ఆనందబాష్పాలు - పి.వి. సాయి సోమయాజులు

ananda bashpalu

మస్కారం! నేను మీ సునీల్ అంబాని. మన దేశంలోని ధనవంతులలో ఒక్కడిని. ఇప్పటిదాకా నన్ను చాలా మంది రకరకాల ప్రశ్నలు అడిగారు. కాని అందరూ అడిగే ఒకే-ఒక్క ప్రశ్న ఎటువంటి బ్యాక్‍గ్రౌండ్ లేని నేను ఎలా ధనవంతుడినయ్యానని. కాని నాకున్న ఒకే ఒక్క ఆస్తి మా నాన్నగారు! భయపడకండి... ఇది సెంటిమెంట్ కథ కాదు.

అప్పట్లో అడ్డూ అదుపూ లేకుండా అన్ని ధరలూ పెరిగిపోయాయన్నది మనందరికీ తెలిసిన విషయమే! సోషల్-నెట్‍వర్కింగ్ సైట్స్ లో, పుస్తకాల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ వీటి మీద జోక్స్ రావడం కూడా మనందరికీ తెలిసిందే! వీటి గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పడానికి ఇది రాయలేదులే కాని నా జీవితంలో జరిగిన ఓ సందర్భాన్ని మీతో పంచుకోవడానికే ఇది రాయడం జరిగింది. ధరలు మనసును పిండే రోజులవి. దరిద్రం మాకు నిత్యపాఠాలు చెప్పే దిక్కుమాలిన రోజులవి.

"ఏమండీ! మీరివాల పని మీద బయటకి వెళ్తానన్నారు కద." అంది మా ఆవిడ.

"అవును. ఏం? వచ్చేటప్పుడేమైనా తీసుకురావాలా?" అని అడిగాను.

"అంటే..మీకు ఖజానా నగల షాపు తెలుసుకదా ?"

"ఆ...తెలుసు..! వచ్చేటప్పుడు ఏమైనా నెక్లెస్ తీసుకురావాలా?" అని అడిగాను.

"అబ్బే లేదండి. ఆ నగల షాపు ముందు ధనలక్ష్మి కిరాణా కొట్టులోంచి ఓ కేజీ ఉల్లిపాయలు తీసుకొస్తారా ?" అని అడిగింది.

"ఏంటి....ఉల్లిపాయలా ? మొన్నే కద తెచ్చాను!" అని అరిచాను.

"అదేంటండీ... నగలు కావాలా అని గొప్ప రాజసంగా అడిగారు... ఇంతా చేస్తే ఉల్లిపాయలకి బెదిరిపోయారు!" అంది నవ్వుతూ వెటకారంగా.

"బంగారందేముందే... ఒక్కసారి కొని దాచుకుంటాం. కానీ ఈ ఉల్లిపాయలు అలా కాదు కద... ఎన్నో సార్లు కొనాల్సొస్తుంది!" అని బాధగా అన్నాను.

"అందుకే మిమ్మల్ని అక్కడ కొనమన్నాను. అక్కడైతే మనకి రెండు రూపాయలు తక్కువగా ఇస్తారండి!" అని ఆనందంగా చెప్పింది.

"సరే ఐతే, నేను బయల్దేరుతాను" అని బయట అడుగు పెట్టాను.

"ఏమండీ! కార్ కీస్ మర్చిపోయారు!" అంది తాళాలిస్తూ.

"కారా ?? ఏంటి జోకా? పెట్రోల్ ధర బీ.పీ కంటే వేగంగా పెరిగిపోతుంది. ఈ టైమ్‍లో నేను కారులో వెళ్తే అందరూ నన్ను ధనవంతుడని అనుకొంటారు. అప్పుడు వాడు రెండు రూపాయిలు తగ్గించడం కాదు కదా... ఐదు రూపాయిలు పెంచుతాడు... ఆ తరువాత నీ ఇష్టం !" అన్నాను.

"కరక్టేనండోయ్... మీకు ఆలస్యమవుతున్నట్టుంది. అసలే ఆస్తుల విషయంలో మీరు లాయర్‍ని కలవడానికి వెళ్తున్నారు" అని గుర్తుచేసింది.

