సాఫ్ట్ వేర్ ఇంజనీర్ - అశోక్ పొడపాటి

Software Engineer

డ్జి తీర్పు చెప్పబోయే ముందు కోర్టులో నెలకొనే నిశ్శబ్దం... ఇప్పుడా ఇంట్లో ఉంది. పేరులో తప్ప శరీరంలో ఎక్కడా అందంలేని సుందరరామయ్య గారు జడ్జిలా వరండా మధ్యలో కుర్చీలో కూర్చుని ఉన్నారు. తండ్రి పోలికలు ఏమీ లేకుండా బుట్టబొమ్మలా అందంగా ఉన్న ఆయన కూతురు పద్మావతి సాక్షిలా ఆయన పక్కనే నిలబడి ఉంది. ఎదురుగా ముద్దాయిలా నేను. చేతులు నలుపుకుంటూ, భయభయంగా మామయ్య వైపు చూస్తూ, ఆయన చెప్పే తీర్పు కోసం గాబరాగా ఎదురు చూస్తున్నాను. అప్పటికే నా వాదనలు వినిపించడం పూర్తయింది. కొద్ది నిమిషాల మౌనం తర్వాత ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడు.

నువ్వు పద్మను ప్రేమించడంలో తప్పేం లేదు. ఎందుకంటే నువ్వు నా తోడబుట్టిన దాని కొడుకువి కాబట్టి, అది నీ మరదలు కాబట్టి. తను నీ హక్కని నువ్వు అనుకొని ఉండొచ్చు. కానీ దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఆ ఒక్క అర్హత సరిపోదు.

ఇంకేం కావాలి.... భయభయంగానే అడిగాను.

యువరాణిని చేసుకోబోయే వాడు కచ్చితంగా యువరాజే అయ్యుండాలి. అట్టాగే రాణి లాంటి నా కూతుర్ని చేసుకోబోయే వాడు కచ్చితంగా ఈ కాలపు యువరాజు అయ్యుండాలి.

యువరాజంటే... అయోమయాన్ని కుతూహలంతో కలిపి అడిగాను.

అది కూడా తెలియదా..! మొద్దు వెధవ. ఈ కాలపు యువరాజంటే జీతంలోనూ, సుఖంలోనూ మరెవ్వరూ పోటీపడలేని సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అట్టాంటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కే నా కూతుర్ని ఇచ్చి కళ్యాణం చేస్తా. నీలా ట్రాక్టర్ దున్నుకుంటూ, పొలం పనులు చేసుకునే వాడికి కాదు.

నేను పొలం పనులు చేసే వాడినే కాని... పనికి మాలిన వాడిని కాదు. డిగ్రీ పాసయ్యాను. వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టే పొలం పనులు చేస్తున్నా. పొలం మీద వచ్చే ఆదాయం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకన్నా తక్కువేం కాదు... నా వృత్తిని అవమానించినందుకు వచ్చిన కోపంతో ధైర్యంగా చెప్పా.

నాకదంతా అనవసరం రా. నీకు ఆర్నెల్లు గడువిస్తున్నా. చేతైతే సాఫ్ట్ వేర్ ఇంజనీరై తిరిగిరా. లేకుంటే నా కూతురి పెళ్లికి రా. పప్నన్నం తిని ఎప్పటిలాగే పొలం పనులు చూసుకుందువు గానీ... ఈ లోపు నువ్వు నా కూతురి వైపు చూసినా, మాట్లాడినా నేనేం అనను. ఎందుకంటే అది రేపు సాఫ్ట్ వేర్ ఇంజనీరు భార్యగా హైదరాబాదో, అమెరికానో వెళ్లి... హైక్లాస్ సొసైటీలో ఉండాల్సిన పిల్ల. అలాంటి దాన్ని ఇలా కట్టుదిట్టాలు చేయడం నాకు ఇష్టం లేదు... అంటూ విసవిసా లోపలికి వెళ్లిపోయాడు.

నేనేమీ చేయలేనట్లు అమాయకంగా చూస్తూ నిలబడిపోయింది పద్మావతి.

