తెలతెలవారుతుండగానే ఆ రోజు పేపర్ లో తన ఫోటో చూసుకొని మురిసిపోయాడు. పరందామయ్య. కొడుకు, కూతరు, భార్య, కోడలు, మనవళ్ళు తనకి 'పదవీ విరమణ శుభాకాంక్షలు' పేపర్ ద్వారా తెలిపారు. ఆరోజు రిటైరవుతున్నందున ఒకింత బాధ కలిగింది. భారమైన నిట్టూర్పు విడిచాను. 'పదవీ విరమణ' అనేది ఒకప్పుడు కుటుంబంలో, ఆఫీసులో బాధాకరమైన కార్యక్రమంగా కొనసాగేది. కానీ ఇప్పుడు పద్ధతి మారింది. పదవీ విరమణ పండగలా సెలబ్రేట్ చేసుకోవటం ఆరోగ్యకరమైన మార్పు.
"మీ ఫోటో వచ్చిందా?" అంటూ వచ్చింది అరుంధతి.
"ఆ... నీ పేరు కూడా వేశారోయ్" అని నవ్వుతూ భార్యకి పేపరందించాడు. "చూశారా... మీ రిటైర్మెంట్ అనగానే కొడుకు, కోడలు, కూతరు అంతా కల్సి మీమీద ప్రేమతో నాలుగువేలు ఖర్చుపెట్టి ఈ పేపరులో వేయించారు" అంది ఆనందంగా.
"అయినా... రిటైర్మెంట్ అనగానే... నువ్వింక పనికిరావు పో... అని వదిలించినట్టు కొంచెంబాధగానే ఉంది." అన్నాడు.
"భలేవారే... మీ ఒంట్లో ఇంకా పాఠాలు చెప్పే శక్తి ఉండొచ్చు. కాని ప్రభుత్వం దృష్టిలో మీరింక విశ్రాంతి తీసుకోవాల్సిందే కదా... తరువాత రావాల్సిన డబ్బులన్నీ సరిగా వచ్చేలా చూసుకోండి. ముందు... వచ్చిందాన్లోంచి మీ అల్లుడికి లక్షరూపాయలు ఇచ్చేయండి. వైదేహి వచ్చి ఇప్పటికే నెలయింది. ఫోన్ లో విడాకుల నోటీస్ పంపిస్తానంటూ అల్లుడు అమ్మాయిని తరచూ బెదిరిస్తున్నాడు" అంది.
"అల్లుడికిచ్చేది యాభైవేలే కదే..." అన్నాడు బరువుగా.
"పెళ్ళయి అయిదేళ్లయింది కదా... ఈ అయిదేళ్ళలో ఫిక్సిడ్ చేస్తే మాకు రెట్టింపయ్యేది. అందుకే లక్ష ఇవ్వండని వైదేహి కూడా వాదిస్తోంది."
"అల్లుడికన్నా ఎక్కువ వైదేహి పోరు పెట్టడమే బాధగా ఉంది. డబ్బు ముందు అన్ని బంధాలు గడ్డిపరకలైపోవడం మరింత బాధగా ఉంది" అన్నాడు.
"వీటితో అన్నీ తీరిపోతాయిలెండి. మనకింక డబ్బు సమస్య లేముంటాయ్? కొడుకూ, కోడలూ ఇద్దరూ ఉద్యోగస్తులే కదా..." అంది.
అప్పుడే కోడలు టీ తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చింది.
"రాము క్యాంప్ కెళ్తున్నాడమ్మా...?" అనడిగాడు పరంధామయ్య.
"ఈ రోజు వెళ్తారట. మళ్ళీ వారం తరువాత వస్తారేమో"అంది. పొడిపొడిగా నెలనించి ఇంట్లో తిష్టవేసి ఇంకా లేవని ఆడబిడ్డ మీద కోపంగా ఉంది కోడలు సరోజినికి.
"వైదేహి లేవలేదా సరోజినీ..." అంది అరుంధతి.
"లేదు. రాత్రి వాళ్ళాయన ఫోన్ చేశాడు. విడాకుల నోటీస్ పోస్ట్ లో వేశాడట. వారంలో లక్ష ఇస్తేనే... ఆ నోటీస్ వెనక్కి తీసుకుంటానని కూడా అన్నాడట" అని వెళ్ళిపోయింది.