‘అది నిజమే కదా’ అనుకుని నేను బస్ స్టాప్ కి బయలుదేరాను.

సూర్యుడి ధాటికి ఎక్కడ వడ కొట్టి కింద పడిపోతానో అని భయంగా ఉంది. హు..ఏం చేస్తాం.. ఒకప్పుడు వడ కొడుతుందని భయపడి జేబులో ఉల్లిపాయలు పెట్టుకుని తిరిగేవాళ్ళం... ఇప్పుడు ఉల్లిపాయలకి భయపడి ఎండలో తిరగడం మానేస్తున్నాం! ‘ఎండకి తట్టుకోలేక పోతున్నాను ఏ బస్ వస్తే ఆ బస్ ఎక్కేయాలి... ఇంక నా వల్ల కాదు’ అని అనుకుంటుండగా, బస్ వచ్చింది. వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళకి తిండి దొరికితే పరిగెట్టినట్టు, అందరూ బస్ వెనకాల పరుగులు తియ్యడం మొదలుపెట్టారు. ఆ జనసమూహంలో ఎలాగో అలా బస్సులో నీడ వైపున కూర్చోవాలని లోపలికెళ్లేసరికి నాకు ఆశ్చర్యమేసింది. ఎందుకంటే అందరూ ఎండ వైపు కూర్చోవడానికి కొట్టుకుంటున్నారు. పిచ్చిగా నవ్వుకుని నీడ వైపు దర్జాగా కూర్చున్నాను. కాసేపయ్యాక చూసేసరికి సీట్ దొరకని వాళ్ళందరూ మరో వైపు కూర్చోకుండా దిగిపోవడం మొదలుపెట్టారు. ఇక నాకు నవ్వు ఆగలేదు. పగలబడి నవ్వడంతో అక్కడున్న వాళ్ళందరు నన్ను చూడసాగారు. బస్ బయలుదేరింది. నేనున్న వరుసలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆఖరికి కండక్టర్ కూడా అటుపక్క ఇరుగ్గా కూర్చున్నాడు. ఎండకి వీళ్ళ మతి పోయిందనుకున్నాను. అప్పుడే బస్ "U-టర్న్" తీసుకుంది. ఎండ నావైపొచ్చింది. నా గూబ పగలకొట్టినట్టనిపించింది. పక్కన చూసేసరికి అటుపక్కవాళ్ళందరూ నా వైపే వెటకారంగా చూస్తూ నవ్వసాగారు. నాకేం చెయ్యాలో తెలియక మొహం దాచుకోవడానికి ప్రయత్నించాను. ఇంతలో కండక్టర్‍ వస్తే టికెట్ అడిగాను. అతను వెంటనే టికెట్ ఇచ్చి పన్నెండు రూపాయలడిగాడు.

"అదేంటి ??? టికెట్ తొమ్మిది రూపాయలే కద ? పెట్రోల్ ధరలు పెరిగాయని మేము బస్సుల్లో వస్తుంటే, మీరే ఇలా చేస్తే ఎలా సార్ ?" అని అడిగాను బాధగా.

"అచ్చా...మరి బస్ దేంతో నడుస్తుందో !" అని నాకో కౌంటరేసాడు.

చేసేదేంలేక గంట సేపు ఆ ఎండలోనే కూర్చుందామని నిశ్చయించుకున్నాను. కాసేపయిన తర్వాత ఒకడు బస్ ఎక్కి నా పక్కన దిగులుగా కుర్చున్నాడు.

"నాకు తెలుసు. ఎండలో గంట సేపు ప్రయాణించడం కష్టమే !" అన్నాను.

"నేను దాని గురించి బాధ పడట్లేదు !" అని అన్నాడు.

"మరి?" అని అడిగాను ఆశ్చర్యంగా.

"నిన్న మా ఇంట్లో దొంగలుపడ్డారు !" అన్నాడు.

"అయ్యో.." అన్నాను.

"దొంగాడు మా ఇంట్లోని అతి విలువైన వస్తువులని దొంగలించాడు!" అన్నాడు ఏడుస్తూ.

"ప్చ్.....ఏమిటవి?" అని అడిగాను.

"రెండు కేజీల ఉల్లిపాయలు" అని అన్నాడు కర్చీఫ్ తో కన్నీళ్ళని తుడుచుకుంటు.

"అయ్యయ్యో... మరి ఇప్పుడు ఎక్కడికెళ్తున్నారు ?" అని అడిగాను.

"అణుపురం గోల్డ్ లోన్ దగ్గరికి... ఆ డబ్బులతో ఉల్లిపాయలు కొనుక్కుని ఇంటికెళ్తాను!" అని చెప్పాడు.

’హు...ఇప్పుడైతే బంగారాన్ని తాకట్టు పెట్టి ఉలిపాయలు కొనుక్కోవాల్సొస్తుంది... ఇక ముందైతే ఉలిపాయల్ని తాకట్టు పెట్టి బంగారం కొనాల్సొస్తుందేమో!’ అని నాలో నేనే అనుకున్నాను.

స్టాప్ వచ్చేంతవరకు ఒకరి బాధల్ని ఇంకోళ్ళతో పంచుకున్నాం. బస్ దిగంగానే నేను కిరాణా కొట్టుకి వెళ్ళాను. అక్కడ ఉల్లిపాయలు తీస్కున్న వెంటనే లాయర్‍ని కలవడానికి వెళ్ళాను.

నేను వెళ్ళేసరికి ముట ముటలాడే ఆయన మొహంలో మొట్టమొదటి సారి చిరునవ్వుని చూశాను. అతను వెంటనే నన్ను కూర్చోపెట్టి మర్యాద చెయ్యడంతో నేను ఆశ్చర్యపోయాను.

"సారీ సర్... ఉల్లిపాయలు కొనుక్కుని వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది !" అన్నాను.

"మీరు ఉల్లిపాయలు కొనడమేమిటండి?? అసలు మీ చరిత్ర మీకు తెలీదు!" అన్నాడతడు.

"నాకు చరిత్రా?" అని నవ్వి ఊరుకున్నాను.

"ముందు ఒకటి చెప్పండి. మీకు వచ్చే లాభంలో నాకో ఇరవై శాతం ఇస్తారు కదా!" అని అడిగాడు ఆశగా.

"అసలంటూ లాభం వస్తే ఇరవై ఏంటిలే కాని, ఇరవై ఐదు తీస్కొ!" అని అన్నాను దర్జాగా.

"సార్... సార్... నా జన్మ ధన్యమైంది... మీ నాన్నగారికి ఐదు ఎకరాల ఉల్లి తోట ఉందండీ... ఇప్పుడే మీ దస్తావేజులు పరిశీలించాను!" అని అన్నాడు ఆనందంతో.

ఈ మాట వినడంతోనే మేము ఇద్దరం అరుస్తూ... ఈలేసుకుంటూ... ఆనందంతో డాన్స్ వేయడం మొదలుపెట్టాం. దెబ్బకి నేనో లక్షాది కారిని అయిపొయాను. ఆ లాయర్‍ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్కుని జీవితాన్ని అనుభూతిస్తాడట. ఉల్లిపాయలు తీసుకొస్తానని ఎదురు చూస్తున్న నా భార్య కి ఉల్లితోట వార్తని తీసుకెళ్ళడంతో తను సంతోషం పట్టలేకపోయింది. దీనికంతటికి కారణం మా నాన్నగారు. అప్పట్లో బ్రతుకు బండిని నడిపించడానికి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నా బ్రతుకు బండిని నడిపించడం మాత్రమే కాదు, పరిగెట్టిస్తూంది. ఎవరికైనా ఉల్లిపాయలు కోస్తే ఏడుపొస్తుంది, కాని మాకప్పటినుంచి ఉల్లిపాయల్ని కోస్తే ఆనందబాష్పాలు జల జల రాలుతున్నాయి. అలా ఓ వార్త మా తలరాతనే మార్చేసింది.

***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