జీవితంలో తొలిసారి ఒకడ్ని మర్డర్ చేయాలనిపించింది. వాడే శివాజీ. మా ఊరి నుంచి తొలి సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మాకు కంప్యూటర్నిపరిచయం చేసింది వాడే. శివాజీని ఊరుఊరంతా నడిచే దేవుడిలా చూస్తుంది. వాడి చరిత్రను గోరుముద్దలతో రంగరించి పసిపిల్లల నోటికి అందిస్తారు. ఒకసారి వాడే మా మామయ్యను హైదరాబాద్ తీసుకెళ్లి హైటెక్ సిటీ అంతా తిప్పాడు. అద్దాల మేడల్లో అందమైన ఇంటీరియర్ తో ఉన్న కంపెనీల్లోకి తీసుకెళ్లాడు. ఒక వారం దగ్గర ఉంచుకుని ఆ కల్చర్ని, వీకెండ్ సెలబ్రేషన్స్ ని పూర్తిగా అలవాటు చేశాడు. అప్పటి నుంచి ఆయనకు ఈ పిచ్చి పట్టుకుంది. అది ఎంత వరకు వెళ్లిందంటే... మనిషంటే సాఫ్టవేర్ ఇంజనీరే అని అనుకునేటంత.

సాధారణంగా ఎవర్నైనా మీరేం చేస్తుంటారు అని అడుగుతారు. మామయ్య మాత్రం మీరు సాఫ్ట్ వేర్ ఇంజనీరేనా అని అడుగుతాడు. పొరపాటున అవతలి వాళ్లు కాదంటే... అప్పటి వరకు చూపించిన గౌరవ మర్యాదలు అమాంతం పడిపోతాయి. సంబోధన దాదాపు 'ఏరా' స్థాయికి వెళుతుంది. 'ఏడిశావ్ లే...' అంటూ సాగుతుంది. 'ఇక... మూస్తావా' అనే అర్థంతో ముగుస్తుంది. ప్రస్తుతం ఆయన దృష్టిలో మనుషులు రెండు రకాలు. ఒకటి సాఫ్టవేర్ ఇంజనీర్లు. రెండు మిగిలిన వారందరూ. చంద్రముఖి సినిమాలో నగల్ని చూసే సమయంలో జ్యోతిక ముఖంలో కనిపించే వెలుగే... సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని చూసినప్పుడు మామయ్య ముఖంలోనూ కనిపిస్తుంది. విష్ణుమూర్తి పదకొండో అవతారం సాఫ్ట్ వేర్ ఇంజనీరేనని ఆయనకు బలమైన విశ్వాసం. తిరుమల కొండ కన్నా సైబర్ టవర్సే పవిత్రమైందని ఆయన నమ్మకం. ఆ నమ్మకంతోనే ఎలా ఆన్ చేయాలో తెలియకపోయినా... ఓ కంప్యూటర్ని తెచ్చి హాల్లో పెట్టుకున్నాడు. మామయ్య ఈ మధ్య మగవాళ్లనైతే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లై వర్థిల్లాలని, ఆడవాళ్లనైతే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మొగుడిగా రావాలని దీవిస్తున్నాడని ఇంటి దగ్గర మా నాన్న అంటుంటే ఒకసారి విన్నాను.

మామయ్యకు సాఫ్ట్ వేర్ ఇంజనర్లంటే పిచ్చని నాకు తెలుసుకాని... మరీ ఈ స్థాయిలో అని నేను ఊహించలేదు. ఊరంతా మామయ్యని సాఫ్ట్ వేర్ రామయ్య అని ఎందుకంటారో... నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. పద్మావతి పదో తరగతి ఫెయిలై తప్పించుకుందిగానీ... లేకపోతే దాన్ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని చేసేదాక నిద్రపోయేవాడు కాదు... కూతుర్ని నిద్రపోనిచ్చే వాడు కాదు.