ఆమాట విని అరుంధతి వైదేహి గదిలోకి పోగా, వాలు కుర్చీలోంచి లేచి పరంధామయ్య టీ కప్పుతో వరండాలోకెళ్ళారు.
***
జనరల్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, లీవ్ శాలరీ అన్నీ కలిపి పరందామయ్యకి మూడున్నర లక్షలు వచ్చాయి. అందులోంచి లక్ష రూపాయలు వైదేహికివ్వడంతో కొడుకు, కోడలు మొహాలు మాడ్చుకున్నారు. కాని అంతకుముందు రోజే పోస్ట్ లో విడాకుల నోటీస్ రావటంతో అంతా కంగారుపడ్డారు. చివరికి అల్లుడికి ఫోన్ చేసి, పిలిపించి లక్ష చేతుల్లో పెట్టాకగాని వైదేహి బయల్దేరలేదు. ఆ రాత్రి కోడలు సరోజిని ఏదో నెపంతో ఇద్దరు పిల్లల్ని చితకబాదింది. కొడుకు పొద్దుననగా బయటికెళ్ళినవాడు అర్దరాత్రి దాటాకగాని ఇంటికి చేరలేదు.
వైదేహి వెళ్ళిపోయాక అరుంధతి భర్తతో అంది.
"ఏమండీ... కూతురికి లక్ష రూపాయలివ్వటం మీ కొడుక్కీ, కోడలికీ నచ్చనట్టుగా వుంది. కాని అంతకంటే దారుణమైన విషయం సాయంత్రం వైదేహి గదిలో విన్నాను" అంది.
"ఏమిటే?" అన్నాడు పరందామయ్య.
"మీరు విడాకుల నోటీస్ పంపించకపోతే... వాళ్ళు లక్ష రూపాయలిచ్చేవాళ్ళే కాదు. అడ్వకేటుకి ఎంతిచ్చారేమిటి? అని భర్తనడుగుతోంది. ఆయనేమో... వెయ్యి రూపాయలడిగితే ఆరొందలిచ్చాను అంటున్నాడు" అంది.
"పరంధామయ్య గారు..." అంటూ నసిగాడు. "నేనే... రండి... అరుంధతీ టీ తీసుకురా..." అని అతనికి కుర్చీ చూపించాడు కూచోమన్నట్టుగా. అతడు కూచుంటూనే తనని తాను పరిచయం చేసుకుంటూ "నా పేరు జయశంకర్. నేను మాన్వి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ నండి. మీరు హిందీ బాగా చెప్తారని చాలాసార్లు విన్నాను. ఈ సిటీలో హిందీ పండిట్ దొరక్క మా కాలేజీ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి మా కాలేజీలో లెక్చరర్ గా జాయినవ్వండి. రోజుకి మూడు పీరియడ్స్ కి మించి ఉండవు. జీతం కూడా మూడు వేల వరకూ ఇస్తాను" అన్నాడు చాలా వినయంగా.
టీ తీసుకొచ్చిన అరుంధతి వైపు కొంచెం గర్వంగా చూశాడు పరంధామయ్య. జయశంకర్ టీ తీసుకొని మీ నిర్ణయం వీలైతే రేపటిలోపు చెప్పండ్సార్" అన్నాడు.
పరంధామయ్య ఆలోచనల్లో పడ్డాడు.
"మా కాలేజీలో మీకు ఏ ఇబ్బందీ ఉండదండీ. మేమంతా మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులకి ఫ్రిఫరెన్స్ ఇస్తూ సైన్సు సబ్జెక్టుల్లో కష్టపడతాం కాని, లాంగ్వేజెస్ విషయం పెద్దగా పట్టింపు లేద్సార్. అందుకే మీకు ఏ ఇబ్బందీ ఉండదు" అన్నాడు జయశంకర్.
"ఇదేదో మంచి అవకాశమే ఉన్నట్టుంది కదా" అన్నట్టున్నాయి అరుంధతి చూపులు.
"సైన్సు చెప్పేవాళ్ళకు మీరెంతిస్తారు బాబు?" అంది అరుంధతి.
"ఇరవై వేలిస్తామమ్మా" అన్నాడు టక్కున.
"అయ్యో... మీరు సైన్సు టీచర్ గా రిటైరైనా బాగుండేది" అన్నట్టు మరోసారి చూసింది అరుంధతి.
"సరే... నా నిర్ణయం రేపు చెప్తాను" అన్నాడు పరంధామయ్య.
