
ప్రతిరోజూ ఉరుకులు, పరుగులతో అలసిన శరీరం, పదవీ విరమణ అయిన తరువాత కొంత నెమ్మది అయింది.. రోజూ, ఉదయం లేచే సరికి 7 / 8 గంటలు అవుతోంది.. అక్కడి నుంచి నెమ్మదిగా మొదలవుతుంది పని..
కాఫీ త్రాగటం, ఆయన పేపరు చూస్తుంటే, తాను ఫోన్ చూసుకోవడం.. ఇలా ఉంటుంది భారతి దినచర్య.. ఇద్దరు పిల్లలూ అమెరికాలో ఉన్నారు.. సంవత్సరానికి ఒకసారి వీలును బట్టి వస్తారు.. పోయిన సారి చిన్నమ్మాయి ఫ్లోరిడా నుండి వచ్చినప్పుడు పనిమనిషిని మార్చింది..
యంగ్ అండ్ యనర్జిటిక్ ప్రమీలను మాట్లాడింది.. పైగా దానికి వార్నింగ్ ఇచ్చింది.. అమ్మ, నాన్న ఇద్దరూ పెద్దవాళ్ళు, వాళ్ళను జాగ్రత్తగా చూడాలని, ఇంకా తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ చెప్పి వెళ్ళింది..
చాత గాని రోజులు వచ్చిన తరువాత మంచి ఆసరా కావాలనిపిస్తుంది.. రాగానే గలగలా మాట్లాడుతూ "అమ్మా.. ఈ చీర బాగా లేదు.. బయటికి పోయేటప్పుడు మంచిది కట్టుకో.." అంటూ దగ్గరుండి మార్పిస్తుంది..
"అమ్మా చిన్న పాప చెప్పింది.. మిమ్మల్ని చూసుకోమని.. నేనిక్కడే ఉంటా.. మీరు పొమ్మన్నా నేను పోను.." అంటూ స్వతంత్రంగా అన్ని పనులూ, చేతులో నుండి లాక్కుని మరీ చేస్తోంది..
ఎప్పుడైనా పడుకుంటే వచ్చి కాళ్ళకు ఆయిల్ తో మసాజ్ చేస్తూ తన కష్టాలు చెప్పుకునేది.. అల్లోవెరాతో మంట తగ్గుతుంది అంటూ క్రిందికి వెళ్ళి అల్లోవెరా ఆకులు తెచ్చేది.. వాటి నుండి గుజ్జు తీసి అరి కాళ్ళకు రాసేది..
"సారూ! నువ్వు కూకో నేను కట్ చేస్తా.." అంటూ కూరగాయలు కట్ చేసే ట్రే ఆయన చేతిలో నుంచి తీసుకుంటుంది.. కొద్ది రోజుల్లోనే బాగా అలవాటు అయింది..
ఈరోజింకా రాలేదేంటాని ఆరా తీయటానికి ఫోన్ చేసింది భారతి.."అమ్మా.. రెండు నిమిషాల్లో అక్కడ ఉంటా.." మనం అడగటానికి వ్యవధి కూడా ఇవ్వదు..
రాగానే మొదలు పెట్టింది.. మాటల మధ్యలో ఒకసారి చెప్పింది.. ప్రమీలను, భర్త వదిలేసి వేరే ఆమెతో ఉన్నాడట.. తనను, ఇద్దరు కొడుకులను వదిలేసి వెళ్ళి పొయ్యాడు.. అప్పటినుండి తనే పనిచేసుకుంటూ పిల్లల్ని చదివిస్తోంది.. పెద్దవాడు డిగ్రీ చిన్నవాడు ఇంటర్ చదువుతున్నారు.. మూడు ఇళ్ళలో పనిచేస్తోంది.. నెలకు రు.15000 వరకు వస్తాయట.. అమ్మగా అవతారమెత్తిన స్త్రీ, పిల్లల కోసం ఎంతటి పోరాటమైనా చేస్తుంది.. ఎంతటి కష్టమైనా భరిస్తుంది... బాధలన్నింటినీ లోన దాచుకుని ఘల్లు, ఘల్లుమంటూ, చలాకీగా తిరుగుతుంది.. ఒకసారి చెపితే చాలు, అన్ని పనులు చకచక చేస్తుంది.. ఈ పని మనం మాట్లాడుకోలేదు అనదు.. పెచీలు పెట్టదు..
