వీపు పైన కూర్చుంది. నది మధ్యలో, మొసలి నీటిలో మునిగిపోవడం ప్రారంభించింది. కోతి భయపడి, మొసలిని "నువ్వు ఎందుకు మునిగిపోతున్నావు" అని అడిగింది. కోతికి ఇప్పుడు తప్పించుకునే మార్గం లేదని తెలుసుకున్న మొసలి, "క్షమించు, మిత్రమా. నా భార్య తన ప్రాణాలు కాపాడుకోవడానికి నీ హృదయాన్ని తినాలని కోరింది. అందుకే నేను నిన్ను నాతో తీసుకెళ్తున్నాను" అని సమాధానం ఇచ్చింది. కోతికి కోపం వచ్చినా అది ఎంతో తెలివైనది. అది ప్రశాంతంగా ఉండి, "ఒక ప్రాణాన్ని కాపాడితే నాకు చాలా సంతోషం. నేరేడు చెట్టు దగ్గర చెప్పి ఉండవచ్చు కదా కదా. నీటిలో మునిగిపోతుంది అని నా హృదయాన్ని చెట్టు పైన పెట్టి వచ్చాను" అంది. కోతి వెంటనే మొసలి తో మనం త్వరగా వెలితే చెట్టు నుండి తన హృదయాన్ని తీసుకోవచ్చని చెప్పింది. మొసలి వెంటనే దానికి అంగీకరించి వెనక్కి తిరిగింది. వారు చెట్టు దగ్గరకు చేరుకోగానే, కోతి చెట్టు పైకి దూకి, “ఓ తెలివితక్కువ మొసలి, ఎవరైనా తన హృదయాన్ని తీసి వేరే చోట ఎలా ఉంచుకోగలరు? నువ్వు నన్ను స్నేహితుడిగా మోసం చేశావు. ఇప్పుడు వెళ్లి ఇక ఎప్పటికి తిరిగి రాకు" అనగానే సిగ్గు పడిన మొసలి తన ఇంటికి తిరిగి వెళ్ళింది. మనమే తెలివైన వాళ్ళం అనుకుంటే మనకు మించిన తెలివైన వాళ్ళు ఉంటారు.