"చెప్పటం కాదు. మీరు తప్పక రావాలి... వస్తున్నారు" అనేసి వెళ్ళిపోయాడు జయశంకర్.
పరంధామయ్య నిట్టూర్చి 'ఏమంటావ్' అన్నట్టుగా చూశాడు.
"ఒక్కసారిగా ఇంట్లోనే ఉండాలంటే మీక్కూడా బోర్ గా ఉంటుందేమో. మంచి అవకాశం అదీగాక వెతుక్కుంటూ వచ్చాడు. ఆలోచించండి. చేతనవుతుందనుకుంటే మీ ఇష్టం..." అంది.
కాసేపు ఆలోచించాక... కాలేజీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు పరంధామయ్య.
***
నాలుగు నెలలు గడిచాయి.
అరుంధతికి ఉన్నట్టుండి ఓ రోజు చాతిలో నొప్పి ప్రారంభమైంది. ఆరోజు ఆదివారం కావడంతో అంతా ఇంట్లోనే ఉన్నారు. స్ట్రోక్ ఎక్కువవటంతో హడావిడిగా తరలించారు. ఆ దృశ్యం చూసి పిల్లలు సైతం ఏడుపు మొదలెట్టారు. నానమ్మకేమో అయిందని.
ఆటోలో ఓ ఆస్పత్రికెళ్ళగానే... ఆదివారం కావటంతో డాక్టర్లెవరూ లేక ఓ జూనియర్ డాక్టర్ అన్నిరకాల టెస్టులూ చేశాడు. పరంధామయ్యలో ఆందోళన పెరుగుతుంటే కొడుకు, కోడలు ధైర్యం చెబుతున్నారు.
అరగంట తరువాత జూనియర్ డాక్టర్ ఆమెకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయటం మంచిదని చెప్పి - "ఈ రోజు డాక్టర్లెవరూ లేరు. హైదరాబాద్ తీసికెళ్ళండి" అని చెప్పాడు.
అది విని సరోజిని "నా క్లాస్ మెట్ శ్రీలక్ష్మి ఈ ఊర్లోనే డాక్టర్ గా ప్రాక్టీస్ పెట్టింది మావయ్య. తను కూడా హార్ట్ స్పెషలిస్టు. ఆదివారమైనా కూడా నాకోసం తప్పకుండా పరీక్ష చేస్తుంది. అక్కడికెళ్దాం" అంది ఆదుర్దాగా. రాము కూడా అక్కడికే వెళ్దాం అనటంతో మళ్ళీ ఆటోలో శ్రీలక్ష్మి నర్సింగ్ హోమ్ కి తరలించారు.
సరోజిని తన ఫ్రెండ్ అయిన శ్రీలక్ష్మిని కల్సింది. ఆమె హడావిడిగా వచ్చీ రాగానే అరుంధతి నాలుక కింద ఓ టాబ్లెట్ ఉంచింది. పది నిమిషాల్లో నొప్పి క్రమంగా తగ్గాక అన్ని రకాల పరీక్షలూ చేసింది.
"ఈవిడకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సినంత అవసరం లేదు. మెడిసిన్స్ రాసిస్తాను. వాడండి" అంది. తరువాత శ్రీలక్ష్మిఎంతకీ ఫీజు తీసుకోలేదు.
అరుంధతి మామూలైపోయినా మొహంలో ఆందోళన ఇంకా తగ్గలేదు. తిరిగి అంతా ఇంటికి బయల్దేరారు. పరంధామయ్య రిలీఫ్ గా నిట్టూర్చారు. కానీ... ఆరాత్రే అనుకోని ఘోరం జరిగిపోయింది.
అరుంధతి గుండెల్లో మరోసారి వచ్చిన నొప్పి... ప్రాణాల్ని పైపైనే తోడేసింది. నొప్పి తీవ్రమవుతుంటే బాధగా, నిస్సహాయంగా భర్త వైపు, కొడుకూ, కోడలి వైపూ, పిల్లలవైపు చూస్తూనే చనిపోయింది.
నెలరోజులదాకా ఆ ఇంట్లో స్మశాన స్తబ్ధత విలయతాండవం చేసింది. తరువాత అరుంధతి జ్ఞాపకాలు ఇంట్లో రోజురోజుకీ బాధపెడుతుంటే కనీసం కాలేజికెళ్తేనన్నా బావుంటుందేమోనని బయల్దేరాడు పరంధామయ్య, అప్పటికే తనూ వెళ్ళిపోవడానికి తయారైన వైదేహి సూట్ కేస్ తో వచ్చింది.