"ఏంటి ఇంత లేటయ్యింది.."ఫిల్టర్ కాఫీ గ్లాసులో పోసుకుంటూ అడిగింది..
"అమ్మా.. ఇయ్యాల లాయర్ దగ్గరకు వెళ్ళాలి.. ఆ పేపర్లు వెతుక్కునే సరికి కొద్దిగా లేట్ అయింది."
"మళ్ళీ ఏమొచ్చింది.." ఫోను చూసుకుంటూ క్యాజువల్ గా అడిగింది..
"అమ్మా నీకు చెప్పినగా.. పొలం నా మొగని పేరు మీద ఉంది.. అది మార్పించాల.."
"నువ్వు చెపితే వింటాడేంటి.." నిజం తెలుసుకోవాలన్నట్లుగా అడిగింది..
"అదేందమ్మా.. అంతమాటంటివి.. అయినా పొలం కొన్నది నేనేగా.. మా ఆయన నాకు బావే కదా.." ఆశ్చర్యంతో కళ్ళు రెపరెప లాడించింది..
ఒక ఇంట్లోనే ఉంటున్న ఉమ్మడి కుటుంబం వారిది.. ఆమె బావ పొలం అమ్ముతుంటే బయటికి పోవడం ఎందుకని వాళ్ళే తీసుకున్నారు.. రిజిస్ట్రేషన్ తరువాత చేసుకుందామని ఆగారు..
"అయినా అందరం పొత్తులో ఉన్నప్పుడు మా బావ అంటే మా ఆయన అన్న దగ్గర కొన్నాము.. మీకు తెలుసుగా అమ్మ.. అప్పుడు నేను బ్యాంకులో హౌస్ కీపింగ్ లో చేసాను.. మా ఆయన కూడా చాలా మంచోడమ్మా.. ఏ అలవాటు లేదు.. ఇద్దరం వచ్చిన డబ్బులతో మిగుల్చుకుని పొలం కొన్నాము.."
"మరి నీ పేరున ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.." సందేహం నివృత్తి చేసుకునేందుకు అడిగింది..
"అప్పుడు ఆడోళ్ళ పేరు మీద చేస్తారని నాకు తెలియదు.. నాకు తెలియకుండా తన పేరు మార్చుకున్నాడు.." తన కష్టార్జితం కూడా భర్తకు పిల్లలకే అంకితం చేస్తోంది..
"నన్ను పిల్లల్ని మంచిగా చూసుకునే వోడు.. ఆ చిన్న సంతోషం నన్ను ఏమీ ఆలోచించనియ్యలేదు.. ఆ మాయదారి దాన్ని తగులుకుని ఇట్లా అయిపోయాడు.." అమాయకంగా చెప్పింది..
ఆడది తన జీవితం కూలిపోతున్నా ఇంకో ఆడదాన్నే నిందిస్తుంది, కాని భర్తని నిందించదు.. అతని తప్పేమీ లేదా..
"నిన్నూ నీ పిల్లల్ని వదిలి వెళ్ళిన వాడు నీకు పొలం రాస్తాడా.. నీది పిచ్చి నమ్మకం.." ముందే తనను మెంటల్ గా తయారు చేయాలని అన్నది..
"లాయర్ గారు చేస్తానన్నారు.. అయినా అదేంటమ్మా! ఒక్కసారే అట్టా అన్నావు.."
తనను డిస్కరేజ్ చెయ్యలేక “వస్తుందిలే.. నీ పని చూసుకో..” అని తనను లోపలికి పంపింది..
ఈ లాయర్ ఈమెను డబ్బుకోసం ఇందులోకి లాగుతున్నాడా.. ఆమె దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు.. అమ్మినప్పుడు రాసుకున్న ఒప్పంద పత్రం అది.. ఎందుకు పనికొస్తుంది.. ఇలా అనేక సందేహాలతో తలమునకలవుతూ అలోచించింది..
ఏంటోయ్ టిఫిన్ లేదా.." శ్రీవారి హెచ్చరికతో వంటింట్లోకి వెళ్ళింది భారతి..
"అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదేలే.. అదేమిటో ఆడదంటె మగవాడికి అలుసులే.." రేడియోలో పాట వింటూ 50 ఏళ్ళ క్రితం పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడూ అంతేగా అనుకుంది.. తను జన్మనిచ్చి, పెంచి, సంఘంలో నిలబెట్టిన మగవాడి నుంచి రక్షణ కోరుకుంటోంది స్త్రీ.. హతవిధీ..