ఇంటికి ఏ సంబంధం వచ్చినా... వాళ్లను మామయ్య మొదటిగా అడిగే ప్రశ్నలు 'సి' లాంగ్వేజ్ వచ్చా... జావా గురించి తెలుసా... సైబర్ టవర్స్ ని ఒక్కసారన్నా చూశావా... అక్కడ అడ్డంగా తల ఊపితే ఇక అంతే... మామయ్య ఉగ్రనరసింహుడైపోతాడు. ప్రోగ్రామ్ రాయడం చేతగాని వాడికి పెళ్లెందుకంటూ రెచ్చిపోతాడు. కీబోర్డ్ మీద లయబద్దంగా నాట్యం చేయని చేతులతో తాళెలా కడతావని ప్రశ్నిస్తాడు. ఒరాకిల్ గురించి తెలియని వాడు జీవితంలో ఏ మిరాకిల్ చేయలేడంటూ అందర్నీ ఊరి చివరి వరకు తరిమి కొడతాడు. నిజానికి మామయ్యకు శాలరీ గురించి కూడా పెద్దగా పట్టింపు లేదు. సాఫ్ట్ వేర్ ఇంజనీరైతే చాలు. ఒకసారి మా ఊరి పూజారి పెద్ద సంబంధం తీసుకొచ్చాడు. వరుడు ఇస్రోలో సైంటిస్ట్. జీతం దాదాపు లక్ష రూపాయలు. వాళ్లని కూడా మామయ్య సాఫ్ట్ వేర్ మంత్రాలతో బెదరగొట్టి పంపించాడు. తర్వాత కూతురి కోసం ఆయన చూసిన సాఫ్ట్ వేర్ వరుళ్ల జీతాలు ఆ సైంటిస్ట్ శాలరీలో మూడో వంతు కూడా లేవు. కంప్యూటరంటే తెలియని, ఇంగ్లిష్ పరిజ్ఞానం ఏ మాత్రం లేని పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి ఇప్పటి వరకు ఏ సాఫ్ట్ వేరు ఇంజనీరు ముందుకు రాకపోవడం కచ్చితంగా నా అదృష్టమే.

అయితే ఆ అదృష్టానికి కాలం చెల్లే రోజులు రావడంతో... ఆ రోజు సాయంత్రం బావి దగ్గర పద్మావతిని కలిశాను. నాకు నువ్వన్నా ఇష్టమే... మా నానన్నా ఇష్టమే... ఇద్దరిలో ఎవర్నీ వదులుకోలేనూ అంటూ పాతరాగమే పాడింది. పైగా నువ్వు ఆరు నెలల్లో అన్ని కోర్సులు నేర్చుకుని సాఫ్ట్ వేర్ ఇంజనీరై పోవచ్చుగా అని ఓ ఉచిత సలహా కూడా పడేసింది. ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల అన్ని చాన్నళ్లలోని సినిమాలు ఎడాపెడా చూసేయగా... వచ్చిన జ్ఞానంతో కొన్ని పంచ్ డైలాగులు కూడా విసిరింది. సంకల్పంతో సాధించలేనిది ఏదీ లేదంటూ ఓ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చింది. అదే సంకల్పంతో నువ్వు పదో తరగతి పరీక్షలు మళ్లీ రాసి పాసైపోవచ్చుగా... అని నేననగానే అలిగి మూతిముడుచుకుంది. అరగంట బతిమాలాక మళ్లీ మాట్లాడటం మొదలు పెట్టింది... అదీ ఇలాంటి జోకులేస్తే ఊరుకోననే షరతుతో. ఒకే మాట తను చెబితే కొటేషన్ ఎలా అయిందో... నేను చెబితే జోక్ ఎలా అయిందో నాకు అర్థం కాలేదు.