"నాన్న... నేనూ వెళ్తున్నాను. ఆయనకి వంటకి ఇబ్బంది అవుతుంది" అంది.
" సరేనమ్మా... మీ అన్నయ్య క్యాంపులకీ, మీ వదిన ఆఫీస్ కీ, పిల్లలు స్కూళ్ళకీ వెళ్ళాక నాక్కూడా ఈ ఇంట్లో మీ అమ్మ జ్ఞాపకాలు బాధపెడుతున్నాయి. అందుకే నేను కూడా మళ్ళీ ఈ రోజు నుంచి కాలేజీకెళ్తున్నాను" అన్నాడు.
"సరే నాన్నా..." అంటూ ఆగింది.
"ఏంటమ్మా... బస్టాండ్ వరకూ రావాలా?" అనడిగాడు.
"అదికాదు నాన్నా. ఆరోజు నేనొచ్చేసరికి అమ్మని పాడెపై ఉంచారు. అమ్మ మీద నాలుగు తులాల పుస్తెలతాడు ఉండాలి. అన్నయో, వదినో తీసుంటారు. తల్లి మీది సొమ్ములు కూతురికే చెందుతాయని ఆయన వచ్చేటప్పుడు చెప్పారు" అంది.
పరంధామయ్య మనసులో గుండు పిన్నుతో గుచ్చినట్లయింది.
"మీ అమ్మ చనిపోయిన బాధలో నాకా విషయమే తెలీదు. బహుశా సరోజిని తీసుండొచ్చు. మళ్ళీ వచ్చిన్రోజు ఆ విషయం ఆలోచిద్దామమ్మా" అన్నాడు బయల్దేరుతూ.
"వదిన మాటవరసకైనా ఈ ప్రస్తావన తేలేదు నాన్నా" అంది కొంచెం కోపంగా.
"మీ అమ్మ పోయాక ఇంటిపని, వంటపని, ఆఫీస్ తో సరోజినిక్కూడా తీరికలేదమ్మా మర్చిపోయిందేమో. ఆమె అలాంటిది కాదులే" అన్నాడు. బయటికి వచ్చాక ఆటోని పిలిచి వైదేహినెక్కించాడు.
కాసేపు ఆలోచించాకా... కాలేజీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు పరంధామయ్య.
***
ప్రిన్సిపల్ జయశంకర్ అటెండర్ తో పరంధామయ్యని తన గదిలోకి పిలిపించాడు. అప్పటికే స్టాఫ్ మీటింగ్ ప్రారంభమైంది. పరంధామయ్య గదిలోకి రాగానే, "కూచోండి మీరు ఇంటర్ ఫస్టియర్ లో సుజల అనే అమ్మాయిని చాలా సీరియస్సయ్యార్ట" అనడిగాడు.
"అవునండీ. ఆ అమ్మాయి ప్రవర్తన బాగాలేదు. ఆపిల్లతో క్లాసంతా డిస్టర్బ్ అవుతోంది అన్నాడు.
"అంతమాత్రానికే మీరు సీరియస్సయితే ఎలాగండీ? ఒకవేళ ఆ అమ్మాయి వేరే కాలేజీలో జాయినైతే ఎంత నష్టమో తెల్సా? ఏటా ముఫ్ఫయ్ అయిదువేలు, అంటే అంటే రెండేళ్ళకి డెబ్బయ్ వేలు నష్టపోవాల్సి వస్తుంది. ఇంకోసారి ఎవర్నీ ఏమి అనకండి. ఇక మీరు వెళ్ళొచ్చు" అన్నాడు కొంత సీరియస్ గా.
పరంధామయ్యకి మిగతా స్టాఫ్ ముందు అవమానంగా అనిపించింది. లేచి వస్తుంటే వెనకనించి జయశంకర్ మాటలు విన్పించాయి. "వీళ్ళబ్బాయి నా క్లాస్ మెట్ కమ్ రూమ్మేట్. మా నాన్న ఖాళీగా ఉంటున్నార్రా. నీ కాలేజీలో జాయిన్ చేస్కో అని పోరుపెడితే తీసుకున్నా. కాని ఈ ముసలాడు చెప్పే హిందీకి ఆ మూడువేలు కూడా వేస్టే" అన్నాడు.
పరంధామయ్య నిశ్చేష్టుడయ్యాడు. రిటైరయ్యాక కూడా తన కొడుకు తన సంపాదనపై...???
ఇంకా ఆలోచించలేకపోయాడు.
కాలేజీ నించి బయటపడి, రోడ్డుపైకొచ్చాడు.
భారంగా ఇంటివైపు నడక సాగిస్తుంటే "నమస్కారం మేస్టారూ. నేను అటే వెళ్తున్నాను. కూచోండి" అని స్కూటర్ ఆపాడు ఓ అబ్బాయి.
పరంధామయ్య అనుమానంగా చూస్తుంటే "నేను ఒకప్పుడు మీ స్టూడెంట్ ని. ఇప్పుడు డాక్టర్ నయ్యాను. శ్రీలక్ష్మి నర్సింగ్ హోమ్ లో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నాను.
స్కూటరెక్కండి. ఇంటిదగ్గర దింపేస్తాను." అనటంతో పరంధామయ్య కూచున్నాడు.
స్కూటర్ వేగంగా నడుపుతూనే అతడు "మాస్టారూ... మీరేమీ అనుకోనంటే ఒక విషయం చెప్తాను" అన్నాడు.
"చెప్పు బాబూ!"
"అమ్మగార్ని ఆ రోజు హాస్పిటల్ కి తీసికొచ్చాక నిజానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంది. కాని మీ కోడలు, డాక్టరమ్మ ఫ్రెండవడంతో 'రేపో మాపో చచ్చే ఈ ముసలావిడకి హార్ట్ సర్జరీ చేసి రెండు లక్షలు ఖర్చు చేయటం ఎందుకని ఒప్పించింది." అన్నాడు.
పరంధామయ్య గుండెల్లో బ్లాస్టింగ్ లా పేలిందామాట.
కళ్ళు చీకట్లు కమ్మాయి.
ఇంకా అతడేదో చెప్తున్నా విన్పించట్లేదు. పావుగంటలో అతడు ఇంటి ముందు దింపేసి వెళ్ళాడు.
ఇంట్లోకి నడిచే ఓపిక కూడా లేక వరండాలోని వాలు కుర్చీలో కూలబడ్డాడు.
మనసు అల్లకల్లోలమైంది.
ఇంటిముందు క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలంతా ఒక్కసారిగా వచ్చి "తాతయ్యా... మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏమిటి?" అనడిగారు.
"బుకీలంటే ఎవరు తాతయ్య?" అనడిగాడు మరో మనవడు.
"బుకీలంటే... ఆ డాక్టరమ్మా, ఆ ప్రిన్సిపాలూ, నా అల్లుడు రా... మానవ సంబంధాలపై బెట్టింగ్ ఆడుతున్నారే మీ అమ్మ, మీ ఆంటీ వీళ్ళంతా ఫిక్సర్లు, జాతినీ, దేశాన్నీ ప్రేమించే సంస్కృతి కనుమరుగైపోతుంటే ఆటలే కాదు. కుటుంబాలే విచ్చిన్నమైపోతాయ్. ఇంతకన్నా విచారకరమైంది మరేదీ కాదేమో. ఇంతకన్నా శాంతిభద్రతల సమస్య ఇంకేది లేదేమో. ఆటకన్నా కుటుంబం చాలా గొప్పది. మానవీయ మూలాల్ని చెల్లాచెదురు చేసే ఈ ఫిక్సింగ్ లని ఎదుర్కోవడానికి ముందు ముందు మీరు అగ్ని పరీక్షలే కాదు, అణుపరీక్షల్లాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్రా పిల్లలూ..." పరంధామయ్య చెప్పలేదు.
మనసు ఘోషించింది.
కళ్ళలోంచి నీళ్ళు ధారాపాతమయ్యాయి.
"అదేంటి తాతయ్యా... మ్యాచ్ ఫిక్సింగ్ గురించి అడిగితే నువ్వేడుస్తున్నావ్?"
అన్నారు భుజాలు పట్టి కుదుపుతూ...
అతడి కళ్ళు మూతపడ్డాయి. వాలు కుర్చీలోనే ఒరిగిపోయాడు. 'మ్యాచ్ ఫిక్సింగ్' అంటే తాతయ్యకి కూడా తెలీక నిద్రపోయాడనికొని... వాళ్ళు క్రికెట్ ఆటలో మునిగిపోయారు...
***
(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)