ఇన్నేళ్ల నుంచి కలిసి తిరుగున్నా పద్మావతి మనపక్షమో అర్థం కాదు... ప్రతి పక్షమో(నాన్న పార్టీ) అర్థం కాదు. పోని తను నన్ను ప్రేమించడం లేదా అంటే... తన కళ్లల్లో కనిపిస్తున్న ప్రేమ అబద్ధం కాదు... అలాగే గుండెల్లో వాళ్ల నాన్న మీదున్న గౌరవమూ అబద్ధం కాదు. తను ఎదుటివాళ్లను మోసం చేసేటంత తెలివైంది కాదు.. అలా అని మోసపోయేటంత అమాయకురాలు కూడా కాదు. ఎదిగిన పసిపిల్ల... ఇరవై ఏళ్ల చిన్నపాప అంతే. అవ్వాకావాలి... బువ్వాకావాలి అనుకునే మనస్తత్వం. అతిశయోక్తి అనుకోకపోతే ఒక మాట చెబుతాను... నేను ఈ ప్రపంచంలో తనని తప్ప ఎవర్ని పెళ్లి చేసుకున్నా సంతోషంగానే ఉంటాను. తను మాత్రం నన్ను తప్ప ఇంకెవ్వర్ని పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేదు. ఎందుకంటే తనను ప్రేమించడం మాత్రమే కాదు. భరించాలి కూడా. ఆమె ప్రేమను, అలకను, కోపాన్ని... సమస్తాన్ని నేను మాత్రమే భరించగలను. ఎందుకంటే నేను నాకన్నా ఎక్కువగా తననే ప్రేమిస్తున్నాను కాబట్టి...

లేచిపోవడానికి, పారిపోవడానికి పద్మావతి రాదుకాబట్టి... నాక్కూడా అంత ధైర్యం లేదు కాబట్టి... తప్పనిసరి పరిస్థితుల్లో నేను సాఫ్ట్ వేర్ ఇంజనీరై పోవాలని బలంగా నిర్ణయించుకున్నాను. పుస్తకాలన్నీ తెప్పించుకుని దగ్గర పెట్టుకుని, ఓ స్నేహితుడి సహకారంతో నేర్చుకోవడం ప్రారంభించాను. కనీసం నెలైనా పడుతుందనుకున్నాను గానీ... మొదలు పెట్టిన రెండు రోజుల్లోనే నాకు అర్థమైపోయింది... ఇలా చదివితే నేను సాఫ్ట్ వేర్ ఇంజనీరవడం అసాధ్యమని. ఇలా లాభం లేదనుకుని ఓ మంచి ముహూర్తం చూసుకుని బస్సెక్కి హైదరాబాద్ బయలుదేరాను. ఏ ఇన్ స్టిట్యూట్లో చూసినా గుట్టలుగా ఉన్న స్టూడెంట్లు. ఫ్యాకల్టీ చెప్పేది సరిగా వినిపించదు. కనిపించదు. అర్థం కాదు. అలా మైత్రివనం ముచ్చట కూడా మూడు రోజుల్లో తీరిపోగా... సొంతూరికి తిరుగుప్రయాణమయ్యాను. అయినా దారిపొడవునా ఒకటే ఆలోచన... సాఫ్ట్ వేర్ జాబ్ లేకుండా మామయ్యని ఒప్పించ లేను. ఇష్టం లేని చదువు చదవలేను... అలా అని పద్మావతిని వదులుకోలేను... ఏం చేయాలి... ఏం చేయాలి... ఏం చేయాలి.

ఆ రోజు సాయంత్రం ఊరిలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. శివాజీ నాన్నకు గుండెపోటు అన్న వార్త దావానలంలా వ్యాపించింది. వెంటనే పక్కనున్న టౌన్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆయన్ను పరీక్షించిన డాక్టర్లు గుండె వాల్వ్స్అన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని... బతకడం అసాధ్యమని... దగ్గరి వాళ్లకు కబురు చేసుకోండని చెప్పారు. తన కొడుకుని ఒక్కసారి చూడాలని ఉందని ఆయన అతి కష్టం మీద చెప్పాడు. దాదాపు అదే ఆయన ఆఖరి కోరిక కావచ్చు. సుందరరామయ్య మామయ్య వెంటనే శివాజీకి ఫోన్ చేశాడు. విషయం తెలుసుకున్నశివాజీ భోరుమన్నాడు. బాధపడేందుకు సమయం లేదు. మీ నాన్న ప్రాణం నిమిషాల మీద ఉంది. నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అని మామయ్య చెప్పాడు. దానికి శివాజీ చెప్పిన సమాధానం విని చెట్టంత మామయ్య ఒక్కసారిగా కూలబడిపోయాడు.

సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో ఇప్పుడు రిసెషన్ నడుస్తుందని... కంపెనీలన్నీ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయని... తీసేయడానికి కారణాలు వెతుకుతున్నాయని... ఇప్పటికే వీకెండ్స్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ క్యాన్సిల్ చేశారని... ఇలాంటి పరిస్థితిలో తను లీవ్ అడిగిన మరుక్షణం... పింక్ స్లిప్ టేబుల్ మీద... తను గేటు బయట ఉంటామని చెప్పాడు. ఉద్యోగం పోతే ఫ్లాట్ కోసం, కారు కోసం, ఊళ్లో పొలాల కొనుగోలు కోసం, ఆడంబరాల కోసం చేసిన అప్పలు జన్మలో తీర్చలేనని... ఇలాంటి పరిస్థితిల్లో తాను సెలవు పెట్టి రాలేనని... పరిస్థితుల వల్ల రాలేకపోతున్నానే కానీ తండ్రి మీద ప్రేమలేక కాదని చెబుతూ... కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకోవాలని మామయ్యను కన్నీళ్లతో ప్రాథేయపడ్డాడు. మరో గంటలో ఆయన ప్రాణం పోయింది. ఊరుఊరంతా గొల్లు మంది. అప్పటి వరకు ఊరికి హీరోగా కనిపించిన శివాజీ... ఒక్కసారిగా విలన్ గా కనిపిస్తున్నాడు. మామయ్య మాత్రం పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అయినా శివాజీని క్షమించలేకపోతున్నాడు. దాని గురించే రోజుల తరబడి మథన పడుతున్నాడు. జన్మంతా పూజించిన దేవుడు... ఆపద వేళ ముఖం చాటేస్తే భక్తుడు పడే బాధను... ఇప్పుడు మామయ్య అనుభవిస్తున్నాడు.

ఆ రోజు రాత్రి నేను మామయ్య ఇంటికి వెళ్లాను.
వెళ్లేముందు నేను చాలా ప్రిపేర్ అయ్యాను. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా మనుషులేనని... డాక్టర్, లాయర్, కలెక్టర్... ఆఖరికి గవర్నమెంట్ టీచర్ కూడా కాలేక సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా స్థిరపడతారని... తొంభై శాతం మంది కేవలం డబ్బు కోసమే ఆ వృత్తిని ఎంచుకుంటారు తప్ప... ప్రేమతో కాదని... నువ్వు వాళ్ల సుఖాలు చూశావు తప్ప... టెన్షన్లు చూడలేదని... గ్యారెంటీ లేని ఉద్యోగాలు, మితిమీరిన ఒత్తిడి, రాత్రి డ్యూటీలు, డెడ్ లైన్లతో చిన్నవయసులోనే షుగర్లు, బీపీలు తెచ్చుకుని గుండె జబ్బులతో ఆస్పత్రి పాలవుతున్నారని... ఇలా ఏవేవో... అనుకుని వెళ్లాను.

నేను వెళ్లగానే ఆయన నాతో అన్న మొదటి మాట... 'ముహూర్తాలు ఎప్పుడు పెట్టిచ్చమంటావ్ రా...' అని...

ఈ మాటను ఊహించని పద్మావతి తండ్రి వంక కొంచెం ఆశ్చర్యంగా, మరికొంచెం ఆనందంగా చూస్తూ నిలబడింది.

మీ ఇష్టం మామయ్య అంటూ... రెండు లక్షలు పెట్టి కొన్నసాఫ్ట్ వేర్ ఉద్యోగానికి సంబంధించిన అప్పాయిట్ మెంట్ ఆర్డర్ని మడిచి జేబులో పెట్టుకుని వెనుదిరిగాను.

***

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు